(దిలీప్ కుమార్ జయంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి ప్రత్యేక వ్యాసం)
“అసలుసిసలైన పద్ధతిగల నటుడు” అని సినీ దార్శనికుడు సత్యజిత్ రే చేత ప్రశంసలు అందుకున్న ఒకే ఒక నటుడు మహమ్మద్ యూసఫ్ ఖాన్ అనే దిలీప్ కుమార్. “మై తుమ్హారీ ఆంఖోమే అప్నీమోహబ్బత్ కా ఇకరార్ దేఖనా చాహతా హూ” అంటూ ‘మొఘల్-ఏ-ఆజం’ లో దిలీప్ పలికినట్టు ఆ డైలాగు మరెవ్వరూ చెప్పలేరన్నది నిజమైన నిజం! 1997లో పాకిస్తాన్ ప్రభుత్వంచేత ‘నిషాన్-ఏ-ఇంతియాజ్’ పేరిట అత్యుత్తమ సివిలియన్ అవార్డును పొందిన ఒకే ఒక భారతీయ నటశిఖామణి దిలీప్ కుమార్. నాటి శివసేన ప్రభుత్వం ఈ అవార్డును స్వీకరిస్తే దిలీప్ దేశభక్తిని శంకిల్చాల్సివస్తుందని, ఆ బహుమతిని తిరస్కరించమని ఆదేశిస్తే, “కళాకారుని సృజనాత్మతకు ఎల్లలుండవు. తొలుత నేను భారతీయుడను. ఆపైన అంతర్జాతీయ కళాకారుడిని” అంటూ శివసేన ఆదేశాన్ని కాదని పాకిస్తాన్ ప్రభుత్వ బహుమతిని సగర్వంగా అట్టిపెట్టుకున్న ధీశాలి దిలీప్ కుమార్. తన తండ్రికి క్షమాపణ చెప్తే పెళ్ళిచేసుకుంటానని షరతు విధించిన మధుబాల ప్రేమను సైతం త్యాగంచేసి ఆత్మగౌరవం నిలబెట్టుకున్న ట్రాజెడీకింగ్ దిలీప్ కుమార్. ‘బొంబాయి నగర షరీఫ్’ గా గౌరవ పదవిని అలంకరించిన ఏకైక నటుడు కూడా దిలీప్ కుమారే. 54 ఏళ్ళ సుదీర్ఘ సినీ జీవితాన్ని ఆస్వాదించి నటనకు స్వస్తిచెప్పిన ఆ నటయోధుని జయంతి సందర్భంగా కొన్ని జ్ఞాపకాలు మీ ముందుకు….
యూసఫ్ ఖాన్ దిలీప్ కుమార్ గా..
అవిభక్త భారతదేశంలోని నార్త్-వెస్ట్ ఫ్రాంటియర్ కు చేరువలోని పెషావర్ (ప్రస్తుత పాకిస్తాన్) వద్ద ఒక సంపన్న కుటుంబంలో డిసెంబరు 12, 1922 న దిలీప్ కుమార్ జన్మించారు. దిలీప్ తండ్రి లాలా గులాం సర్వర్ ఖాన్, తల్లి ఆయేషా బేగమ్. వారికి 12 మంది సంతానం. దిలీప్ కుమార్ తండ్రికి మహారాష్ట్ర లోని నాసిక్ కు దగ్గరలో గల దేవలాలి అనే హిల్ స్టేషన్ వద్ద పండ్లతోటలు వుండేవి. ఆయన పండ్ల వ్యాపారం చేసేవారు. దిలీప్ నాసిక్ లోని బార్నెస్ పాఠశాలలో విద్యాభ్యాసం చేసారు. రాజ్ కపూర్ దిలీప్ కు సహాధ్యాయి. 1930 ప్రాంతంలో వారి కుటుంబం మొత్తం బొంబాయిలో స్థిరపడింది. తండ్రి అడుగుజాడల్లోనే దిలీప్ పూణేలో ఒక కేంటీన్ తెరచి అందులో డ్రై ఫ్రూట్స్ వ్యాపారం మొదలెట్టారు. ప్రఖ్యాత నటి దేవికారాణి పూణేలో ఆ కేంటీన్ కు వచ్చినప్పుడు దిలీప్ ని చూసి బాంబే టాకీస్ వారు అమియా చక్రవర్తి దర్శకత్వంలో నిర్మించిన ‘జ్వర్ భాటా’ సినిమాలో హీరోగా తొలి అవకాశాన్ని ఇప్పించారు. 1944లో విడుదలైన ఈ సినిమాతో దిలీప్ హీరోగా తెరంగేట్రం చేసారు. కేదార్ శర్మ దర్శకత్వం వహించిన ‘చిత్రలేఖ’ (1941) సినిమా రచయిత భగవతి చరణ్ వర్మ యూసఫ్ ఖాన్ పేరును ‘దిలీప్ కుమార్’ గా మార్చారు. ‘జ్వర్ భాటా’ చిత్రం బొంబాయిలో బాగా ఆడినా ఇతర కేంద్రాలలో ఊహకందని పరాజయం పాలయింది. అలా కొంతకాలం గడిచాక 1947లో షౌకత్ హుసేన్ రిజ్వి దర్శకత్వనిర్మాణంలో, నూర్జహాన్ సరసన నటించిన ‘జుగ్ను’ సినిమా బాక్సాఫీస్ హిట్ గా నిలిచి, ఆ పరంపర 1948లో ఫిల్మిస్తాన్ వారు రమేష్ సైగల్ దర్శకత్వంలో నిర్మించిన దేశభక్తి చిత్రం ‘షహీద్’, వాడియా మూవీటోన్ వారి ‘మేలా’ సినిమాలోనూ కొనసాగటంతో దిలీప్ కుమార్ పేరు హిందీ చలన చిత్రరంగంలో మార్మోగింది. ‘మేలా’ చిత్రంలో దిలీప్ సరసన నర్గీస్ నటించగా, సంగీతం నౌషాద్ అందించారు. ఈ చిత్రం పెద్ద మ్యూజికల్ హిట్ గా పేరుతెచ్చుకుంది. ఇక 1949లో మెహబూబ్ ఖాన్ నిర్మించిన ముక్కోణపు ప్రేమ కావ్యం ‘అందాజ్’ లో నర్గీస్, రాజకపూర్ లతో దిలీప్ నటించారు. రాజ్ కపూర్ సినిమా ‘బర్సాత్’ విడుదలయ్యేదాకా, ‘అందాజ్’ చిత్రం అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. అదే సంవత్సరం ఫిల్మిస్తాన్ వారు నిర్మించిన ‘షబ్నమ్’ సినిమా కూడా మంచి హిట్ గా నిలిచింది. ఇందులో కామినీ కౌశల్ దిలీప్ కు జంటగా నటించింది. ఆమెతో దిలీప్ కు ప్రేమ చిగురించడం ఈ చిత్రంలోనే మొదలైంది. అయితే వారి పెళ్ళికి కుటుంబ సమస్యలు అడ్డురావడంతో పెళ్లిదాకా రాలేదు. 1950లో దిలీప్ కుమార్ నటించిన ‘జోగన్’, ‘బాబుల్’, 1951 లో నటించిన ‘హల్ చల్’, ‘దీదర్’, ‘తరానా’, 1952 లో విడుదలైన ‘’దాగ్’, ‘సంగ్ దిల్’, 1954 లో వచ్చిన మెహబూబ్ ఖాన్ చిత్రం ‘అమర్’ చిత్రాలు బాక్సాఫీస్ హిట్లుగా నిలిచాయి. అమియా చక్రవర్తి నిర్మించి దర్శకత్వం వహించిన ‘దాగ్’ చిత్రంలో దిలీప్ కుమార్ నటనకు తొలి ఫిల్మ్ ఫేర్ బహుమతి లభించింది. ఫిల్మ్ ఫేర్ బహుమతులు ప్రవేశ పెట్టిన తర్వాత ఉత్తమ నటుడుగా తొలి బహుమతి అందుకున్నది కూడా దిలీప్ కుమారే కావడం విశేషం.‘అమర్’ చిత్రంలో దిలీప్ కుమార్ విలన్ వేషం వేసి మెప్పించారు. 1950లో దిలీప్ కుమార్ నటించిన 9 సినిమాలు ఆ దశకంలో వచ్చిన అత్యుత్తమ 30 సినిమాల జాబితాలో చోటు సంపాదించాయి. 1950 లోనే దిలీప్ పారితోషికం లక్షరూపాయలు! 1955లో నౌషాద్ నిర్మించిన ‘ఉరన్ ఖటోలా’ బాక్సాఫీస్ హిట్టయింది. ఇందులో మధుబాల హీరోయిన్ గా నటించాల్సి ఉండగా అనారోగ్య కారణాల విరమించుకుంటే, ఆ అవకాశం నిమి కి దక్కింది. ఈ సినిమాను తమిళంలో ‘వానరథమ్’ పేరుతో 1956లో డబ్ చేశారు. అదే సంవత్సరం జెమిని అధినేత ఎస్.ఎస్.వాసన్ తెలుగులో వచ్చిన ‘పల్లెటూరిపిల్ల’ సినిమాను ‘ఇన్సానియత్’ పేరుతో స్వీయదర్శకత్వంలో పునర్నిర్మించగా అందులో దిలీప్ కుమార్, దేవానంద్ కలిసి నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన ఏకైక చిత్రం ‘ఇన్సానియత్’. ఇందులో బీనారాయ్ హీరోయిన్ గా నటించింది. దిలీప్ కుమార్ 50వ దశకంలో మంచి రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాల విజయంతో దిలీప్ కుమార్ శకం ఆరంభమైందని చెప్పవచ్చు.
రొమాంటిక్ హీరో నుంచి ట్రాజెడీ కింగ్ గా…
‘అయితే కొన్ని సినిమాలలో దిలీప్ కుమార్ విషాదభరితమైన పాత్రలు పోషించారు. ముఖ్యంగా 1955లో వచ్చిన బిమల్ రాయ్ సినిమా ‘దేవదాసు’ లో ముఖ్యపాత్ర పోషించి మెప్పించారు. ఇందులో సుచిత్రాసేన్ పార్వతిగా, వైజయంతిమాల చంద్రముఖిగా నటించగా, సచిన్ దేవ్ బర్మన్ సంగీతం సమకూర్చారు. ఇండియా టైమ్స్, ఫోర్బెస్ సంస్థలు ఈ చిత్రాన్ని టాప్ 25 బాలీవుడ్ సినిమాల జాబితాలో చేర్చాయి. 1958లో బిమల్ రాయ్ స్వీయ దర్శకత్వ నిర్మాణంలో వచ్చిన పునర్జన్మ నేపథ్య చిత్రం ‘మధుమతి’ లో దిలీప్ కుమార్ విషాధభరిత నటన ప్రదర్శించారు. ఈ రెండు సినిమాలు ఒక్కసారిగా దిలీప్ ను ‘ట్రాజెడీ కింగ్’ గా మార్చివేసాయి. తర్వాత గురుదత్ ‘ప్యాసా’ (తెలుగులో మల్లెపూవు) సినిమాలో నటించమని దిలీప్ ని అడిగితే “గొప్పగా ఆశించిన దేవదాసు సినిమా ఆడలేదు. నీ సినిమాలో పాత్రకూడా అలాంటిదే. జనం చూడరు” అంటూ తప్పుకుంటే, చివరకు గురుదత్ తనే హీరోగా నటించగా ఆ సినిమా సూపర్ హిట్టయింది. 1954లో ఫిలింఫేర్ బహుమతులు ప్రవేశపెట్టినప్పుడు ’దాగ్’ సినిమాలో ఉత్తమ నటనకు దిలీప్ కుమార్ తొలి బహుమతి అందుకున్నారు. అలా ఎనిమిది సార్లు అతనికి ఫిలింఫేర్ బహుమతులు దక్కాయి. ఆరోజుల్లో దిలీప్ కుమార్ సరసన నటించిన మధుబాల, నర్గిస్, నిమి, కామిని కౌశల్, మీనాకుమారి, వైజయంతిమాలలు హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకునారు. దిలీప్ కుమార్ నటించిన తొలి టెక్నికలర్ సినిమా మెహబూబ్ ఖాన్ నిర్మించిన ‘ఆన్’(1952). అందులో దిలీప్ కుమార్ ది ఒక ఆదర్శ పల్లెటూరి యువకుని పాత్ర. ఈ సినిమాని తొలుత 16 mm గేవాకలర్ లో తీసి తర్వాత టెక్నికలర్ కి బ్లోఅప్ చేసారు. 1955 లో రాజకపూర్ సినిమా ‘శ్రీ 420’ వచ్చేదాకా ‘ఆన్’ సినిమాదే అత్యధిక కలక్షన్ల రికార్డు. ‘ట్రాజెడీ కింగ్’ గా దిలీప్ కుమార్ ఎంత పేరుతెచ్చుకున్నారంటే, ఒకానొక సమయంలో ఆయన మానసిక వైద్యుడివద్దకు వెళ్లి విషాదభరిత పాత్రల ప్రభావం నుంచి ఎలా బయటపడాలని సలహా అర్ధించారు. ఆ వైద్యుడు తేలిక మనస్తత్వం వుండే పాత్రలను, హాస్యం మేళవించిన పాత్రలను ఎంచుకోమని సలహా ఇచ్చారు. దిలీప్ కుమార్ స్కూల్లో చదువుతున్నప్పుడు తోటి విద్యార్ధులు గేలిచేస్తూ ఆటపట్టిస్తుంటే, వారిని వారించలేక మౌనంగా బాధను భరించేవారట. ఆ అనుభవం విషాద పాత్రల్లో జీవించడానికి పనికి వచ్చిందని తన ఆత్మకథలో దిలీప్ రాసుకున్నారు. దీనినిబట్టి దిలీప్ నటనలో యెంతగా జీవించి ఉంటారో మనం ఊహించుకోవచ్చు. సైకియాట్రిస్ట్ సూచనమేరకు దిలీప్ 1960లో వి.ఎన్.సిన్హా నిర్మించిన ‘కోహినూర్’ సినిమాలో మీనాకుమారి సరసన ఒక రాజకుమారుడుగా చలాకీ పాత్రలో నటించారు. ఈ సినిమా దిలీప్ కుమార్ ని ఒక నూతనకోణంలో ఆవిష్కరింపజేసింది. దిలీప్ కుమార్ కు ఈ చిత్రం ఫిల్మ్ ఫేర్ బహుమతి తెచ్చిపెట్టింది. తెలుగులో వచ్చిన బందిపోటు సినిమాకు ఈ చిత్రం కొంతవరకు ప్రేరణ. అలాగే తెలుగులో వచ్చిన అగ్గిరాముడు సినిమాను ఎస్.ఎం. శ్రీరాములు నాయుడు ‘ఆజాద్’ పేరుతో రీమేక్ చేస్తే రాబిన్ హుడ్ సినిమాలాగా ప్రేక్షకులు దానిని ఆదరించారు. ఈ సినిమా అత్యధిక వసూళ్ళు రాబట్టింది. దిలీప్ కుమార్ కు మూడవ ఫిల్మ్ ఫేర్ బహుమతి తెచ్చిపెట్టిన చిత్రం ‘ఆజాద్’. ఈ రెండు సినిమాలలో మీనాకుమారి హీరోయిన్ గా నటించింది.
మలుపు తిప్పిన మొఘల్-ఏ-ఆజం
1960లో మొఘల్ రాకుమారుడు సలీం (జహంగీర్) అనార్కలిల ప్రేమకథ ఆధారంగా కె. ఆసిఫ్ దర్శకత్వం వహించిన ‘మొఘల్-ఏ-ఆజం’ దిలీప్ నటజీవితంలో గొప్ప మైలురాయి. ఈ సినిమా కలక్షన్ల రికార్డు 11 సంవత్సరాలదాకా బ్రేక్ కాలేదంటే అది ఎంతటి బ్లాక్బస్టర్ సినిమానో ఊహించుకోవచ్చు. 1971లో వచ్చిన ‘హాథీ మేరే సాథీ’ చిత్రం ఈ రికార్డును తిరగ రాసింది. ఈ సినిమా నిర్మాణానికి ఆ రోజుల్లోనే కోటిన్నర రూపాయలు ఖర్చయిందట. సినిమాకు నిజమైన ఆభరణాలు వాడారు. 500 రోజులు శ్రమించి తీసిన ఈ సినిమా జాతీయ బహుమతినే కాకుండా మూడు ఫిలింఫేర్ బహుమతులను కూడా గెలుచుకొంది. ఈ సినిమాను 2004లో డిజిటల్ టెక్నాలజీ సహకారంతో రంగులద్ది విడుదలచేస్తే, బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది. ఇందులో నాయికగా నటించిన మధుబాలతో దిలీప్ ప్రేమాయణం సాగింది. అదొక విఫలమైన పెద్ద రొమాంటిక్ టేల్. ‘నయా దౌర్’ సినిమా నిర్మాణంలో వుండగా మధుబాల తండ్రి చేసిన ప్రతిపాదన నచ్చక ఇద్దరికీ భేదాభిప్రాయాలు వచ్చాయి. ఆ సినిమాలో తొలుత మధుబాల నటించాల్సి వుండగా అభిప్రాయ భేదాలవలన వైజయంతిమాలను తీసుకున్నారు. దాంతో నిరాశకు లోనైన మధుబాల తర్వాత దిలీప్ తో నటించలేదు. ‘మొఘల్-ఏ-ఆజం’ ఆమెకు ఆఖరి సినిమా అయింది. అదే సంవత్సరంలో దిలీప్ కుమార్ ‘గంగా-జమున’ పేరుతో సొంతంగా చిత్రనిర్మాణానికి పూనుకున్నారు. ఈ సినిమాకు కథను దిలీప్ కుమారే రచించారు. నితిన్ బోస్ దర్శకత్వంలో దిలీప్ నిర్మించిన ఏకైక సినిమా ‘గంగా-జమున’. నిజాయితీ పరుడైన ఒక గ్రామీణ యువకుడు పరిస్థితుల ప్రభావంతో దోపిడీ దొంగగా మారే నేపథ్యంలో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. జాతీయ స్థాయిలో ఈ చిత్రం ద్వితీయ అత్యుత్తమ చిత్రంగా బహుమతి అందుకుంది. కార్లో వివరీ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శనకు నోచుకొని ప్రత్యేక బహుమతి దక్కించుకుంది. దీని తర్వాత సుధాకర్ బోకడే నిర్మాణతలో ‘కళింగ’ పేరుతో మరొక సినిమాకు దర్శకత్వం వహించాలని దిలీప్ భావించినా, ఎందుకో అది చిత్రీకరణకు నోచుకోలేదు. ఈ ప్రాజెక్టు ని ఏడు సంవత్సరాలు నాన్చి మంగళం పాడారు. మొఘల్-ఏ-ఆజం, గంగా-జమున సినిమాలు సూపర్ హిట్లయ్యాక, సినిమా నటనకు స్వస్తి చెప్పాలని దిలీప్ ఆలోచించడం కూడా వాస్తవమే. కానీ అది నెరవేరకముందే రామ్ ముఖర్జీ నిర్మించిన ‘లీడర్’ సినిమాలో నటించాల్సి వచ్చింది. లీడర్ సినిమాలో నటనకు ఫిలింఫేర్ బహుమతి దక్కింది. ఈ సినిమా కు దిలీప్ కుమారే కథను సమకూర్చడం విశేషం. 1962లో హాలీవుడ్ సినిమా ‘లారెన్స్ ఆఫ్ అరేబియా’ లో నటించమని బ్రిటీష్ దర్శకుడు డేవిడ్ లీన్ దిలీప్ కుమార్ కు ఆఫర్ ఇస్తే ఎందుకో దిలీప్ “నో” అన్నారు. తర్వాత ఆ పాత్ర ఈజిప్షియన్ నటుడు ఒమర్ షరీఫ్ కు దక్కటం, అతనికి గొప్పపేరు రావడం నాణేనికి మరోవైపు కథ. 1966లో ‘దిల్ దియా దర్ద్ లియా’ సినిమా వచ్చింది. ఈ సినిమాకు అబ్దుల్ రషీద్ కర్దార్ దర్శకుడు. కానీ దిలీప్ కుమారే అనధికారంగా దర్శకత్వం వహించారని అంటారు. 1964లో రామానాయుడు ఎన్టీఆర్ తో నిర్మించిన ‘రాముడు-భీముడు’ సినిమాను 1967లో విజయా సంస్థ వారు ‘రామ్ అవుర్ శ్యామ్’ పేరుతో నిర్మిస్తే, దిలీప్ అందులో ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. తర్వాతవచ్చిన ‘ఆద్మీ’ సినిమా కూడా బాగా ఆడింది.
ఫెయిరీ టేల్ విత్ సైరాబాను…
1960 లో దిలీప్ కుమార్ నటించిన ప్రేమకావ్యం ‘మొఘల్-ఎ-ఆజం’ చిత్ర ప్రీమియర్ షో ముంబై లోని ప్రఖ్యాత మరాఠా మందిర్ లో ప్రదర్శించారు. బాలీవుడ్ అందాలనటి సైరాబానుకు అప్పుడు కేవలం 16 ఏళ్ళు. ఆమె ‘మొఘల్-ఎ-ఆజం’ ప్రీమియర్ షో కు హాజరైంది. అయితే ఆ షో కి దిలీప్ కుమార్ హాజరు కాలేకపోయారు. దిలీప్ కుమార్ కు వీరాభిమాని అయిన సైరాను నిరుత్సాహం ఆవరించింది. తరవాత ఒకసారి ఆమెకు దిలీప్ ని స్వయంగా కలుసుకునే అవకాశం దొరికింది. ఆమెను చూసిన దిలీప్ “చాలా అందంగా వున్నావు” అని మెచ్చుకున్నారు. దిలీప్ తన కలల అభిమాని అయినా సైరాబాను మొదట ప్రేమించింది జూబిలీ నటుడు రాజేంద్రకుమార్ ని. అయితే సైరాబాను తల్లి పూర్వ నటి నసీం బాను కు ఆ ప్రతిపాదన నచ్చలేదు. కానీ ఇద్దరిమధ్యా 22 ఏళ్ళ వ్యత్యాసం వున్న దిలీప్ కుమార్ తో తన కూతురు వివాహానికి నసీం బాను అంగీకారం తెలిపింది. 1966లో వీరిద్దరికీ వివాహం పెద్దల సమ్మతితో జరిగింది. అప్పుడు సైరాబాను వయసు 22 కాగా దిలీప్ వయసు 44 సంవత్సరాలు! వారిద్దరూ బాలీవుడ్ ఆదర్శ దంపతులుగా మన్ననలందుకున్నారు. పెళ్ళయ్యాక సైరా ‘షాగిర్ద్’, ‘దీవానా’, ‘పడోసన్’, ‘ఆద్మీ అవుర్ ఇన్సాన్’, ‘ఝుక్ గయా ఆస్మాన్’, ‘గోపి’, ‘పూరబ్ అవుర్ పశ్చిమ్’, ‘విక్టోరియా 203’ వంటి సినిమాలలో నటించినా 1976 తరవాత నటనకు స్వస్తి చెప్పి భర్తను సేవిస్తూ గృహిణి గా జీవనం కొనసాగించింది. అయితే నటీనటుల జీవితాల్లో అపశ్రుతులు చోటు చేసుకోవటం సహజం. దిలీప్ కుమార్ 1980లో ‘ఆస్మా’ అనే ఒక పాకిస్తానీ మహిళ ప్రేమలో చిక్కుకున్నారు. కానీ, త్వరలోనే తేరుకున్న దిలీప్ ఆమెనుండి బయటపడి సైరాబాను చెంతచేరారు. “దిలీప్ కుమార్ అల్లా నాకు ప్రసాదించిన కోహినూర్ వజ్రం” అని సైరాబాను ఎప్పుడూ చెబుతూనే వుంటుంది.
అపజయాల దశకం
‘రామ్ అవుర్ శ్యామ్’ సినిమా తర్వాత దిలీప్ కు సరైన హిట్ సినిమాలు లేవు. ప్రతి కళాకారుడికీ కలసిరాని కాలమంటూ వుంటుంది. 1970 దశకం దిలీప్ కు కలిసి రాలేదు. 1972లో దిలీప్ ద్విపాత్రాభినయం చేసిన బి.ఆర్. చోప్రా సినిమా ‘దాస్తాన్’ బాగా ఆడలేదు. తనకన్నా 22 ఏళ్ళ చిన్నదైన హీరోయిన్ షర్మిలా టాగూర్ తో ఈడు-జోడు కుదరలేదు. తమిళంలో హిట్టయిన ‘మురదన్ ముత్తు’ను భీంసింగ్ దర్శకత్వంలో ‘గోపి’గా మలిస్తే అందులో సైరాబాను నాయికగా నటించింది. ఈ సినిమాకూడా బాక్సాఫీసు వద్ద ఫెయిల్ అయింది. అసలు ఇది దిలీప్ కుమార్ నటించాల్సిన సినిమా కాదు. తొలుత రాజేంద్రకుమార్ ని హీరోగా అనుకొని తర్వాత దిలీప్ ని ఎంపిక చేసారు. అదే సంవత్సరం తపన్ సిన్హా దర్శకత్వంలో దిలీప్ ‘సగినా మహతో’ అనే బెంగాలి సినిమాలో నటించారు. అందులో కూడా సైరాబానే హీరోయిన్. ఈ సినిమా విజయవంతం కాకపోయినా జాతీయ బహుమతి గెలుచుకుంది. మాస్కో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో కూడా ప్రదర్శితమైంది. ఇదే సినిమాను హిందీలో ‘సగినా’ పేరుతో రీమేక్ చేసారు. ఫ్లాష్ బ్యాక్ లు ఎక్కువగా వుండడతో హిందీలో ఈ సినిమా పూర్తిగా ఫెయిల్ అయింది. ఇవి కాక దిలీప్ నటించిన ‘అనోఖి మిలన్’, ‘ఫిర్ కబ్ మిలోగి’ సినిమాలు పరాజయాలు చవిచూసాయి. 1976లో అసిత్ సేన్ దర్శకత్వంలో ‘బైరాగ్’ సినిమాలో దిలీప్ సైరాబాను సరసన నటించారు. ఈ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో దిలీప్ కుమార్ ఇదు సంవత్సరాలపాటు సినిమాల్లో నటించడం మానుకున్నారు.
క్యారెక్టర్ నటుడుగా..
1981 తర్వాత క్యారక్టర్ పాత్రలు చేయడానికి దిలీప్ మొగ్గు చూపారు. ఆ సంవత్సరం మల్టిస్టారర్ సినిమా ‘క్రాంతి’ విడుదలైంది. బ్రిటీష్ పరిపాలనను ఎదిరించిన విప్లవకారుడుగా నటించిన దిలీప్ కు ఆ సినిమాలో చాలామంచి పేరొచ్చింది. సినిమా కూడా బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. 1982లో సుబాష్ ఘయ్ సినిమా ‘విధాత’ లో దిలీప్ కుమార్ షంషేర్ సింగ్ గా నటించి మన్ననలు అందుకున్నారు. తర్వాత వచ్చిన ‘శక్తి’ సినిమాలో నటనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ బహుమతి అందుకున్నారు. క్యారెక్టర్ నటుడుగా తర్వాత కాలంలో ‘మజ్దూర్’, ‘దునియా’, ‘ధర్మాధికారి’, ‘కర్మ’, ‘కానూన్ అప్నాఅప్నా’, ‘సౌదాగర్’ వంటి అనేక చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించి మెప్పించారు. సుభాష్ ఘయ్ దర్శకత్వంలో దిలీప్ నటించిన ఆఖరి చిత్రం ‘సౌదాగర్’. అంతే కాదు 1959లో రాజ్ కుమార్ తో ‘పైగామ్’ చిత్రంలో నటించిన తర్వాత దిలీప్ నటించిన సినిమా ఇదే. దిలీప్ కుమార్ ఆఖరి బాక్సాఫీస్ హిట్ సినిమా కూడా ఇదే!. దిలీప్ నటించిన చివరి చిత్రం 1998లో వచ్చిన ‘ఖిలా’. అందులో జగన్నాథ్, అమరనాథ్ సింగ్ అనే రెండు పాత్రల్లో దిలీప్ జీవించి నటించారు.
దటీజ్ దిలీప్ కుమార్
దిలీప్ కుమార్ నటించిన ‘జాన్వర్’, ’షిక్వా’, ‘ఆగ్ కా దరియా’ సినిమాలు అనేక కారణాల వలన విడుదలకు నోచుకోలేదు. దిలీప్ కు ఎక్కువగా మహమ్మద్ రఫీ పాటలు పాడేవారు. నౌషాద్ సంగీతమంటే దిలీప్ కు యెంతో ఇష్టం. దిలీప్ కుమార్ ఒక పర్యాయం రాజ్యసభకు రాష్ట్రపతి చేత నామినేట్ చెయ్యబడ్డారు. ముంబై నగర గౌరవ షరీఫ్ గా మహారాష్ట్ర ప్రభుత్వం దిలీప్ కుమార్ కు పట్టం కట్టింది. 1991లో పద్మభూషణ్, 1994లో ‘దాదా సాహెబ్ ఫాల్కే’, 1997లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు, 2015 లో పద్మవిభూషణ్ పురస్కారాలు దిలీప్ కుమార్ కు దక్కాయి. 1993లో ఫిలింఫేర్ జీవనసాఫల్య పురస్కారం దిలీప్ కు లభించింది. అత్యధిక అవార్డులు అందుకున్న నటుడుగా దిలీప్ కుమార్ పేరు గిన్నీస్ బుక్ రికార్డులో చోటుచేసుకుంది. అత్యధికంగా 8 సార్లు ఉత్తమ నటుడుగా ఫిల్మ్ ఫేర్ బహుమతులు పొందిన ఏకైక నటుడు దిలీప్ కుమార్. ఆయనకు పూర్వీకులనుండి వారసత్వ సంపదగా దక్కిన పెషావర్(పాకిస్తాన్) లోని మూడంతస్తుల భవనాన్ని ప్రభుత్వం మూడు కోట్లకు కొనుగోలు చేసి, దానిని చారిత్రక కట్టడంగా ప్రకటించి, ప్రజలు తిలకించడానికి సందర్శన వేళలు నిర్ణయించింది. ఉదయ్ తారా నాయర్ అనే ఫిలిం జర్నలిస్టు గ్రంధస్థం చేసిన దిలీప్ కుమార్ ఆత్మకథ ‘ది సబ్ స్టెన్స్ అండ్ ది షాడో’ పుస్తకం కూడా ఆరు సంవత్సరాల క్రితం విడుదలైంది. దిలీప్ కుమార్, మీనాకుమారి నటించిన ‘యాహుది’ సినిమా పెయింటింగ్ ఐదు లక్షలకు, ‘గంగా-జమున’ లో దిలీప్ బొమ్మతో వున్న పెయింటింగ్ రెండు లక్షలకు వేలంలో అమ్ముడుపోయాయంటే ఆశ్చర్యం కదూ! జూలై 7 న దిలీప్ కుమార్ ముంబై లోని హిందుజా ఆసుపత్రిలో ప్రోస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతూ తన 98 వ యేట కాలం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో దిలీప్ కుమార్ పార్థివ దేహానికి జూహు శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. దిలీప్ కుమార్ భౌతికంగా మనముందు లేకున్నా అతడు నటించిన సినిమాలు శాశ్వతంగా మన మనస్సులో పదిలంగా వుంటాయి.
-ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)