తెలుగు వాడుకే మనకొక ‘వేడుక’

తెలుగుభాష సుందరం… తెలుగుకోసం అందరం… అన్న నినాదంతో రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులతో ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారి ఆధ్యర్యంలో “మాతృభాషా మహాసభ” ఎంతో ఘనంగా జరిగింది. సభా ప్రారంభానికి ముందుగా సాయంత్రం 5 గంటలకు విజయవాడ,  లెనిన్ సెంటర్ లో విశ్వనాథ సత్యనారాయణ గారి విగ్రహం దగ్గర నుండి తెలుగుతల్లి రథం డప్పు కళాకారులతో, భాషా ప్రేమికులతో సభా ప్రాంగణానికి ఊరేగింపుగా కదలి వచ్చింది.

విజయవాడ, గాంధీనగరంలో మంగళవారం (5-9-23) సాయంత్రం మాతృభాష మహాసభ నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, భాషాభిమానులు పాల్గొన్నారు. ప్రముఖ సినీకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ, తెలంగాణలో అన్ని జిల్లాల్లోనూ ఒకే యాస ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రాంతాల వారీగా యాసలు, మాండలీకాలు ఉన్నాయన్నారు.

సంగీతంలో ప్రావీణ్యం ఉన్న మోహనరాగం, కల్యాణిరాగాల్లో ఉన్న వ్యత్యాసాలు ఎలా గుర్తిస్తారో అదే విధంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో ఉన్న యాసను, మాండలికాలు మనకు స్పష్టంగా తెలుస్తాయని చెప్పారు. వ్యక్తులు మాట్లాడే యాసను బట్టి వారి ప్రాంతాలను సులువుగా గుర్తుపడతారన్నారు. మీడియా ఛానళ్లు రోజుకో యాసలో వార్తలను చదివితే అందులో ఉన్న మాధుర్యం తెలుస్తుందని అభిప్రాయపడ్డారు.


కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు ఏడవదన్నారు. దేశంలో నాలుగో స్థానంలో ఉందన్నారు. 15 కోట్ల మంది తెలుగు భాషను మాట్లాడే వారున్నారన్నారు. విదేశాల్లో తెలుగు భాషకు ప్రాచుర్యం పెరుగుతుంటే, తొలి భాషాప్రయుక్త రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ లో ఇది క్షీణించిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2003లో వచ్చిన అసర్ నివేదిక ప్రకారం తెలుగు అక్షరాలు చదవలేని వారు ఒకటో తరగతిలో 43.8, ఐదో తరగతిలో 3.8, ఎనిమిదో తరగతిలో 2.3 శాతం మంది ఉన్నారని పేర్కొందన్నారు.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, “వాడుక భాషను వాడితే అదే ఒక వేడుక. ఇంగ్లీష్ పై మోజు ఉందని శరీర మంతా పూసుకోకూడదు. కాటుకలా మాత్రమే ఉపయోగించాలి. వ్యవసాయంలోకి యువతరం రావడం లేదన్నారు. అదేవిధంగా భాషలోకి యువత రాకపోతే అది ఏమవుతుందో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఆంగ్ల భాషలోనే ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేయడంతోనే యువతరం తమకు తెలుగు భాష వద్దనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాతృభాషపై పట్టు ఉన్న వారు ఎన్ని భాషలైనా నేర్చుకుని మాట్లాడగలరన్నారు. చైనా, జపాన్ వారికి ఇంగ్లీష్ రాదని తెలిపారు. నోబుల్ బహుమతి సాధించిన వారిలో 80 శాతం మంది మాతృభాష ఇంగ్లీష్ కాదన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ తెలుగు భాషను 2012లో అత్యంత సుందరమైన భాషగా గుర్తించారన్నారు. వాడుకలో తెలుగు నాలుగో స్థానంలో ఉందన్నారు. ఇటువంటి తెలుగు అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు ప్రాధాన్యం, మాధుర్యాన్ని గుర్తించాలని చెప్పారు. ఒక భాష మృతభాషగా మారితే దానికి అనుబంధంగా ఉన్న సంస్కృతి అంతరించి పోతుందన్నారు. తమ బాల్యంలో మద్రాసులో వున్న రోజుల్లో ఇంటి వద్ద తెలుగు నేర్చుకునే ఏర్పాటు నాన్న నందమూరి తారక రామారావు గారు చేసారన్నారు.

తానామాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ ఆంగ్లభాషలో చదివితేనే ఉద్యోగాలు వస్తాయన్నది వట్టి అపోహ మాత్రమేనని, జపాన్, చైనా, జర్మనీ వంటి దేశాల్లో మాతృభాషలోనే విద్య నభ్యసించి విజయాలు సాధిస్తున్నారని, కొంతమంది తల్లి దండ్రులలో నెలకొన్న భయాన్ని ఆసరాగా చేసుకొని బలవంతంగా ఆంగ్ల మీడియం చదువులు రుద్దుతున్నారన్నారు.

కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జనసేన నేత కందుల దుర్గేష్, సింగపూర్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధి వామరాజు సత్యమూర్తి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ పాల్గొన్నారు. ఇంకా ఈ సభలో ప్రముఖ రచయితలు, జర్నలిస్టులు, భాషా ప్రేమికులు పాల్గొన్నారు.
-కళాసాగర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap