టాలీవుడ్ ఇండస్ట్రీ లో కుట్రలు షరా మామూలే. ఆ మాట కొస్తే, కుట్రలు కుతంత్రాలు లేని రంగం ప్రత్యేకంగా ఏదీ లేదు. ఉంటే మీరు చెప్పొచ్చు.
ఇస్రో నుంచి సినీ ఇండస్ట్రీ వరకు అన్ని రంగాల్లో తొక్కేసే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా పక్కోడ్ని పైకి లేవనివ్వకుండా తొక్కే ప్రయత్నం చేస్తుంటారు. ఆ కుట్రలోంచి చీల్చుకుని బయటకు వచ్చి సక్సెస్ చూపించిన వాడే రియల్ హీరో. అది సినిమా రంగం అయినా, మరే రంగం అయినా.
ప్రతి రంగంలో పోటీ ఉంటుంది. ఏ రంగంలో అయినా రాణించాలంటే ఎవరికి నల్లేరు నడక కాదు. కార్పేట్ వాక్ అంత కన్నా కాదు. కొందరికి ఎక్కడో సుడి ఉంటుంది. కొందరికి అదృష్టం తోడు అవుతుంది. ఇలాంటి వాళ్ళు కొంత త్వరగా అనుకున్న విజయాన్ని అందుకుంటారు. అయితే ఏది అంత ఈజీ మాత్రం కాదు.
వారసులు అయితే దారి కాస్త పూలబాట కావొచ్చు. ప్రతిభ ఉంటేనే అది పూలబాట. ప్రతిభ లేకుంటే వారసులకు పూలబాట ముళ్లబాటగా మారిపోవడానికి ఎంతో టైం పట్టదు. ఇది సినిమా ఇండస్ట్రీ గురించి మాత్రమే కాదు. రాజకీయ రంగం, వ్యాపార రంగం ఇంకే రంగం లో అయినా కావచ్చు. బలవంతంగా జనం పైకి వదిలితే ఘన స్వాగతం ఏం చెప్పరు. ప్రతి ఒక్కరికి ఒక భజన బృందం ఉంటుంది. ఈ బృందం రెడ్ కార్పేట్ పరుస్తుంది. అయితే ప్రతిభ ను నిరూపించుకుంటేనే జనం ఆదరిస్తారు. ఆయా రంగాల్లో రాణించగలుగుతారు.
సినిమా ఇండస్ట్రీ లో కూడా ఎవరూ ప్రతిభ లేకుండా రాణించరు. ప్రతిభ తోనే ఎవరికయినా సక్సెస్ లభిస్తుంది! ఇక కుట్రలు కుతంత్రాలు అన్ని రంగాల్లో మాదిరిగా సినిమా రంగం లోనూ ఉంటాయి. కుల మతాలు ఇమేజ్ లు ఇతరత్రా వ్యవహారాల పై వాటి తీవ్రత ను బట్టి కుట్రల స్థాయి ఉంటుంది. కొందరు అద్భుతమైన నటులు ఇలా వచ్చి అలా మాయం అయిపోయారు. కొందరు అద్భుత ప్రతిభ వున్నా సక్సెస్ అందుకోవడం కోసం నానా తంటాలు పడుతుంటారు. ఇది గొప్ప వినోద రంగం. అంతకు మించి పెద్ద వ్యాపార రంగం.
ఇండస్ట్రీ కొందరి చేతుల్లో కీలు బొమ్మ అంటుంటారు చాలా మంది. ఇలా అనడం తప్పు అంటాను నేను. ఆ వ్యాపారంలో వారి సక్సెస్ అంటాను. వారే విజేతలు అంటాను. పారిశ్రామిక రంగం లో వేల కోట్లు సంపాదిస్తుంటారు. వాళ్ళను ఎవ్వరు వేలెత్తి చూపరు. సినిమా ఇండస్ట్రీ కూడా అంతే. ఇక్కడెందుకు తప్పు పట్టాలి. ఎవరు ముందు ఉంటే వాళ్లే విజేతలు.
సరే, అసలు విషయానికి వద్దాం. ఖుషి సక్సెస్ మీట్ లో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఇండస్ట్రీలో తనపై కుట్ర జరుగుతోందని, డబ్బులు ఇచ్చి మరీ కొందరు నెగటివ్ రివ్యూలు రాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వంద మంది అభిమానులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు వంతున కోటి రూపాయలు రానున్న పది రోజుల్లో ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఈ రెండు విషయాలను విడివిడిగా చూడలేక పోతున్నాం. కుట్ర జరుగుతోందని, అభిమానులు తిప్పి కొట్టాలి అని కోటి రూపాయలు ఇస్తున్నట్లు అనిపించింది. ఏది ఏమైనా వంద మందికి కోటి రూపాయలు ఇవ్వడం అభినందనీయం. చాలా సంతోషం. విజయ్ దేవరకొండ కు శుభాకాంక్షలు.
ఇండస్ట్రీ కుట్రదారులకు నా సలహా. ఇంకో పది మంది హీరోలను తొక్కే ప్రయత్నం చేయండి. ఒక్కో హీరో వంద మందికి ఒక్కొక్కరికి లక్ష చొప్పున, పది మంది హీరోలతో వెయ్యి మంది అభిమానులకు పెద్ద ఊరట లభిస్తుంది. నిజంగా ఇండస్ట్రీలో కుట్రదారులు ఉంటే ఈ సలహా పాటించమని నా విజ్ఞప్తి.
–డా. మహ్మద్ రఫీ