బాలీవుడ్ మదర్ … నిరూపరాయ్

చలనచిత్ర పితామహుడు ఎవరు అంటే వెంటనే గుర్తుకొచ్చేది దాదాసాహెబ్ ఫాల్కే పేరు. అలాగే హిందీ చిత్రరంగ మాతామహి ఎవరంటే అందరూ చెప్పే పేరు నిరూపరాయ్. అందుకు కారణం ఆమె రెండు వందలకు పైగా చిత్రాల్లో తల్లి పాత్ర పోషించి ఉండడమే. యష్ చోప్రా 1975 లో నిర్మించిన ‘దీవార్’ చిత్రంలో అమితాబ్, శశికపూర్ లకు త్యాగశీలయైన తల్లిగా అపూర్వ ఆదరణ పొందిన పాత్రలో నిరూపరాయ్ జీవించిన విషయం మనకు తెలిసిందే. మదర్స్ డే నాడు బాలీవుడ్ లో అందరికీ గుర్తుకొచ్చేది దివంగత నిరూపరాయే. బాలీవుడ్ లో ఆమెను ‘బాలీవుడ్ ‘మా’ జీ’ అని ‘క్వీన్ ఆఫ్ మిజరీ’ అని పిలుచుకుంటారు. నిరూపరాయ్ వర్ధంతి సందర్భంగా ఆమెను గురించిన కొన్ని విశేషాలు…

సినిమాలలో నటించాలని…

నిరూపరాయ్ అని పిలవబడే బాలీవుడ్ క్యారక్టర్ నటి అసలుపేరు కోకిల కిషోర్ చంద్ర బల్సారా. ఆమె గుజరాత్ లోని వల్సద్ దగ్గర వున్న కలవాడ గ్రామంలో 4 జనవరి 1931 న సనాతన గుజరాతి చౌహాన్ కుటుంబంలో జన్మించింది. తల్లిదండ్రులు ఆమెను ముద్దుగా ‘చిబి’ అని పిలుచుకునేవారు. తండ్రి కిషోర్ చంద్ బల్సారా రైల్వేలో పనిచేసేవారు. చిన్ననాడే, అంటే ఆమెకు 14 ఏళ్ళు నిండగానే 1945లో కమల్ రాయ్ తో బాల్య వివాహం జరిగింది. అప్పుడు నిరూపరాయ్ స్కూలులో చదువుకుంటూ వుండేది. పెళ్ళయ్యాక ఆమె పేరు ‘నైటింగేల్’ గా మారింది. పెళ్లి నాటికి భర్త కమల్ రావు రేషనింగ్ అధికారిగా పనిచేస్తుండేవారు. ఒక గుజరాతి వార్తాపత్రికలో నూతన నటీనటులు కావాలనే ప్రకటన పడితే, కమల్ రాయ్, నిరూపరాయ్ ఇద్దరూ తమ ఫోటోలను పంపారు. వారిని ఇంటర్వ్యూకి రమ్మని పిలుపొచ్చింది. వెంటనే బయలుదేవి వారిద్దరూ బొంబాయి వచ్చారు. అప్పటికి వారికి పెళ్లై కేవలం నాలుగు నెలలు మాత్రమే. అయితే స్క్రీన్ టెస్ట్ లో నిరూపరాయ్ ఒక్కర్తే ఎంపికైంది. దాంతో ‘రొక్కాదేవి’ (1945) అనే గుజరాతి చిత్రంలో హీరోయిన్ గా నటించేదుకు నిరూపరాయ్ కి అవకాశం దొరికింది. తొలిసినిమాలోనే ఆమె పేరును దర్శకుడు ‘నిరూపరాయ్’ గా మార్చారు. ఆ సినిమాకు నిర్మాత విష్ణుకుమార్ వ్యాస్. ఆయనే దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించారు. సినిమాల్లో సంప్రదాయ గుజరాతీ కన్యలు నటించడం ఆరోజుల్లో నేరంగా పరిగణించేవారు. నిరూపరాయ్ ‘రుక్కాదేవి’ సినిమాలో నటించేదుకు ఉద్యుక్తురాలైనప్పుడు ఆమె తండ్రి చాలా ఆగ్రహించారు. ఆమెతో బాంధవ్యం తెంచుకోవడానికి కూడా వెనుకాడలేదు. 1945 లోనే హోమీ వాడియా ‘వాడియా మూవిటోన్’ పతాకం మీద నిర్మించిన తొలి హిందీ సినిమా ‘అమర్ రాజ్’ లో నిరూపరాయ్ కి హీరోయిన్ గా నటించే అవకాశం కల్పించాడు. నిరూపరాయ్ నటించిన తొలి హిందీ చిత్రం కూడా అదే కావడం విశేషం. ‘అమర్ రాజ్’ సినిమాలో నిరూపరాయ్ సరసన హీరోగా త్రిలోక్ కపూర్ నటించారు. ఆ సినిమా బాగా విజయవంత మైంది. దాంతో త్రిలోక్ కపూర్-నిరూపరాయ్ కలిసి 18 సినిమాల్లో జంటగా నటించారు. వెంటవెంటనే ఆమె ‘భన్వర్’, ‘మీరాబాయి’, ‘లాఖోమ్ మే ఏక్’, ‘జై హనుమాన్’, ‘జై మహాకాళి’, ‘సత్యవాన్ సావిత్రి’, ‘హమారీ మంజిల్’, ‘హరహర మహాదేవ్’, ‘వీర భీమసేన్’, ‘లవకుశ’ వంటి పౌరాణిక సినిమాల్లో నటించింది. ‘రుక్కాదేవి’ సినిమానే కాకుండా ‘గుణసుందరి’ వంటి అనేక గుజరాతి సినిమాల్లో నటించిన తొలితరం నటి నిరూపరాయ్. తొలిరోజుల్లో, అంటే… 1940-50 మధ్యకాలంలో నిరూపరాయ్ పౌరాణిక సినిమాలలో ఎక్కువగా నటించేది. వాటిల్లో సీతాదేవి, లక్ష్మీదేవి వంటి హిందూ దేవతల పాత్రలు పోషించడంతో ప్రేక్షకులు ఆమెను కలిసి దీవెనలు కోరేవారు. చాలామంది సినీ ప్రేమికులు ఆమె ఇంటికి వచ్చి దేవతల పాత్రలు పోషించినందుకు ఆమె పాదాలకు వందనం చేసేవారు. 1949లో కులకర్ణి దర్శకత్వం వహించిన ‘ఉధార్’లో దేవానంద్ కు జంటగా నిరూపరాయ్ నటించింది. 1970 తరవాత ఆమె తన పంధా మార్చుకొని సాంఘిక సినిమాల్లో తల్లి, అక్క, వదిన, అత్త గారి పాత్రలు సమర్ధవంతంగా పోషిస్తూ వచ్చింది.

దశ మార్చిన బిమల్ రాయ్

ప్రముఖ దర్శక నిర్మాత బిమల్ రాయ్ 1953లో ‘దో భీగా జమీన్’ అనే చిత్రాన్ని నిర్మించారు. భూమిని ప్రాణంకన్నా మిన్నగా భావించే ఓ సామాన్య రైతు కథగా, వ్యదార్థ జీవుల యదార్ధ గాథగా బిమల్ రాయ్ ఈ చిత్రాన్ని మలిచారు. బల్రాజ్ సాహ్ని శంభు మహతో గా, అతని భార్య ‘పారో’ (పార్వతి మహతో)గా నిరూపరాయ్ నటించిన చిత్రమది. ఈ చిత్రంలో నటించేటప్పుడు నిరూపరాయ్ విషాద సన్నివేశాలలో గ్లిసరిన్ వాడకుండానే కన్నీళ్లు తెప్పించి, ఆ పాత్రలో అంతగా లీనమై నటించింది. జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ‘దో భీగా జమీన్’ కేంద్రప్రభుత్వ బహుమతి అందుకుంది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ చిత్రానికి అంతర్జాతీయ బహుమతి లభించింది. కార్లోవివరిలో ఉత్తమ సామాజికాభివృద్ధి సందేశ చిత్రంగా మన్ననలందుకొని, బహుమతి గెలుచుకుంది. 1954లోనే ఫిలింఫేర్ బహుమతులు ఇవ్వడం మొదలైంది. ఆ తొలి సంవత్సరంలో ప్రతిష్టాత్మక ఉత్తమ చిత్రంగా ‘దో భీగా జమీన్’ చిత్రం ఎంపికైంది. అంతవరకూ నిరూపరాయ్ ధరిస్తున్న పౌరాణిక పాత్రలకు భిన్నంగా ఇందులో పారో పాత్ర లభించగానే ఆమె బొంబాయిలోని చోర్ బజార్ కు వెళ్లి ఆ పాత్రకు సమకూరే దుస్తులను స్వయంగా కొనుక్కొని నటించింది. ఆ దుస్తుల్ని సినిమా నిర్మాణం పూర్తయ్యేదాకా ‘ల్యాండ్రీ’ కి వెయ్యనివ్వకుండా బిమల్ రాయ్ జాగ్రత్తలు తీసుకొని పారో పాత్రకు సహజత్వాన్ని తెచ్చే ప్రయత్నం చేశారు. తరవాత త్రిలోక్ కపూర్ సరసన ‘చక్రధారి’ చిత్రంలో నిరూపరాయ్ నటించింది. త్రిలోక్ కపూర్ తో ఆమెకు ఇది రెండవ చిత్రం. ఆమె నటించిన రాజిందర్ సింగ్ బేడి చిత్రం ‘గరం కోట్’ ఉత్తమచిత్రంగా బహుమతి అందుకుంది. హృషికేష్ ముఖర్జీ ఎడిటర్ గా పనిచేసిన ఈ చిత్రంలో బల్రాజ్ సాహ్ని సరసన నిరూపరాయ్ ‘గీత’ పాత్రలో జీవించింది. లేఖ్ రాజ్ భాక్రి దర్శకత్వంలో వచ్చిన ‘టోంగావాలి’ చిత్రంలో బలరాజ్ సాహ్నితోనే ఆమె జతకట్టింది. ఈ చిత్రాలతో నిరూపరాయ్ మంచి స్టార్డం అందుకుంది. ‘దీవార్’ చిత్రం తరవాత ‘బ్లడ్ స్వెట్’, ‘ముకద్దర్ కా సికందర్’, ‘అమర్ అక్బర్ ఆంథోనీ’, ‘సుహాగ్’, ‘ఇంక్విలాబ్’, ‘గంగా జమున సరస్వతి’ వంటి సినిమాల్లో తల్లి పాత్ర పోషించి, బాలీవుడ్ తల్లిగా స్థిరపడింది. అటు ధర్మేంద్రకు, ఆ తరవాత ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోల్ కు కూడా తల్లిగా నటించిన ఒకే ఒక నటి నిరూపరాయ్. దేవానంద్ కన్నా నిరూపరాయ్ ఎనిమిదేళ్లు చిన్న. కానీ దేవానంద్ కు ఆమె ఎన్నో సినిమాల్లో తల్లిగా నటించింది. ‘మునీంజీ’ (1955) సినిమాలో నిరూప రాయ్ తొలిసారిగా తల్లి వేషంలో కనిపించింది. ‘ఛాయా’ (1962), ‘షెహనాయి’(1965) సినిమాలలో నటనకు నిరూపరాయ్ ఉత్తమ సహాయనటిగా ఫిలింఫేర్ బహుమతులు అందుకుంది. 1967 లో విడుదలైన ‘రామ్ అవుర్ శ్యామ్’ సినిమాలో దిలీప్ కుమార్ కు అక్కగా (తెలుగులో శాంతకుమారి పాత్ర) నటించి మెప్పించింది. ‘కవి కాళిదాస్’, ‘సామ్రాట్ చంద్రగుప్త’, ‘రాణి రూపమతి’ వంటి చారిత్రాత్మక చిత్రాల్లో భరత్ భూషణ్ కు తల్లిగా నటించింది. ముఖ్యంగా ‘దీవార్’ సినిమాలో అమితాబ్ బచ్చన్, శశికపూర్ ల తల్లిగా నిరంతరం ఆటుపోట్లను అధిగమిస్తూ పోషించిన పాత్రను, అందులో శశికపూర్ “మేరే పాస్ మా హై” అని చెప్పే డైలాగులను నేటికీ చలనచిత్ర అభిమానులు మరువలేదంటే అందులో నిరూపరాయ్ గొప్పతనాన్ని, ఆ పాత్ర ఔచిత్యాన్ని గౌరవించాలి. చిత్రరంగంలో యాభై సంవత్సరాలు మమేకమై 475 చిత్రాలకు పైగా ఆమె వివిధ పాత్రలను పోషించింది. 80వ దశకంలో ఆమె సినిమాలలో నటనకు కాస్త దూరం జరిగినా మరలా 1999లో ‘లాల్ బాదుషా’ చిత్రంలో అమితాబ్ తల్లిగా కనుపించి పాత స్మృతులను గుర్తుచేసింది. ఆమె అంధురాలిగా ఎక్కువ సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. 2004 లో ఆమెకు ఫిలింఫేర్ వారి జీవిత సాఫల్య పురస్కారం దక్కింది.

పదనిసలు…

నిరూపరాయ దంపతులకు యోగేష్, కిరణ్ అనే ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కిరణ్ రాయ్ భార్య ప్రవాస భారతీయురాలు. ఆమె పేరు ఉనారాయ్. నిరూపరాయ్ తనవద్దనుంచి వరకట్నం ఆశించిందని, గృహహింసకు పాల్పడిందని 1998లో నిరూపరాయ్ మీద, ఆమె భర్త కిరణ్ రాయ్, మామ కమల్ రాయ్ ల మీద ఉనారాయ్ కేసు పెట్టింది. వారిని అరెస్టు కూడా చేయించింది. మలబార్ హిల్ లో నిరూపరాయ్ 1963లో ఒక పెద్ద బంగాళానుకొనుగోలు చేసి దానిని ఆధునీకరించింది. మూడువేల చదరపు గజాల ఆ ఇంటికి ఎనిమిది వేల గజాల ఉద్యానవనం కూడా వుంది. గుండెపోటు రావడంతో నిరూపరాయ్ 13, అక్టోబరు 2004 న తన 72 వ ఏట ముంబైలో చనిపోయారు. నిరూపరాయ్ మరణం తరవాత ఆమె భర్త కమల్ రాయ్ ఆధీనంలో ఆ ఆస్తి వుండేది. 2015లో కమల్ రాయ్ కూడా చనిపోయాక ఆ స్థిరాస్తి పంపకాలలో గొడవలు పెచ్చురిల్లి కొడుకులిద్దరూ ఒకరిమీద మరొకరు కేసులు పెట్టుకున్నారు.

బిమల్ రాయ్ సినిమా ‘దో భీగా జమీన్’ చిత్రం పతాక సన్నివేశంలో నిరూపరాయ్ చనిపోతుంది… మరోవైపు బల్రాజ్ సాహ్నికి తన భూమి దక్కుతుంది. ఈ సినిమా క్లైమాక్స్ బిమల్ రాయ్ భార్యకు నచ్చలేదు. నిరూపరాయ్ పాత్రను మరణించేలా చిత్రీకరించడం అమానుషమని, తిరోగమనానికి ప్రతీక అంటూ వాదించింది. దాంతో బిమల్ రాయ్ కూడా సంతుష్టుడై ముగింపును సవరించారు. దాంతో నిరూపరాయ్ బ్రతుకుతుంది… బల్రాజ్ సాహ్ని తన పొలాన్ని కోల్పోతాడు.

Nirupa Roy

దీవార్ (1975) చిత్రంలో అమితాబ్ బచ్చన్ తల్లిగా యష్ చోప్రా తొలుత పరిశీలించిన పేరు వహీదా రెహమాన్. కానీ ‘కభీ కభీ’ (1976) చిత్రంలో వహీదా రెహమాన్ అమితాబ్ కు జంటగా నటించడంతో, ఒకవేళ ‘కభీ కభీ’ చిత్రం దీవార్ కన్నా ముందు విడుదలైతే ఈ సినిమా మీద వ్యతిరేక ప్రభావం చూపుతుందనే ముందుచూపుతో నిరూపరాయ్ ని ఆ పాత్రకు ఎంపిక చేశారు. అయితే వహీదా రెహమాన్ తర్వాత వైజయంతిమాల పేరు కూడా పరిశీలనలోకి వచ్చిన విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత వరసగా ‘అమర్ అక్బర్ అంథోని’ (1977), ‘మర్ద్’ (1985) వంటి చిత్రాలలో అమితాబ్ కు ఆమె తల్లిగా నటించింది.

-ఆచారం షణ్ముఖాచారి
_____________________________________________________________________________

ఆచారం షణ్ముఖాచారిగారి పరిచయం:

Acaram Shanukhachari

పుట్టింది, పెరిగింది నెల్లూరు జిల్లా కావలిలో. కందుకూరు, తిరుపతి, పంత్ నగర్ (యు.పి)లో చదువులు. వ్యవసాయ విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్. బ్యాంకింగ్ లో డిప్లొమాలు. 1971లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో వ్యవసాయాధికారిగా ఉద్యోగం చేరారు. 1977 లో ఆంధ్రా బ్యాంక్ లో చేరిక…వివిధ పదవుల నిర్వహించి, ఉన్నతాధికారిగా 2009లో ఉద్యోగ విరమణచేశారు. 11 సార్లు ఉత్తమ బ్యాంకర్ గా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు. ఉద్యోగ విరమణానంతరం స్వచ్ఛంద పాత్రికేయునిగా సితార సినీ పత్రిక, తెలుగు వెలుగు, చతుర లో పన్నెండేళ్లుగా సినిమా విశ్లేషణాత్మక వ్యాసాలు అందించారు. వ్యవస్థాపక అధ్యక్షునిగా శ్రీ రావి కొండలరావుతో కలిసి ‘సాహిత్య సంగీత సమాఖ్య స్థాపన. వ్యవస్థాపక కార్యదర్శిగా పన్నెండు సినిమా పుస్తకాలకు ప్రకాశకులుగా వ్యవహరించారు. శ్రీ కొండలరావు మరణానంతరం ఆ సమాఖ్యకు ప్రస్తుతం అధ్యక్షునిగా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం నివాసం హైదరాబాద్ లో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap