జయరాజ్ కు కాళోజీ పురస్కారం!

పద్మ విభూషణ్ ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా ప్రతిష్టాత్మకంగా ఇచ్చే కాళోజీ నారాయణరావు పురస్కారం 2023 సంవత్సరానికి ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్ కు లభించింది. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ ప్రతి యేటా అందించే కాళోజీ అవార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫారసు మేరకు, ముఖ్యమంత్రి కెసిఆర్ ఈసారి కవి జయరాజ్ ను ఎంపిక చేశారు.
ఈ నెల 9వ తేదీన శ్రీ కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే అధికారిక కార్యక్రమంలో జయరాజ్ కు ‘కాళోజీ’ అవార్డును అందజేయనున్నారు. ఈ అవార్డు ద్వారా లక్ష వెయ్యి నూట పదహార్లు నగదు (రూ. 1,01,116/-) రివార్డును, జ్జాపికను అందించి దుశ్శాలువాతో సత్కరించనున్నారు.

ఉమ్మడి వరంగల్, నేటి మహబూబాబాద్ జిల్లాకు చెందిన శ్రీ జయరాజ్ చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి కవిగా పేరు తెచ్చుకున్నారు. వారి వయసు 60. పేద దళిత కుటుంబానికి చెందిన జయరాజ్ వివక్షత లేని సమ సమాజం కోసం తన సాహిత్యాన్ని సృజించారు. బుద్ధుని బోధనలకు ప్రభావితమై డా. బి.ఆర్. అంబేద్కర్ రచనలతో స్ఫుర్తి పొందారు.
తెలంగాణ ఉద్యమ కాలంలో పల్లె పల్లెనా తిరుగుతూ తన ఆట, పాట, గానం ద్వారా ప్రజల్లో తెలంగాణ సాంస్కృతిక ఉద్యమ భావజాలాన్ని రగిలించిన ప్రజా కవిగా జయరాజు గుర్తింపు పొందారు. ప్రకృతి గొప్పతనాన్ని వర్ణిస్తూ, పర్యావరణ పరిరక్షణ కోసం పలు పాటలు రచించారు. జయరాజ్ రాసిన పాటలలో శిలా నీవే… శిల్పివి నీవే… శిల్పానివి నీవే …, వానమ్మ.. వానమ్మ.. వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవమ్మ వానమ్మ.. వంటివి ముఖ్యమైనవి. మనిషికీ ప్రకృతికీ వున్న అవినాభావ సంబంధాన్ని తన సాహిత్యం ద్వారా సున్నితంగా విశ్లేషించారు. కాళోజీ పురస్కారం అందుకోనున్న జయరాజ్ అన్నకు అభినందనలు

మహమ్మద్ రఫీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap