చందమామ చిత్రకళా’త్రయం’

అటుపిల్లల్ని ఇటు పెద్దల్ని ఆరున్నర దశాబ్దాల పాటు అలరించి, ఆనందపర్చి, ఆశ్చర్యపర్చిన జాతీయ మాసపత్రిక ‘చందమామ’ అందులో ప్రచురింపబడే కథలు, సీరియల్తో సమంగా అందులోని చిత్రాలు ఆకట్టుకొనేవి. చదువురాని వారు కూడా ఆ బొమ్మల కోసం చందమామ కొనుక్కునే వారంటే అతిశయం కాదు. ఆ పత్రికకు అంతటి ఆదరణ రావడానికి ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు ఒక కారణంకాగా, అందులో చిత్రకారులుగా పనిచేసిన చిత్ర, శంకర్, వపా మరోకారణం. చిత్ర మద్రాసు ఆంధ్రుడు, శంకర్ తెలుగు, ఇంగ్లీషు తెలిసిన తమిళియన్, వపా నూరు పైసల ఆంధ్రుడు. చిత్ర 1947 జూలైలో వెలువడిన మొదటి సంచిక నుండి, 1978 మే 6న ఆస్తమించేవరకు అంటే మూడు దశాబ్దాల పాటు చందమామకు పనిచేశారు. ఆయన చిత్రకళ ఎవరివద్ద అభ్యసించలేదు. స్వతహాగా ఆయన ఛాయా చిత్రకారుడు కూడా, 1947లో తొలిసంచికకు ముఖచిత్రం వేసింది, 1955 సెప్టెంబర్లో వచ్చిన తొలి బేతాళ కథకు అపురూప చిత్రం గీసింది కూడా చిత్రానే. మొదట్లో వెలువడిన సంచికల్లో దాదాపు ప్రతి కథకు ఆయనే బొమ్మలు వేసేవారు. ఆయన తన జీవిత కాలంలో పది వేల చిత్రాలు సుమారుగా గీచారు. ఆయన కంచుకోట, జ్వాలాదీపం, రాకాసి లోయ, పాతాళదుర్గం, రాతిరథం, విచిత్ర కవలలు, తోక చుక్క మాయా సరోవరం ముఖ్యమైనవి.

చందమామలో పనిచేసిన మరో చిత్రకారుడు వడ్డాది పాపయ్య. 1960 సం. నుండి 1992 డిశంబర్ లో ఆయన మరణించే వరకు ముఖచిత్రం, అటు వెనుక చిత్రాలతోపాటు అనేక పౌరాణిక సీరియలకు తనదైన శైలిలో చిత్రాలు గీసి పత్రిక సర్కులేషన్ పెగడానికి కారకులయ్యారు. వపా ఏ కళాశాలలో చిత్రకళ నేర్చుకోలేదు. స్వయంకృషితో సాధనచేసి, స్వశైలితో చిత్రాలు గీసి కళాభిమానుల్ని ఆకట్టుకొన్నారు. ఆయన రామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, అరణ్యపురాణం, పంచతంత్రకళలు, విఘ్నేశ్వరుడు తదితర పురాణ గాథలకు వందలాది వర్ణచిత్రాలు వేలాది రేఖాచిత్రాలు గీచారు. కొ.కు. మరణంతో ఆగిన దేవీ భాగవతం పూర్తి చేయడంతో పాటు, విష్ణుపురాన్ని వపా రచించి, చిత్రాలు గీసారు. 1960 -1970 ఒక దశాబ్దం మాత్రమే వపా చందమామ మద్రాసు కార్యాలయంలో వుండి చిత్రకారుడుగా పని చేశారు. తర్వాత అనకాపల్లి సమీప కుగ్రామం కశింకోట వచ్చి 1992లో ఆయన కన్నుమూసేవరకు ఇంటినుండే చిత్రాలు గీసి ‘పోస్టు’ ద్వారా చిత్రాలు పంపిచేవారు. చందమామతో వపా అనుబంధం ప్రత్యేకమైనది. .

చందమామాలో పనిచేసిన మరో ముఖ్య చిత్రకారుడు శంకర్. వీరు తమిళనాడుకు చెందిన వ్యక్తి, చిత్ర, వపా డిగ్రీలు లేని చిత్రకారులు కాగా శంకర్ మద్రాసు ప్రభుత్వ కళాశాలలో చిత్రలేఖనంలో డిప్లమో చేశారు. ఆయన ప్రతిభ గుర్తించి, కళాశాల ఉపకారవేతనం కూడా ఇచ్చింది. బెంగాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, శిల్పి దేవిరాయ్ ప్రసాద్. వారి వద్ద చిత్రకళలో మెళకువలు నేర్చుకున్నారు.

1952 లో మూడు వందల రూపాయల జీతంతో చందమామలో చిత్రకారునిగా చేరి, ఆ పత్రిక మూసివేసేవరకు అంటే 2012 వరకు ఆరుదశాబ్దాలపాటు చిత్రకారునిగా పనిచేసి రికార్డు సృష్టించారు. ఒరిజినల్ వెర్షన్లో వున్న విక్రమార్కుడి భంగిమ మార్చి బేతాళుడి కాళ్లకు బదులు తలకనబడేలా చేసి మరింత మెరుగు పర్చారు శంకర్.మనందర్ని ఇంతగా ఆకట్టుకున్న ఈ బొమ్మ వెనుక చిత్రాలతోపాటు శంకర్ పాత్ర వుండటం విశేషం. 700 విక్రమ్ బేతాళ కథలకు శంకర్ చిత్రాలు గీచారు. రామాయణ, భారతం కథలకు కూడా శంకర్ రేఖాచిత్రాలు గీచారు. రామాయణ, భారతం కథలకు కూడా శంకర్ రేఖా చిత్రాలు గీచారు. ఆయన చిత్రాలు ఎంతోమంది కళాభిమానులకు స్ఫూర్తినిచ్చాయి. టూరిస్టు వింతలవంటి విషయాలను ఫొటో చూసి చిత్రాలు గీయడం శంకర్ ప్రత్యేకత. చందమామ మూతపడ్డాక ‘రామకృష్ణ విజయం’ అనే పత్రికలో ఆయన పనిచేశారు. చందమామ సంస్థ చిత్ర, శంకర్, వపాలతో విడివిడిగా చందమామ చిత్రకారులు పేరుతో బృహత్ గ్రంథాలను వెలువరించింది.
-సుంకర చలపతిరావు (91546 88223)

6 thoughts on “చందమామ చిత్రకళా’త్రయం’

  1. మంచి ఆర్టికల్ సర్… మాకు ఇది చదవడం వల్ల అనేక విషయాలు తెలిశాయి. అభినందనలు సుంకర వారికి….

    …….. శ్రీనివాస్ బీర, ఆర్టిస్ట్.

  2. 👌🙏మీకు ధన్యవాదములు సర్ చాలా మంచి సమాచారం అందించారు,, 64కళల డాట్ కామ్ ద్వారా ఆర్ట్ గూర్చి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలని ఉంది..

  3. నా చిన్నతనంలో ఎన్నో అపురూప జ్ఞాపకాలతో కూడిన ఏకైక కాలక్షేపం ఈ చందమామ !…కథలకు ప్రాణం పోసిన అపర బ్రహ్మలు ఈ చిత్రకారులు ! చక్కని సమాచారం!

  4. కె.సి.శివశంకర్ గారు తన 97వ ఏట సెప్టెంబర్ 29, 2020వ సంవత్సరంలో చెన్నైలో కన్నుమూశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap