డిసెంబర్ 15 న హైదరాబాద్ లో బాపు రమణ అకాడెమి వారు ‘బాపు అవార్డ్’ ను సత్తిరాజు శంకర్ నారాయణ గారు అందుకోనున్న సందర్భంగా …. వారి జీవిత రేఖా చిత్రం మీ కోసం.
తక్కువ అక్షరాల్లో ఎక్కువ భావాన్ని పలికించడం మంచి రచయిత లక్షణం అని పెద్దలంటారు. అట్టహాసంగా కాన్వాసులూ, రంగుల ట్యూబులూ, ఎక్రిలిక్కులూ, ఆయిల్ పెయింటింగ్స్ కి కావాలి. అవి వేయటానికి చాకులు, తాపీలు- అనేక రకాల షేప్ ల బ్రష్ లూ ఉండాలి. ఇంకా వాటర్ కలర్స్ కొస్తే- ఆ రంగులు వేయటానికి స్పెషల్ బ్రష్ లూ, నిబ్బులూ ఎన్నో రకాల ఫీట్లు..
ఇవేవీ లేకుండా…ఒక A4 సైజు పేపర్- ఒక పెన్సిల్ ఉంటే చాలు.. సత్తిరాజు శంకర్ నారాయణ లో వినూత్న కళాశక్తి రూపొందుతుంది. మరీ ముఖ్యంగా “ముఖ చిత్రాలు” చిత్రించడంలో ఆయన సంచలనం సృష్టిస్తున్నారు. శంకర నారాయణ గారి తండ్రి గారు సత్తిరాజు వేణుగోపాల రావు గారు – చక్కటి కళాభిరుచి గల చిత్రకారులు. చిత్రకళారంగంలో అనితర సాధ్యమైన ప్రతిభను చూపించి, సంచలనాత్మక చిత్రకారుడైన బాపు గారు వీరి అన్న గారే. ఇప్పుడు శంకర గారు తన కళతో ఎందరో ప్రముఖుల పోర్గెట్స్ వేసి- వారిని పరవశింప చేస్తున్నారు.
“హాసరేఖలు” (సినీ హాస్య సంగీత కళాకారుల రేఖా చిత్రాలు)
“నాద రేఖలు” (శాస్త్రీయ సంగీత విద్వాంసుల రేఖా చిత్రాలు)
“MAESTROS OF CARNATIC MUSIC” (కర్నాటక సంగీత విద్వాంసుల రూప చిత్రాలు)
“గీతార్చన” [ఆధ్యాత్మిక వేత్తల రేఖ చిత్రాలు)
“కలం రేఖలు” (కవుల, రచయితల రేఖా చిత్రాలు)
“రూపు రేఖలు” (కార్టూనిస్టుల పోరైట్స్ సంకలనం)..
ఇవీ- ఇప్పటివరకు శంకర్ గారి చిత్రాలతో వచ్చిన సంకలనాలు.
త్వరలో భారతీయ నృత్య కళాకారుల చిత్ర సంకలనం కూడా వెలువడబోతోంది.
ఈ సంకలనాలలో పేర్కొన బడిన వ్యక్తులందరూ వారి వారి రంగాల్లో ప్రముఖులు.. నిష్ణాతులు. అలాటి ప్రముఖ వ్యక్తులను బొమ్మలలో నేటి యువతరానికి పరిచయం చేయటం శంకర్ గారి ముఖ్య ఉద్దేశం..
వారి వారి వ్యక్తిత్వాలని ప్రతిఫలించే ఈ వ్యక్తుల చిత్రాలను ప్రముఖంగా చూపిస్తూ, వారిని గురించిన వివరాలను సంగ్రహంగా తెలుపుతూ- ఇలాటి సంకలనాలు వెలువడడం చాలా ప్రశంసించదగిన ప్రయత్నం . ఈయన చిత్రకళ నిరంతర వాహిని గా కొనసాగుతోంది. 82 ఏళ్ళ వయసులో కూడా ఈయన రోజుకు ఒకటో, రెండో బొమ్మలు వేయనిదే విశ్రమించరంటే అతిశయోక్తి కాదు.
వీరు Economics లో Masters degree పొందారు. ఆకాశ వాణి లో 32 సంవత్సరాలు పని చేసి, 1995 లో డైరెక్టర్ గా పదవీ విరమణ చేసినప్పటి నించీ బొమ్మలేయడం లో అవిశ్రాంత సాధన చేస్తున్నారు. ఇప్పటికి దాకా సుమారు 3వేల పై చిలుకు బొమ్మలు వేసి website లో పెట్టారు .
ఆయనకెన్నో సన్మానాలు, సత్కారాలు జరిగాయి. కుటుంబ సభ్యుల ప్రోద్బలం.. బాపూ రమణల ఆశీర్వాదం – స్వర్గస్థురాలైన వారి శ్రీమతి శాంత ప్రేరణ- ఆయన చిత్రకళా విన్యాసానికి నిరంతర ప్రోత్సాహం ఇస్తున్నాయని ఆయన వినయంగా చెప్తూంటారు.
వీరి పెన్సిల్ నుంచి మరిన్ని చిత్రాలు నిరంతరాయంగా ఆవిర్భవించాలని ఆకాంక్షిద్దాం.
-బి.ఎం.పి. సింగ్