(బెందాళం క్రిష్ణారావు గారు 29-4-2018 న ప్రజాశక్తి దినపత్రికలో చేసిన ఇంటర్ వ్యూ)
బాలి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దాదాపు ఐదు దశాబ్దాలుగా అవిశ్రాంత చిత్రకారుడాయన. దేశవిదేశాల్లోని తెలుగువాళ్లందరికీ, గీతల్ని, రాతల్ని ప్రేమించేవారందరికీ ఇష్టమైన పేరది. లక్షల చిత్రాలు గీసిన లక్షణమైన చిత్రకారునిగా, కార్టూనిస్టుగా, కథారచయితగా తన జీవితాన్నే చిత్రంగా మలచుకుని పయనం సాగిస్తున్న కళాకారుడు బాలి. అసలుపేరు మేడిశెట్టి శంకరరావు. కానీ, ‘బాలి’గానే అందరికీ తెలుసు. విద్యార్థి దశలోనే 1958 నాటి ఆంధ్ర (వార)పత్రికలో ‘ఉబుసుపోక’ అనే శీర్షికతో వేసింది తొలిచిత్రమైనా, 1970 నుంచే విస్తారంగా చిత్రాలు గీస్తున్నారు. అమ్మ అన్నపూర్ణమ్మ అందంగా తీర్చిదిద్దే ముగ్గుల్ని చూసి చిత్రకళా సాధనకు ఉపక్రమించిన ‘బాలి’ ఏ గురువు దగ్గరా శిక్షణ పొందకుండానే స్వయంకృషితో ఎదిగారు. నిస్సందేహంగా బాపు బొమ్మల తర్వాత అంత ఒద్దికగా.. అందంగా కనిపించే బొమ్మలు గురించి ఆరాతీస్తే మాత్రం.. బాలి బొమ్మలే గుర్తొస్తాయి. మరో తెలుగింటి అందమైన బాలి బొమ్మ ‘జీవన’యానం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం!!
కుటుంబ నేపథ్యం వివరించండి?
మా స్వస్థలం విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి. అమ్మ అన్నపూర్ణమ్మ, నాన్న లక్ష్మణరావు. అప్పటి బ్రిటీష్‌పాలనలో ఆర్మీలో సుబేదార్‌గా ఉండేవారు. ఆయనకు చిత్రకళ మీద ఆసక్తి ఉండేది. నాన్న ఉద్యోగరీత్యా సింగపూర్, ఇటలీ, మలయా తదితర దేశాలు తిరిగేవారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో చిన్నపిల్లలమైన మాకు అమ్మే ధైర్యం చెప్పేది. ఆయన అప్పుడప్పుడూ ఇంటికి వచ్చేవారు. మేమంతా కలిసి ఊటీ వెళ్లినట్టు జ్ఞాపకం. ఆతర్వాత ఆయన మాకు భౌతికంగా దూరమయ్యారు. దాంతో అమ్మ, మేమూ అనకాపల్లిలోని మామయ్య ఇంటికి చేరాం. అక్కడే నా చదువు మొదలయ్యింది. ఇంకోవిషయం నాన్న బతికున్నంత కాలం నాకు ఆయన ఆర్టిస్టని తెలియదు. ఆయన చనిపోయిన తర్వాత బ్రిటీష్ అధికారులు ఆయనకు సంబంధించిన పెట్టెల్ని మాకు పంపించారు. అప్పటికే పుట్టెడు దుఃఖంతో ఉన్న అమ్మ వాటిని తెరవనేలేదు. అక్కడికి పన్నెండేళ్ల తర్వాత వాటిని తెరిచి చూస్తే డబ్బు, ఇతర వస్తువులతోపాటు, బొమ్మలేయడానికి ఉపయోగించే చైనా రంగుల కేకులు, కుంచెలు, ఆయన చిత్రించిన ప్రకృతి దృశ్యాల బొమ్మలు కన్పించాయి. ఈ ల్యాండ్‌స్కేప్‌లు నాలో చిత్రకారుడికి బీజం వేశాయనుకుంటాను.
చిత్రకళపై మక్కువ ఎలా ఏర్పడింది?
అమ్మ అన్నపూర్ణమ్మ ఏపని చేసినా కళాత్మకత కన్పించేది. ఎంతో అందమైన ముగ్గుల్ని అమ్మ తీర్చిదిద్దడాన్ని చిన్నప్పటి నుంచీ మక్కువతో చూసేవాడిని. నేలమీద పూలతీగలు పర్చినట్లుండే ఆ ముగ్గుల్ని చూశాక బహుశా నాలో చిత్రకళకు అలా ప్రేరణ పెరిగిందనుకుంటాను. స్కూల్లో కూడా డ్రాయింగ్ క్లాసులుండేవి. మిగిలిన సబ్జెక్టుల కన్నా డ్రాయింగ్ క్లాసులంటే ఇష్టంగా ఉండేది. నేను వేసిన బొమ్మల్ని మా టీచర్లు అంతగా మెచ్చుకోకపోయినా అమ్మ మాత్రం వాటిలో లోపాలను సరిద్దుతూ మురిపెంగా చూసేది. అమ్మ పడుకున్నప్పుడు వెనుకనుంచి చూసి ఆ భంగిమనే చిత్రంగా గీశాను. ఇప్పటికీ మహిళల చిత్రాలు గీసేటప్పుడు నాకు తెలియకుండానే అమ్మ గుర్తొచ్చి, ఆ ప్రభావం చిత్రాల్లో కన్పిస్తుంటుంది.
చదువుతో పాటు చిత్రకళాభ్యాసం చేస్తూనే ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. ఇక కుటుంబ పోషణకు ఉద్యోగాల వేట మొదలుపెట్టాను. ఆ సమయంలో చిత్రకళా సాధనని కొంచెం పక్కన పెట్టాను. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి, పబ్లిక్ వర్క్స్ విభాగంలో క్లర్క్ ఉద్యోగంలో చేరాను. అయితే బొమ్మలు గీయడం ప్రాక్టీస్ మళ్లీ ఎక్కువైంది. పత్రికల్లోనూ నేను గీసిన చిత్రాలు వస్తుండేవి. 1970లో అనుకుంటా ఆంధ్రజ్యోతి వారపత్రికలో ఒక పిల్లల నవల రాసి, దానికి బొమ్మలు కూడా నేనే గీసి పంపించాను. అప్పటి ఎడిటర్ పురాణం సుబ్రహ్మణ్యశర్మ దానిని పత్రికలో సీరియల్‌గా ప్రచురించడమే కాకుండా.. తనను కలవాల్సిందిగా కబురుపెట్టారు. అక్కడ కెరీర్ బాగుంటుందని భావించి, ప్రభుత్వోద్యోగాన్ని వదిలేశాను.
చిత్రకారునిగా ప్రయాణం ఎలా మొదలైంది?
ఆంధ్రజ్యోతి వారపత్రిక, యువ, జ్యోతి మాసపత్రికల్లో రకరకాల కథలకు నా చిత్రాలు ఎక్కువగా వచ్చేవి. అయితే వృత్తిలో మాత్రం స్థిరపడలేదు. ఈలోగా రామోజీరావు ఈనాడు పత్రిక ప్రారంభించడం ,అందులో నన్ను స్టాఫ్ ఆర్టిస్టు/ కార్టూనిస్టుగా ఉద్యోగంలోకి తీసుకున్నారు. అంతకుముందు నేను ఏబికే ప్రసాద్ రాసిన ‘హోచిమిన్ జీవితం’ పుస్తకానికి బొమ్మలు గీశాను. ఈనాడు తొలి ఎడిటర్ ఏబికె ప్రసాద్ కావడం వల్ల అలా ఈనాడులో అడుగుపెట్టాను. విశాఖపట్నంలోనే పత్రిక ప్రారంభమైంది కాబట్టి..అక్కడే ఉండేవాడిని. తర్వాత హైదరాబాద్ ఆఫీసుకు వెళ్లాను. ఈనాడు నుంచి ఏడాదిన్నరలోనే బయటకు వచ్చేశాను. వెంటనే ఆంధ్రజ్యోతిలో స్టాఫ్ ఆర్టిస్టుగా అప్పటి ప్రధాన సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు తీసుకున్నారు. అలా ఆ సంస్థలో 12 ఏళ్లు పనిచేశాను.
‘బాలి’ అనే పేరెలా వచ్చింది?
నా అసలుపేరు మేడిశెట్టి శంకరరావు. అందువల్ల బొమ్మలు గీసే మొదట్లో దిగువన శంకర్, శంకరరావు అని సంతకం పెట్టేవాడిని. అయితే అప్పటికే బొమ్మలు గీస్తున్న శంకర్‌లు ఇద్దరున్నారు. దాంతో పురాణం సుబ్రహ్మణ్యశర్మ నాకు సరికొత్తగా ‘బాలి’ అని నామకరణం చేశారు. నాకూ అది వినూత్నంగా, వైవిధ్యంగా అన్పించింది. అప్పట్నుంచీ నా చిత్రాలకు ‘బాలి’ అనే పేరే స్థిరపడిపోయింది. ఇప్పటికీ నా అసలుపేరు కన్నా ఈ పేరే నన్ను ఎక్కువ ప్రాచుర్యంలో ఉంచుతోంది.
కార్టూన్లలోనూ ప్రత్యేక ముద్ర ఎలా వేయగలిగారు?
కార్టూన్‌ని ఏ అంశంపై గీయాలో ముందుగా అవగాహన చేసుకుంటాను. నిజానికి బొమ్మ గీయడం, అందులో యాక్షన్ నాకు కొత్తకాదు. దాన్లో ఫన్ పేల్చడంలోనే కష్టమంతా ఉంటుంది. కార్టూన్‌లో రాసిన మాటలు చక్కగా అందరూ చదివి, ఆహ్లాదంగా నవ్వుకునేలా ఉండాలి. ఇదంతా కేవలం కొన్ని నిమిషాల్లోనే జరిగిపోవాలి. అలాంటి అంశాలన్నీ దృష్టిలోపెట్టుకుని, కార్టూన్లు పుంఖాను పుంఖాలుగా వేశాను. వాటిలో పోయినవి పోగా ఇప్పటికే ఆరేడు కార్టూన్ సంపుటాలు వచ్చాయి.
ప్రత్యేకశైలి కోసం కృషి చేశారా?
చాలామంది చెబుతుంటారు. ‘చిత్రంలో స్ట్రోక్ చూడగానే ఇది బాలి బొమ్మ అని తెలిసిపోతుందని..’ అది నిజమే. పదేపదే బొమ్మలు గీస్తుండడం వల్ల కొన్ని కొన్ని యాంగిల్స్ ఎక్కువగా నా బొమ్మల్లోనే కన్పిస్తాయి. అదే ఒరవడి అలా కొనసాగి నా బొమ్మలకు ఒక ప్రత్యేకశైలిని తీసుకొచ్చిందనుకుంటాను.
బాలి బొమ్మల్ని బాపు మెచ్చుకున్న సందర్భం ..?
అదెప్పుడంటే వంగూరి ఫౌండేషన్ అమెరికా వారు నా పుస్తకాన్ని ‘బాలి కార్టూన్లు’ పేరుతో అచ్చేశారు. దాన్ని హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో బాపు చేత ఆవిష్కరింపజేశారు. ఆయన ఆ పుస్తకాన్ని అలవోకగా అటూ ఇటూ తిరగేస్తుంటే నేను ”దాన్ని కొంచెం ఓపిగ్గా ఒకసారి చూడండి సార్!” అన్నాను. దానికి ఆయన ”బాలీ! మీకు తెలియకపోవచ్చు, నేను మీ బొమ్మల అభిమానిని. ఇదే కాదు కడప రెడ్డిగారి ‘కాళిదాస శృంగార తిలకం’ పుస్తకానికి మీరేసిన బొమ్మలు అద్భుతం” అన్నారు. నా సీనియర్ చిత్రకారులు బాపు అందించిన కాంప్లిమెంట్‌కు మించిందింకేం ఉంటుంది? అన్పించింది నాకు.
మీ చిత్రకళపై ఎవరెవరి ప్రభావం ఉంది?
చిన్నప్పటి నుంచీ చాలా మంది చిత్రకారుల చిత్రాలను పరిశీలిస్తున్నాను. అయితే నాకు గురువులు అంటూ ఎవరూ లేరు. నా మీద ఎవరి ప్రభావమూ లేదు. నేను ఎవర్నీ అనుకరించను. తెలుగులో బాపు దగ్గర్నుంచీ తమిళ, బెంగాలీ ఆర్టిస్టుల బొమ్మలన్నింటినీ గమనించేవాణ్ణి. ఇటు ఇండియన్, అటు ఫారిన్ ఆర్టిస్టుల్లో ఎవరి ప్రత్యేకతలు వారికున్నాయి. నా వరకు నేనైతే ఒక సంఘటనని తీసుకోవడం, దానిని చిత్రంగా మలచుకోవడం.. నా అనుభవం మీదే ప్రాక్టీస్ చేశాను. అప్పటికప్పుడు కొన్ని వివరాలు, విశేషాలు వెంటనే తట్టవు కనుక.. వాటికి సంబంధించిన ఫొటోలను భద్రపర్చుకుని, ప్రాక్టీస్‌లో ఉపయోగిస్తాను.
కుటుంబ ప్రోత్సాహం ఎలా ఉండేది?
నా ప్రధానవృత్తి ఇదే కాబట్టి ప్రోత్సాహం ఎక్కువగానే ఉండేది. చిత్రకళలో కాకుండా మిగిలిన ఎన్నో విషయాలలో నా భార్య ధనలక్ష్మి సహకరించేది. నేను ప్రభుత్వోద్యోగం వదిలి పత్రికల్లోకి వెళ్తున్నానంటే ఏమాత్రం వెనక్కిలాక్కుండా, భవిష్యత్ గురించి భయపెట్టకుండా నాకు ఎంతో అండగా నిలిచింది. ఆమె నాకు దూరం కావడం నేను తేరుకోలేని విషాదమే. మాకు ఇద్దరు పిల్లలు.. అమ్మాయి వైశాలి, అబ్బాయి గోకుల్. వారిద్దరికీ బొమ్మలంటే ఎంతో ఆసక్తి. చిన్నవయసులో వాళ్లూ బొమ్మలు గీసి, పోటీల్లో బహుమతులు సాధించేవారు. తర్వాత చదువుల్లో మునిగారు, ఇద్దరూ ప్రస్తుతం అమెరికాలోనే ఉంటున్నారు. అమ్మాయి పిల్లలు చరణి, చందుల పేర్లతో కార్టూన్ స్ట్రిప్‌లు గీశాను. ఇవి ఆంధ్రప్రభ వీక్లీ చిన్నారిలో నాలుగేళ్లు నడిచింది. వేలాదిమందిని అలరించాయి.
నా బొమ్మల ప్రదర్శనలు చాలా జరిగాయి. అందుకున్న ప్రశంసలూ, సన్మానాలూ, అవార్డులూ చాలానే ఉన్నాయి. గుంటూరు కళాపీఠం ‘చిత్రకళా సామ్రాట్’ అనే బిరుదిచ్చింది. కొన్నేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘హంస’ పురస్కారాన్ని అందించింది. న్యూజిల్యాండ్ బైబిల్ సొసైటీ నా బొమ్మలకు ప్రత్యేక ప్రశంసలందించింది. జర్మనీ ప్రాంక్‌ఫర్డ్‌లో పర్యావరణంపై నా బొమ్మల పుస్తకాన్ని ముద్రించి ఆవిష్కరించారు. … ఇలా ఎన్నో ఉన్నాయి.
విశ్రాంతి జీవితం ఎలా ఉంది?
పిల్లలు జీవితాల్లో సెటిలయ్యారు. ఇప్పుడంతా విశ్రాంతే. అంటే బొమ్మలు గీస్తుండడమే నాకు విశ్రాంతి. హాయిగా వంట చేసుకోవడం, బొమ్మలు వేసుకోవడం, ఈ బొమ్మలు ఇలానే గీస్తే బాగుంటుందా? మరోలా గీస్తే ఎలా ఉంటుంది? కొత్తగా ఇంకెలా గీస్తే బాగుంటాయా? అనే ఆలోచనలు, ప్రయోగాలు అలా జీవితం సాగిపోతోంది. రోజూ సాయంత్రం విశాఖ సాగర తీరానికి నేనుండే ఎంవీపీ కాలనీ నుంచి వెళ్తాను. టీవీ అంటే అసలు ఇష్టం ఉండదు. సినిమాలు చూసి మూడు దశాబ్దాలకు పైగానే అవుతోంది. రాత్రివేళల్లో కథల పుస్తకాలు చదవడం నాకు నచ్చిన పనులు. నేను 35 వరకూ కథలు కూడా రాశాను. నేను గీసిన బొమ్మలతోనే వాటిని ఒక సంపుటంగా తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నాను.
బొమ్మల్లో కొత్తదనం ఉండాలి
- బాలి, చిత్రకారుడు
__________________________________________________________________________________________
నా విషయంలో.. ప్రవృత్తే వృత్తిగా మారడంలో నిరంతరం చిత్రకళా సాధనలోనే ఉండేవాడిని. బ్రష్‌గీతలు, క్రోక్విల్‌గీతలు, క్యారికేచర్, కార్టూనింగ్, యానిమేషన్ ఇలా అన్ని విభాగాల్లోనూ ప్రాక్టీస్ చేశాను. కొన్ని దశాబ్దాలపాటు పత్రికల్లో కథలకు, సీరియళ్లకు, వివిధ పుస్తకాలకు, పత్రికలకు ముఖచిత్రాలుగా అసంఖ్యాకంగా బొమ్మలు గీశాను. ఇప్పటికీ గీస్తూనే ఉన్నాను. ఎల్లప్పుడూ సమాజాన్ని గమనిస్తుండాలి. గీసే బొమ్మల్లో మార్పులతో కొత్తదనం కనిపిస్తుండాలి.
సంభాషణ : బెందాళం క్రిష్ణారావు