గుంటూరు చెందిన ప్రముఖ రచయిత, ఆంధ్రోపన్యాసకులు, కార్టూనిస్ట్ డాక్టర్ పులిచెర్ల సాంబశివరావును పండిత గోపదేవ్ వైదిక ధర్మ ప్రచార సమితి ‘ఆర్య పురుష’ బిరుదుతో సత్కరించనుంది.
మహర్షి దయానంద సరస్వతి స్థాపించిన ఆర్యసమాజ సిద్ధాంతాలను తెలుగు రాష్ట్రాలలో ప్రచారం గావించి, నిండు నూరేళ్లు జీవించిన మహాత్ములు పండిత గోపదేవ్ స్మృత్యర్థం, ఈ రెండు రాష్ట్రాలలో వేదవాఙ్మయాన్ని ప్రచారం గావిస్తున్న వారిని ‘పండిత గోపదేవ్ వైదిక ధర్మ ప్రచార సమితి’ ఏటా పురస్కారాలతో సత్కరిస్తుందని సమితి వ్యవస్థాపక కార్యదర్శి, ఆర్యసమాజ కమిటీ సభ్యులు, న్యాయవాది ఏలూరి సూర్యనారాయణ వెల్లడించారు.
సమితి 17వ వార్షికోత్సవం సందర్భంగా గుంటూరు అరండల్ పేటలోని ఆర్యసమాజ మందిరంలో అక్టోబర్ 2 ఆదివారం, ఉదయం 9 గం.లకు జరుగనున్న కార్యక్రమంలో, ఈ ఏడాది డాక్టర్ పులిచెర్ల సాంబశివరావుకు ‘ఆర్యపురుష’ బిరుదుతో పాటు 25 వేల రూపాయల నగదుతో సత్కరించుకోనుంది. 1946లో జన్మించిన పులిచెర్ల తెలుగు సాహిత్యంలో ఎం.ఎ., ‘వీరేశలింగం రచనలలో హాస్యం’ అనే అంశంపై పిహెచ్.డి. చేసి, స్థానిక జె.కె.సి. కళాశాలలో సుదీర్ఘకాలం ఆంధ్రోపన్యాసకులుగా పనిచేసి 2004 సం.లో పదవీవిరమణ చేశారు..
వారి సోదరులు సుబ్బారావుతో కలిసి జంటకవులుగా సాహిత్య, చారిత్రక, దేశభక్తుల గ్రంథ రచనలతో ప్రఖ్యాతులయ్యారు. రచనలలో శ్రీరామాయణం, రాణా ప్రతాప్ సింగ్ ప్రత్యేకత సంతరించుకున్నాయి. ‘స్వర్ణయోగి’ రచన ఇంటర్మీడియట్ విద్యార్ధులకు ఉపవాచకంగా ప్రభుత్వం ఆమోదించింది.
‘ఈనాడు’ దినపత్రికలో ‘అంతర్యామి’ వ్యాసాల ద్వారా సామాజిక అంశాలతో, ధార్మిక, ఆధ్యాత్మిక అంశాలను స్పృశిస్తూ ప్రజా చైతన్యానికి కృషి చేశారు. తొలిరోజులలో తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధిచెందిన భారతి మాసపత్రికలో ఆయన రచనలు ప్రచురితం అవుతూ ఉండెడివి. ఈనాడుతో పాటు, ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాజకీయ వ్యంగ్య కార్టూనులు కూడా వేసేవారు. వీరి మొదటి కార్టూన్ ‘ఆంధ్రపత్రిక’లో 1965 సం.లో అచ్చయ్యింది. పలు సామజిక, ధార్మిక సంస్థలలో సన్నిహితంగా వ్యవహరించారు.
మహర్షి దయానంద రచించిన ‘సత్యార్ధప్రకాశం’ స్ఫూర్తితో ఆయన జీవితాన్ని వేదోక్తంగా మలచుకున్నారు. తన జీవితంలో ఎన్నెన్నో ఉత్తమ పురస్కారాలు అందుకున్న డాక్టర్ పులిచెర్లను ‘ఆర్యపురుష’తో పాటు ‘సువర్ణాంగుళీయకం’ ప్రదానం చేసి ఘనంగా సత్కరించుకోనున్నారు.
వీరితో పాటు విజయనగరం జిల్లా, చీపురుపల్లికి చెందిన వైదిక ధర్మ ప్రచారకులు రెడ్డి రామానాయుడు, కుమరాపు అప్పలనాయుడులకు కూడా ‘ఆర్య పురుష’ బిరుదుతో పాటు, నగదు పురస్కారాలను అందించనున్నట్లు సూర్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా జరిగే సభకు వైదికధర్మ ప్రచారకులు డాక్టర్ కొసరాజు రవీంద్ర అధ్యక్షత వహిస్తారు. కార్యక్రమంలో జూపూడి హైమావతి, డాక్టర్ బి.విజయ భాస్కర్, డాక్టర్ కొండబోలు కృష్ణ ప్రసాద్, డాక్టర్ పి. విజయ తదితరులు పాల్గొంటారు.
–కళాసాగర్
Great contribution to telugu literature in the changing modern world