సోగ్గాడు శోభనాద్రి … శోభన్ బాబు

చెన్నై మహానగరంలోని నుంగంబాకంకు దగ్గరలో వుండే రాజారాం మెహతా నగర్ లో ఓపెద్ద లోగిలి. అందులో రెండు ఇళ్లు. ఒకటి ‘శాంతి’ మరొకటి ‘ప్రశాంతి’. శాంతి నిలయంలో నటభూషణుడు, అందాల నటుడు శోభన్ బాబు కుటుంబం ఉంటుంది. ప్రశాంతి నిలయంలో శోభన్ ఆఫీసు గదులు, అతిథి గదులు వుంటాయి. ఇంటి ముందుండే విశాలమైన ఖాళీ స్థలంలో ఏపుగా పెరిగిన చెట్లు దర్శనమిస్తాయి. ఆ చెట్ల ఆకుల్ని తుంచినా, కాయల్ని, పూలను కోసినా శోభన్ బాబుకు కోపమొస్తుంది. ఇంతెందుకు ఆయన వ్యక్తిగత ఆఫీసు గదిలో పెద్ద వేపచెట్టు వుంటుంది. దానిచుట్టూ రక్షణ కవచం బిగించి ఆఫీసు గది నిర్మించుకున్నారే తప్ప, ఆ చెట్టును కొట్టివేయలేదు. ఆ విశాల లోగిలిలోనే వర్కర్లకు క్వార్టర్లు వున్నాయి. అక్కడ పనిచేసే కుటుంబాల పిల్లల చదువులు ఖర్చులతోబాటు ఇతర నిర్వహణా ఖర్చులన్నీ శోభన్ బాబే భరిస్తారు. ఇంటి ప్రాకారం ముందు ఇరువైపులా నీడనిచ్చే చెట్లు, ఆ చెట్ల నీడల్లో విశాలమైన అరుగులు వుంటాయి. వృద్ధ జనం నడకకు వచ్చి అక్కడ సేదతీరుతూ కబుర్లు చెప్పుకుంటూ, పేపర్లు చదువుకుంటూ స్వచ్చమైనగాలి పీల్చుకుంటూ కాలంగడుపుతూవుంటారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే శోభన్ బాబు కు ప్రకృతి అన్నా, తనమీద ఆధారపడినవారన్నా అంత అనురాగం, ప్రేమ, ఆప్యాయత.

మరో ఉదంతం…. శోభన్ బాబుని సోలో హీరోగా నిలబెట్టిన చిత్రం ‘వీరాభిమన్యు’ (1965). అందులో దుర్యోధన పాత్రధారి రాజనాల. ఒకసన్నివేశంలో శోభన్ రాజనాలతో గదాయుద్ధం చేయాలి. శోభన్ కొత్త కావడంతో షూటింగులో అతని గద వెళ్లి రాజనాల నుదుటిని తాకి కాస్త రక్తం కారింది. రాజనాల ఆగ్రహోదగ్రుడయ్యాడు. చేతిలో వున్న గదను విసిరేసి “డూండీ గారూ, నేను బిజీ విలన్ ని. ఇలాంటి చేతగానివాడితో హీరో వేషం వేయిస్తారా. వేరే హీరోని పెట్టండి” అంటుండగా శోభన్ బాబు రాజనాలకు క్షమాపణ చెప్పాడు. అయినా వినలేదు. కట్ చేస్తే… అదే రాజనాల 1980లో అన్నానగర్ లోని ఒక కారు షెడ్డులో దుర్బర జీవితం గడుపుతూ డబ్బు సాయంకోసం శోభన్ బాబు ఇంటికి వచ్చాడు. పాత విషయం ఆయనకు గుర్తొచ్చి ఏమైనా అంటాడేమోనని రాజనాలకు ఒకవైపు సందేహంగానే వుంది. శోభన్ బాబు రాజనాలకు ఆహ్వానం పలికి పలహారం, కాఫీ పెట్టించి ఒక కవరు అతని జేబులో పెట్టాడు(అందులో ఇరవైవేలరూపాయలకు పైగానే వున్న సంగతి ఇంటికి వెళ్లి చూసుకుంటే కాని రాజనాలకు తెలియదు. ఆరోజుల్లో అది చాలా పెద్ద మొత్తమే). రాజనాల కళ్ళలో నీళ్ళు తిరిగాయి. శోభన్ ఆతణ్ణి గేటుదాకా వచ్చి సాగనంపాడు. అంతటి కరుణా సముద్రుడు శోభన్. ఇలాంటి గుప్తదానాలు అతడు ఎన్నో చేశాడు. అయితే ఆ విషయాలను రెండవ కంటికి కూడా తెలియనివ్వలేదు. మార్చి 20 న అలాంటి అందాల శోభన్ బాబు వర్ధంతి సందర్భంగా ఆ అందాల నటుని జీవన ప్రస్తానం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం …..

తొలి నేపథ్యం…
శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనాచలపతి. జనవరి 14, 1937 న శోభన్ బాబు కృష్ణా జిల్లా కుంటముక్కల గ్రామంలో ఉప్పు రామతులశమ్మ, సూర్యనారాయణరావు దంపతులకు జన్మించారు. వారిది మధ్యతరగతి రైతు కుటుంబం. శోభన్ ఇంటికి పెద్దవాడు కాగా అతనికి తమ్ముడు సాంబశివరావు, చెల్లెళ్ళు ధనరంగ, ఝాన్సి, నిర్మల వున్నారు. శోభన్ తన ప్రాధమిక విద్యను కుంటముక్కలలో పూర్తిచేసి హైస్కూలు చదువు మైలవరంలో కొనసాగించారు. హైస్కూలు వార్షికోత్సవాలలో నాటకాలు వేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. విజయవాడలో ఇంటర్మీడియట్ చదివి గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో బియ్యస్సి డిగ్రీ పూర్తి చేశారు. అక్కడ ‘పునర్జన్మ’ వంటి నాటకాలలో ప్రధానపాత్రలు పోషించి అనతికాలం లోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. శోభన్ బాబుకు సినిమాలంటే చాలా ఇష్టం. తిరువూరులో తొలిసారి ‘కీలుగుఱ్ఱం’ సినిమా చూసి సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. దేవదాసు, పాతాళభైరవి, మల్లీశ్వరి సినిమాలను బాగా అభిమానించేవారు. మల్లీశ్వరి సినిమాని ఇరవై సార్లకు పైగా చూశానని శోభన్ స్వయంగా చెప్పుకున్నారు. 21 ఏళ్ళకే అంటే మే 1958లో శోభన్ బాబుకి శాంతకుమారితో పెళ్లయింది. ఆలిఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదివేందుకు తండ్రి ఏర్పాట్లు చేసినా, న్యాయశాస్త్రం చదవాలని నిర్ణయించుకొని శోభన్ మద్రాసు బయలుదేరారు. కోడంబాక్కం లిబర్టీ కి దగ్గరలో ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు. అయితే మద్రాసు వచ్చింది శోభన్ ‘లా’ కోర్సు చదవడానికి కాదు. ఆ మిషతో కాలేజీలో చేరి సినిమాలో అవకాశాలు వెతుక్కుందామని. సెంట్రల్ స్టేషన్ కు దగ్గరలో ఎస్ ప్లనేడ్డ్ దగ్గర ‘లా’ కాలేజిలో శోభన్ కి అడ్మిషన్ దొరికింది. రోజూ పది కిలోమీటర్లు సైకిలు తొక్కుకుంటూ కాలేజికి వెళ్లి నాలుగైదు గంటలు క్లాసులకు హాజరై భోజనం వేళకు తిరిగివచ్చేవారు. శ్రీమతి వంట రుచిచూసి మరలా సైకిలు మీద భరణి, వీనస్, విక్రమ్, వాహిని, ఏవియం, గోల్డెన్ స్టూడియోల చుట్టూ తిరుగుతూ కనపడిన నిర్మాతను, దర్శకుణ్ణి కలిసి ఫోటోలు యిచ్చి సినిమాల్లో నటించే అవకాశాలు ఇమ్మని అడుగుతూ కాలం గడిపేవారు. ఇంటికి, కాలేజీకి దూరం ఎక్కువై తిరగటం కష్టమై పోవడంతో స్తూడియోలకు దగ్గరగా వుండే కోడంబాక్కం వద్దకు మకాం మార్చారు. శోభన్ కు సినిమాల్లో చేరడం మీద శ్రద్ధ వుందని తండ్రికి చూచాయగా తెలిసింది. అటువంటి అవకాశాలకోసమే ముమ్మరంగా ప్రయత్నించమని ప్రోత్సహించారు.

పొన్నలూరి బ్రదర్స్ లో అవకాశం…

1959లో పొన్నలూరు బ్రదర్స్ సంస్థ శ్రీకృష్ణ మూవిటోన్ స్టూడియోలో ‘దైవబలం’ సినిమా నిర్మిస్తోంది. ఆ సంస్థ అధినేత వసంతకుమార్ రెడ్డిని శోభన్ కలిసి ఫోటోలు ఇచ్చారు. ఆయన పరీక్షగా చూసి “నీలో మంఛి నటుడున్నాడు. సినిమాలకు పనికొస్తావ్” అంటూ మేకప్ టెస్టు చేయించారు. అందులో గంధర్వకుమారుడి వేషమిచ్చారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆ సినిమాలో మూడురోజుల షూటింగుతో చిన్న పాత్ర పోషించినందుకు శోభన్ కు రెండు వందల రూపాయల పారితోషికం లభించింది. డబ్బుకన్నా తన ఆరాధ్యదైవం ఎన్టీఆర్ తో కలిసి నటించడం శోభన్ కు యెంతో సంతృప్తి నిచ్చింది. ఆ సినిమాతోనే ఉప్పు శోభనాచలపతిరావు ‘శోభన్ బాబు’ గా అవతార మెత్తారు. ‘దైవబలం’ సినిమా ఆశించినంత గొప్పగా ఆడలేదు. నిజానికి వసంతకుమార్ రెడ్డి శోభన్ ను హీరోగా పెట్టి కనకమేడల రచించిన ‘మహామాయ’ నవలను సినిమాగా తీద్దామనుకున్నారు. ‘దైవబలం’ ఫ్లాప్ కావడంతో ఆ సినిమా ప్రయత్నాలు మూలపడ్డాయి. 1960లో విశాఖపట్నానికి చెందిన నిర్మాత బి.ఆర్. నాయుడు సుఖీభవ ప్రొడక్షన్స్ పతాకంపై ‘భక్త శబరి’ చిత్రాన్ని నిర్మిస్తూ అందులో శబరి చెంత వుండే ‘కరుణ’ అనే మునికుమారుడి పాత్రను శోభన్ కు ఇచ్చారు. అందులో పండరీబాయి శబరిగా, హరనాథ్, రామకృష్ణలు రామలక్ష్మణులుగా ఎంపికయ్యారు. దర్శకుడు చిత్ర్తపు నారాయణమూర్తి శోభన్ మీద ఒక పాటను కూడా చిత్రీకరించారు. సినిమా 15, జూలై 1960 న విడుదలైంది. సినిమా సుమారుగా ఆడినా, శోభన్ అంటే కొత్త నటుడని ప్రేక్షకలోకానికి తెలిసింది. ఆ సమయంలోనే శోభన్ కి కొడుకు పుట్టాడు. ‘భక్త శబరి’లో తను పోషించిన ‘కరుణ’ పాత్ర పేరే కుమారుడికి పెట్టుకున్నారు శోభన్. ఎన్టీఆర్ ‘సీతారామ కల్యాణం’(1961) చిత్రాన్ని నిర్మిస్తూ శోభన్ కి లక్ష్మణుడి పాత్ర ఇస్తూ “సినిమా రంగాన్ని ధ్యానంగా, తపస్సుగా స్వీకరించండి. సక్రమంగా, వినయంగా, సత్సీలతతో మెలగండి. మీరు తప్పకుండా పైకి వస్తారు” అంటూ తొలిరోజు షూటింగులో ఉద్బోధ చేశారు. ఆ సలహా శోభన్ మీద తీవ్రమైన ప్రభావం చూపింది. క్రమశిక్షణ అలవాటు చేసింది. శోభన్ ప్రవర్తన నచ్చిన ఎన్టీఆర్ తరవాత ‘భీష్మ’ సినిమాలో శోభన్ కు అర్జునుడు వేషం ఇప్పించారు. తరవాత కొన్ని ఆఫర్లు వచ్చినా షూటింగు మొదలై ఆగిపోయేవి. వాటిలో ‘పార్వతీ పరమేశ్వరులు’, ‘ఆణిముత్యం’, ’ఉల్లాసపయనం’ వంటి చిత్రాలున్నాయి. తరవాత నిర్మాత పండరీకాక్షయ్య ‘మహామంత్రి తిమ్మరుసు’ చిత్రంలో తిమ్మరుసు కొడుకు గోవిందరాయలు పాత్రను శోభన్ కు ఇచ్చారు. ఎన్టీఆర్ శోభన్ కు ‘లవకుశ’ చిత్రంలో శత్రుఘ్నుడి పాత్రను ఇప్పించారు. అదే సమయంలో అన్నపూర్ణా సంస్థ వారు నిర్మిస్తున్న ‘చదువుకున్న అమ్మాయిలు’ (1963) చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు శోభన్ కు రెండవ హీరో గా పోలీసు అధికారి పాత్రను ఇచ్చి ప్రోత్సహించారు. అలా సావిత్రి ప్రక్కన తొలిసారి నటించే అవకాశం శోభన్ కు లభించింది. అలాగే ‘ఇరుగుపొరుగు’ చిత్రంలో అతిథి పాత్ర లభించింది. చిన్నచిన్న పాత్రలు పోషిస్తూ ఆర్ధికంగా శోభన్ కష్టాలు అనుభవించారు. ఆ పరిస్థితుల్లో కమలాకర కామేశ్వరరావు ‘నర్తనశాల’ (1963) చిత్రంలో అభిమన్యుడి పాత్రకు శోభన్ ను ఎంపిక చేశారు. ఈ మూడు సినిమాల ఆదరణతో ‘సుమంగళి’ (1965) సినిమాలో “ఏవేవో చిలిపితలపు లురుకుతున్నవి” అనే పాటలో జయంతితో నటించే అవకాశం దక్కింది.

వీరాభిమన్యులో అభిమన్యుడిగా…

నిర్మాతలు సుందర్లాల్ నహతా-డూండీ(డూందేశ్వరరావు)లు భారీ బడ్జెట్ తో ‘వీరాభిమన్యు’ చిత్రాన్ని ప్రారంభిస్తూ అభిమన్యుని పాత్రకు హరనాథ్, రామకృష్ణ లను త్రోసిరాజని శోభన్ ని ఎంపికచేశారు. ఇందులో దర్శకుడు వి. మధుసూదనరావు ప్రమేయం, ఎన్టీఆర్ ప్రోద్బలం కూడా వుంది. హీరో పాత్ర కావడంతో పెద్దపెద్ద డైలాగులు శోభన్ తో చెప్పించారు దర్శకుడు. ఆగస్టు 12, 1965 న ‘వీరాభిమన్యు’ చిత్రం విడుదలై అఖండ విజయం సాధించింది. శోభన్ కు మంచి పేరొచ్చింది. కానీ పౌరాణిక చిత్రాలకు ఆదరణ తక్కువ కావడంతో నిర్మాతలు ఆ జోలికి పోవడం తగ్గించేశారు. పౌరాణిక చిత్ర హీరోగా ముద్రపడడంతో అవకాశాలు రావడం తగ్గాయి. దాంతో మరలా చిన్నచితక వేషాలను వెయ్యక తప్పలేదు. సుందర్లాల్ నహతా-డూండీలు కృష్ణ హీరోగా ‘గూఢచారి 116’ (1966) చిత్రాన్ని నిర్మిస్తూ, అందులో ఐదు నిమిషాలు మాత్రమే వుండే గూఢచారి పాత్రను ఇచ్చారు. అదే సంస్థలో హీరోగా చేసిన శోభన్ ఒక సంవత్సరం గ్యాప్ లోనే చివరికి గెస్ట్ పాత్ర పోషించాల్సి రావడం లలాట లిఖితం అంటారు శోభన్. అప్పుడే శోభన్ బాబు మానసికంగా రాటు తేలారు. ఆటుపోట్లకు అలవాటు పడే వాతావరణాన్ని సృష్టించుకున్నారు. చిన్న సంస్థల్లో చిన్న పాత్రలు వెయ్యరాదని, పెద్ద బ్యానర్లలో గెస్టు పాత్ర పోషించినా మంచిదే అనే అభిప్రాయానికి వచ్చిన శోభన్ కొన్ని పాత్రలు తిరస్కరిస్తూ, సురేష్ సంస్థ రామానాయుడు నిర్మించిన ‘ప్రతిజ్ఞాపాలన’లో మాత్రం నారదుడి పాత్రను ఒప్పుకున్నారు. అప్పటికే శోభన్ కు నలుగురు పిల్లలు పుట్టారు. సంసారం పెరగడంతో ఇల్లు మారాల్సివచ్చింది.

పౌరాణిక, జానపదాల నుంచి సాంఘికాలకు…

తరవాత ఎస్. భావనారాయణ నిర్మించిన ‘లోగుట్టు పెరుమాళ్ళకెరుక’ (1966) చిత్రంలో శోభన్ బాబుకు హీరోగా నటించే అవకాశం వచ్చింది. కె.ఎస్.అర్. దాస్ కు అది మొదటి చిత్రం. ఆ సినిమా హిట్ కాలేదు. హిట్టయ్యుంటే మాత్రం శోభన్ క్రైం చిత్రాలబారిన పడివుండేవారు. అందుకే “అంతా మనమంచికే” అనే సామెత పుట్టింది. అదే సంవత్సరం నటుడు పద్మనాభం ‘పొట్టిప్లీడరు’ చిత్రం నిర్మిస్తూ శోభన్ బాబుకు మంచి పాత్ర ఇచ్చారు. ఆ చిత్రం శతదినోత్సవం చేసుకుంది. తరవాత ‘భక్త పోతన’ లో శ్రీరాముడి వేషం, ‘శ్రీకృష్ణావతారం’లోను, నారదుడి వేషం లభించాయి. సుందరాల్ నహతా-డూండీ నిర్మించిన ‘సతీ అనసూయ’ చిత్రంలో నారదుడి పాత్ర పోషించమంటే మొహమాటం లేకుండా “హీరో కి ఇచ్చే పారితోషికం ఇస్తేనే చేస్తాను” అని భీష్మించి పంతం నెరవేర్చుకున్నారు శోభన్. ఇది ఆత్మాభిమానానికి పరీక్ష అని సర్దిచెప్పుకున్నారు లోలోపల. ఆ తరవాత జి. విశ్వనాథం దర్శకత్వంలో ‘సత్యమేజయం’, రిపబ్లిక్ ప్రొడక్షన్స్ సీతారామ్ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ‘రక్తసిందూరం’, కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో నిర్మించిన ‘కాంభోజరాజు కథ’ సినిమాల్లో హీరోగా నటించారు. ఆ చిత్రాలు గొప్పగా ఆడలేదు. అప్పుడే ఎన్టీఆర్ కబురుపెట్టి దాదామిరాసి దర్శకత్వంలో వాసూమీనన్ నిర్మిస్తున్న ‘పుణ్యవతి’ (1967) చిత్రంలో ఒక మంచి పాత్రకు సిఫార్సు చేశాననే చల్లని కబురు చెప్పారు. అందులో హీరో ఎన్టీఆర్ కు ఒక పాటే వుంటే శోభన్ కు మాత్రం “ఇంతేలే నిరుపేదల బ్రతుకులు”, “పెదవులపైన సంగీతం” అనే రెండుపాటలు పెట్టారు. ఎన్టీఆర్ ఉదార స్వభావానికి శోభన్ శిరస్సువంచి నమస్కరించారు. అందుకే చనిపోయేదాకా శోభన్ బాబు ఉదయం ఆఫీసులో అడుగు పెట్టగానే ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించనిదే ఏపనీ మొదలు పెట్టేవారు కాదు. ఎన్టీఆర్ శోభన్ బాబు కి అలా సాయం చేస్తే అక్కినేని మరలా వారి సొంత సంస్థలో ‘పూలరంగడు’ చిత్రానికి సహాయ కథానాయకుడిగా వేషం లభించేలా చేశారు. కె. హేమాంబరధరరావు దర్శకత్వంలో నిర్మించిన ‘ఆడపడుచు’ చిత్రంలో ఎన్టీఆర్, శోభన్ బాబు చంద్రకళకు అన్నలుగా నటించారు. విశ్వనాథ్ దర్శకత్వంలో ‘లక్ష్మినివాసం’ చిత్రంలో రామ్మోహన్ తోబాటు శోభన్ నటించారు. ఈ రెండు చిత్రాలూ విజయవంతమయ్యాయి. బాపు దర్శకత్వంలో నిర్మించిన ‘బుద్ధిమంతుడు’ చిత్రంలో శ్రీకృష్ణుని పాత్ర పోషించినప్పుడు అందులో భక్తుని పాత్రలో వున్న అక్కినేని శోభన్ బాబు కాళ్ళకు దణ్ణం పెట్టే సన్నివేశముంది. శోభన్ ఆ సన్నివేశానికి ఒప్పుకోలేదు. అంతటి సీనియర్ టాప్ గ్రేడ్ హీరో తన కాళ్ళు పట్టుకోవడం అపచారమని భావించారు శోభన్. అక్కినేని, బాపు నచ్చజెప్పిన తరవాతగాని ఒప్పుకోలేదు. చిత్రీకరణ పూర్తయ్యాక అక్కినేనికి పాదాభివందనం చేసి క్షమాపణ కోరిన సున్నిత హృదయుడు శోభన్ బాబు.

అందాల హీరోగా ఎదిగి…

1967లో 10 సినిమాల్లో, 1968లో 9 సినిమాల్లో శోభన్ నటించారు. ఇక 1969లో శోభన్ బాబు 12 సినిమాల్లో నటించారు. ముఖ్యంగా దర్శక నిర్మాత బి.ఎన్. రెడ్డి నిర్మించిన చివరి చిత్రం ‘బంగారు పంజరం’ లో నటించడం ఒక మధురానుభూతి అంటుండేవారు శోభన్ బాబు. “ఏ మల్లీశ్వరి సినిమాను ఇరవై సార్లకు పైగా చూశానో, ఆ మల్లీశ్వరిని అందించిన మహనీయుని వద్ద పనిచేయడం కన్నా వేరే అదృష్టమేముంటుంది” అని స్నేహితుల దగ్గర చెప్పుకుంటూ మురిసిపోయేవారు శోభన్. అయితే వాణిశ్రీ-శోభన్ జంటను ప్రేక్షకులు అప్పట్లో ఆదరించలేదు. కారణం ఆ పాత్రలు సావిత్రి-నాగేశ్వరరావు పోషించాల్సినవని భావించడమే. తరవాతి కాలంలో శోభన్ బాబు-వాణిశ్రీ జంట ఎంత హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకుందో చెప్పాల్సిన పనిలేదు. జెమినీ వారు మలయాళంలో హిట్టయిన ‘తులాబారం’ చిత్రాన్ని తెలుగులో ‘మనుషులు మారాలి’ పేరుతో నిర్మిస్తూ శోభన్ బాబు ని హీరోగా తీసుకున్నారు. రజతోత్సవం చేసుకున్న ఆ చిత్రంలో శోభన్ కు మంచి పేరొచ్చింది. దాంతో శోభన్ కు స్టార్ వాల్యూ వచ్చింది. ఆ సినిమాకు కె.రాఘవేంద్రరావు, ఎ. కోదండరామిరెడ్డి సహాయ దర్శకులుగా వి. మధుసూదనరావు వద్ద పనిచేశారు. వారితో శోభన్ స్నేహాన్ని పెంచుకున్నారు. తదనంతర కాలంలో విజయవంతమైన దర్శకులుగా పేరు తెచ్చుకున్న వారిద్దరూ శోభన్ కు ఎన్ని అవకాశాలు ఇచ్చారో తెలిసిందే. శోభన్ బాబుకి మరో బ్రేక్ ఇచ్చిన చిత్రం నవతా కృష్ణంరాజు నిర్మించిన ‘తాసిల్దారు గారి అమ్మాయి’. చిన్నప్పటినుండి ఎవరినైతే తన అభిమాన నటిగా ఆరాధించారో ఆ ‘జమున’ ఈ చిత్రంలో శోభన్ సరసన నటించింది. అందులో శోభన్ ది తండ్రిగా, కొడుకుగా ద్విపాత్రాభినయం. తరవాత వచ్చినవన్నీ ఛాలంజింగ్ పాత్రలే. నటుడు బాలయ్య నిర్మించిన ‘చెల్లెలి కాపురం’, బాపు నిర్మించిన ‘సంపూర్ణ రామాయణం’, ఉషశ్రీ చిన్నపరెడ్డి నిర్మించిన ‘మానవుడు దానవుడు’ చిత్రాలు వేటికవే సాటి. మానవుడు-దానవుడులో ఒక పాత్రలో నిస్వార్ధంగా సేవచేసే డాక్టరు, మరో పాత్రలో కరడుగట్టిన కిరాయి హంతకుడుగా ఈ రెండు పాత్రల్ని సమర్ధవంతంగా పోషించారు శోభన్. ఈ చిత్ర సంచలన విజయంతో శోభన్ పారితోషికం ఎనిమిది రెట్లు పెరిగింది. అలాంటి చిత్రాలే వరస విజయాలను తెచ్చిపెట్టిన ‘కాలం మారింది’, ‘జీవనతరంగాలు’, ‘శారద’, ‘పుట్టినిల్లు మెట్టినిల్లు’, ‘డాక్టరు బాబు’, ‘కన్నవారి కలలు’, ‘గంగ-మంగ’, ‘జీవితం’, ‘ఖైదీ బాబాయి’, ‘దేవాలయం’, ‘దేవత’, ‘కార్తిక దీపం’, ‘మల్లెపూవు’.. మరెన్నో. ఇక శోభన్ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

జయలలితతో అనుబంధం….

Sobhanbabu with Jayalalitha

జయలలితను ‘డాక్టర్ బాబు’ సినిమాలో నటింపజేసేందుకు తమ్మారెడ్డి కృష్ణమూర్తిని, లెనిన్ బాబు ని ఒప్పించింది శోభన్ బాబే. శోభన్ బాబు అంటే జయలలితకు అపారమైన ప్రేమ. అందులో తప్పులేదు. కానీ పెళ్లి, పిల్లలు వున్న వ్యక్తిని తన దారికి తెచ్చుకోవడం మాత్రం బాగాలేదని పత్రికలు ఘోషించాయి. జయలలిత శోభన్ బాబుని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడింది కూడా. అయితే శోభన్ బాబు ఆ ప్రతిపాదనను సున్నితంగా త్రోసిపుచ్చారు. కట్టుకున్న భార్యకు, పిల్లలకు అన్యాయం చేయలేనని తన అసక్తతను వ్యక్తం చేశారు. అయితే వారిద్దరిమధ్య వివాహేతర సంబంధాలు కొనసాగుతూనే ఉండేవి. కానీ జయలలిత తన ప్రయత్నాలు మానుకోలేదు. చివరికి శోభన్ బాబు ఆమెనుండి దూరం జరిగారు. దాంతో జయలలిత పెళ్లి చేసుకోకుండా భాహ్మచారిణిగానే ఉండిపోయింది. అయితే మరో కథనం కూడా వార్తల్లో వుంది. వీరిద్దరూ పెళ్ళికి సిద్ధపడ్డారని, అయితే జయలలితతో పార్టీపరంగాను, వ్యక్తిగతంగాను సన్నిహిత సంబంధాలు కలిగిన నాటి ముఖ్యమంత్రి ఎం.జి. రామచంద్రన్ పెళ్లి ప్రయత్నాలను అడ్డుకొని ఆపుచేయించారనేది ఆ వదంతి. శోభన్ బాబు తరచూ జయలలితను కలుసుకునేందుకు పోయస్ గార్డన్ వెళ్లడాన్ని శోభన్ బాబు భార్య తీవ్రంగా వ్యతిరేకించేదనే మాట వాస్తవం.

క్రమశిక్షణ కలిగిన జీవితానికి ప్రతీకగా నిలిచిన శోభన్ బాబు అరవయ్యోపడిలో పడగానే స్వచ్చందంగా నటజీవితానికి స్వస్తిచెప్పి అభిమానుల హృదయాల్లో హీరో ఇమేజితోనే తెరమరుగయ్యారు. మంచి ఆరోగ్యంతో వుండే శోభన్ తన జీవితకాలంలో ఆసుపత్రికి వెళ్ళడం కానీ, ఇంజక్షన్ తీసుకోవడం కానీ చేయలేదు. అయితే అకస్మాత్తుగా శోభన్ చెన్నై లోని తన ఇంటిలోనే 2008 మార్చి 20 న మెట్లు దిగుతూ జారిపడి అకాల మరణాన్ని పొందారు. తను నటించిన రెండువందల పైచిలుకు చిత్రాలు శోభన్ బాబుని సోగ్గాడుగానే చూపించాయి. వార్ధక్య చాయలతో క్యారక్టర్ పాత్రలు చేసేందుకు ఆయన మనసు అంగీకరించలేదు. నటనకు స్వస్తి చెప్పిన తరవాత తన ఫోటో కూడా బయటకు రానీయకుండా చర్యలు తీసుకున్నారు. మనిషైతే మనముందు లేరుగానీ, పవిత్ర గోదావరి తీరాన రాజమహేంద్రవరంలో కాంస్య విగ్రహ రూపంలో ఆ సోగ్గాడు శోభనాద్రి రోజూ దర్శనమిస్తూనే వున్నారు.

-ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

1 thought on “సోగ్గాడు శోభనాద్రి … శోభన్ బాబు

  1. అందాల నటుడిపై చక్కటి వ్యాసం అందించినందుకు క్రుతజ్ఞతలు. క్రమశిక్షణకి ఎంతో విలువనిచ్చే శోభన్ బాబు జయలలిత విషయంలొ దారితప్పాడు. దానినే విధిరాత అంటారేమో…. ఎన్నో వేల కోట్లకి వారసుడైన ఆయన ఏకైక కుమారుడు ఆ అందాల నటుడి పేరన ఏ సేవా కార్యక్రమాలు చేస్తున్న దాఖలాలు లేవు. దీనినే విడ్డూరం అంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap