సినీ ధరణినేలిన ‘భరణి’రాణి… భానుమతి

(సెప్టెంబరు 7న, భానుమతి జన్మదిన సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి ప్రత్యేక వ్యాసం…)

యాభైసంవత్సరాల క్రితం కొలంబియా రికార్డింగ్ కంపెనీ వాళ్లు భానుమతి పాటల ఆల్బం విడుదలచేస్తూ రికార్డు స్లీవ్ మీద ముద్రించిన పరిచయ వాక్యాలను చదివితే భానుమతి ప్రజ్ఞ ఎలాంటిదో విదితమౌతుంది. ఆ రికార్డు కవరు మీద “స్వరవాహిని, స్వరమోహిని, స్వరారోహ స్వరవర్ణిని, చలనచిత్ర ధరణినేలు భరణి రాణి భానుమతికి, సంగీతపు సామ్రాజ్ఞికి సాటి లేరు…లేరు…లేరు. సప్తస్వరసాగరాల గుప్తమ్మగునమృతమ్ము చిలికి చిలికి వెలికితీసి నిలుపుకున్నదా గళమ్ము… ఆ మంగళ గళమున చిరుపొగరు, వగరు రంగరించి సరిగమ పదనిసలామె స్వరసుధలకు సంతరించె” అని ముద్రించారు. ఆమెకు ఇంతకన్నా పొగడ్త మరేంకావాలి. భానుమతి పేరు వినగానే వెంటనే “మనసున మల్లెల మాలలూగెనే” (మల్లీశ్వరి), “ఎందుకోయి తోటమాలి అంతులేని యాతన” (విప్రనారాయణ), “ఓ బాటసారి నను మరువకోయి” (బాటసారి), “అడుగడుగో అల్లడుగో అభినవ నారి మన్మధుడు” (సారంగధర) “శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా” (బొబ్బిలి యుద్ధం) వంటి పాటలకు ప్రాణప్రతిష్ట చేసిన స్వరమోహిని భానుమతి కళ్ళముందు నిలుస్తుంది. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. కథానాయికగా, అద్భుత గాయనిగా, సంగీత దర్శకురాలిగా, సినీ నిర్మాతగా, సినీ దర్శకురాలిగా, స్టూడియో అధినేతగా, రచయిత్రిగా… అన్నిటినీ మించి విలక్షణమైన వ్యక్తిత్వంతో చలనచిత్రసీమలో మహారాజ్ఞిగా ఓ వెలుగు వెలిగిన భానుమతి లలిత కళలకు మెరుగులు దిద్దిన ధీమంతురాలు. ఆమెకు జ్యోతిషం, చిత్రలేఖనం కూడా వచ్చు. మద్రాసు ప్రభుత్వ సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్ గా కళాభ్యున్నతికి కృషిచేసిన మల్లీశ్వరి ఆమె. తిరువయ్యూరు లో జరిగిన త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలలో పాల్గొని భారతరత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి తో కలిసి గళం కలిపి “ఎందరో మహానుభావులు” కీర్తనను ఆలపించిన సంగీత సరస్వతి. ’విప్రనారాయణ’ చిత్రంలో దేవదేవి గా విమల గాంభీర్యాన్ని ప్రదర్శించి ప్రేక్షక హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ధీమంతురాలు. ఒక మధ్య తరగతి మహిళ ఆత్మవిశ్వాసం వుంటే ఆత్మగౌరవం నిలుపుకోవచ్చు అని నిరూపించి, నమ్మిన సిద్దాంతాలకోసం రాజీ పడకుండా జీవించడం ఎలాగో ఆచరించి, మధ్యతరగతి మహిళ ఎవరెస్టు అంతటి ఎత్తుకు ఎలా ఎదగవచ్చో చూపుతూ తన జీవితాన్నే ఒక ఉదాహరణ గా చేసిన ధీశాలి భానుమతి. పద్నాలుగు సంవత్సరాలనుండి ఇరవై ఎనిమిది సంవత్సరాలలోపు ఎంతోమంది సాధించలేని విజయాలను భానుమతి సొంతం చేసుకోగలిగింది. పద్నాలుగు సంవత్సరాల వయసులోనే ఆమె మొట్టమొదటి సినిమా ‘వరవిక్రయం’లో నటించింది. పద్దెనిమిదేళ్ళ వయసులో రామకృష్ణారావును ప్రేమవివాహం చేసుకుంది. పందొమ్మిది సంవత్సరాలకు కొడుకు భరణీ కుమార్ కు జన్మనిచ్చింది. అప్పుడే రచయిత్రిగా అవతారమెత్తింది. ఇరవై ఒక్క సంవత్సరాలకి సొంత సినిమా నిర్మించింది. ఇరవై ఐదు సంవత్సరాలకి సొంత స్టూడియో నిర్మించింది. ఇరవై ఎనిమిది సంవత్సరాలకే చండీరాణి చిత్రాన్ని మూడు భాషల్లో నిర్మించి, ద్విపాత్రాభినయం చేస్తూనే దర్శకత్వ బాధ్యతలను నిర్వహించింది. ఇవి చాలు ఆమె ప్రతిభను గుర్తుచేయడానికి. ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి జయంతి సందర్భంగా కొన్ని జ్ఞాపకాలు.

తొలిరోజుల్లో భానుమతి …

భానుమతి పుట్టింది సెప్టెంబరు 7, 1925 న ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలం, దొడ్డవరం గ్రామంలో. ఆమె తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య రెవెన్యూ ఇనస్పెక్టరు, తల్లి సరస్వతమ్మ గృహిణి. తండ్రి మంచి సంగీత విద్వాంసుడు. తండ్రే భానుమతికి తొలి గురువు. తల్లి కూడా సంగీతం నేర్చుకుంది. భానుమతి ఏక సంతాగ్రాహి. ఒకసారి వింటే వెంటనే పాడగలిగే యోగం ప్రసాదించాడు భగవంతుడు. తల్లి ఇరుగుపొరుగు పిల్లలకు సంగీతం నేర్పుతుంటే ప్రక్కన కూర్చుని వారితో జతకలిపేది. ఇంట్లో గ్రామఫోను రికార్డులుండేవి. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, హీరాబాయి బదోడ్కర్, నారాయణరావు వ్యాస్, బాలగంధర్వ, రోషనారా బేగమ్ వంటి నిష్ణాతులు పాడిన పాటలు వింటూ యధాతధంగా పాడేస్తూ వుండేది. భానుమతికి సినిమారంగం మీద సదభిప్రాయం వుండేది కాదు. అందుకే ఆ రంగంలో అడుగిడటానికి మొదట్లో సుముఖత చూపలేదు. డా. గోవిందరాజుల సుబ్బారావు భానుమతి తండ్రిగారికి సన్నిహిత మిత్రుడు. సారథి ప్రొడక్షన్స్ వారి ‘మాలపిల్ల’ (1938) చిత్రంలో హీరోయిన్ చెల్లెలి పాత్రను భానుమతిని చేత వేయించాలని ప్రయత్నించారు. ఎందుకో భానుమతి తండ్రికి కూడా ఆమె సినిమాల్లో నటించడం ఇష్టంలేదు. ఆమెచేత పాటలు పాడించి రికార్డులుగా ఇవ్వాలనే యోచనలో వున్నారు. తరవాత మద్రాసుకు వెళ్తూ భానుమతిని వెంటతీసుకెళ్ళారు. అక్కడ దర్శకనిర్మాత గూడవల్లి రామబ్రహ్మంను కలవడం జరిగింది. టంగుటూరి సూర్యకుమారిని చూసి తనుకూడా సినిమాల్లో నటించేందుకు భానుమతి సుముఖత చూపింది. అప్పట్లో రేలంగి వెంకట్రామయ్య ప్రొడక్షన్ మేనేజరుగా వున్నారు. ఆయనవెంట తండ్రితో భానుమతి కాకినాడ వెళ్లి చిత్తజల్లు పుల్లయ్యను కలిసింది. అప్పుడే ‘వరవిక్రయం’ (1939) సినిమా నిర్మాణం కాబోతోంది. భానుమతి అందులో ‘కాళింది’ పాత్రను పోషించింది. అదే ఆమె తొలి చిత్రం. అందులో “పలుకవేమి నా దైవమా పరులు నమ్మేది న్యాయమా రామా” అనే త్యాగరాజస్వామి కృతిని ఆలపించింది. సినిమాల్లో త్యాగరాయ కృతి ఆలపించిన తొలి గాయని భానుమతే. అదే సినిమాలో “స్వాతంత్ర్యమే లేదా ఈ స్త్రీజాతిలోన”, “జాతికి నీ సూత్రంబే సంపత్కరమౌ సాధనము” అనే మరో రెండు పాటలు కూడా పాడింది. అప్పుడు భానుమతికి నెలకు 150 రూపాయల జీతం ఇచ్చేవారు. సినిమా శతదినోత్సవం చేసుకుంది. తరవాత భవభూతి కావ్యాన్ని ‘మాలతీమాధవం’(1940) పేరుతో సినిమాగా నిర్మించారు. అందులో భానుమతిది మాలతి పాత్ర. కానీ ‘మాలతీమాధవం’ సినిమా ఫ్లాపయింది. భానుమతి కలకత్తాలో సినిమా షూటింగుల్లో ఉంటున్నప్పుడు విశ్వనాథ కవిరాజు, బలిజేపల్లి లక్ష్మీకాంతకవి లతో పరిచయం ఏర్పడి, వారివద్ద పద్యాలు ఎలారాయాలో నేర్చుకుంది. కవిరాజు కథలు ఎలారాయాలో భానుమతికి నేర్పారు. అప్పుడే భానుమతి చేత ఆయన ‘మరచెంబు’ అనే కథ రాయించారు. ఆ కథ ‘చిత్రగుప్త’ అనే పక్షపత్రికలో అచ్చయింది. అప్పుడు భానుమతికి పద్నాలుగేళ్ళు. భానుమతి చురుకుదనం, ఉద్వేగం, కలివిడితనం చూసి ఈ కవిద్వయం వృద్ధిలోకి రావాలని ఆశేర్వదించారు. తరవాత భానుమతి పి. పుల్లయ్య దర్శకత్వంలో నిర్మించిన ‘ధర్మపత్ని’(1941) లో నటించింది. ‘భక్తిమాల’ చిత్రంలో నటిస్తుండగా అందులో నృత్య సన్నివేశాలు ఉండడంతో వెంపటి పెదసత్యం గారితో భానుమతికి శిక్షణ ఇప్పించారు. భక్తిమాల చిత్ర నిర్మాణం పూర్తయ్యాక భానుమతి ఒంగోలుకు వచ్చేసింది. భానుమతి తండ్రి కొల్హాపూరు నుంచి ఒక మరాఠీ విద్వాంసుణ్ణి పిలిపించి సంవత్సరంపాటు భానుమతికి హిందూస్తానీ సంగీతంలో శిక్షణ ఇప్పించారు. తరవాత వీణ, సితార్ వాద్యాలను వాయించటం నేర్చుకుంది.

