ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగుండే నేత ఆయన. తనకి రాజకీయ జన్మనిచ్చిన భారతీయ జనతాపార్టీకి, తనని అక్కున చేర్చుకుని ఆదరించిన హైదరాబాద్ అంబర్‌పేట ప్రజలకు, తను పుట్టి పెరిగిన తెలంగాణకు సర్వదా రుణపడి ఉంటానంటూ వినమ్రతను వ్యక్తం చేస్తారాయన. ఆయనే… గంగాపురం కిషన్ రెడ్డి. కేంద్రంలోని హోంశాఖ సహాయమంత్రి స్థాయి నుంచి మొన్నటి విస్తరణ తర్వాత పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి శాఖామంత్రిగా పదోన్నతి పొందారు. మోడీ ప్రభుత్వంలో తెలంగాణ నుంచి తొలిసారిగా కేబినేట్ హైదానందుకున్న నేతగా ఆయన గుర్తింపు పొందారు. ప్రధాని మోడీకి, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాల ఆదరణాభిమానాలు పొందిన కిషన్ రెడ్డి విధేయతకు, సమర్థతకి గుర్తింపుగా ఈ హోదా లభించింది. కిషన్‌రెడ్డికి పదోన్నతి లభించడం పట్ల బిజేపీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
2019లో లోకసభకు ఎన్నికైన కిషన్‌రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి సమర్ధవంతంగా నిర్వర్తించారు. తాను నమ్ముకున్న పార్టీ సవాళ్లను ఎదుర్కొన్న ప్రతి సమయంలోనూ కీలకంగా వ్యవహరించి చురుకైన భూమిక నిర్వర్తించారు. మరీ ముఖ్యంగా జమ్మూకాశ్మీర్ రాష్ట్ర విభజన బిల్లుతోపాటు 370 అధికరణం రద్దు విషయంలోనూ లోకసభలో సమర్ధంగా వ్యవహరించారు. అంతేనా! బిజేపీకి అత్యంత కీలకమైన ఈశాన్యరాష్ట్రాల్లో తిరుగుబాటు సంస్థల వల్ల తలెత్తే సమస్యల్ని పరిష్కరించేందుకు కిషన్‌రెడ్డి చూపించిన చొరవ అగ్రనేతల్ని ఎంతగానో ఆకట్టుకుంది.
కరోనా కష్టకాలంలో
కరోనా మహమ్మారి కోరల్లో దేశం యావత్ కష్టాల కొలిమిలో బాధలు పడుతుంటే భరోసా ఇచ్చేందుకు కిషన్‌రెడ్డి వ్యవహరించిన తీరు బహుథా ప్రశంసాపాత్రమైంది. కరోనా సమయంలో కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకి ఇన్చార్జ్ గా బాధ్యతలు నిర్వర్తించారు. బిజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించడంలో కిషన్ రెడ్డి పాత్ర గణనీయంగా ఉంది.
జన ఆశీర్వాద యాత్ర
ఆగస్ట్ 19 నుంచి 22 వరకూ కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర విజయవంతంగా నిర్వర్తించారు. మూడు లోకసభ నియోజకవర్గాల పరిధిలో నాలుగు జిల్లాల్లో ఈ యాత్ర సాగింది. ఈ యాత్ర ద్వారా ప్రజలకు మరింత దగ్గరవ్వడమే కాకుండా వారి ఆదరాభిమానాలు సంపూర్ణంగా పొందే అవకాశం కూడా దక్కిందని కిషన్‌రెడ్డి మీడియాముఖంగా తెలిపారు. ఈ రకంగా ఎప్పటికప్పుడు తన సమర్ధతను నిరూపించుకుంటున్న కిషన్ రెడ్డికి పదోన్నతి ఇచ్చి మరింత ప్రోత్సహించాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ భావించారు. ఫలితంగానే కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి హెూదాను కల్పించారు. ప్రధాని నమ్మకాన్ని వమ్ముకానీయను
ప్రధాని నరేంద్రమోడీ నా పై ఉంచిన నమ్మకాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ వమ్ము కానివ్వనని కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధాని అప్పగించిన బాధ్యతల్ని అంకితభావంతో పూర్తిచేస్తానని వాగ్దానం చేసారు. నవ భారత్ నిర్మాణం కోసం ప్రధాని నరేంద్రమోడీ అహర్నిశలూ కష్టపడుతున్నారన్నారు. ప్రస్తుతం తన ముందు రెండు అంశాలున్నాయని చెప్తూ మోడీ స్వప్నాన్ని నిజం చేసేలా పనిచేయడం అందులో మొదటిదన్నారు. అంతేకాదు… అమరవీరుల ఆశయాలకనుగుణంగా తెలంగాణ అభివృద్ధి పరచడంలో నావంతు కృషి చేయాల్సిన అవసరమెంతైనా ఉందని చెప్పారు. మంత్రి పదవి కావాలని ఏనాడూ ఎవరినీ అడగలేదని చెప్పారు. అలా అడిగే సంప్రదాయం కూడా పార్టీలో లేదన్నారు. సమర్ధతను పార్టీ అగ్రనేతలు గుర్తించిన తర్వాతే ఎవరినైనా పదవులు వాటంతటవే వరించి వస్తాయన్నారు. అలా వచ్చిన పదోన్నతే ఇదని కిషన్‌రెడ్డి చెప్పారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన జలవివాదంపై కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. అంతేకాదు, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు కలిసి కూచుని చర్చల ద్వారానే పరిష్కారం కనుగొనవచ్చని సూచించారు.
అనూహ్యంగా కేంద్ర కేబినేటికి
రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో ఆండాళమ్మ, స్వామిరెడ్డి దంపతులకు గంగాపురం కిషన్ రెడ్డి 1960 జూన్ 15న జన్మించారు. ఆయన సహధర్మచారిణి జి. కావ్య. కిషన్ రెడ్డి దంపతులకు ఇద్దరు పిల్లలు. జి. వైష్ణవి, జి. తన్మయి. బిజేపి నేత బండారు దత్తాత్రేయ పోటీ చేసేందుకు నిరాకరించడంతో 2019లో జరిగిన లోకసభ ఎన్నికలో సికింద్రాబాద్ నుంచి పోటీ చేయడానికి కిషన్ రెడ్డిని బిజేపి అధిష్టానవర్గం ఎంపిక చేసింది. తన గడపలోకి వచ్చిన ఏ చిన్ని అవకాశాన్నయినా వదిలిపెట్టని నైజం కల కిషన్‌రెడ్డి ఆ ఎన్నికలో పోటీ చేసి ఎంపిగా గెలుపొందారు. ఆ తర్వాత కేంద్రంలో ఘోంశాఖలో సహాయమంత్రి పదవి వరించింది.
ఇదీ రాజకీయ ప్రస్థానం
1980 నుంచి 1994 వరకూ బిజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1980లో రంగారెడ్డి జిల్లా బిజేపీ యువమోర్చా కన్వీనర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కిషన్‌రెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు. 1992లో యువమోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా, 1993 నుంచి వరుసగా మూడుసార్లు జాతీయ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. 2004లో తొలిసారి హిమాయత్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009, 2014 ఎన్నికల్లోనూ గెలుపొందారు. 2010 నుంచి 2014 వరకూ ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసారు. 2014 నుంచి 2016 వరకూ తెలంగాణ బిజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2018లో అంబర్‌పేట నుంచి ఓటమిపాలై 2019 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి గెలిచి పార్లమెంట్ లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం పదోన్నతిపై కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు.
మార్నింగ్ వాక్… పొలిటికల్ వాక్
మార్నింగ్ వాక్ తోనే ప్రజలతో మమేకమైన కిషన్ రెడ్డి కోవిడ్ ఉధృత సమయంలో కేంద్ర మోంశాఖ సహాయ మంత్రిగా హైదరాబాద్లోని గాంధీ, కింగ్ కోఠీ, టిమ్స్ హాస్పిటల్స్ లో పర్యటించారు. వివిధ రోగుల్ని పరామర్శించారు. వారిని ఓదార్చారు. వైద్య చికిత్స ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆస్పత్రుల్లో వెంటలేటర్ల కొరతను తీర్చారు. కోవిడ్ కారణంగా మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలను
కలిసి పరామర్శించారు.
కిషన్‌రెడ్డి పోరుయాత్ర
2012 జనవరి 19న మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి 88 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 986 గ్రామాల్ని చుట్టుముడుతూ 22 రోజుల పాటు 3,500 కిలో మీటర్ల పొడవునా ‘పోరు యాత్ర’ సల్పారు కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ నిర్వహించిన భారతీయ జనతాపార్టీ అధ్యక్ష పదవిని ఆయన తర్వాత అందుకున్న నాయకుడు కిషన్‌రెడ్డి, కిషన్‌రెడ్డి సామాజిక సేవలో భాగంగా గుండెజబ్బులతో బాధపడుతున్న పిల్లలకోసం ప్రభుత్వంవారు ప్రత్యేకంగా ఓ స్కీమ్ ఏర్పాటు చేసేలా కృషి చేశారు. కిషన్‌రెడ్డి తెలంగాణ హెమ్ గార్డ్స్ అసోసియేషన్‌కు నాయకత్వం వహించారు.
బిజేపి ప్రాణం: కిషన్‌రెడ్డి
భారతీయ జనతాపార్టీ కిషన్ రెడ్డికి నచ్చిన పార్టీ. ఆ పార్టీ సిద్ధాంతాల్ని అత్యంత ప్రతిభావంతంగా ఆవిష్కరించగల నేత ఆయన. ప్రజాసమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు అధికారపక్షంపై ఒత్తిడి చేయడమే కాకుండా…అవసరాన్ని బట్టి నిరసనలు, ఆందోళనలు చేసిన చరిత్ర ఆయన సొంతం. బిజెవైఎమ్ ప్రసిడెంట్ గా పనిచేసిన కాలంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ యువజన మండలి (వరల్డ్ యూత్ కౌన్సిల్ ఎగైనెస్ట్ టెర్రరిజం) సంస్థని స్థాపించారు. ఇది రాజకీయాల్లో ప్రమేయం లేని స్వచ్ఛంద సంస్థ.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గళం వినిపించడంలో ఈ సంస్థ నిర్వహించిన పాత్ర ప్రశంసాపాత్రం. ఈ యువజన మండలి ఆధ్వర్యంలో ప్రపంచ యువజన సమావేశాన్ని న్యూఢిల్లీలో స్థాపించారు. ఆ సమావేశానికి 50దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు సంఘీభావం తెలిపే లక్ష్యంతో ఆయన ‘సీమా సురక్షా జాగ్రాన్ ‘ యాత్ర నిర్వహించారు.
కన్నీరుమున్నీరైన కిషన్‌రెడ్డి
అంబర్పేట జన ఆశీర్వాద యాత్రలో కిషన్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. కేంద్రమంత్రినైనా అంబర్‌పేట నియోజకవర్గ ప్రజలకు దూరమయ్యాననే బాధ తనలో ఉప్పొంగుతోందన్నారు. అంబర్‌పేటకు వస్తుంటే చాలా రోజుల తర్వాత బిడ్డ తల్లి దగ్గరకి వచ్చినట్లనిపించిందన్నారు. అంబర్‌పేట ప్రజలు గర్వపడేలా పనిచేస్తానని హామీ ఇచ్చారు. దేశానికి రాజైనా తాను అంబర్‌పేట ప్రజలకు బిడ్డనేనని చెప్పారు. అంబర్పేట నా ప్రాణమన్నారు. మీరంతా అందించే ప్రేమ, ఆప్యాయత తానెప్పుడూ మరిచిపోలేనన్నారు. అంబర్ పేటవాసులు అందించే ఆశీస్సులు ప్రాణమున్నంతవరకూ గుర్తుంటాయన్నారు. దేశానికి సేవ చేసే అవకాశం మీరిచ్చారు… సికింద్రాబాద్ ప్రజలిచ్చారు… ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చారన్నారు.
- వి. సురేష్