ఆర్ట్ ఫెస్టివల్-2021 ను ప్రారంభించిన విశాఖ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు
చూడటానికి చిత్రాలే.. కానీ ప్రతి చిత్రం ఓ సామాజిక అంశంతో ముడిపడి ఉంది. అమ్మాయిలపై వివక్ష ఏంటని ఓ చిత్రం సమాజాన్ని నిలదీస్తుంది. ప్రకృతిని నాశనం చేయడానికి మీరెవరని మరో చిత్రం మనల్ని ప్రశ్నిస్తుంది. ఇలా ఒక్కో చిత్రం.. ఒక్కో ఇతి వృత్తాన్ని కల్గి చూపరులను ఆకర్షిస్తున్నాయి. ఇవన్నీ యువతీయువకులు, వృత్తి చిత్రకారులు కుంచె పట్టి లాక్ డౌన్ కాలంలో గీసినవే. విశాఖపట్టణం బీచ్ రోడ్డు హవామహల్ లో జరుగుతున్న ‘ఆంధ్రప్రదేశ్ ఆర్ట్ ఫెస్టివల్-2021లో 90 మంది తమ చిత్రాలను, గ్రాపిక్స్, శిల్పాలను ప్రదర్శించారు. ఆ చిత్రాల వెనుక వారి శ్రమను.. సమాజాన్ని చూసిన కోణం తెలుసుకోవడానికి.. విశాఖ కళాభిమానులు తరలి వస్తున్నారు.
విశాఖ కళాకారుల ప్రతిభ అందరికీ తెలిసేలా ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేయాలని డీఐజీ ఎల్‌కేవీ రంగారావు అన్నారు. బీచ్ రోడ్డులోని హవామాహల్ లో ఆంధ్రప్రదేశ్ ఆర్ట్ ఫెస్టివల్-2021ను ఆయన సోమవారం(25-10-21) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రధాన నగరాల్లో ఆర్ట్ గ్యాలరీలు ఉన్నాయని, పర్యాటక ప్రాంతమైన విశాఖలో లేకపోవటం శోచనీయమన్నారు. ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేస్తే స్థానికుల ప్రతిభను ప్రోత్సహించినట్లవుతుందన్నారు. ఫెస్టివల్ లో ప్రదర్శించిన ప్రతి చిత్రం అద్భుతంగా ఉందని చెప్పారు. ఫెస్టివల్ నిర్వాహకుడు కె. రవి మాట్లాడుతూ రాష్ట్రంలోని కళాకారుల ప్రతిభను వెలికితీసేందుకు ఈ ఫెస్టివల్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ నెల 28వ తేదీ వరకు పెయింటింగ్ ఎగ్జిబిషన్ అందుబాటులో ఉంటుందన్నారు. ప్రతి సంవత్సరం ప్రదర్శనకు ఈ వేదికను ఇచ్చి కళాకారులను ప్రోత్సహిస్తున్న హవామాహల్ ఆసామి, కళాభిమాని మయాంక్ కుమారి గారికి కృతజ్ఞతలు తెలిపారు.
జి.రవీందర్ రెడ్డి, వి.రమేష్, బొత్స వెంకట్ వంటి ప్రముఖ కళాకారులకు వైజాగ్ నిలయం, అయితే వైజాగ్ వారికే వీరి గురించి పెద్దగా తెలియదు. వీరు వైజాగ్ వెలుపల దేశ, విదేశాలలో ప్రసిద్ధి చెందారు. భారతదేశం మరియు విదేశాలలో ఉన్న ఎంతో మంది సీరియస్ ఆర్ట్ కలెక్టర్ వద్ద ఈ గొప్ప కళాకారుల వర్క్స్ సేకరించబడ్డాయి. ఈ ఎగ్జిబిషన్ లో వారి కొన్ని చిత్రాలను ప్రదర్శించడం మనకు గర్వకారణం. రాబోయే ఆర్టిస్టులకు స్థలం ఇవ్వడంతో ప్రారంభమైన ఈ ప్రక్రియ ఊపందుకుంది, కొన్ని సంవత్సరాలలో భారతదేశంలోని ఏ ఆర్ట్ ఫెయిర్‌కైనా పోటీగా మన కళాకారులు సిద్ధంగా వున్నారనడంలో సందేహంలేదంటున్నారు కురేటర్ కె. రవి.
ఈ ప్రదర్శనలో ఏ.యూ. ఫైన్ ఆర్ట్స్ కాలేజీ అధ్యాపకులు మండా శ్రీనివాస్, వి. రమేష్, కట్టకూరి రవి లతో పాటు బొత్సా వెంకట్, శ్రీనివాసరావు కనుమూరి, సంధ్యా పట్నాయక్, యస్. సతీష్, రవి చంద్ర, నరేష్ మహంత, తిరుపతిరావు అద్దేపల్లి, కె.ఎల్. దీపిక, గుణవతి, శరత్ చంద్ర, కామేశ్వరి, షర్మిల కర్రి తదితర కళాకారులు పాల్గొన్నారు.
–కళాసాగర్ యల్లపు
మీకు నచ్చిన painting images kooda పెట్టివుంటే బాగుండేది.
ఆర్టికల్ బాగుంది