సుప్రసిద్ధ మహిళా కార్టూనిస్ట్ తెలుగు కార్టూనిస్టుల అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి పద్మ గారు గత నాలుగేళ్ళుగా ప్రతీ కార్తీకమాసంలో తన ముద్దుల మనమరాలు శ్రీ ఆర్తి జన్మదినం సందర్భంగా కార్టూనిస్టుల వనభోజనాల పేరుతో ఏర్పాటు చేస్తున్న కార్టూనిస్టుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా ఎంతో చక్కటి ఆహ్లాదకర వాతావరణంలో 28-11-2021 ఆదివారం నాడు విజయవాడ భవానిపురం నందలి సర్ ఆర్ధన్ కాటన్ హైస్కూల్ నందు నిర్వహించడం జరిగింది. ఈ వేడుక సందర్భంగా కార్టూనిస్టులకు చక్కటి హాయి ఆనందాలను కలిగించేవిదంగా పద్మగారు రూపొందించిన లక్కీ డీప్, స్మరించుకుందాం, అవర్ ఫ్రెండ్, ఏ టు జేడ్, కార్టున్ వాక్యపోటీ, లెమన్ అండ్ స్పూన్, కార్టూనిస్ట్ పేర్లతో అంత్యాక్షరి, సూపర్ హీరో లాంటి సరదా సరదా ఆటల పోటీలలోని బహుమతులు గెల్చుకోవడం కోసం అక్కడకు విచ్చేసిన కార్టూనిస్ట్ మిత్రులంతా పోటీపడి తమ చిన్నతనంలోని స్కూల్ పిల్లల్లా మారిపోయి వుత్సాహంగా పాల్గొనడం విశేషం.
ఉదయం తొమ్మిదిన్నర గంటలకు నేను వెళ్లేసరికే కార్యక్రమ నిర్వాహకురాలైన పద్మ గారు వారి కుటుంభ సభ్యులతో పాటు యువ కార్టూనిస్ట్ హరికృష్ణ, సీనియర్ కార్టూనిస్ట్ బాచి, ప్రసిద్ద తదితరులు కార్యక్రమ వేదిక వద్ద ఏర్పాట్లు చూస్తూ వేడుకలో పాల్గొన బోయే కార్టూనిస్టులు అందుకోబోయే బహుమతులను వేదిక వద్ద చక్కగా అమర్చడం జరిగింది. ఆపై వివిధ ప్రాంతాలనుండి విచ్చేసిన కార్టూనిస్టులు వారి హాజరుకి ప్రతీకగా వారి మార్కు కార్టూన్ బొమ్మతో సంతకం చేసేందుకు వీలుగా వేదిక వద్ద ఏర్పాటు చేసిన డ్రాయింగ్ బోర్డు పై వచ్చిన ప్రతీ కార్టూనిస్ట్ వారివారి చిత్రాలు వేయడం జరిగింది. ఉదయం పదిగంటలకల్లా సీనియర్ కార్టూనిస్ట్ టీవి, రాజమండ్రి కార్టూనిస్ట్ శేఖర్, కళాసాగర్ మరియు వారి శ్రీమతి లీలావతి, రచయిత సింగంపల్లి అశోక కుమార్, నాగిశెట్టి, ధీరజ, బొమ్మన్, పుష్ప, గంగాధర్, మురళీధర్, ఇబ్రహీం, అంతోటి ప్రభాకర్, వడ్డేపల్లి, ఆదినారాయణ, రావెళ్ళ, శరత్ బాబు, జమదగ్ని,షేక్ సుభాని, బాలకృష్ణ, యస్. యస్. రాజ్, మైనేపల్లి లాంటి వారితో కలిపి విచ్చేసిన మొత్తం 30 మంది తెలుగు కార్టూనిస్టులు వేదిక వద్దనే ఏర్పాటు చేసిన అల్పాహారం ముగించిన అనంతరం శేఖర్ కార్యక్రమాన్ని వివరించారు. ఆ తదుపరి పాల్గొన్న కార్టూనిస్ట్ లందరికి ఆహ్వానం పలుకుతూ వెల్కం బోర్డు ని కార్టూనిస్ట్ పద్మగారు ఓపెన్ చేయడంతో కార్యక్రమం మొదలైంది. తొలి తెలుగు కార్టూనిస్ట్ తలిసేట్టి రామారావు కార్టూన్ని సీనియర్ కార్టూనిస్ట్ టీవి గారు వేసి కార్యక్రమాలను ప్రారంబించారు. అనంతరం పద్మగారు కార్యక్రమానికి విచ్చేసిన కార్టూనిస్ట్ మిత్రులందరి మధ్య స్నేహ భాందవ్యం ఎల్లవేళలా నిలిచి వుండాలని ఆశిస్తూ అందరికి స్నేహ రక్షా భందనాలను అందించగా అందరూ వాటిని తమ చేతులకు దరించుకున్న తదుపరి లక్కీడీప్ అనే పోటీలో బాగంగా ఒక బుట్టలో కొన్ని చిట్టీలు వేసి కార్టూనిస్ట్ మిత్రులందరికి పంచడం జరిగింది. తదుపరి వాటిల్లో వారి మనమరాలు శ్రీ ఆర్తి పేరు గల చిట్టి వచ్చిన ముగ్గురి లో ఎవరైతే ముందు ఇచ్చారో వారికి ఆ వరుస క్రమంలో ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులు ప్రకటించగా దీనిలో, లీలావతి గారు, యువ కార్టూనిస్ట్ ధీరజ మరియు రావెళ్ళ గారికి బహుమతులు రావడం జరిగింది. ఆ తర్వాత నిర్వహించిన పోటీ “స్మరించుకుందాం” ఇందులో ఒక పదభంధం లాంటి చిట్టి లో విడివిడి గా వున్న అక్షరాలలోదాగి యున్న దివంగతులైన మన తెలుగు కార్టూనిస్టుల పేర్లను కనుక్కుని వరుసగా వారి పేర్లు రాయాలి. దీనిలో మొదటి బహుమతి బాచి ద్వితీయ బహుమతి ఈ వ్యాస రచయిత వెంటపల్లికి, తృతీయ బహుమతి ధీరజ కు రావడం జరిగింది.
అనంతరం మిత్రులు 64 కళలు.కాం ఎడిటర్ కళాసాగర్ గారు నూట అరవై ఆరు మంది తెలుగు కార్టూనిస్ట్ ల సమాచారంతో ఎంతో శ్రమకోర్చి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన “కొంటె బొమ్మల బ్రహ్మలు” అనే గ్రంధాన్ని ప్రముఖ రచయిత సింగంపల్లి అశోక కుమార్ చేతులమీదుగా ఆవిష్కరించి తొలి ప్రతిని కార్టూనిస్ట్ పద్మగారికి అందజేయడం జరిగింది. అశోక కుమార్ గారి చక్కటి సమీక్ష జరిగిన అనంతరం సీనియర్ కార్టూనిస్ట్ టీవిగారు కళాసాగర్ లు ఈ పుస్తకం గురించి మాట్లాడడం జరిగింది. తర్వాత ఈ పుస్తక రూపకల్పనలో సహాయమందించిన బొమ్మన్, వెంటపల్లి, ప్రసిద్ద, జమదగ్ని, ఆదినారాయణ, అంతోటి ప్రభాకర్ తదితరులకు పుస్తకాన్ని బహుకరించడం జరిగింది.
తర్వాత జరిగిన “అవర్ ఫ్రెండ్” అనే పోటీలో అక్కడ కార్యక్రమానికి హాజరైన కార్టూనిస్టులలో ఒకరి గురించి మరొకరు కరక్ట్ గా రాయగలగడం, దానిద్వార మార్కులు వేసి ప్రైజెస్ ఇవ్వడం. దీనిలో దాదాపు అందరూ ప్రైజెస్ గెలుచుకోవడం జరిగింది, ఎక్కువ మందికి లేమన్ టీ గిఫ్ట్ బాక్షేస్ అందరికి అందజేయడం జరిగింది. తర్వాత సభ్యులందరితో గ్రూప్ ఫోటో తీసిన అనంతరం పెట్టిన మరో పోటీ పేరు A to Z (అంతా మనమే) దీనిలో పాల్గొన్న ప్రతీ కార్తూనిస్టుకీ A to Z అక్షరాలున్న చిట్టీలు ఒక ప్యాకెట్ లో ఇవ్వగా ఆ అక్షరాలలో నుండి అక్కడ గ్రూప్ లో వున్నకార్టూనిస్టుల పేర్లలో మాత్రమే ఎవరో ఒక కార్టూనిస్ట్ పేరుని త్వరత్వరగా సెలెక్ట్ చేసి జడ్జ్ కి అందించిన తొలి ముగ్గురికి ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులు ఇవ్వడం జరిగింది. అనంతరం పద్మగారు ఆరెంజ్ చేసిన చక్కటి పసందైన భోజనాలు అందరం ఆరగించిన తదుపరి సీనియర్ కార్టూనిస్ట్ టీవీ గారికి ఒక చిరు సన్మానం చేసారు. తదుపరి కార్టూనిస్టులతో ఆడించిన గేమ్ లెమన్ అండ్ స్పూన్. దీనిలో బాచి గారు రెట్టించిన ఉత్సాహంతో ఆడి మొదటి బహుమతి గెల్చుకున్నారు. తర్వాత కార్టూనిస్ట్ కృష్ణ కిశోర్ వేసిన బొమ్మకు రంగులు వేసి సరైన వ్యాఖ్య రాయడం. అందుకు గాను పాల్గొన్న ప్రతీ కార్టూనిస్ట్ కీ చిన్న చిన్న క్రేయాన్ బాక్షేస్ అందించగా వయసుమళ్ళిన మధ్యవయసు మరియు యువకులుగా వున్న అందరూ రెడిమేడ్ గా వున్న బొమ్మపై క్రేయన్స్ తో రంగులు దిద్ద్డుతూ అందరూ కాన్వెంట్ పిల్లాల్లా మారిపోయారు. అందరికి ఈ పోటీ మరలా బాల్యాన్ని గుర్తు చేసి ఒక గమ్మత్తైన అనుభవాన్ని అందించింది . అందరూ రంగులు వేసి వ్యాఖ్య రాసిన అనంతరం వాటిని తీసుకుని జడ్జ్ మెంట్ నిమిత్తం మరో సీనియర్ కార్టూనిస్ట్ బొమ్మన్ గారికి అందజేయగా వడ్డేపల్లి వెంటపల్లి నాగిశెట్టిలకు బహుమతులు రావడం జరిగింది. తర్వాత జరిగిన పోటీ అంత్యాక్షరి . ఇది మామూలుగా జరిగే సినిమా పాటల అంత్యాక్షరి కాదు కేవలం కార్టూనిస్టుల పేర్లతో పలికే అంత్యాక్షరి . ఇందులో పాల్గొన్న కార్టూనిస్ట్ లను ఏ అండ్ బి గ్రూపులుగా విభజించి పోటీ నిర్వహించగా ఏ గ్రూప్ లోని వున్న వెంటపల్లి త్వరత్వరగా సమాదానాలు చెప్పి తన గ్రూప్ విజయానికి కారకులయ్యారు. చివరిగా మొత్తం పోటీలలో ఎక్కువ బహుమతులు గెల్చుకున్న బాచి గారు సూపర్ హీరో అవార్డ్ అందుకున్నారు. ఆద్యంతం ఆహ్లాదభరిత వాతావరణంలో ఆనందంగా సాగిన ఈ కార్టూనిస్టుల వనబోజన కార్యక్రమ నిర్వాహణలో కార్టూనిస్ట్ పద్మ గారి బర్త, కుమారుడు కోడలు , మనమరాలు మొత్తం కుటుంభం కార్టూనిస్టుల పట్ల చూపిన ప్రేమ ఆదరణ నిజంగా ఎంతో గొప్పగా అనిపించింది. చివరిగా సాయంత్రం టీ, స్నాక్స్ లు ముగించిన తర్వాత దూరప్రాంతము నుండి వచ్చిన వాళ్ళను పద్మ గారి కుమారుడు తన కారులో బస్ స్టాండ్ వరకు కూడా దించి పంపించడం మరింత గొప్పగా అనిపించింది. గత నాలుగేళ్ళుగా సాగుతున్న ఈ కార్యక్రమ నిర్వాకురాలైన పద్మ గారికి ధన్యవాదములు తెలియ జేసి మిత్రులంతా వెనుదిరిగారు. ఆ సాయంత్రం అక్కడనుండి వచ్చే ఏడాది రాబోయే ఈ కార్యక్రమంకోసం మరల ఎదురు చూస్తూ…..
–వెంటపల్లి సత్యనారాయణ