(సెప్టెంబర్ 8 గరికపాటి రాజారావుగారి వర్థంతి)
ప్రజా సాంస్కృతిక ఉద్యమానికి గరికపాటి రాజారావు జీవితం నిరంతర స్ఫూర్తి. తెలుగు కళారంగాన్ని ప్రజా కోణం నుండి రాస్తే ముందుగా వినపడే పేరు గరికపాటి. నేటి సమాజంలో ఆర్థిక అసమానతలు తీవ్రతీరమై, సంపద మొత్తం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకరించిన వేళ, మతతత్వం రాజ్యాధి కారమై ప్రజాతంత్ర ఉద్యమాలకు, మానవ సంబంధాలకు కొత్త అర్ధాలు చెపుతున్నవేళ, గరికపాటి రాజారావు మనకు అందిం చిన స్పూర్తిని అందిపుచ్చుకోవాల్సి ఉంది. కళలను పోరాటానికి అనుసంధానం చేసిన తీరును అధ్యయనం చేయాల్సి ఉంది. ఈ ఫిబ్రవరి 5న జయంతి సందర్భంగా మల్లోక సారి కళాకారులు ప్రజల కోసం, ప్రజా కళల కోసం పునరంకితం చేసుకోవాల్సిన సందర్భమిది.
1937లోనే మద్రాసులో ఎల్.ఐ.యం చదువుతున్న రోజులో పుచ్చలపల్లి రామ చంద్రారెడ్డి (పుచ్చలపల్లి సుందరయ్య సోదరుడు) మరియు డాక్టర్ రామదాసు వారి ప్రభావం వల్ల మార్క్సిస్టు రాజకీయ ఉద్యమా లవైపు ఆకర్షితుడై ఉన్నాడు. మార్క్సిజాన్ని అధ్యయనం చేసి ప్రజల కోసం జీవించాలన్న చైతన్యాన్ని అందిపుచ్చుకున్నారు. ఆ సమయం లోనే క్విట్ ఇండియా పిలుపుతో భారత స్వాతంత్ర పోరాట జ్వా లలు ఒక వైపు… ప్రజల్ని కలవర పరిచే పద్ధతుల్లో విరుచుకుపడుతున్న హిట్లర్ ఫాసిజం ఇంకో వైపు… బెంగాలను మరుభూమిగా మల్చిన బెంగాల్ కరువు మరో వైపు.., దేశంలో అనేక సంస్థానాల్లో రగుల్కొన్న ఉద్యమాల వెల్లువ.., తెలంగాణ నేలపై జాముకు వ్యతిరేకంగా సాగుతున్న సమర సూరు.. ఆ పోరాటకాలంలో, ఒక సాంస్కతిక సంఘాన్ని ఏర్పర్చుకోవాల్సిన ఆవసరాన్ని గుర్తించి ముందుకు సాగినవాడు డా. రాజారావు.
1943లో బొంబాయిలో జరిగిన అఖిలభారత అభ్యుదయ రచయితల సంఘం మహాసభల్లో ఆంధ్ర ప్రతినిధిగా హాజరై, అక్కడ ఏర్పడ్డ ‘ఇష్టా (ఐపిటిఎ)కు అఖిల భారత కార్యదర్శుల్లో ఒకరుగా నియమించబడ్డారు. వెంటనే రాష్ట్రంలో కూడా ఆంధ్ర ప్రజానాట్యమండలి ఏర్పర్చి, తొలి కార్యదర్శిగా నియమితులయ్యారు.
విద్యార్థి దశలోనే విచిత్ర వేషాలు వేసిన అనుభవం, మద్రాసులో చదువుతున్నప్పుడు తోటి విద్యార్థులతో నాటకాలు వేయించిన అనుభవం, ప్రజానాట్య మండలిని ముందుకు నడిపించడానికి ఉపయోగపడింది. ఆ తర్వాత ప్రజానాట్య మండలి చరిత్రతో అతని జీవితం పెనవేసుకుంది. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజానాట్య మండలిది ఒక ఉజ్వల చరిత్ర.. ఒక ఝంఝూమారుతం… తెలుగు నేల కళా రూపాలతో కదంతొక్కిన అపురూప సంఘటన… వ్యక్తులే శక్తులై ఊల్లన్ని ఊగి సాగినవేళ… ముందుపీఠాన నిలిచిన వారు రాజారావు. ఆంధ్రప్రజా నాట్య మండలి ఏర్పడటానికి ముందే, తమ వ్యక్తిగత కృషితో ఆనాటికే ప్రజల్లో ఉన్న జంగం కథను, నేడు మనం చూస్తున్న ‘బుర్రకథ’ రూపంలో సుంకర సత్యనారాయణ, కాకుమాని సుబ్బరావు తయారు చేసిన ‘కష్టజీవి’ బుర్రకథను ప్రజానాట్యమండలి జనంలోకి తీసుకెళ్లింది. అనేక కళా బృందాలు ఏర్పడ్డాయి. వారంతా ఆనాటికి ప్రజల్లో ఉన్న కోలాటం, సోది వేషం, పిట్టల దొర, జముకుల కథ, యక్షగానం లాంటి కళా రూపాలను దాదాపు 40 వరకు రాజారావు ఆధ్వర్యంలో పునరుద్ధరించి, ఆ కళారూపాల్లో ప్రజా సమస్యలను జోడించారు. తక్కువ మందితో ఎక్కువ ప్రచారం చేయడానికి ఉన్న అవకాశాలను గుర్తించి, అందుకు తగ్గట్టు చిన్న కళారూపాలను విప్లవీకరిం చడంలోనే రాజారావు ప్రతిభ దాగివుంది. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘మా భూమి’ నాటకాన్ని రాష్టదళంతో పాటు ప్రతీ జిల్లాలో దాదాపు 10 దళాలు ఏర్పడి ప్రదర్శనలిచ్చారు. ప్రభుత్వం భయపడి ‘మాభూమి’ని నిషేధించింది. ఒక సైనికుడిగా కళాకారులను తయారు చేస్తూనే, వీరనారి, వీర కుంకుమ లాంటి నాటకాలు రాసారు. అనేక కళారూపాలు తయారుచేసారు. మాభూమి, పరివర్తన, పోతుగడ్డ, సీతారామరాజు వంటి నాటకాలకు దర్శకత్వం వహించారు.
సాయుధ పోరాట విరమణ అనంతరం రాజమండ్రిలో రాఘవ కళాసమితిని ఏర్పర్చి అనేక నాటక ప్రదర్శనలు ఇచ్చారు. ‘రాజా ప్రొడక్షన్స్’ అనే సంస్థను స్థాపించి 1953లో పుట్టిల్లు సినిమాను స్వయంగా నిర్మించి దర్శకత్యం వహించాడు. ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు జమున, అల్లు రామ లింగయ్యను వెండితెరకు పరిచయం చేశాడు.
ఆ తరువాత 1962లో విడుదలైన ఆరాధన సినిమాలో రాజశ్రీకి తండ్రి షావుకారు పాత్ర వేశాడు. దేవుడుచేసిన మేలు చిత్రాన్ని నిర్మించినా ఆర్థిక కారణాలవల్ల ఆ చిత్రం విడుదల కాలేదు. వృత్తిరీత్యా వైద్యుడైన రాజారావు ఉచితంగా వైద్య సేవలు అందించడానికి విజయవాడలోని పోరంకిలో ప్రజా వైద్యశాల నెలకొల్పి ఫీజులు తీసుకోకుండా మందులు కూడా తనే కొనుగోలు చేసి ఉచితంగా రోగులకు సేవ చేసేవాడు. కొంతకాలం రాజమండ్రిలోనూ ప్రజావైద్యశాల నిర్వహించాడు.
ఒకసారి జైభవానీ నాటకాన్ని ప్రదర్శించే సమయంలో గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థులయ్యారు. 1963 సెప్టెంబరు 8న మద్రాసులో మరణించారు.
అతని జీవితమెప్పుడు ప్రజా కళాకారులకు ఒక పాట్య పుస్తకం… జీవిత గమనానికి ఒక దిక్సూచి. ఉద్యమాల్లో అతడెప్పుడూ చిరంజీవే.