‘కృష్ణప్రేమ’ తో ప్రేమలోపడి…

ఫేమస్ సినీ అండ్ స్టార్ కంబైన్స్ వారు మద్రాసు వేల్ స్టూడియోలో హెచ్.వి. బాబు దర్శకత్వంలో ‘కృష్ణప్రేమ’ (1943) చిత్రం నిర్మించారు. అందులో శాంతకుమారి రాధగా నటించగా భానుమతి చంద్రావళి పాత్ర పోషించింది. భానుమతికి అది ఐదవ సినిమా. ఆ చిత్రానికి పి.ఎస్. రామకృష్ణరావు సహాయ దర్శకుడు. అతణ్ణి చూడగానే భానుమతి అతని ప్రేమలో పడిపోయింది. ఒకసారి షూటింగులో భానుమతి చేతికి ముల్లు గుచ్చుకొని రక్తం వచ్చింది. అక్కడే నారదుడి వేషంలో వున్న టంగుటూరి సూర్యకుమారి “అయ్యో పాపం రక్తం వస్తోంది. తడిగుడ్డ తీసుకురండి” అని అరచింది. రామకృష్ణారావు వెంటనే తన జేబులోవున్న రుమాలు తీసి కాస్త జంకుతూనే భానుమతి చేతికి కట్టుకట్టాడు. రామకృష్ణ జంకుకి ఓ బలమైన కారణముంది. అంతకుముందు ఒకానొక సన్నివేశంలో చంద్రావళి కృష్ణుడి చెంప చెళ్ళుమనిపించి పరుగు లంకించుకుంటూ బురదగుంటలో పడాలి. ఆ షూటింగులో భానుమతి కృష్ణ పాత్రధారి గాలి వెంకటేశ్వరరావు చెంపను నిజంగానే చెళ్ళుమనిపించడంతో, ఆయన చెంప ఉబ్బిపోయింది. దాంతో క్లోజప్ షాట్లు వాయిదావేసి భానుమతి బురదగుంటలో పడే షాటు తీశారు. ఆ షాటులో భానుమతికి బురద ఎక్కువగా అంటుకోకపోవడంతో దర్శకుడు బాబు రామకృష్ణను కొంచెం బురద అంటించమన్నాడు. కృష్ణుడి చెంప దెబ్బ గుర్తుకొచ్చి ఆయన భయంభయంగా గజం దూరంలో వుండి బురద పూశారు. దాంతో రామకృష్ణ మీద భానుమతికి ప్రేమ రెట్టింపయింది. భానుమతి తండ్రి రామకృష్ణని పెళ్లాడేందుకు ఒప్పుకోలేదు. తరవాత పరిస్థితులు సానుకూలించి ఆగస్టు 8, 1943న ఇద్దరూ పెళ్లిచేసుకున్నారు. అలా ‘కృష్ణప్రేమ’ చిత్రం భానుమతి జీవితాన్ని ఓ మలుపు తిప్పింది. గృహిణిగా జీవితం గడపాలని భర్తతో కలిసి అత్తగారి వూరు పుంగనూరు వెళ్ళే ప్రయత్నం చేసింది భానుమతి. కానీ సినిమా ప్రపంచాన్ని యేలాలని రాసివుంటే పుంగనూరు వెళ్ళడం ఎలా కుదురుతుంది?

స్వర్గసీమ తో నటిగా స్థిరపడి…

ముదిగొండ లింగమూర్తి భానుమతిని వాహినీ అధిపతి బి.ఎన్.రెడ్డి కి పరిచయం చేశారు. ‘స్వర్గసీమ’ చిత్రాన్ని నిర్మించనెంచిన బి.ఎన్.రెడ్డి నాగయ్యను హీరోగా, జయమ్మను హీరోయిన్ గా, భానుమతిని ‘వ్యాంప్’ పాత్రకోసం ఎంపికచేశారు. 1942-43లో రెండవ ప్రపంచ యుద్ధం తారాస్థాయిని చేరుకోవడంతో, కోస్తా పట్టణాలమీద జపాన్ దేశం బాంబులు వేసింది. దాంతో అందరూ మూటా ముల్లె సర్దుకొని వాహినీ కంపెనీని ఖాళీచేసి తాడిపత్రి వెళ్లిపోయారు. యుద్ధ మేఘాలు సద్దుమణిగాక ‘స్వర్గసీమ’ సినిమా నిర్మాణం వూపందుకుంది. నిర్మాణ వ్యవహారాలను లింగమూర్తి చూసుకున్నారు. అయితే కొత్తగా సినిమాలు తీయాలనుకునే కంపెనీలకు ప్రభుత్వం పర్మిట్ విధించి 11 వేల అడుగులలోపే సినిమాలు తీయాలని ఆంక్షలు విధించింది. దాంతో ముడి ఫిలిం దిగుమతి కష్టతరమైంది. జనవరి 10, 1946 న ‘స్వర్గసీమ’ సినిమా విడుదలై అనూహ్యమైన విజయాన్ని అందుకొంది. భానుమతి లాంటి నటిని చూడాలంటే ‘స్వర్గసీమ’మ చిత్రాన్ని చూడాలి అని అందరూ చెప్పుకున్నారు. ఆమె పాత్ర తీరు మొదట భాగవతుల బృందంలో అమాయకమైన నటిగా, తరవాత కట్టుబొట్టు తీరు అన్నీ మారి నాగరిక కన్యలా అవతరించి నాగయ్యను వలలో వేసుకునేందుకు వ్యాంప్ లా తయారై ‘సుబ్బులు’ సుజాతగా మారుతుంది. ‘బ్లడ్ అండ్ సాండ్’ అనే ఆంగ్ల చిత్రంలోని హమ్మింగ్ ఆధారంగా తీసుకొని “ఒహోహో పావురమా” పాటకు జీవం పోస్తే, చేతిలో జేబురుమాలును పావురంగా ఊహించుకుంటూ ఆపాటకు భానుమతి అభినయం చేసిన తీరు ఈ నాటికీ నిత్యనూతనంగా అగుపిస్తుంది. ‘స్వర్గసీమ’(1945) నాటికి భానుమతి నాట్యంలో మంచి ప్రావీణ్యం సంపాదించింది. అది ఈ సినిమాలో ఆమెకు ఉపకరించింది. ఈ సినిమా తమిళంలో కూడా వందరోజులు ఆడింది.

మల్లీశ్వరి ఎవరంటే భానుమతే…

నేటికీ మల్లీశ్వరి పేరు చెబితే అందరికీ గుర్తుకొచ్చేది భానుమతి. బి.ఎన్. రెడ్డి ‘వందేమాతరం’ సినిమా షూటింగు కోసం హంపీ వెళ్ళినప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి ప్రేమకథ ఏదైనా తీయాలని 1939 లోనే ఆయన నిర్ణయించుకున్నారు. దాంతో దేవులపల్లి కృష్ణశాస్త్రిని కాకినాడ నుంచి పిలిపించి ‘మల్లీశ్వరి’ సినిమాను ఒక కళాఖండంగా రూపొందించేందుకు ప్రణాళిక రచించి, ఆయనచేత మాటలు, పాటలు రాయించారు దర్శకుడు బి.ఎన్. రెడ్డి. పాటల రికార్దింగుకి ఆరు నెలలు పట్టింది. భానుమతితో దర్శకుడు కాస్త ఇబ్బంది పడడంతో రేవతి అనే అమ్మాయిని మల్లీశ్వరి పాత్రకోసం పరీక్షించారు. కానీ భానుమతి స్థాయి ఆ అమ్మాయికి లేదని మరలా భానుమతినే మల్లీశ్వరి పాత్రకు తీసుకున్నారు. అందులో ఉషాపరిణయం యక్షగానం ఒక గొప్ప నాట్యశిల్పం. దానికోసం భానుమతి చేత నృత్యదర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తి రెండు నెలలకు పైగా రిహార్సల్స్ చేయించారు. చిత్రం 20-12-1951 న విడుదలైంది. విజయవాడలో వందరోజులు ఆడినా అందరూ గొప్ప క్లాసిక్ అన్నారేగాని కమర్షియల్ సినిమా అనలేదు. దాంతో సినిమా ఆర్ధిక విజయాన్ని అందుకోలేకపోయింది. “మనసున మల్లెలమాలలూగెనే” పాటకోసం ఎ.కె. శేఖర్ స్టూడియోలోనే ఏకంగా తుంగభద్రా ఒడ్డుని సృష్టించాడు. రామారావు వేణువు ఊదుతూ మెట్లు దిగిరావడం, కొలను ముందు భానుమతి రామారావు ఒడిలో తలపెట్టుకొని కూర్చోవడం అద్భుతంగా చిత్రీకరించారు. జయదేవుని అష్టపది “ధీర సమీరే యమునా తీరే” ట్యూను ఆధారంగా “మనసున మల్లెల మాలలూగెనే” పాట రూపు దిద్దుకుంది. ఈ చిత్ర నిర్మాణ సమయంలో బెంగాలీ దర్శకుడు దేవకీ బోస్ మద్రాసు వచ్చి ‘మల్లీశ్వరి’ సెట్ లో బి.ఎన్. రెడ్డిని కలిశారు. అప్పుడు భానుమతిని పరిచయం చెయ్యడం జరిగింది. ఆమె చేత బోస్ రవీంద్రుని ‘గీతాంజలి’ లోని కొన్ని పద్యాలను పాడించుకున్నారు. రామారావుతో భానుమతి చండీరాణి, చింతామణి, వివాహ బంధం, తోడూ-నీడా, బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం, తాతమ్మ కల, అమ్మాయిపెళ్ళి వంటి సినిమాల్లో నటించింది.

మిస్స’యిన మిస్సమ్మ, దేవదాసు…

విజయా వారి మిస్సమ్మ సినిమాలో మిస్సమ్మ పాత్ర తొలుత భానుమతిదే. నాలుగు రీళ్ల సినిమా పూర్తయింది. ఆరోజు వరలక్ష్మీ వ్రతం. పూజాకార్యక్రమాలు పూర్తిచేసుకొని షూటింగ్ కి భానుమతి కాస్త ఆలస్యంగా వెళ్ళింది. నిర్మాత చక్రపాణికి కోపం వచ్చింది. ఆలస్యమైనందుకు క్షమాపణ చెప్పమన్నారు. ముందురోజు సాయంత్రం షూటింగ్ ప్యాకప్ చెప్పేటప్పుడు మరునాడు ఆలస్యంగా వస్తానని ప్రొడక్షన్ సిబ్బందికి నోట్ రాసి చక్రపాణికి ఇవ్వమని చెప్పానని భానుమతి వాదించింది. క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పివెళ్లిపోయింది. చక్రపాణి ఆగ్రహోదగ్రుడై అంతవరకూ తీసిన నాలుగు రీళ్ళను కాల్చివేసి, భానుమతి స్థానంలో సావిత్రిని తీసుకొని సినిమా పూర్తిచేశాడు. ఒకరకంగా అది సావిత్రి చిత్రసీమలో నిలదొక్కుకోవటానికి దోహదపడింది. భానుమతి 1954 ‘చక్రపాణి’ అనే చిత్రం నిర్మించింది. విజయా నిర్మాత చక్రపాణి మీద కక్ష సాధింపుకే భానుమతి సినిమాకి ఆయన పేరు పెట్టిందని సినీ పండితులు గుసగుసలాడుకున్నారు. కానీ సినిమా విడుదలయ్యాక ఆ అభిప్రాయం తప్పని తేలింది. చక్రపాణి అంటే ఆమెకు ఎంతో గౌరవం. చక్రపాణి సినిమాకి భానుమతి తొలిసారి సంగీత దర్శకత్వం వహించింది. అనురాగం చిత్రంలో “సన్నజాజి తీవెలోయ్” పాటకు పెండ్యాల అనుమతితో ట్యూను కట్టుకుంది భానుమతే.

వినోదా వారి ‘దేవదాసు’ సినిమాలో పార్వతి పాత్రకు భానుమతికి ఆఫర్ ఇచ్చారు నిర్మాత డి.ఎల్. నారాయణ. భానుమతి “నో” అంది. ఎందుకంటే ‘దేవదాసు’ చిత్రనిర్మాత డి.ఎల్.నారాయణ గతంలో భరణీ స్టూడియోలో మేనేజరుగా పనిచేశారు. “నా దగ్గర పనిచేసినవాడు తీసే సినిమాలో నేను నటించడమా! అది నాకే అవమానం” అంటూ తిరస్కరించింది. అలాగే డి.ఎల్. నిర్మించిన ‘కన్యాశుల్కం’ చిత్రంలో మధురవాణి పాత్రను కూడా వదలుకుంది. ఆమె వ్యవహార శైలి ఎక్కువమంది నిర్మాతలకు రుచించలేదు. “పాత్రలు నావద్దకు వచ్చాయి కానీ నేను పాత్రలవద్దకు వెళ్ళలేదు” అని ఆమె సగర్వంగా చెప్పుకునేది. ‘హరిశ్చంద్ర’ లో చంద్రమతి పాత్ర చెయ్యమంటే చెయ్యనంది. ఆ సందర్భంగా చక్రపాణి “భానుమతి ఎవరినైనా ఏడిపిస్తే చూస్తారు కానీ, ఏడిస్తే ఎవరు చూస్తారు” అని చమత్కరించారు.

మరిన్ని విశేషాలు …

ఆమెది విలక్షణమైన, విశిష్టమైన వ్యక్తిత్వం. ఆమెకు గర్వమని, అహంభావమని దూరంగా చూసినవాళ్ళు అనుకుంటారు. కానీ అది కేవలం తన ఆత్మ విశ్వాసమని భానుమతి చెప్పుకున్నారు. మగఆధిక్యం ప్రదర్శించే ఈ చిత్రసీమలో పొగరు, వగరు గానే వుండాలి అని ఆమె చెబుతుండేది. భానుమతి లైలా మజ్నులో భగ్న ప్రేమికురాలు లైలాగా, బాటసారిలో మాధవి పాత్రలో జీవించి నటించి యేడిపించలేదా అంటే, అందుకు భానుమతి సమర్దురాలే అంటారు చిత్రజగత్తులో అందరూ. 1966లో వచ్చిన ‘పల్నాటి యుద్ధం’లో భానుమతి నాయకురాలు నాగమ్మ పాత్రలో కన్నాంబనే మరిపించింది. ‘విప్రనారాయణ’ చిత్రంలో పరమభక్తుడైన విప్రనారాయణుడు ని భ్రష్టు పట్టించే పాత్రలో భానుమతి మంచి మార్కులు తెచ్చుకుంది. ‘చింతామణి’ చిత్రాన్ని నిర్మించే ముందు అక్కినేని నాగేశ్వరరావును బిల్వమంగళుడు పాత్రను పోషించమంటే ఆయన “నో” చెప్పడమే కాకుండా, భానుమతికి ఇవ్వజూపే పాత్ర ఆమె ఇమేజికి తగిన పాత్రకాదు, సినిమా తీయవద్దని సలహా ఇచ్చారు. అయితే భానుమతి ఆ పాత్రను పోషించింది. ‘పతియే ప్రత్యక్ష దైవం’ అనే సినిమాలో బుక్కై, రెండు పాటలు కూడా పాడి తప్పుకుంది. ‘అనురాగం’, ‘అంతస్తులు’, ‘పుణ్యవతి’ వంటి సినిమాల్లో సెంటిమెంటు నిండిన పాత్రల్లో రాణించింది. ‘అంతా మనమంచికే’ సినిమాలో అన్నీ తానై నిలిచి సినిమాను మంచి హిట్ చేసింది. ఆ తరవాత భానుమతి ధోరణి మారిపోయింది. మల్లీశ్వరి పాత్ర లోని ముగ్దతనం మరుగున పడింది. మగరాయుడులా పాత్రపోషణ చెయ్యడం ప్రారంభించింది. ‘విచిత్ర వివాహం’, ‘అమ్మాయి పెళ్లి’, ‘మంగమ్మ గారి మనవడు’, ‘బామ్మమాట బంగారుబాట’ చిత్రాల్లో ఈ ధోరణి బాగా కనిపిస్తుంది. తమిళంలో భానుమతి చాలా సినిమాల్లో నటించింది. “మాన్ మగన్ తెవి’ వంటి చిత్రాల్లో కొన్ని హాస్యపాత్రలు కూడా పోషించింది. ఆమె మంచి రచయిత్రి. ఆమె రచించిన ‘అత్తగారి కథలు’ కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ‘నాలో నేను’ పేరుతో భానుమతి తన ఆత్మకథ రాసుకుంది. లలితకళా అకాడమీకి భానుమతి ఐదేళ్ళు సభ్యురాలిగా వుంది. తమిళనాడు ప్రభుత్వ సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్ గా వ్యవహరించింది. మద్రాసు సాలిగ్రామంలో తన పేరిట ఒక పాఠశాలను నెలకొల్పింది. ‘చండీరాణి’ సినిమాను మూడు భాషల్లో నిర్మించి, అందులో ద్విపాత్రాభినయంచేసి, దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించిన వ్యక్తిగా భానుమతి పేరు రికార్డులకెక్కింది. వి.బి. రాజేంద్రప్రసాద్ ‘అంతస్తులు’ చిత్రం నిర్మిస్తూ భానుమతికి ఒక గొప్ప పాత్ర ఇచ్చారు. “దులపర బుల్లోడా దుమ్ము” అనే పాట చిత్రీకరణ కోసం ఆమె మద్రాసు నుండి వచ్చి సారథి స్టూడియో గెస్ట్ హౌసు లో వుంది. రాజేంద్రప్రసాద్ రిట్జ్ హోటల్లో బస ఏర్పాటు చేసినా ఆమె కూడా నిర్మాతే కనుక, నిర్మాత ను దృష్టిలో పెట్టుకొని పొదుపు పాటించాలని స్టూడియోలో ఉండేందుకే మొగ్గు చూపింది. ఆరోజు రాత్రి చుంచెలుకలు ఆమె కాళ్ళను కొరికేశాయి. రాజేంద్రప్రసాద్ భయపడిపోయి డాక్టర్లను పిలిపించారు. కానీ భానుమతి కేవలం అయోడిన్ రాసుకొని, బాధను దిగమింగుతూ ఆ పాట చిత్రీకరణను పూర్తిచేసింది. నిర్మాతలకు ఆమె ఇచ్చే గౌరవం అలాంటిది. భరణీ స్టూడియోకి ఆమె యజమాని. ఆమెకు 1966లో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ అవార్డును బహూకరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘రఘుపతి వెంకయ్య’ అవార్డుతో సత్కరించింది. 2000లో ఆమెకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఎన్.టి.ఆర్’ అవార్డు ప్రదానం చేసింది. ‘అన్నై’(1962), ‘అంతస్తులు’ (1965), ‘పల్నాటి యుద్ధం’ (1966) సినిమాలలో నటనకు భానుమతి ప్రాంతీయ చిత్రాల కేటగరీలో జాతీయ బహుమతులు అందుకుంది. అన్నాదురై ఆమెకు ‘నడిప్పుకుం ఇళక్కనం’ (నటనకు వ్యాకరణం) అనే బిరుదు ప్రదానం చేశారు. 1984లో తమిళనాడు ప్రభుత్వం ‘కలైమామణి’ బిరుదుతో భానుమతి ని సత్కరించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. 2013లో తంతి తపాలాశాఖ భానుమతి స్మారక స్టాంపును విడుదల చేసింది. భానుమతికి ఒకే ఒక కుమారుడు డాక్టర్ భరణి.

భానుమతి పేరులోనే ఒక ప్రత్యేకత వుంది. ‘అంతస్తులు’ సినిమాలో భానుమతి పాత్రకు తొలుత పరిశీలించింది జమున పేరును! జమున సరేనంది. కానీ కొందరు శ్రేయోభిలాషులు “అక్కినేనికి అక్కగా నటిస్తే యెవరు చూస్తారు” అనడంతో వెనక్కి తగ్గింది. అప్పుడు అగ్రేసరాభినేత్రి భానుమతిని సంప్రదించారు నిర్మాత రాజేంద్రప్రసాద్. ఆమెకు కథ బాగా నచ్చి “ఓకే” అంది. అప్పటికే ఆమె రెండు సినిమాల్లో నటించాల్సి వుంది. ‘అంతస్తులు’ కథ విన్నాక ఆ రెండు సినిమాలూ వదులుకొని మరీ నటించింది. సినిమా నిర్మాణం సారథీ స్టూడియోలో జరిగింది. భానుమతి జగపతి సంస్థకు యెంతగా సహకరించిందంటే కనీసం హోటల్లో కూడా బసచేయలేదు. స్టూడియో గెస్టుహవుసు లోనే మకాం! “దులపర బుల్లోడో దుమ్ము దులపర బుల్లోడా” పాట ఇప్పటికీ దుమ్ము దులుపుతూనే వుంది. పెళుసుగా వుండే భానుమతి మాటతీరు, ఆహార్యం, ఆత్మాభిమానపు ధోరణి ‘అంతస్తులు’ సినిమాలో పాత్రకు సరిగ్గా సరిపోయాయి. అందుకే ఈ సినిమాలో ఆమె నటనకు అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమాతోనే రాజేంద్రప్రసాద్ కు భానుమతితో మంచి స్నేహం కుదిరింది. ఎప్పుడైనా మంచి సలహాలకోసం ప్రసాద్ ఆమెను సంప్రదించడం కద్దు.

హాస్యనటుడు 1970లో ‘మట్టిలో మాణిక్యం’ పేరుతో ఒక సొంత చిత్రానికి శ్రీకారం చుట్టి, సినిమాలో కొంతభాగాన్ని పంపిణీదారులకు ప్రదర్శిస్తే వాళ్ళు “కథ పేలవంగా వుంది, పంపిణీ చేయలేం” అంటూ చేతులెత్తేశారు. అయితే “చలం తల్లి పాత్రకు భానుమతి గారిని అడిగి చూడండి. ఆమె సరేనతే పంపిణీ చేస్తాం’’ అనడంతో చలం భానుమతిని కలిసి బ్రతిమాలాడు. ప్రాముఖ్యం లేని ఆ పాత్రనుచేయలేనని భాముమతి కరాఖండిగా చెప్పేసింది. ఈ కథను వినిపించింనప్పుడు చక్రపాణి, నరసరాజు కూడా అక్కడే వున్నారు. చక్రపాణి కల్పించుకొని ‘’భానుమతి ఎవరినైనా ఏడిపిస్తే జనం చూస్తారుగానీ, ఆమె ఏడ్చే వేషం కడితే ఎవరు చూస్తారు’’ అంటూ చమత్కరించారు. దాంతో చలం భానుమతి పాత్రని ఏడు రీళ్లకు పెంచి, దానిని వదిన పాత్రగా మార్చి తెరకెక్కించాడు. ఆ పాత్రకు మాటలు తానే రాసుకున్నారు భానుమతి. సినిమా భానుమతి మూలంగానే సూపర్ హిట్టయింది. అదే వూపులో భానుమతి ‘అంతా మనమంచికే’ సినిమా నిర్మించి దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించి హిట్ చేశారు. దీనికి ముందు 1953 లోనే భానుమతి ‘చండీరాణి’ అనే త్రిభాషా చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ద్విపాత్రాభినయం చేసిన విషయం మనకు తెలిసిందే.

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్ వారు పాతాళ భైరవి సినిమా నిర్మించేనాటికే ఆమె సూపర్ స్టార్. అప్పుడే వాహినీ వారు భానుమతి, రామారావు తో మల్లీశ్వరి సినిమా నిర్మించారు. విజయా వారు మిస్సమ్మ సినిమా నిర్మాణం తలపెడుతూ రామారావుకు జంటగా భానుమతిని తీసుకున్నారు. అందులో రెండవ హీరోయిన్ గా తొలుత సావిత్రిని ఎంపిక చేశారు. సినిమా నాలుగు రీళ్లు తయారైంది. ఒక వరలక్ష్మీ వ్రతం రోజున భానుమతి పూజాదికాలు పూర్తిచేసుకొని షూటింగ్ కు ఆలస్యంగా హాజరైంది. ఆమె ఆలస్యంగా రావడం చక్రపాణికి కోపం తెప్పించింది. ఆమెను చక్రపాణి సంజాయిషీ కోరారు. “ముందురోజే ఉత్తరం రాసిపెట్టి మీకు అందజేయమని మీ గుమాస్తాకు ఇచ్చివచ్చాను” అని భానుమతి చెప్పిన సమాధానం చక్కన్నకు నచ్చలేదు. ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. చక్రపాణి వెంటనే అప్పటిదాకా షూట్ చేసిన నాలుగు రీళ్లను తెప్పించి ఆమె ఎదురుగానే కాల్చేయించి, ఆమె స్థానంలో సావిత్రిని మొదటి హెరోయిన్ ఘా ప్రమోట్ చేసి, సావిత్రి పాత్రను జమునకు ఇచ్చి సినిమా పూర్తిచేశారు. అయినాగాని చక్రపాణి, భానుమతి ల మధ్య గల స్నేహానికి మాత్రం అంతరాయం కలుగలేదు. చక్రపాణి భానుమతి చేత కథలు రాయిస్తూనేవచ్చారు. భానుమతి తన ఆత్మకథను రాస్తూ దానిని విజయా నిర్మాత నాగిరెడ్డి గారికి అంకితం చెయ్యడం విశేషం గా చెపుకోవాలి. భానుమతి నటి కాకముందే మంచి రచయిత్రి. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి ఆమెను తన శిష్యురాలిగా ప్రకటించారు కూడా. భానుమతి తన 80 వ యేట 24 డిసెంబర్ 2005 న చెన్నైలో మరణించారు.
-ఆచారం షణ్ముఖాచారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap