నా పేరు తోటపల్లి కళాధర్ శర్మ. కళాధర్ పేరుతో కార్టూనులు వేస్తూంటాను. నేను పుట్టింది 5 మే 1955లో, పుట్టిన ఊరు, ప్రస్తుతం నివాసం గుంతకల్లు. మా నాన్నగారు (తోటపల్లి సీతరామశర్మ) సినిమా ఆపరేటర్ కావడంతో చదువు కొన్నాళ్ళు గుంతకల్లు, అనంతపురం, కర్నూల్, మార్కాపురం ఇలా బీయస్సీ దాకా సాగింది. నాకు చిన్నప్పటినుండి బాపుగారి బొమ్మలంటే బాగా పిచ్చి. బాపు గారంటే ఏమీ తెలియని వయసులో నాకు ఆ విధమైన ఆసక్తి కలగడానికి మా మేనమామ పుష్పగిరి శంకరశర్మ గారే కారణం.మా మామగారు చిత్రకారుడు కావడంతో ఆ లక్షణాలు కొద్దిగా నాకూ వచ్చాయి.ఆయన బాపు గారి బొమ్మల పుస్తకం ఒకటి నాకిచ్చారు. నా అభిమాన చిత్రకారుడు అందరిలాగే బాపుగారే. జయదేవ్ గారు, సరసి గారు, రామక్రిష్ణగారి కార్టూన్లు నాకిష్టం. నా తొలికార్టూన్ నా కాలేజి రోజూల్లో మా మిత్రుడు కర్నూల్ నుండి కొంత కాలం నడిపిన ఉమ అనే పత్రికలో వేశారు. ‘నిక్కర్ వేసుకొని వెళుతున్న ఓ పొట్టిమనిషిని చూపిస్తో ఆయనేరా మా వూరి పిల్లల డాక్టర్ ‘ అని వ్యాఖ్య రాశాను. క్రొక్విల్ అకాడమి వారి పత్రికలో కార్టూన్ల పోటీలొ మూడవ బహుమతి అందుకున్నాను. ఈ మధ్యలో నవ మల్లెతీగ వారి ప్రొత్సాహక బహుమతి అందుకోవడం విజయవాడలో ‘తెలుగు కార్టూనిస్టుల అసోసియేషన్ ‘ ద్వారా సహ కార్టూనిస్టులను కలవడం ఓ మధురానుభూతి. ఆ తర్వాత నా కార్టూన్లకు అంధ్రభూమి వారు ఎక్కువ ప్రోత్చాహం ఇవ్వడం జరిగింది. అటు తర్వాత నా కార్టూనులు వరుసగా జ్యోతి మాసపత్రిక, గో తెలుగు, హాసం, పల్లకీ, హస్యానందం, నవ్య వీక్లీ, క్రోక్విల్ హాస్యప్రియ, రచన, విపుల, స్వాతి మాసపత్రిక మొదలైన పత్రికలలో వచ్చాయి.
రచయితగా విపుల పత్రికలో కార్డు కథలు రాసాను. రచన మాసపత్రికలో మూడు కథలు ‘అందులో రెండు కథలు కథా పీఠం అవార్డ్ అందుకున్నాయి. రచన లో ఓ మిని కవిత రాసాను. కర్నూల్ లో చదువుకుంటున్నపుడు నటనాలయం (ఎన్.జీ.వో. సభ్యులు) నాటిక ప్రదర్శన జరిగినపుడు వారికి ఓ ప్రార్థన గీతం రాసాను.. సినీమా పంపిణీ శాఖలో, సినీమా థియేటర్ విభాగంలో పనిచేయడం జరిగింది.ఒక మిత్రుడితో కలిసి సినీమాలు పంపిణీ కూడా చేసి చేతులు కాల్చుకున్నాను. ప్రస్తుతం సినీమా రంగానికి దూరంగా వుంటున్నాను.
నా కుటుంబం ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. చాలాకాలంగా కార్టూనులకు, కథలు రాయడానికి దూరంగా వున్నాను. త్వరలో మళ్ళీ మొదలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాను. నేను వేసిన కార్టూనులు దాదాపు రెండు వందల వరకు ఉంటాయి.
నాకు నచ్చిన నా కార్టూన్ అంటే నేను వేసిన ప్రతి కార్టూన్ నాకు నచ్చిన తర్వాతనే పత్రికకు పంపడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో పత్రికా నంపాదకులు వారికి నచ్చక వాపసు వచ్చినవి కొన్ని మరో పత్రిక వాళ్ళు స్వీకరించడం కూడా జరిగింది.
నా గురించి చెప్పుకునే అవకాశం ఇచ్చిన 64 కళలు.కాం కళాసాగర్ గారికి ధన్యవాదాలు.
Congrats Kaladhar garu
కళాధర్ గారు మీ కార్టూన్లు బాగుంటాయి.