నాటకరంగం… నేటి యువతరం లో అంతగా ఆదరణలేని రంగం. సినిమాలకు ఉండే క్రేజ్ ఈ నాటక రంగానికి ఉండదు. బుల్లితెరకు ఉండే ఆదరణ కూడా ప్రజల నుండి ఈ నాటక రంగానికి ఉండదు. కానీ బుల్లితెర, వెండి తెరకు మించిన చరిత్ర నాటకరంగానిది. ప్రజల్ని చైతన్యపరుస్తూ సమాజంలో నెలకొన్న అసమానతలను రూపుమాపేందుకు సంఘసంస్కర్తలు ఎంచుకున్న మహోన్నత ఆయుధం నాటకం. అంతటి ఘన వైశిష్ఠ్యం కలిగిన నాటకరంగం సజీవంగా కొనసాగాలని భవిష్యత్తు తరాలకు తరగని వారసత్వ సంపదగా నాటకాన్న్ని అందించాలనే నా సంకల్పానికి తోడ్పాటునిస్తూ… ఎల్లవేళలా వెన్నుదన్నుగా ఉంటున్న నా అరవింద ఆర్ట్స్ కుటుంబ సభ్యులకు సదా కృతఙ్ఞుడునై ఉంటాను.
తెలుగు నాటకరంగంలో అరవింద ఆర్ట్స్ కు ఓ ప్రత్యేక స్థానం ఉందంటే అది అరవింద ఆర్ట్స్ కుటంబంలోని ప్రతీ కళాకారుని కృషే కారణం. ఈ సందర్బంగా అరవింద ఆర్ట్స్ కుటుంబ సభ్యులకు నాటకంపట్ల ఎంత ప్రేమ ఉంటుంది, ఎంత బాధ్యత గా నాటకాన్ని ఆరాధిస్తారు అనే విషయాలను ఒక చిన్న ఉదాహరణ ద్వారా మీకు తెలియపరచుకోవాల నుకుంటున్నాను. భువనేశ్వర్ లో అత్యంత ప్రతిష్టాత్మక మైన బహుభాషా నాటకోత్సవాలకు తెలుగు భాష నుండి అరవింద ఆర్ట్స్ “మధుపర్కాలు” నాటిక ఎంపిక అయ్యింది. ఐతే ఓవైపు కోవిడ్ సెకండ్ వేవ్ కొనసాగుతుందని విస్తృత ప్రచారం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో భువనేశ్వర్ కు వెళ్ళి నాటిక ప్రదర్శించగలమా అని ఓ చిన్న సందేహం నాకు ఉంది. సరే ముందుగా విషయాన్ని నా అరవింద కుటుంబ సభ్యులైన కళాకారులకు చెప్పాను. ప్రతీ ఒక్కరూ పాజిటివ్ గా స్పందించారు. నన్ను ఉత్సాహపరిచే విధంగా నా నాటకరంగ కుటుంబ సభ్యులందరూ కలసి నాకు అండగా నిలిచి నాతో అడుగు ముందుకేయించిన ప్రతీ నటీనటునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకించి ఐదుగురు నటీమణుల సహకారం మరువలేనిది.
ఈ సందర్బంగా మరో విషయాన్నీ మీకు చెప్పాలనుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల్లో అనేక పరిషత్ ల్లో మధుపర్కాలు నాటిక ను చూసిన పిఠాపురం కు చెందిన ముగ్గురు మిత్రులు బహుభాషా నాటకోత్సవాల్లో ప్రదర్శించే మధుపర్కాలు నాటిక ను వీక్షించేందుకు కారు లో 600 కిమీ ప్రయాణించి భువనేశ్వర్ కు వచ్చి నాటికను వీక్షించిన కళాహృదయులకు ధన్యవాదాలు చెబుతున్నాను. ఇది ఇలా ఉండగా విపత్కర పరిస్థితులను సైతం లెక్క చెయ్యకుండా నాటకానికి, రంగస్థలానికి ప్రాధాన్యత నిచ్చి భువనేశ్వర్ లో మధుపర్కాలు నాటిక ను అత్యద్బుతంగా ప్రదర్శించి అరవింద ఆర్ట్స్ ఖ్యాతిని మరొక మెట్టు ఎక్కించిన అరవింద కుటుంబ సభ్యులందరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మీ
గంగోత్రి సాయి