ఒక మంచి రచన చదువుతున్నప్పుడు మన మనసులో ఆ రచనలోని రూపాలు మెదలుతాయి. ఆ మనోహర రూపాల సౌందర్యాన్ని నయనానందకరంగా చూపే కుంచె పేరే బాపు. బాపు గీసే బొమ్మలు మాట్లాడతాయి…. సిగ్గుపడతాయి… నవ్విస్తాయి… కవ్విస్తాయి కూడా. బాపు ముఖచిత్రం వేస్తే ఆ రచనకు… ఆ పుస్తకానికి వెయ్యి వోల్టుల కాంతి వస్తుంది… విలువ అతిశయిస్తుంది… బంగారానికి తావి అబ్బినట్లవుతుంది. బాపు రేఖాచిత్రాలు గీస్తాడు… వంకర టింకరగా. అవన్నీ కార్ట్యూనులై సమ్మోహన పరుస్తాయి… బిగ్గరగా నవ్విస్తాడు బాపు. ఒకసారి ఓ పుస్తకానికి శ్రీవెంకటేశ్వరస్వామి పాదాలు వేశాడు. గ్రంధకర్త కాస్త చనువు తీసుకుని ‘అయ్యా స్వామి వారి కాలి వ్రేళ్లు కాస్త ఉబ్బెత్తుగా వున్నాయి’ అంటూ తల గోక్కున్నాడు. ‘దానిదేముండీ… బూట్లు తొడుగుదాంలే’ అన్నాడు బాపు కూల్‌గా. అవతల నుంచి మాట లేదు! దటీజ్ బాపు.
అందమైన అమ్మాయికి మారుపేరు ‘బాపు బొమ్మ’. బాపు రమణతో కలిసి సృష్టించిన బుడుగు, సీగాన పెసూనాంబ, రెండుజెళ్ళ సీత, అప్పుల అప్పారావు, గిరీశం, లావుపాటి పెళ్ళాం-బొచ్చుకుక్క లాంటి బుజ్జి మొగుడూ… వీరంతా గుర్తుకు వస్తే మనసు ఎంతగా నవ్వుకుంటుందో!! ఆరుద్ర అందుకే అన్నారు… ‘కొంటె బొమ్మల బాపు, కొన్ని తరముల సేపు, గుండె ఊయల లూపు, ఓ కూనలమ్మా’ అని. సృష్టిలో తీయనిది స్నేహమే అంటే స్నేహం మధురమైనదని అర్థం…అంతేకాని తీయలేక పోయినదని మాత్రం కాదని భాష్యం చెప్పిన ముళ్ళపూడి వెంకట రమణ ఆయన చెలికాడు. బాపు-రమణలవి అవిభాజ్య శరీరాలు. ఒకరిది లేఖాచిత్రమైతే, మరొకరిది రేఖాచిత్రం. రెండూ కలిస్తే మనోహర చిత్రం… అదే చలనచిత్రం. ఆ బాపు పుట్టినరోజు – డిసెంబర్ 15న.
బాపు అభిమానులకు కానుకగా బాపు బొమ్మలన్ని ఒక చోట చేర్చి www.bapuartcollection.com పేరుతో ఒక వెబ్ పోర్టల్ ప్రారంభించారు వారి అబ్బాయి. ఇందులో మనకు నచ్చిన బొమ్మలు వివిధ సైజులలో దొరుకుతాయి. ఇతర దేశాలకు కూడా సప్లయి చేస్తున్నారు.