అమితాబ్‌ సినీ ప్రస్థానానికి 50 యేళ్ళు

బిగ్..బి.. ఆ రెండు పదాలు పలికితే చాలు భారతీయుల గుండెలు అల్లాడి పోతాయి. కోట్లాది మంది అభిమానుల మనసు దోచుకున్న ఆ అరుదైన నటుడు, లివింగ్ లెజెండ్, బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌. కొన్నేళ్లుగా సినీ ప్రియులను అలరిస్తూ వస్తున్నారు. తనకంటూ ఓ ఇమేజ్ ను స్వంతం చేసుకున్నారు. హిందీ సినీ జగత్తులో అమితాబ్ బచ్చన్ తన 50 ఏళ్ల ప్రస్ధానాన్ని పూర్తి చేసుకున్నారు. సాథ్‌ హిందుస్తానీ చిత్రంతో బాలీవుడ్‌లో ఆయన అడుగు పెట్టారు. తన నటనతో దేశవ్యాప్తంగా సినీ అభిమానులను ఉర్రూత లూగించారు. భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ అమితాబ్‌ నటనకు సినీ ప్రియులు నీరాజనాలు పలికారు. ఇటీవలే తెలుగులో “సైరా నరసింహారెడ్డి ” లో కూడా అమితాబ్ నటించారు.

సుదీర్ఘ సినీ ప్రయాణంలో పలు బ్లాక్‌ బస్టర్లు అందించారు. అమితాబ్ తన నట ప్రస్థానాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ సినిమాల్లో అమితాబ్‌ ఎంట్రీ సీన్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వస్తోందంటే అతిశ యోక్తి కాదు.బిగ్‌బీ తొలి మూవీ సాథ్‌ హిందుస్తానీ 1969 నవంబర్‌ 7న విడుదలై నేటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఐదు దశాబ్ధాలుగా సినీ ప్రియులను అలరిస్తున్న అమితాబ్‌ తన నట వారసునిగా అభిషేక​ బచ్చన్‌ను పరిశ్రమకు అందించారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు అభిషేక్‌ తన తండ్రి హీరోగా ఎదిగిన తొలినాళ్ల ఫోటోను పోస్ట్‌ చేశారు.

కేవలం కుమారుడి గానే కాదు, నటుడిగా, ఓ అభిమానిగా మేమంతా మీ ఔన్నత్యానికి సాక్షులుగా నిలిచామని అభిషేక్‌ రాశారు. సినీ అభిమానులంతా తాము బచ్చన్‌ తరంలో జీవించామని గర్వంగా చెప్పుకుంటారని, 50 ఏళ్లు సినీ జీవితంలో కొనసాగినందుకు అభినందనలు తెలిపారు. మరో 50 ఏళ్ల కోసం తాము నిరీక్షిస్తామని అభిషేక్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అమితాబ్ జీ మిమ్మల్ని మేమెలా మరవగలం.. నిత్యం మా అడుగు జాడల్లో..ఆలోచనలలో మీ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. మీ స్వరం మమ్మల్ని సమ్మోహితులను చేస్తూనే ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap