ప్రముఖ ఛాయాగ్రహకుడు భరత్ భూషణ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 31 జనవరి 2021న హైదరాబాద్ నల్లకుంటలోని తన నివాసంలో కన్నుమూశారు.
తెలంగాణపల్లె జన జీవనం, పల్లె దర్వాజాలు, బతుకమ్మ పండుగలు, తెలంగాణా మగువలు దిన చర్యలు వంటి తదితర అంశాలను తన ఫోటోలలో చిత్రీకరించిన ఘనుడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఛాయాగ్రహకుడు భరత్ భూషణ్. పల్లె ప్రజల జీవన వైవిద్యాన్ని ఆయన ఫోటోలు మనకు అర్థం చేయిస్తాయి. కలర్ ఫుల్ దర్వాజాలు, గోడలపై చిలికిన వెల్ల, గొళ్లాలు, కూలిన గోడలు, దర్వాజాలు, ముగ్గులు, వంటింటి వస్తువుల సౌందర్యాన్ని మన కళ్ల ముందుంచుతూ తెలంగాణ పల్లె జీవితం ఆవిష్కరించిన తీరు అద్భుతం. దైనందిన జీవితమే కాదు, పండుగలను పబ్బాలు, జాతర వైభవాన్ని కూడా ఆయన కెమెరా కన్ను అద్భుతంగా చిత్రీకరించింది.
వీరి పూర్తి పేరు గుడిమళ్ల భరత్ భూషణ్. ఆయన 2015లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం అందుకున్నారు. నేరెళ్ల వేణుమాధవ్ కల్చరల్ ట్రస్టు పురస్కారం కూడా అందుకున్నారు.
కవి శివసాగర్, నల్ల కలువ టీ.ఎన్.సదాలక్ష్మి, జానపద పితామహులు బిరుదురాజు రామరాజు వంటి వారి ఫొటోలు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అంతేనా తెలంగాణా కవి కాళోజి ఛాయాచిత్రాలు తీసిన ఘనతకూడా భరత్ భూషణ్‌దే. భరత్ భూషణ్ సినిమాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్ గా కూడా పనిచేశారు. హరిజన్, కాంచన సీత, రంగులకల వంటి సినిమాలకు ఫొటోగ్రఫీ సమకూర్చారు. మెగాస్టార్ చిరంజీవిగా కరియర్ ఆరంభంలో పత్రికలకోసం చక్కటి ఫోటోలను తీసింది కూడా ఆయననే చెప్పుకుంటారు. వీటన్నింటికి తోడు భరత్ భూషణ్ ఫోటో జర్నలిస్టు మాత్రమే కాదు జానపద కళలపై, కుల వృత్తులపై వ్యాసాలు రాసిన రచయిత కూడా.
భరత్ భూషణ్ స్థానికుడిగా అనిపిస్తుంది గానీ కాదు, తాను విశ్వజనీనం. ‘నా దేశమే తన ప్రపంచం’ అన్న సుప్రసిద్ధ భారతీయ ఛాయా చిత్రకారుడు రఘురాయ్ మాదిరి మన భరత్ భూషణ్ కు తెలుగు నేలనే ‘భారతం’. తెలంగాణయే ప్రపంచం. పై పైకి ఎగబాకకుండా విశాలంగా పరుచుకున్న తన కృషిని అధ్యయనం చేస్తే స్థానికతలోని విశ్వజనీనత బోధపడుతుంది. అంతేకాదు, ఫోటోగ్రఫీ మాధ్యమానికి మొదటి సారిగా సిగ్నేచర్ వాల్యూ తెచ్చిన రఘు రాయ్ మాదిరే తానూ తెలుగు నాట ఎంతో పాప్యులర్ ఫోటోగ్రాఫర్. ఛాయా చిత్రకళకు గొప్ప గౌరవాన్ని తెచ్చిన కళాకారుడు. వారు తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రాఫర్. వారి బతుకమ్మ బొమ్మను సామాన్యులు కూడా గుర్తు పట్టడమే అందుకు నిదర్శనం.
ప్రభుత్వ ప్రోత్సాహం: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కళలను, కళాకారులను ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం భరత్ భూషణ్ కు ప్రతి నెల రూ.10 వేలు పింఛను అందజేస్తుంది. ఆయన కేన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న నటుడు చిరంజీవి రూ.50 వేల ఆర్థిక సాయం అందించాడు.
దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత క్యాన్సర్ మళ్ళీ తిరగబెట్టడంతో గత కొంత కాలంగా భరత్ భూషణ్ బసవ తారకం ఆస్పత్రిలో రేడియేషన్, కీమో చికిత్సలు తీసుకున్నారు. తాజాగా తిరగబెట్టిన క్యాన్సర్ కి తోడు వారికి మల్టిపుల్ సమస్యలున్నాయి. షుగర్, కిడ్నీ, హార్ట్ ప్రాబ్లెమ్స్ కూడా ఉన్నాయి.
భరత్ భూషణ్ కు ఆయనకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.