‘నటరత్న’ బాలాజీ నాయుడు కు ‘గండపెండేర ధారణ’

సమతా సేవా సమితి వారి 13 వ వార్షికోత్సవం సందర్భంగా, ప్రముఖ రంగస్థల నటులు, నంది అవార్డు గ్రహీత, నటరత్న, ఎన్టీఆర్, ఎఎన్ఆర్, ఎస్వీఆర్ పురస్కారాల గ్రహీత ఆచంట బాలాజీ నాయుడు గారిని, ఈ రోజు 27-02-2024, మంగళవారం సాయంత్రం, శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత & నృత్య కళాశాల ప్రాంగణంలోని శ్రీ గోకరాజు లైలా గంగరాజు కళావేదిక పై గండపెండేర ధారణతో సత్కరించబడుచున్న సందర్భంగా వారి పరిచయ వ్యాసం.

నట ప్రస్థానం: బాల్యం నుండి నాటక రంగం పట్ల ఆసక్తిని పెంచుకొని తన తల్లిదండ్రులైన శ్రీమతి ఆచంట లక్ష్మీదేవి గారి ఆశీస్సులతో, ‘నటసార్వభౌమ’ శ్రీ ఆచంట వెంకటరత్నం నాయుడు గారి మార్గదర్శకంలో 15 యేటనే రంగస్థల ప్రవేశం గావించారు. వివిధ పాత్రలను పౌరాణిక నాటకాలలో పోషిస్తూ, తనలో దాగివున్న ప్రతిభను కళాతృష్ణను సానపట్టడానికి తండ్రి వెంకటరత్నం నాయుడు గారి సూచనల మేరకు సినీ, నాటక రంగ ఉద్ధండులైన గురువులు ధూళిపాళ సీతారామశాస్త్రి, సి. రామ్మోహనరావు, ‘పద్మభూషణ్’ ఎ.ఆర్. కృష్ణ మొదలగు వారి దగ్గర వాచకాభినయనంలోనూ, హావభావాల ప్రదర్శనలోనూ, ఆహార్యంలోనూ, పౌరాణిక పద్యనాటకాలలో గల మెలకువలను క్రమశిక్షణతో అభ్యసించి, వాటిని నాటకరంగంలో ప్రదర్శిస్తూ, తండ్రికి తగ్గ తనయుడుగా ఖ్యాతి గడిస్తూ రాష్ట్ర, రాష్టేతర ప్రాంతాలలోనే కాకుండా విదేశాలలో కూడా తెలుగు పద్య నాటక వైభవాన్ని చాటిచెప్పిన ఘనత వీరిది. వేలాది నాటక ప్రదర్శనలిస్తూ, అశేష ప్రజానీకం చేత శెహభాష్ అనిపించుకుంటున్నారు.

అభినవ దుర్యోధనుడు:
ఒక ప్రక్క పద్యనాటక సంప్రదాయపు పటుత్వాన్ని చాటిచెప్పడమే కాకుండా తెలుగు నాటక సజీవ పాత్రలైన దుర్యోధనుడు, జలంధరుడు. రావణాసురుడు, ఘటోత్కచుడు, కీచకుడు మొదలగు పాత్రలను అత్యంత రసవత్తరంగా అభినయిస్తూ ప్రేక్షకుల హృదయాలలో తనదైన ముద్ర వేస్తున్న ప్రతిభాశాలి ఆచంట బాలాజీ నాయుడు.

కురుక్షేత్రం, శ్రీకృష్ణయబారం మొదలగు నాటకాలలో ‘దుర్యోధనుడు’గా బాలాజీ నాయుడు పాత్ర పోషణ, తన తండ్రి ‘నటసార్వభౌమ’ ఆచంట వెంకటరత్నం నాయుడు గారి నటనకు ధీటుగానూ, విభిన్న శైలిలో ప్రదర్శిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ ‘అభినవ దుర్యోధనుడు’ గా అందరి మన్ననలు అందుకుంటూ కీర్తిపతాకాలు ఎగురవేస్తున్నారు. అలాగే జలంధరుడు. గయుడు, రావణుడు, విశ్వామిత్రుడు, ఘటోత్కచుడు మొదలగు వీర రసపాత్రను ధీటుగా పోషిస్తూ ఊరూరా, వాడవాడలా అనేక ప్రదర్శనలిస్తూ పలు సంస్థలచే ఘన సన్మానాలు, సత్కారాలు, అవార్డులు, రివార్డులు అందుకుంటూ, ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదిస్తూ ‘స్టేజీ టైగర్’ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

జీవన ప్రస్థానం:
పవిత్ర కృష్ణానదీ తీర ప్రాంతాన గల విజయవాడకు దగ్గరకు గల కొండపల్లిలో 1957వ సం.లో జన్మించిన బాలాజీ నాయుడు గ్రాడ్యుయేషన్ విద్యను పూర్తిచేసి, సంగీత విద్యను విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో అభ్యసించారు. ఆకాశవాణి, దూరదర్శన్ లో ‘ఎ’ గ్రేడ్ కళాకారునిగా కీర్తి గడిస్తున్నారు. 1990వ సం.లో “జై శ్రీ షణ్ముఖ నాట్యమండలి” ను స్థాపించి, తద్వారా ఐదువేల ప్రముఖ పౌరాణిక నాటకాలను ప్రదర్శించి, మూడు దశాబ్దాలుగా నాటక సమాజాన్ని విజయపథంలో నడిపిస్తున్నారు. తన నాటక సమాజం ద్వారా ఎంతో మంది కళాకారులను తయారుచేస్తూ, వారిని ప్రోత్సహిస్తూ, సంగీత, నాటక, సాంకేతిక, ఆహార్య రంగాల వారికి జీవనోపాధిని కల్పిస్తున్నారు.

అవార్డులు-రివార్డులు:
సుమారు 40 సం.లుగా కళామతల్లికి చేస్తున్న సేవకు గాను రాష్ట్ర ప్రభుత్వం నుండి అత్యంత ప్రతిష్టాత్మకమైన నంది అవార్డును ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకున్నారు. అలాగే వివిధ కళాసంస్థల నుండి ‘నటరత్న ‘నటవిరాట్’, ‘నటభూషణ’, ‘స్టేజీ టైగర్’, సినీ రంగస్థల ప్రముఖులైన యస్వీర్, ఎన్.టి.ఆర్., బళ్ళారి రాఘవ, ఈలపాట రఘురామయ్య, మహానటి సావిత్రి. కళామంజరి వారి విశిష్టరత్న మొదలగు మరెన్నో పురస్కారాలను అందుకున్నారు.

నాటకరంగ వృత్తిపట్ల నీతి, నిజాయితీ, నిబద్ధత, పట్టుదల, నైపుణ్యం, నేర్పు, ఓర్పు, పెద్దలయెడ గౌరవ కల్గిన ఆచంట బాలాజీ నాయుడు రంగస్థల, రేడియో, టి.వి. మరియు సినీ రంగాలలో ఉత్తమ క్రమశిక్షణకల్గిన నటుడుగా అందరి అభిమానాన్ని, ప్రశంసలను అందుకుంటున్న వీరు మన ఆంధ్ర రాష్ట్ర కృష్ణాజిల్లా వాసులవ్వడం మన తెలుగు జాతికి గర్వకారణం.

గౌరిశంకర్ (81211 51014)

2 thoughts on “‘నటరత్న’ బాలాజీ నాయుడు కు ‘గండపెండేర ధారణ’

  1. It is very good to hear that Sri Balaji Naidu is conferred on a great award.
    All artists are to be recognised like this..

  2. తెలుగు వారి సొత్తు పథ్యం …
    ఆ పధ్య నాటకం లో రారాజు శ్రీ ఆచంట బాలాజీ నాయుడు…గండపెండేర బహుకరణ ప్రశంసనీయం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap