‘చందమామ’పై అందుకున్న డాక్టరేట్

‘చందమామ’పై పరిశోధించి పి.హెచ్డీ. సాధించడం నా కల! ఎందుకంటే నన్ను చందమామ రచయితను చేసింది. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు అందుకునేలా తీర్చిదిద్దింది. ఇన్నాళ్ళకు ఇన్నేళ్ళకు నా కల నెరవేరింది. 1975లో పదేళ్ళ వయసులో మొదటిసారి ‘చందమామ’ పుస్తకం చూశాను. అట్ట చినిగిపోయి, జీర్ణావస్థలో ఉన్న ఆ పుస్తకం రంగుల బొమ్మలతో మంచి మంచి కథలతో నన్ను చాలా ఆకర్షించింది. అప్పుడు దాన్ని చందమామ అంటారని కూడా నాకు తెలియదు. అప్పటి నుండి చాలా ఆసక్తిగా ‘చందమామ’ చదువుతున్న నేను 1977 వేసవి సెలవుల్లో అలానే ఎందుకు కథలు రాయకూడదు అనే ఆలోచనతో మొదటిసారి కథ రాశాను. కానీ దాన్ని ఏ పత్రికకూ పంపలేదు. ‘చందమామ’ కథలు చదవడం ఆపలేదు. 1981 లో రెండు కథలు రాసి చందమామకు పంపితే, ఒక కథ ప్రచురణకు తీసుకున్నట్టు వెంటనే ఉత్తరం వచ్చింది. ఆ కథ ‘నీకేలాభం’ పేరుతొ చందమామ మార్చి, 1982 సంచికలో ప్రచు రించారు. ఆ కథలో కేవలం కథ కేంద్ర బిందువు మాత్రమే నాది. దాన్ని పూర్తిగా మార్చి ఒక కథగా తీర్చిదిద్ది, చందమామలో ప్రచురించారు. నాటి నుండి రచయితనయ్యాను. అది మొదలు చందమామామ కథలు చదువుతూ, రాస్తూ ఉన్నాను. ‘చందమామ’ నన్ను ఒక రచయితగా తీర్చిదిద్దింది.

1980 మే ‘చందమామ’ సంచిక నుండి స్వంతంగా చందమామలు కొని భద్రపరచడం మొదలు పెట్టాను. అప్పుడు ‘చందమామ’ ధర రూపాయి పావలా. బడ్జెట్ వేసుకొని, ‘చందమామ’ కొని భద్రపరచడానికి నిశ్చ యించాను. ఆ నిర్ణయం నా జీవితంలో పెనుమార్పుకు మూలమయింది. బళ్ళో చిరుతిళ్ళు తినడానికి ఇచ్చిన డబ్బులు రూటు మార్చి, చందమామ కొన్నాను. నేను అప్పుడు ఎర్రమంజిల్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాను. మా బళ్ళో ఇంటర్వెల్లో చింతచెట్టు కింద సైకిల్ వెనుక పెద్ద తట్ట పెట్టుకొని అమ్మే, పుల్ల ఐస్ క్రీం, వేయించిన పల్లీలు, పీచు మిఠాయి నా లక్ష్యాన్ని తూట్లు పొడిచేందుకు నన్ను చాలా రెచ్చగొట్టి టెంప్ట్ చేసేవి. వాటి వంక చూస్తూ నోట్లో నీళ్లూరి నేను కొద్దిసేపు అటూ ఇటూ ఊగిస లాడినా చివరికి నా లక్ష్యమే జయించింది. క్రమం తప్పకుండ ‘చందమామ’ కొనడం మానలేదు. ‘చందమామ’ మీద నా అభిమానం చూసి, మా పొరుగింటి వాళ్ళు, వాళ్ళు చదివేసిన పాత ‘చందమామ’లు నాకు ఇచ్చారు. అప్పుడు మరో ఆలోచన వచ్చింది. ‘చందమామ’ పాతవి మొత్తం సంచికలు సంపాదించాలని అంతే దాన్నొక లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇప్పటికి ‘చందమామ’ మొదటి సంచిక 1947 జులై నుండి చివరి సంచిక 2013 అక్టోబర్ వరకు మొత్తం 766 సంచికలు వచ్చాయి. కొంత మినహా(1950 దశకానికి సంబంధించి కొన్ని దొరకలేదు) సాంతం సంపాదించాను.

పుస్తకాలు కొని, దాచుకొని, ఇంట్లో ఒక స్వంత గ్రంథాలయం ఏర్పాటు చేసుకొని, రోజూ వాటిని చూస్తూ (చదవడం అనేది తర్వాత సంగతి) ఉంటే కలిగే ఆనందం కేవలం అనుభవైకవేద్యం, పిల్లలకు అలాంటి అలవాటు చేస్తే, వారిలో తప్పకుండ ఒక మంచి మార్పుకు దారి తీస్తుంది. ఒక పుస్తకాన్ని కొని భద్రపరచడం మొదలు పెట్టాక పాత పుస్తకాలు కూడా సేకరించాలనే ఆలోచన విద్యార్థి దశలో ఒక ధ్యానం వంటిది అని నా అభిప్రాయం. ఆ ధ్యానంలో చదువు విషయంలో కూడా చక్కటి ఫలితాలు సాధించవచ్చ నేందుకు నేనే ఉదాహరణ. అందుకే ఈ రోజు నేను ఉన్న ఈ స్థాయికి కారణభూతమైన నన్ను పెంచి పెద్ద చేసిన మా అన్న వదినలు శ్రీరాములు, నాగలక్ష్మి గార్లతో పాటుగా నేను ‘చందమామ’కు కూడా ఋణపడి ఉంటాను.

‘చందమామ’ రచయితగా పేరు సంపాదించాక ‘చందమామ’ మీద ఇంకా అభిమానం పెరిగి దానిమీద పరిశోధన చేయాలనిపించింది. ఆ సమయంలో సారస్వత పరిషత్ లో మా గురువు గారైన చంద్రశేఖర రెడ్డి గారితో మాట మాత్రంగా నా అభిలాషను వెల్లడించాను. అంతే ఆ రోజు నుండి ఆయన నా వెంటబ డ్డారు. నా పరిశోధనకు పర్యవేక్షకులుగా కూడా ఆయనే. అందుకే ముందు వందనం ఆయనకే. 2004లో ఉస్మానియా యూనివర్సిటీలో PhD కోసం జాయిన్ అయ్యాను. నా ఉద్యోగ పని వత్తిడిలో పరిశోధన చాలా కాలం పాటు కొనసాగింది. చివరికి 2022మార్చి చివరన నా పరిశోధన వ్యాసం సమర్పించాను.

2023 జనవరి 10వ తేదీన పర్యవేక్షకులు చంద్రశేఖర రెడ్డిగారు, ఓరియంటల్ విభాగపు తెలుగు శాఖాధ్య క్షులు సిల్మానాయక్ గారు, చంద్రశేఖర రావు, సిహెచ్. వెంకట రెడ్డి గార్ల నేతృత్వంలో వైవా జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ, ఎగ్జామినేషన్ బ్రాంచ్ అదనపు కంట్రోలర్ గారు 2023 జనవరి 27న అధి కారికంగా నాకు పీ.హెచ్.డి. పట్టాను ప్రకటిస్తూ, యూనివర్సిటీ వెబ్సైట్లో ప్రెస్ నోట్ పబ్లిష్ చేశారు. నా ‘చందమామ’ పరిశోధన ఎంతవరకు వచ్చిందంటూ కలసినప్పుడల్లా అడిగే హితులు చాలా మంది ఉన్నారు. మా డిపార్టుమెంట్ లో చాలా మంది మిత్రులైతే కలసినప్పుడు, కలవనప్పుడు ఫోన్ లో నన్ను ములుగర్రతో హెచ్చరించి, వెంటబడిన సందర్భాలు చాలా వున్నాయి. వారందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెల్చుకుంటున్నాను. ఈ రోజు ఈనాడు పత్రికలో నాకు పీహెచ్ అవార్డు వచ్చిందన్నా వార్త చూసి చాలా మంది మిత్రులు, నాకు పరిచయం లేని చందమామ అభిమానులు సైతం నా గురించి నెట్లో సెర్చ్ చేసి, నా ఫోన్ నంబర్ సంపాదించి మరీ నాకు అభినందనలు తెల్పుతున్నారు.

ముఖ్యంగా ముప్పది ఏళ్ళకు పైగా చందమామ ఎడిటర్ & పబ్లిషర్ గా వ్యవహరించిన బి.విశ్వనాథరెడ్డిగారు (స్వర్గీయ బి.నాగిరెడ్డి గారి తనయులు) ఈ విషయం తెలియగానే నన్ను అభినందిస్తూ మెసేజ్ పంపడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా నా సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాను.

డాక్టర్ దాసరి వెంకట రమణ
కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ గ్రహీత
(Mob: 9000572575)

5 thoughts on “‘చందమామ’పై అందుకున్న డాక్టరేట్

  1. నిజంగా ఈ విషయం చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది.. గత తరం వారందరికీ ఒక భగవద్గీత ఈ చందమామ.. మేము నేర్చుకున్న చదువు కంటే మిగతా ఆచార వ్యవహారాలు, భయ భక్తులు, సమాజం యొక్క విశ్లేషణ, ప్రేమలు ఆప్యాయతలు మానవ సంబంధాలు మొదలైన విషయాలన్నీ ఈ చందమామ ద్వారానే మాకు లభించాయి.. నిజంగా చందమామ మీద పరిశోధన చేయాలన్న తలంపు రావడమే ఈయన గొప్పదనం. రచయితకు అభినందనలు ధన్యవాదాలు.. ఈ విశేషాలన్నీ తెలియజేసిన కళాసాగర్ గారికి కూడా నా కృతజ్ఞతలు..

  2. చందమామ అభిమానులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డా. దాసరి వెంకట రమణ గార్కి అభినందనలు. వారి లాగే ఎందరో చందమామ అభిమానులకు ఇది శుభవార్త. తరతరాలకు చందమామ ఒక స్ఫూర్తి.చందమామ రంగుల పుస్తకాలు ఎవరైనా ప్రింట్ చేస్తే మాలాంటి చందమామ అభిమానులకు వరం అవుతుంది. రచయితకు, శ్రీ కళాసాగర్ గార్కి కృతజ్ఞతలు.-👍🙏బొమ్మన్, విజయవాడ

  3. చందమామ లొ జానపద సీరియల్స్ రాసిన సుబ్రహ్మణ్యం (బాహుబలి సినిమాకి ప్రేరణ అయిన) గారి ఇంటిపేరు మీ ఇంటిపేరూ ఒకటే కావడం యాద్రుచ్చికం. మీ అభిరుచికి అబినందనలు.

  4. Congratulations. Sir, your journey with CHANDAMAMA is inspiring. With best regards, Dr. Srinivascharyulu Attaluri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap