(ఆచార్య ఆత్రేయ వర్ధంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి ప్రత్యేక వ్యాసం…)
ఆచార్య ఆత్రేయ అనగానే మనకు వెంటనే స్పురించేది ‘మనసు కవి’ అనే మాట. కేవలం మనసు అనే పదాన్ని తన సాహిత్య రచనల్లో వాడినంత మాత్రాన ఆత్రేయ మనసుకవి అయిపోలేదు. సగటు మానవుని మనస్తత్వాన్ని సంపూర్ణంగా అర్ధంచేసుకొని మనసులోని మమతను గ్రహించి మన‘సుకవి’గా గుర్తింపు పొందారు. అందుకే ఆత్రేయ పాటల్లో మనసులోని మమతానురాగాలు, మనస్తత్వాలు అంతర్లీనంగా గోచరిస్తుంటాయి. ఆత్రేయ మాటల్లోనే చెప్పాలంటే ‘మనుషులంటే మనసులేరా…మనసు, మమత కలిస్తేనే మనిషి’ అనేది ఆయన నిర్వచనం. ’మనసు మూగది… మాటలు రానిది… మమత ఒకటే అది నేర్చినది’ అని ఆత్రేయ వూరకే చెప్పలేదు. అలాగే ‘మనసు మూగదేకాని బాసుంటది దానికి… చెవులుండే మనసుకే వినిపిస్తుందా ఇదీ’ అంటూ ఎంత నర్మగర్భంగా చెప్పారో చూడండి. మనం చెప్పలేని ప్రశ్నల సమాధానం మనసు చెబుతుందని ఆత్రేయ నమ్మకం. అందుకే ఆయన సినీ సాహిత్య రచనకు మనిషి-మనసు-మమత ను మూలాధారాలుగా ఎన్నుకున్నారు. ఈ మూడు ఒకదానితో ఒకటి అనుసంధానమై అనుబంధాన్ని కలిగి ఉంటాయని, అదే జీవితమనే అంతరార్ధాన్ని వంటబట్టించిన మనసుకవి ఆచార్య ఆత్రేయ. “తనువుకెన్ని గాయాలైన మాసిపోవు నేలాగైనా, మనసుకొక్క గాయమైనా మాసిపోదు చితిలోనైనా” అంటూ తను నమ్మిన సిద్ధాంతాన్ని పాటల రూపంలో ఆచరణలోకి పెట్టి, తన మనసు సిద్ధాంతాన్ని సమర్ధించుకున్నవాడు ఆత్రేయ. “నేను ధనం గొప్పతనాన్ని ఒప్పుకోను. మనిషిని, మనసునే నమ్ముతాను. మనసులేని ధనం మట్టికి కూడా సరిరాదు” అంటారు ఆత్రేయ. అంతేకాదు ‘’నేను రాసిన పాటలన్నీ మంచివి కావు. కొన్ని చెత్త పాటలు, కొన్ని బూతులుగా ధ్వనించేవాటిని కూడా రాశాను. సినిమాకవి బ్రతుకు వివిధ మనస్తత్వాల నిర్మాతల అభిరుచిని సంతృప్తి పరచకపరచక తప్పదు’’ అని బాధపడిన సందర్భాలూ లేకపోలేదు. ఆచార్య ఆత్రేయ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని లోని వివిధ కోణాలను ఒకసారి గుర్తుచేసుకుందాం…
నాటక సాహితీ రచయితగా ఆత్రేయ…
కిళాంబి వేంకట నరసింహాచార్యులు అనే ‘ఆచార్య ఆత్రేయ’ మే నెల 7 వ తేదీ 1921 న నెల్లూరు జిల్లా మంగళంపాడు అనే గ్రామంలో జన్మించారు. పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే పద్యాలు రాయడం ప్రారంభించారు. తల్లి మరణానంతరం మేనమామ వద్ద పెరిగిన ఆత్రేయకు నాటకరంగం మీద ఆసక్తి హెచ్చు. రాయవెల్లూరులో కాలేజీ చదువుకు స్వస్తిచెప్పి నాటకరంగం వైపు శ్రద్ధ చూపారు. తొలుత చిత్తూరులో, ఆ తరవాత నెల్లూరు జిల్లాలోని వివిధప్రాంతాలలో తను రచించిన నాటకాలను ప్రదర్శిస్తూ, వాటికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి పలువురు పెద్దల దృష్టిని ఆకర్షించారు. అప్పట్లో ‘పరివర్తన’, ‘NGO’, ’ఈనాడు’ వంటి నాటకాలు అత్రేయకు నాటక రచయితగా గొప్పపేరు సంపాదించి పెట్టాయి. కొంతకాలం తిరుత్తణిలో గుమాస్తాగా, నెల్లూరు మునిసిఫ్ కోర్టులో డాక్యుమెంట్ రైటర్ గా పనిచేసి, నెల్లూరు శ్రీరామమూర్తి స్థాపించిన ‘జమీన్ రైతు’ పత్రికకు ఉపసంపాదకుడుగా పనిచేశారు. నాటక రచనను అభిమానించే ఆత్రేయ తరవాతికాలంలో ‘వాస్తవం’, ‘విశ్వశాంతి’, ‘భయం’, ‘కప్పలు’, ‘ఎవరుదొంగ?’, ‘వరప్రసాదం’, ‘కాపలావాని దీపం’, ‘ప్రగతి’, ‘ఒక రూపాయి’ పేర్లతో అనేక నాటకాలు, నాటికలు రాశారు. రాయలసీమలో కరవు నెలకొన్న రోజుల్లో ఆనాటి ప్రజల దీనస్థితిని ప్రతిఫలింపజేసే ‘మాయ’ అనే నాటకాన్ని రాసి ప్రదర్శనలు ఇచ్చారు. ‘సామ్రాట్ అశోక’, ‘భయం’, ‘గౌతమ బుద్ధ’ ఆత్రేయ రాసిన మరికొన్ని నాటకాలు. ఆత్రేయ మరొకవైపు కవితా వ్యాసంగాన్ని విస్మరించలేదు. ఆ కోవలోనిదే ఆత్రేయ రాసిన ‘సుప్రభాతం’ అనే ఖండకావ్యం. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని ఆత్రేయ ఆరునెలలు జైలు జీవితం కూడా గడిపారు.
చలనచిత్ర రచయితగా…
రాజన్ అనే మిత్రుని సాయంతో ఆత్రేయ మద్రాసు చేరుకొని సినిమాలలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. అది కష్టకాలం. చేతిలో డబ్బులులేక తను రాసిన ‘గౌతమబుద్ధ’ నాటకాన్ని యాభై రూపాయలకు అమ్మి అవసరాలు గడుపుకున్న రోజులు ఆత్రేయ జీవితంలో ఎన్నో. ఒకసారి ‘తెనాలి రామకృష్ణ’ సినిమాలో చిన్న వేషం వేసే అవకాశం వచ్చింది. ఎందుకో ఆత్రేయకు అది నచ్చలేదు. ‘నో’ చెప్పేశారు. ఆ తరవాత 1949 లో విజయావారు నిర్మించబోయే ‘షావుకారు’ చిత్రానికి మాటలు రాసే అవకాశం వచ్చినట్లే వచ్చి అనారోగ్యం పాలవడంతో చేయి జారింది. ప్రముఖ దర్శకనిర్మాత కె.ఎస్. ప్రకాశరావు నిర్మించిన ‘దీక్ష’(1951) చిత్రం ద్వారా ఆచార్య ఆత్రేయ సినీరంగ ప్రవేశం చేశారు. ఈ చిత్రానికి తాపీ ధర్మారావు నాయుడుతో కలిసి సంభాషణలు సమకూర్చారు. ‘దీక్ష’ చిత్రంతోనే ఆత్రేయ గేయరచయిత గా కూడా పరిచయమయ్యారు. అందులో ఆత్రేయ నాలుగు పాటలు రాశారు. అవి… “పోరా బాబూ పో… పోయిచూడు ఈ లోకం పోకడ (గానం:M.S.రామారావు)”, “ఏమౌతుందో, ఇంకేమౌతుందో, తల్లివంటి వదినెను చేతులారా కొట్టానే’’ (గానం: మాస్టర్ వేణు), ‘’తీయని కథ ఇట్లే తీరెనా, తీరని ఈ వ్యధే మిగులునా” (గానం: ప్రసాదరావు, జిక్కి), ‘’మనుషులంటే వీళ్లేనా, ప్రపంచమతా ఇంతేనా” (గానం: ప్రసాదరావు). ఈ చిత్రానికి పెండ్యాల సంగీత దర్శకత్వం నిర్వహించారు. అలాగే తమిళంలో కరుణానిధి మాటలు సమకూర్చిన ‘మనోహర’ (1954) డబ్బింగ్ చిత్రానికి తెలుగులో బలిజేపల్లి లక్ష్మీకాంతకవి మాటలు రాస్తున్నప్పుడు, ఆత్రేయ అతనికి సహాయకుడుగా పనిచేశారు.
మనసుతో మాట్లాడించిన జ్ఞాని…
ఆత్రేయ సంభాషణలు కూర్చిన సినిమాలలో మనసు మాట్లాడుతుంది…. ఎందుకంటే ఆయన మాటల్ని కలంతో కాదు మనసుతోరాస్తారు. అందుకే ఆత్రేయ సంభాషణలు ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. అలతిపదాలతో దొర్లే ఆ మాటలు హృదయాలను తట్టిలేపుతాయి. అంచనాలకు అందనంతటి అనుభూతులను పంచుతాయి. తాత్విక ధోరణిలో వుండే ఆత్రేయ మాటలు జీవిత తత్వాన్ని విడమరచి చెబుతాయి, పరమార్ధానికి బాటలు పరుస్తాయి. ప్రేమ, అనుబంధం, ఆత్మీయత, కరుణ వంటి అంశాలు ఆత్రేయ సంభాషణాల్లో కోకొల్లలు. ఇక మహిళా సెంటిమెట్ల గురించి చెప్పాల్సిన పనేముంది! వాస్తవిక దృష్టితో ఆలోచించి సంభాషణలను అల్లుతారు ఆత్రేయ. దాదాపు 38 సంవత్సరాలు సినీ జీవితంతో ఆత్రేయ సాహచర్యం ముడివడివుంది. ఆత్రేయ కోసం తహతహలాడే నిర్మాతలు, ఆయన రాసిందే వేదమని భావించే దర్శకులు కోకొల్లలు. మూగమనసులు చిత్రంలో సావిత్రి చేత అక్కినేనిని “ఒరే గోపీ, రేపు ఆదివారం ఇంటికొచ్చావంటే పాట నేర్చుకుంటాను” అని ఆదేశించేటువంటి డైలాగులు ఎవరండీ రాస్తారు?… ఒక్క ఆత్రేయతప్ప! ’ముద్దబంతి పూవులో’’ పాటకు ఆత్రేయ ముందుగానే నేపథ్యం తయారు చేశారు. సావిత్రి కాలేజీ పాటలపోటీలో నెగ్గినందుకు పాట నేర్పిన అక్కినేనికి తనకు లభించిన పూలదండను అతని మెడలో వేస్తుంది. అదిచూసిన జమున ఆ దండను తనకిచ్చేయమంటుంది. అక్కినేని ఒప్పుకోడు. అప్పుడు జమున “ఓయబ్బో మా లావు దండ. శాశ్శితంగా ఇట్టాగే వుంటదా? గోడకి తగిలిస్తే రేపటికి వాడిపోద్ది, ఎల్లుండికి రాలిపోద్ది, ఏం మిగులుద్దీ?” అంటుంటే సావిత్రి మనసు చివుక్కుమంటుంది. అప్పుడు సావిత్రి “గౌరీ… ఎన్ని ఎలాపోయినా హారంలో దారం మిగుల్తుంది. అదిమాత్రం శాశ్వతంగా వుంటుంది” అంటుంది. దానినే నేపథ్యంగా తీసుకొని ఆత్రేయ “పూలదండలో దారం దాగుందని తెలుసును” అంటూ పాటలో వుదహరించారు. ఈ పాటకు ముందు అక్కినేని సావిత్రికి ముద్దబంతి పువ్వు ఇవ్వడం, ఆమె దానిని జడలో తురుముకోబోతే గోదావరి నదిలో అది పడిపోవడం, అక్కినేనేని ఈదుకెళ్లి ఆ పువ్వు తెచ్చి ఇవ్వడం… ఇదంతా సెంటిమెంటుతో నడిపారు ఆత్రేయ. అక్కినేనిని నాగభూషణం తన మనుషులచేత కొట్టించినప్పుడు జమున ఏడుస్తూ కూర్చుంటే అక్కినేని “గౌరీ ఏడుస్తున్నావా నువ్వు. నీకు కూడా కన్నీళ్ళున్నాయంటే” అని అడుగుతాడు. జమున ‘’ఏం మావా నేను మాత్రం మనిషిని కానా?’ అంటుంది. ఈ సన్నివేశం “మానూ మాకూనూ కాను” పాటకు లంకె. సినిమా చివర్లో అక్కినేని, సావిత్రి సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు సావిత్రిచేత “ఏం చచ్చిపోతామా గోపీ. చావు అందర్నీ విడదీస్తుంది. కొందర్ని కలుపుతుంది” అనే గొప్ప డైలాగు చెప్పిస్తారు. అలా ఆలతిపదాలతో ఎంతటి అనంతార్ధాన్ని తీసుకొచ్చారు ఈ మహాకవి! కులగోత్రాలు సినిమాలో కృష్ణకుమారి చేత అక్కినేనిముందు గొప్ప డైలాగు చెప్పించారు ఆత్రేయ. “అమ్మను మా నాన్న మోసం చేశాడు. అప్పటికే తనలో ఆకారం తీసుకుంటున్న నన్ను నా తల్లి తప్పని తెలిసీ మోసింది… కన్నది. అపకీర్తికి గురుతైన నన్ను అప్పుడే తుంచివేయగలిగితే, ఆమెకు ఈ నింద… మీకు ఈ కలతలు వుండేవి కాదు. నేనెప్పుడూ మిమ్మల్ని మోసం చెయ్యాలనుకోలేదు. కులమేదైనా, మతమేదైనా పెళ్లి చేసుకోవడానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ నాకు కులగోత్రాలు లేవు. నా తల్లికి జరిగిన అన్యాయానికి నేను బలికావాల్సిందేనా’’ అంటూ పొందికైన మాటలతో జీవితసత్యాన్ని ఎంతోగొప్పగా చెప్పించారు. కృష్ణకుమారి తల్లి జి. వరలక్ష్మి-మిక్కిలినేని మధ్య జరిగే సంభాషణలు ఆత్రేయ ఎంత అద్భుతంగా రాశారో చెప్పనక్కరలేదు. తనను వంచించి తన జీవితాన్ని, తన కుమార్తె జీవితాన్ని నాశనం చేసి, తనను కులగోత్రాలు లేనిదానిగా లోకంచేత నిందలు పలికించిన భర్త చలపతిని పోలీసులు తరుముకొస్తుంటే వరలక్ష్మి ఇంటిలో దూరుతాడు. అప్పుడు వరలక్ష్మి ‘’చలపతీ… నువ్వా!” అంటుంది ఆశ్చర్యంగా, అసహ్యంగా. ఈ డైలాగుతో భర్తను పేరుపెట్టి పిలిపించిన మర్మం/ధైర్యం ఆత్రేయకే సొంతం. “’కాంతం…ఇన్నాళ్ల తర్వాత కలుసుకున్నాం. పోట్లాడుకోవడం దేనికి. కాసేపు మనసువిప్పి మాట్లాడుకుందాం” అని మిక్కిలినేని అంటుంటే, వరలక్ష్మి కల్పించుకొని “అబద్ధం. ఆనాడూ అన్నెంపున్నెం ఎరుగని కన్నెపిల్ల మనసు దోచుకోవడానికి అబద్ధం చెప్పావు. తల్లిని కాబోతున్నావని తెలిసినా బరువు బాధ్యత తప్పించుకోవడానికి అబద్ధం చెప్పావు. ఇంకా ఏమి చేయాలని అబద్ధం’’ అంటూ నిలదీసే సన్నివేశంలో ఆత్రేయ పలికించిన డైలాగులు చిత్రానికే హైలైట్. ఇక ప్రేమనగర్ సినిమాలో ఆత్రేయ పలికించిన సంభాషణలు నవీన తెలుగు సినీచరిత్రలో అజరామరాలై నిలిచిపోయేవే. తొలిసారి వాణిశ్రీని తీసుకొని తమ రాచనగరులోకి అక్కినేని అడుగుపెట్టినప్పుడు, అతని తల్లి శాంతకుమారి ‘’కల్యాణ్! కన్నతల్లిని ‘గారు’ అని పిలవడంలో గౌరవం కన్నా దూరమే కనిపిస్తుంది’’ అంటున్నప్పుడు వదిన ఎస్. వరలక్ష్మి అడ్డంవస్తుంది. అప్పుడు అక్కినేని ‘’కాదు వదినగారూ! పెద్దరికం వున్నంతవరకు అది చిన్నవాళ్లను పెద్దవాళ్లను కానివ్వదు’’ అంటాడు. అంతేకాదు ‘’వయసురావడమే పెద్దతనమైతే రాళ్లకు రప్పలకూ వస్తాయి’’ అనికూడా అంటాడు. ఇంకా కొన్ని డైలాగులు వినాలంటే… “ప్రేమ, త్యాగం లాంటి పిచ్చిపిచ్చి మొక్కలు ఇక్కడ మొలవవు. మొలిచినా యెదగవు. యెదిగినా పండవు. ఇక్కడనుంచే మా అధికారం ప్రారంభమౌతుంది. అహంకారం విజృంభిస్తుంది. ఈ ముందు కనిపించే వందల వేల ఎకరాలన్నీ మావే. కానీ చివరకు మనిషికి కావలసింది అటు ఆరడుగులు, ఇటు రెండడుగులు’’ అంటాడు అక్కినేని వాణిశ్రీకి తమ ఎస్టేట్ ను చూపిస్తూ. రాజప్రాసాదంలో వారి పరిచారిక వాణిశ్రీతో ‘’చినబాబుగారు పసిబిడ్డలాంటివారమ్మా. ఆయన చెడిపోయారేమోకాని, చెడ్డవారు మాత్రం కారు” అంటుంది. వాణిశ్రీ అక్కినేనితో మద్యసేవనం మాన్పించడానికి తన నుదుటనుండి కారుతున్న రక్తాన్ని గ్లాసులో పట్టి “రోజూతాగే విస్కీ కన్నా ఎర్రగా వుంటుంది. వెచ్చగా వుంటుంది. అంతకంటే ఎక్కువ మత్తిస్తుంది. ఈ మత్తు ఎప్పటికీ దిగదు. ఈ కైపెప్పటికీ తగ్గదు. తాగండి’’ అనే ఒక్కడైలాగుతో అక్కినేనిలో మార్పును తీసుకొనివస్తుంది. అలాగే SV రంగారావు అక్కినేనితో ‘’ప్రతి మనిషి ఏదో ఒక మత్తులో తనకు ఇష్టం లేనిది, కష్టమైనది మరచిపోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. మరుపన్నది లేకుంటే మానవ జీవితం నరకం. బాబూ…ఆయమ్మ మరణంనీవు మరచిపోలేకుండా వున్నావు. కన్నతల్లినే కఠినంగా చూస్తున్నావు. ముందు వెనకో అందరూ వెళ్ళేవాళ్లే. కానీ వంశం… వంశ మర్యాద తరతరాలుగా వారసత్వంగా వుండిపోతుంది. దాన్ని కాపాడుకోవడానికి కొన్ని దాచుకోవాలి, ఓర్చుకోవాలి కూడా. మనస్సును చంపుకోలేకపోతే మత్తులో నిద్రపుచ్చాలి నాయనా’’ అంటాడు. ఈ డైలాగుతోనే అక్కినేని మద్యం సేవించడానికి అలవాటు పడతాడు. వాణిశ్రీకి పెళ్లి జరగబోతున్న సమయంలో అక్కినేని ఆరుబయట నిలబడి ఆమె చెల్లెలితో ‘’నేనిక్కడికి రాకూడదని నాకుతెలుసు. అయినా ఒకసారి మనసారా దీవించి వెళదామని వచ్చాను’’ అంటాడు. ఆ సన్నివేశం మనసును కదిలించివేస్తుంది. అక్కినేని వాణిశ్రీ ని ప్రేమనగర్ కు తీసుకొని వచ్చినప్పుడు ‘’చూడు. నాదేవికి అంకితమైన ఆలయం చూడు. నా ప్రేమ’లత’కు నేను వేసిన పందిరి చూడు. నా జీవితేశ్వరి ఏలబోయే ప్రేమనగరం చూడు. చూస్తున్నావా. నీకింకా ఆమె కనిపించలేదా. ఆమెను చూడాలంటే నా హృదయంలోకి వెళ్ళాలి. చూడు. ఇక్కడ ఆమె సర్వాంతర్యామి. ఎటుచూచినా నా దేవే సాక్షాత్కరిస్తుంది. వెళ్ళు” అని పరోక్షంగా ఆమే తన ప్రియురాలని చెప్పకే చెబుతాడు. “ఎవరికీ ఇవ్వనంతవరకే హృదయం విశాలంగా వుంటుంది. ఒకసారి ఇచ్చాక ఇరుకైపోతుంది. ఇంకెవ్వరికీ ఇవ్వనంటుంది” అని అక్కినేని వాణిశ్రీతో చెప్పే డైలాగు హృదయాన్ని కదిలించి వేస్తుంది. ఇక “లతా ఎందుకు చేశావీపని” అనే ఒకే ఒక డైలాగుతో సినిమా గతినే ఆత్రేయ మార్చివేయ గలిగారు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఆత్రేయ మాటలకు అంతు అంటూ వుండదు. సంభాషణల రచయితగా ఆత్రేయ అన్నపూర్ణా వారి తోడికోడళ్ళు, మాంగల్యబలం, వెలుగునీడలు, డాక్టర్ చక్రవర్తి, సినిమాలకు పనిచేశారు. అలాగే జగపతి వారి ఆరాధన, బాబూ మూవీస్ వారి మంచిమనసులు, మూగమనసులు, తేనెమనసులు, కన్నెమనసులు వంటి చిత్రాలకు, స్వీయదర్శకత్వంలో వచ్చిన వాగ్దానం చిత్రానికి ఆత్రేయ సంభాషణలు సమకూర్చారు… కొన్నిటికి కథలు కూడా రాశారు. శ్రీవేంకటేశ్వర మహత్మ్యం, పెళ్లికానుక, గుప్పెడుమనసు, జీవన తరంగాలు సినిమాలు కూడా ఆత్రేయ కలం పట్టినవే.
అతడొక ప్రేమ పిపాసి…
ఒకానొకసందర్భంలో సి. నారాయణరెడ్డి మాట్లాడుతూ “ఆత్రేయ రాసిన ‘నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి’ అనే ఒక్క వాక్యం చాలు. అది ఇరవై కావ్యాలపెట్టు” అన్నారు. ఆత్రేయ రాసిన ప్రేమ పాటలు అజరామరాలు. ఆయన ఒక ప్రేమ పిపాసి. ప్రేమలో దెబ్బతిన్న ప్రేమికుడు. చదువుకునే రోజుల్లోనే ఆత్రేయ ‘బాణ’ అనే అమ్మాయి ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలంటే సగోత్రీయురాలు అనే నెపంతో పెద్దలు అడ్డుపడ్డారు…. ఆ అమ్మాయి మంచి వీణా విద్వాంసురాలు. అందుకే ఆత్రేయ మంచిమంచి వీణ పాటలు రాశారు. తొలిప్రేమే ఆత్రేయకు గండి కొట్టడంతో సినిమాలో ఆత్రేయ పాటలు ప్రేమగాయాన్ని గుర్తుచేస్తుంటాయి. ఆయన ‘బాణ’ను తలచుకుంటూ… ’లతవై, నా జతవై, గతస్మృతివై, నా శ్రుతివై, స్వరజతివై, లయగతివై, నను పాలించవా…. చెలివై, నెచ్చెలివై, చిరుచలివై, కౌగిలివై, కౌగిలిలో జాబిలివై నను మురిపింపవా అని ప్రేమాభిక్షకోసం తపించారు. ఆడబ్రతుకు చిత్రంలో శ్రీనివాస్ ఆలపించిన ‘’తనువుకెన్ని గాయాలైనా మాసిపోవు నేలాగైనా… మనసుకొక్క గాయమైనా మాసిపోదు చితిలోనైనా’’ అనే పాటలో ప్రేమ వైఫల్య ఫలితాన్నిచాటి చెప్పారు. అంతేకాదు ‘’ఆడవాళ్ళు ఆడుకొనే ఆటబొమ్మ ఈ మగవాడు… ఆడుకున్న ఫరవాలేదు పగులగొట్టి పోతారెందుకో’’ అనికూడా విలపించాడు. ఆత్రేయకు బాగా నచ్చిన పాట బాలు ఇంద్రధనుస్సు చిత్రంలో ఆలపించిన ‘’నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి. నా దాహం తీరనిది. నీ హృదయం కదలనిది’’ అనే పాట. ఆత్రేయ ఒక సీనియర్ నటిని ప్రేమించి ఆ ప్రేమ విఫలమయ్యాక రాసిన పాటగా దీనిగురించి చెబుతారు సినీ పెద్దలు. బాలు ఎక్కడైనా తారసపడితే ఈ పాట పాడించుకొని కన్నీరు పెట్టుకునేవారు ఆత్రేయ. అలాంటిదే కన్నెమనసులు చిత్రంలో ‘’ఓ.. హృదయంలేని ప్రియురాలా వలపును రగిలించావు, పలుకక వూర్కొన్నావు… ఏం కావాలనుకున్నావు, వీడేంకావాలను కున్నావు’’ అనే పాట. ఈ పాట కూడా తను ఒక నూతన తార ప్రేమలోపడి దెబ్బతిన్న తరవాత వెలువడిన పాట. అందులో ‘’నీమనసుకు తెలుసు నా మనసు, నీ వయసుకు తెలియదు నీ మనసు…రాయి మీటితే రాగం పలుకును…రాయికన్న రాయివి నీవు, కసాయివినీవు’’ అంటూ ఈ పాటలో తన అక్కసు వెళ్ళగక్కారు. ప్రేమ అనే రెండక్షరాల మాటకు ఆత్రేయ ఎన్ని నిర్వచనాలు చెప్పారో లెక్కే లేదు. ఆద్యంతమూ లేని అమరానందమే ప్రేమ అని, ఏ బంధమూ లేని తొలి సంబంధమే ప్రేమ అని చెబుతూ ప్రేమ దివ్యభావము, ప్రేమ జీవరాగము, ప్రేమ జ్ఞానయోగము అని ఉద్ఘాటించారు ఆత్రేయ. ఇంకా ఏమి చెప్పారంటే ప్రేమ మనసునపారే సెలయేరు వంటిదని, అలసట తీర్చే చిరుగాలి వంటిదని, అందమైన ప్రేమకు హద్దులే వుండవని, జన్మలు ఎన్ని మారినా ప్రేమ పేరు ప్రేమే అంటూ ముగించారు. ఇలా వుంటుంది ఆత్రేయ రచనాశైలి. ఇంకొక పాటలో “ప్రేమకన్నా పాశముందా, పెంచుకుంటే దోషముందా, తెంచుకుంటే తీరుతుందా, పంచుకుంటే మరచేదా” అని ప్రశ్నించారు. మరొకచోట ‘’ప్రేమకు మరణం లేదు, దానికి ఓటమి లేనేలేదు, అది ఓడి గెలుచుకుంటుంది, చావులోనూ బ్రతికుంటుంది’’ అని ప్రేమ విలువను తెలియజేశారు. మరోకచోట ‘’ప్రేమ లేదనీ, ప్రేమించరాదనీ, సాక్ష్యమే నీవని, నన్ను నేను చాటనీ, గడియపడిన మనసు తలుపు తట్టి చెప్పనీ, ముసురుగప్పి మూగవోయిన మనసుని” అంటూ విఫల ప్రేమ మీద అక్కసు వెళ్ళగక్కారు. మహాకవి కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం మీద తన అభిప్రాయాన్ని చెబుతూ ‘’ప్రేమకు ద్రోహం చేసి అమాయకురాలైన శకుంతలను దుష్యంతుడు మోసం చేశాడు. కానీ కాళిదాసు ఆ మోసం గురించి రాజుగారి ముందు ధైర్యంగా గొంతెత్తి చెప్పలేకపోయాడు. అలా చెప్పివుంటే దుష్యంతుని కొలువుకూటంలోనే కాళిదాసు తల నేలకూలేది. అందుకు కాళిదాసు ఒక పిట్టకథను సృష్టించి రాజునే సమర్ధించాడు. అది మహాకావ్యం కావచ్చు. కానీ, దాని వెనుకవున్న పిరికితనాన్ని నేను హర్షించలేను’’ అని కుండ బద్దలు కొట్టిచెప్పగలిగిన సాహసి ఆత్రేయ. అందుకే ‘’అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికనీ అనుకోవడమే మనిషి పని’’ అని సర్ది చెప్పుకున్నారు. ఇక ప్రేమ సంఘర్షణకు తార్కాణంగా ‘’మనసుగతి ఇంతే మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖములేదంతే’’ అంటూ ఓదార్పువచనాలు పలికారు. మనసులోని మాట చెబుతూ ‘’మనిషిపోతె మాత్రమేమి మనసు వుంటది… మనసుతోటి మనసెపుడో కలిసిపోతది… చావు పూటకలేనిదమ్మ నేస్తమన్నదీ, జనమజనమ కది మరీ గట్టిపడతది’’ అని మూగమనసుల్లోని చెప్పారు. కులాసా పాటలు రాస్తూ ‘’చిటపటచినుకులు పడుతూవుంటే’’ అంటూ తెలుగులో తొలి రెయిన్ సాంగ్ సృష్టించారు ఆత్రేయ. ఇక వీణ పాటలు ఎంతో అందంగా అమర్చారు. డాక్టర్ చక్రవర్తి చిత్రంలో ‘’పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా’’ అనే పాటలో ‘’ఈ వీణ మ్రోగక ఆగినా, నే పాడజాలకపోయినా’’ అంటూ తన ప్రేయసి ‘బాణ’ ను గుర్తుచేసుకున్నారు. అలాంటివే ‘’వీణలోనా తీగలోనా ఎక్కడున్నదీ నాదము అది ఎలాగైనది రాగము’’, “ఈ వీణకు శ్రుతిలేదు ఎందరికో హృదయం లేదు”, “ఎవరో రావాలి నీ హృదయం కదిలించాలి, నీ తీగలు సవరించాలి’’ అనే వీణ పాటలు కూడా అజరామరమైనవి. ఇలా చెప్పుకుంటూ పోతే ఫుల్ స్టాప్ దొరకదు.
మరికొన్ని విశేషాలు…
ఆచార్య ఆత్రేయ 1961లో ‘వాగ్దానం’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో పాటలన్నీ హిట్లే. కథాబలం కూడా గొప్పది. కానీ సినిమా ఆడలేదు. ఈ ప్రశ్నకు యెంత వెదకినా జవాబు దొరకదు. దర్శకునిగా ఈ సినిమాలో ఘనమైన ప్రయోగాలు చేశారు. చిత్రకథ, సంభాషణలు తానే స్వయంగా సమకూర్చినా, సహచర సినీ కవులకు చోటు కల్పిస్తూ వారిచేత పాటలు రాయించారు. అభ్యుదయ కవిగా పేరుగాంచిన దాశరథిని సినీ గేయకవిగా ఈ చిత్రంలోనే పరిచయం చేస్తూ ‘’నా కంటిపాపలో నిలిచిపోరా, నీవెంట లోకాల గెలువనీరా’’ అనే పాటను రాయించారు. మహాకవి శ్రీశ్రీ చేత సీతాకళ్యాణం హరికథ రాయించారు. నార్ల చిరంజీవి చేత ‘తప్పెట్లో తాళాలో’ అనే పాట రాయించారు.
‘’రాసి ప్రేక్షకులని, రాయక నిర్మాతలనీ ఏడిపించేవారు’’ అని ఆత్రేయమీద ఒక అపప్రద వున్నమాట నిజమే. అయినా ఆత్రేయతోనే పాటలు రాయించుకోవాలని, ఆ జాప్యాన్ని హృదయపూర్వకంగా భరిస్తూ, ఎంత కాలమైనా వేచి చూచిన దర్శక నిర్మాతలు వున్నారు. వారిలో పి. పుల్లయ్య, దుక్కిపాటి మధుసూదనరావు, జగపతి రాజేంద్రప్రసాద్, మురారి, ఆదుర్తి సుబ్బారావు వంటివారిని ముందుగా చెప్పుకోవాలి.
వందలకొద్దీ మనసుపాటలు రాసి ప్రేక్షక హృదయాలను దోచుకున్న ఆత్రేయకు నంది పురస్కారం లభించింది కేవలం ఒక సారి మాత్రమే. తొలికోడి కూసింది అనే చిత్రంలో ఆత్రేయ రాసిన “అందమైన లోకమని, రంగురంగులుంటాయని అందరూ అంటుంటారు రామరామ, అంత అందమైంది కానేకాదు చెల్లెమ్మా” అనే పాటకు ఉత్తమ గేయరచయిత బహుమతి దక్కింది.
అన్నపూర్ణా వారి తోడికోడళ్ళు చిత్రంలో ‘’కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడి చానా బుగ్గమీద గులాబీరంగు ఎలా వచ్చేనో చెప్పగలవా’’ అనే అభ్యుదయ గీతాన్ని ఆత్రేయ నెల్లూరు జమీన్ రైతు పత్రికలో పనిచేస్తుండగా రాశారు. కస్తూరిబా బాలికల పాఠశాలకు శ్రీమంతులైన రెడ్ల ఆడపిల్లలు ఖరీదైన దుస్తులు ధరించి కార్లలో వస్తుండడం చూసిన ఆత్రేయకు తన ఆర్ధిక దురవస్థను నెమరువేసుకుంటూ, శ్రీమంతుల అదృష్టంతో పోల్చుకుంటూ ఈ పాటను తన డైరీలో రాసుకున్నారు. దానినే తోడికోడళ్ళు చిత్రంలో ఆదుర్తి సుబ్బారావు వాడుకున్నారు. పాట వింటున్నవారికి ఈపాట శ్రీశ్రీ రాశారోమో అనిపిస్తుంది. జీవనతరంగాలు చిత్రంలో టైటిల్ సాంగ్ కూడా ఆత్రేయ గీతమే.
ఆత్రేయ 1989 సెప్టెంబర్ 13 న చెన్నైలో మరణించారు.
-ఆచారం షణ్ముఖాచారి