నా పూర్తి పేరు పట్నాయకుని వెంకట నరసింగరావు. నరేష్ పేరుతో కార్టూన్లు వేస్తున్నాను. నేను పుట్టింది పెరిగింది అనకాపల్లిలో. పుట్టిన తేది 19 ఏప్రిల్ 1963. నా విద్యాభ్యాసం పది వరకు అనకాపల్లిలో. ఇంటర్ నుండి డిగ్రీ (బి.కాం) కొత్తూరు జంక్షన్ లో గల ఏ ఎమ్ ఏ ఎల్ కాలేజి లో. ప్రస్తుతం నేను నివాసం విశాఖపట్నంలో.
మా నాన్నగారు నారాయణమూర్తి. రచనా వ్యాసంగం పట్లమక్కువ ఎక్కువ. శ్రీపట్నాయిక్ కవి పేరు తో పలు నాటకాలు రాసారు. దీక్ష, అభాగ్యులా అనే నాటకాలు కేంద్ర, రాష్ట్ర నగదు పురస్కారాలు అందుకున్నాయి. వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. అనకాపల్లి కేంద్రంగా విశారద అనే సాహిత్య పక్ష పత్రిక నడిపారు. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని వారమాస పత్రికలు ఇంటికి తెచ్చేవారు. ఆయా పత్రికల్లో వచ్చిన జయదేవ్, రాగతిపండరి, బాబు, మల్లిక్ గార్ల కార్టూన్స్… బాపు, బాలి, చంద్ర, గంగాధర్, ఈశ్వర్ గార్ల ఇలస్ట్రేషన్స్ చూసి చాలా ఆకర్షితుడినయ్యాను.
మా అన్నయ్య నవీన్ ప్రసాద్. ఇద్దరికీ మూడేళ్ళు వ్యత్యాసం. అప్పట్లో “చలనచిత్ర” అనే సినీ వారపత్రిక వచ్చేది. అందులో శోభన్ బాబు నటించిన “కోడెనాగు” ప్రకటనలోని శోభన్ బాబు చిత్రాన్ని కార్బన్ పేపర్ తో కాపీచేసి బొమ్మవేసాడు. అన్నయ్య చాలా గ్రేట్ అనిపించింది. బొమ్మలు వెయ్యాలనే పిచ్చి అప్పట్నుంచి నాకు పట్టుకుంది. మా అన్నయ్య ఒకట్రెండు బొమ్మలు వేసుంటాడు. అంతే ఇప్పటి వరకూ ఆ సంగతే లేదు. కార్బన్ ట్రిక్ తెలిసిన దగ్గర్నుంచి నచ్చిన బొమ్మలు ట్రేస్ తీసి మహదానందపడే వాణ్ణి. మా అన్నదమ్ములిద్దరికీ ఏయన్నార్ అంటే పిచ్చి అభిమానం. దానితో ఒకసారి ఏయన్నార్ బొమ్మ వేసాను. సినిమా ధియేటర్ ముందు స్టిల్స్ డిస్ ప్లే బాక్స్ ఉండేది. మా అన్నయ్య నేను వేసిన బొమ్మ ధియేటర్ వారికిస్తే ఆ బాక్స్ లో పెట్టారు. రోజూ ధియేటర్ కి వెళ్ళి నే వేసిన బొమ్మ చూసుకొని గొప్ప ఎచీవ్ మెంట్ లా ఇద్దరం ఫీలయ్యేవాళ్ళం. ఇదేదో బాగుందని ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి అప్పటి స్టార్ హీరోల బొమ్మలు కూడా వేసి ఆయా హీరోల సినిమాలు రిలీజ్ అయ్యే థియేటర్లకి ఇచ్చేవాళ్ళం.
నేను తొమ్మిదో తరగతి చదువుతున్నపుడనుకుంటా విజయవాడ కేంద్రంగా వెలువడిన ఆనందజ్యోతి అనేవారపత్రిక ప్రారంభసంచికలో నా తొలి కార్టూన్ వచ్చింది. పరిణతిలేకుండా, ఇంకు.. డ్రాయింగ్ షీట్ వంటి బేసిక్స్ తెలియకుండా వేసి పంపేవాణ్ణి. జ్యోతి మాసపత్రిక, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, మయూరి, చిత్రభూమి తదితర పత్రికల్లొ కార్టూన్లు పివియన్రావ్ పేరున వేశాను. ఏడెనిమిది పంపిస్తే ఒకటిరెండు వచ్చేవి. ఒక్కోసారి అదీలేదు. కార్టూన్ పబ్లిష్ చేస్తే పత్రిక కాంప్లిమెంటరీ కాపీతోపాటూ… పదిహేను రూపాయలు పారితోషికం కూడా పంపేవారు.
ఆంధ్రభూమి వారపత్రికలో “కార్టూన్లు వేయడం ఎలా?” శీర్షికన సత్యమూర్తి గారు ధారావాహికగా పాఠాలు చెప్పేవారు. డ్రాయింగ్ పెద్దది, చిన్నది కావాలంటే ఏ పద్దతిలో వెయ్యాలి, నిబ్ లు, ఇంక్ లు, ఎలా వాడాలి? వంటి విషయాలు సులువుగా అర్ధమయ్యేలా చాలా చెప్పారు. కార్టూనిస్ట్ కి, ఆర్టిస్ట్ కి బేసిక్ గా తెలుసుకోవలసిన విషయాలు అవి. నేను చాలా విషయాలు నేర్చుకున్నది సత్యమూర్తి గారి పాఠాలతోనే.
విశాఖపట్నం నుండి వెలువడుతున్న విజయభాను దినపత్రికకు మూడు దశాబ్దాలు పొలిటికల్ కార్టూన్స్ వేసాను. ప్రస్తుతం అక్షర శిల్పం అనే దిన పత్రికకు, బాక్సాఫీస్ (సినిమా టేడ్ మ్యాగజైన్) కి వేస్తున్నాను. సీనియర్ జర్నలిస్జ్ నాదెళ్ళ నందగోపాల్ గారి మూవీమార్కెట్ (వారపత్రిక), టాప్ ఆంధ్ర డాట్ కామ్, ఓ ఆర్ టివి తెలుగు డాట్ కామ్, తదితర సంస్థలలో హానరరీ రెమ్యునరేషన్ తో కార్టూనిస్టుగా పనిచేసాను. నా అభిమాన కార్టూనిష్టులు ఆర్ కె లక్ష్మణ్, సుభాని గార్లు.
1984 నుండి నరేష్ డిజైనర్స్ గా విశాఖలో సేవలు అందిస్తున్నాను. అప్పటిలో డిజైనింగ్ కి ఇప్పుడున్నంత సౌలభ్యం లేదు. అంతా చేతితో రాయాల్సిందే. మల్టీకలర్ డిజైన్స్ “స్ప్రే” గన్ తో చేసేవాణ్ణి. ఫొటోషాప్, అనుఫాంట్స్ అందుబాటులోకి వచ్చాక డిజైనర్స్ కి పని సులువు అయ్యింది. అనుఫాంట్స్ మురళీకృష్ణ గారు అనుక్లిప్ ఆర్ట్స్ సిడిలలో తెచ్చేక్రమంలో కమర్షియల్ డిజైనర్స్ దగ్గరి డిజైన్స్ కలెక్ట్ చేసారు. నేను గీసినవి 400 వరకు బొమ్మలు అను క్లిప్ ఆర్ట్స్ లో పొందుపరిచారు. ఈనాడు పేపరులో వచ్చిన నా మొదటి డిజైన్ అక్కినేని, దాసరిల కాంబినేషన్ లో వచ్చిన”రాముడు కాదు కృష్ణుడు” చిత్రానిది. ఉత్తరాంధ్ర జిల్లాలలోని ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కు అలానే చందనబ్రదర్స్, బొమ్మనబ్రదర్స్, దాలిరాజు సూపర్ మార్కెట్ వంటి పలు వ్యాపారసంస్థలు, విద్యాసంస్థలకు సేవలు అందించాను. నేను ఎక్కువగా సినిమా మరియు కమర్షియల్ ప్రకటనల డిజైన్స్ మరియు, లోగో.. బ్రోచర్స్.. బ్రాండింగ్ వర్క్స్ వంటివి ప్రింట్ మీడియాకి సంబందించినవి చేస్తుంటాను. అలాగే స్థానికంగా వెలువడుతున్న కొన్ని మాసపత్రికలు కూడా నా దగ్గర రూపుదిద్దుకుంటాయి. అలానే ” ఝాన్సీ ఏడ్స్” అనే అడ్వర్టయిజింగ్ ఏజన్సీని నడుపుతున్నాను. ఎడిటర్ & పబ్లిషర్ గా “వార్తావికాస్ ” అనే మాసపత్రికను గత ఎనిమిది సంవత్సరాలుగా తీసుకొస్తున్నాను. డిజైనర్ గా ఉండే పని ఒత్తిడి వలన కార్టూన్లు పై ఎక్కువ సమయం కేటాయించ లేకపోతున్నందుకు కించిత్ బాధగా ఉంటుంది.
నా పరిచయాన్ని 64 కళలు డాట్ కామ్ ద్వారా మీ ముందు ఉంచిన మిత్రులు కళాసాగర్ గారికి ధన్యవాదాలు.
- నరేష్ పట్నాయిక్
Congrats Naresh garu, very good presentation about ur self.
Very interesting intro. beautiful cartoons.
Congratulations 👏This is the best post it feels so happy and motivated after reading about you. You are an inspiration.
Cartoons are really amazing and hilarious.
You presented beautifully about yourself. Good ! Keep it up and wish you to continue as our Ever Green Hero !
You have presented about yourself beautifully! Keep it up and wish you to continue ur activities as our Evergreen Hero !
The details given by you simply superb Naresh garu !
Good cartoons.
First time I am seeing ur cartoon… very funny, excellent line. Thanks to 64kalalu.com