తెలుగు వేడుకల లోగిలి — ఇప్పిలి చిత్రావళి

 “అనన్య ప్రతిభతో కూడిన వేయి అనుకరణ చిత్రాల కన్నా స్వంత ఆలోచనతో స్వయంగా వేసిన ఒక చిన్న చిత్రం మేలు” అదీ తమదైన ప్రత్యేక సంస్కృతిని ప్రతిబింబించేదిగా వున్నప్పుడు అది మరింత మేలుగా వుంటుంది. సుధీర్గ కాలంగా బ్రిటిష్ పాలనలో మగ్గిన మన దేశంలో సకల రంగాలు సహజంగానే పాశ్చాత్య ప్రభావాన్నుండి తప్పించుకోలేకపోయాయి .అందుకు కళారంగం కూడా మినహాయింపు కాలేని సమయంలో బెంగాల్ నందలి జమినీరాయ్ అనే చిత్రకారుడు పాశాత్యచిత్ర కళా ఆదిపత్యంపై తిరుగుబాటు చేసి తన ప్రాంతమునందలి మూలాలను తనయొక్క కళలో ప్రవేశ పెట్టి ధైర్యంగా జానపద చిత్రకళను విస్తృతంగా ప్రచారం చేసాడు. తద్వారా అంతర్జాతీయ ఖ్యాతి గడించాడు.ఆ ప్రభావంతో కర్ణాటకలో వెంకటప్ప, ఆంధ్రప్రదేశ్ లో అంట్యాకుల పైడిరాజు ,తెలంగాణలో కాపురాజయ్య తదితరులు కృషి చేసి ఎంతో ఖ్యాతిని గడించడం జరిగింది.పైన పేర్కొన్న చిత్రకారులంతా  నేడు లేకున్నా ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తూ చిత్రకళా రంగంలో మన తెలుగింటి జానపద సంప్రదయ చిత్రకళలో విశేషంగా కృషి చేస్తూ ముందుకు సాగుతున్న మరో గొప్ప చిత్రకారుడు  శ్రీకాకుళానికి చెందిన శ్రీ ఇప్పిలి జోగి సన్యాసి రావు.  

2017లో రాజమహేంద్రవరంలో  జరిగిన భగీరధి ఆర్ట్ ఫౌండేషన్ వారి కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా సన్యాసిరావు గారి చిత్రాలను నేను  చూడడం జరిగింది. సన్యాసిరావు గారు మరియు వారి అబ్బాయి రంజిత్ శర్మలతో తొలిసారిగా నాకు అక్కడే  పరిచయం కలిగింది . మరలామొన్న2018 డిశంబర్ 8  న శ్రీకాకుళం నందలి అరసవిల్లి సూర్య దేవాలయ ప్రాంగణంలో మా డైట్ 1990-1991 బ్యాచ్ (నేను ఒకప్పుడు ఉపాధ్యాయుడిని ) ఏర్పాటు చేసిన ఆత్మీయ సంగమంలో పాల్గొన్న నేను మా డైట్ ప్రిన్సిపాల్ శ్రీ కే.పి.ఏ చౌదరి గారు  మరియు కొందరి  మిత్ర బృందంతో దేవాలయంలో రంజిత్ శర్మ గారిని కలవడం, ఎంతో ఆప్యాయంగా వారు సూర్య భగవానుడి దర్శనం చేయించడంతో పాటు వారి ఇంటికి తీసుకెల్లడం ద్వారా మరలా వారి చిత్రాలను నాతో బాటు మా మిత్ర బృందం కుడా చూసే అదృష్టం కలిగింది .              

సన్యాసిరావు గారి చిత్రాలకు మన  తెలుగింటి జానపద జీవన,ఆచార సాంప్రదాయాలు  ప్రేరణగా నిలిచాయని చెప్పవచ్చు. ఈ ఆచారాలు సంప్రదాయాల నిర్వాహణలో సాధారణంగా మగాల్లకంటే మగువలదే ప్రధాన పాత్రగా  వుంటుంది. అందు చేతనే వీరి చిత్రాల్లో గ్రామీణ మహిళలే అధికంగా మనకు కనిపిస్తారు. అందులోని ఆ మగువలు  ‘పేరంటానికి రండి” అని బొట్టు పెట్టి పిలుస్తారు. ‘పూజకు వేళాయిందని” పూలు పళ్ళతో సిద్దమౌతారు. గోరింటాకు పెట్టుకుంటూ సంభరపడిపోతారు. “స్వామీ సేవకు సమయమయ్యిందని” గాబరా పడతారు , పూలు పళ్ళతో గుడికి బయలుదేరతారు. కోనేటి దగ్గర కబుర్లు చెబుతారు. ముచ్చట్లాడతారు , చెమ్మ చెక్క చేరడేసి మొగ్గ అంటూ ఆటలాడతారు. గృహమే కదా స్వర్గ సీమ అంటూ వాటిని అందంగా అలంకరిస్తారు. “బహు కాలానికి నేస్తం” అంటూ వొచ్చిన భంధువుని ఆప్యాయంగా ఇంట్లోకి ఆహ్వానిస్తారు. “మరలా తప్పకుండా రానేస్తం” అని వొచ్చిన బంధువులను అంతే ఆప్యాయంగాసాగ నంపుతారు. నూతన వధువికి పోటా పోటీగా “ముస్తాబు”లు చేస్తారు, నిండుగర్భిణీలకు శ్రీమంతాలు నిర్వహిస్తారు. ఇలా అన్నింటా అచ్చమైన,స్వచ్చమైన తెలుగు సాంప్రదాయాలు కొట్టొచ్చినట్లు వీరి చిత్రాలలో మనకు దర్శనమిస్తాయి. బహుసా వారి పూర్వీకులనుండి కూడా శ్రీకాకుళం అరసవిల్లి సూర్యదేవాలయ ప్రధాన అర్చకులుగా కొనసాగుతున్న శిష్ట సంప్రాదాయ బ్రాహ్మణవంశంలో జన్మించినందువల్ల కాబోలు వీరి కళపై ఆ సాంప్రదాయ ప్రభావం బాగా కనబడుతుంది

 శ్రీ సన్యాసిరావు రావు గారు 20 పిబ్రవరి 1946 వ సంవత్సరంలో శ్రీకాకుళం లోని అరసవిల్లి లో శ్రీమతి మహాలక్ష్మి, సింహాచలం దంపతులకు జన్మించారు. చిన్నతనం నుండే చిత్రకళపై ఆసక్తి చూపుతున్న వీరిని తన తండ్రి శ్రీకాకుళం లోనే ప్రముఖ రూప చిత్రకారుడు  కూర్మపు నరసింహం గారి వొద్ద శిష్యునిగా చేర్పించారు , ఆపై విజయనగరంలోని మరో ప్రముఖ జానపద చిత్రకారుడు అంట్యాకుల పైడిరాజు గారి వద్ద అభ్యసనం చేసిన అనంతరం మరో ప్రముఖ చిత్రకారుడు రంగుల రారాజు వడ్డాది పాపయ్య గారి వద్ద శిశ్రూష చేసి ముగ్గురి చిత్రకారులలో గల ప్రత్యేకతలను ఆకళింపు చేసుకొన్నారు . ఆపై డ్రాయింగ్ పరిక్షలలో ఉత్తీర్ణుడై ఆముదాలవలసలో ఆర్ట్ టీచర్ గా పని చేసి 2004 లో రిటైరయ్యారు . ముగ్గురి చిత్రకారుల వద్ద శిష్యరికం చేయడం వల్ల త్రివేణి సంగమంలా వీరి చిత్రాల్లో ముగ్గురి ప్రభావం కనిపిస్తుంది . అయినప్పటికీ వీరిని చిత్రకారుడిగా ఒక స్థాయిలో నిలిపినవి మాత్రం జానపదరీతిలో వేసిన సాంప్రదాయ చిత్రాలే అని చెప్పవచ్చు. వీటిపై పైడిరాజు గారి వొద్ద నేర్చిన లేపాక్షి చిత్రశైలి రేఖా చిత్ర రచనలో కనిపిస్తే, రంగుల విన్యాసంలో వడ్డాది పాపయ్య గారి ప్రభావం కనిపిస్తుంది. వీరి చిత్రాల్లో ఎక్కువభాగం సామూహిక చిత్రాలే. అందునా మహిళా మూర్తుల రూపాలే వాటిల్లో ఎక్కువగా ధర్సనమిస్తాయి. వాటిల్లో మూర్తుల వదనములన్ని చూపరులకు అభిముఖంగా గాకుండా అర్ధ ముఖాలై పక్కకు తిరిగి వుంటాయి. ఇక చిత్రంలోని నేపధ్యమంతా  వివిధ సాంప్రదాయ అలంకరణలతో ఎక్కడ వెలితి లేకుండా నింపడం వీరి చిత్ర రచనలో ప్రత్యేకత . ఈ విదమైన శైలికి ప్రేరణ  పైడి రాజు గారు, మరియు లేపాక్షి చిత్రకళ అని చెప్పవచ్చు .

పై వాటితో పాటు టాగూర్, గాంధి ,  త్యాగ రాజు, తేరీస్సా , తిరుపతి వెంకటేశ్వరస్వామి, ఇంకా తాను నిత్యం ఆరాదించే ఆదిత్యుడు , అరసవిల్లి సూర్య భగవానుడు , వివేకానందుడు ,సుబ్బులక్ష్మి తదితర రూపచిత్రాలు మరియు ప్రకృతి  దృశ్యాలు       కూడా ఎన్నోవేసారు. వీరి తొలి గురువైన కూర్మపు నరసింహం గారి ప్రభావం వీటిల్లో కనిపించినప్పటికీ సన్యాసిరావు గారిని ప్రత్యేకంగా నిలిపినవి  మాత్రం  జానపద రీతి చిత్రాలనని గట్టిగా చెప్పవచ్చు. ఈ చిత్రాలే వీరికి ఎక్కువ పేరు ప్రఖ్యాతులను తీసుకు వొచ్చాయి.

ఒక చిత్రకారుడిగా రాష్ట్ర జాతీయ స్థాయిలో పలు సాముహిక ప్రదర్శనలలో తన చిత్రాలను ప్రదర్శించడమే గాకా ఎన్నో పోటీలలో సైతం పాల్గొని పలు బహుమానాలను అందుకున్నారు. 1975 లో జిల్లాస్థాయిలో ఉత్తమ చిత్రకారుడిగా సన్మానం పొందారు . 1979 లో వెల్లటూరు నవరంగ చిత్ర కళానికేతన్ వారు నిర్వహించిన అఖిలభారత చిత్రకళా పోటీలలో సన్యాసిరావు గారు చిత్రించిన” పేరంటానికి పిలుపు “ అన్న చిత్రం అత్యుత్తమమైనదిగా ఎంపికయ్యి ఉత్తమ బహుమతిగా బంగారు పతాకాన్ని అందుకున్నారు. 1997 లో విశాఖ కూరెల్ల ట్రస్ట్ వారి నుండి మరొక్క సారి ఉత్తమ చిత్రకారుడిగా సన్మానం అందుకున్నారు. 2002 లో అరసవిల్లి లో కూడా ఉత్తమ చిత్రకారుడిగా పౌర సన్మానాన్ని అందుకున్నారు. 2005లో మహతీ సాంస్కృతిక సేవా పురష్కారాన్ని మరలా అదే ఏడాది డిశంబర్ లో యుగాల్ల ట్రస్ట్ వారి నుండి అవార్డ్ తీసుకున్నారు .ఇంకా చిత్రకళా సంషద్ మచిలీపట్నం, అంకాల ఆర్ట్స్ అకాడమి భీమవరం, ఆంధ్ర అకాడమి ఆఫ్ ఆర్ట్స్ విజయవాడ, లలితకళా సమితి సిద్ధిపేట , లలితకళా కేంద్రం బాపట్ల, గంజాం జిల్లా అసోషియేషన్ బరంపురం, మహాకేశవ్ కళా పరిషద్ రాయపూర్, భారత కళా పరిషద్ హైదరాబాద్, కోనసీమ చిత్రకళా పరిషద్ అమలాపురం, భగీరధి ఆర్ట్ ఫౌండేషన్ రాజమహేంద్రవరం, ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమి తదితర ఎన్నో సంస్థల నుండి ఎన్నో బహుమానాలను అందుకున్నారు.

రాష్ట్ర జాతీయ స్తాయిలోనే గాకా అంతర్జాతీయంగా కూడా వీరి చిత్రాలు గుర్తింపు తెచ్చుకున్నాయి అని చెప్పడానికి ఉదాహరణగా అమెరికాలోని చెషైర్ నగరం నందలి ఒక  దేవాలయంలోని సన్యాసిరావు గారు చిత్రించిన సత్యనారాయణ స్వామి  తైలవర్ణ చిత్రం చూపరులను మైమరపిస్తుంది. అంతే గాకా అక్కడ గల సంగీత సభా భవనంలో కుడా వీరు చిత్రించిన త్యాగరాజ స్వామి వారి చిత్రం అలంకరింపబడడం ఇంకో గొప్ప విశేషం. అమెరికా నుంచి వెలువడుతున్న తానా వారి మాస పత్రిక పైన మరియు న్యూ జెర్సీ నుండి వెలువడే తెలుగు జ్యోతి పత్రికపైనా  వీరు వేసిన బొమ్మలు ఎన్నో ముఖ చిత్రాలుగా ప్రచురింపబడ్డాయి. అంతే గాకుండా లండన్ లో అంగ్లేయులకే ఆంగ్లం భోదించే బ్రౌన్ డాక్టర్ గూటాల కృష్ణ మూర్తి గారు ప్రత్యేకముగా వీరి చేత త్యాగరాజ స్వామి వారి చిత్రపటాన్నివేయించుకోవడం మరో గొప్ప విశేషం.

కళ మనల్నే కాదు మనప్రాంతాన్ని, మన సంస్కృతిని , సాంప్రదాయాన్ని కూడా వ్యక్తం చేసేదిగా వుండాలి. భావితరాలకు అది మార్గ దర్శకంగా వుండాలి అనే భావనతో నిబద్దతతో కళాయాణం చేస్తున్న ఈ 72 ఏళ్ళ యువ చిత్రాకారుడు నేటికి అదే నిబద్దతతో తన కుంచెతో సంస్కృతి చిత్రాలను వేస్తూ ముందుకు సాగుతున్న వీరి కృషి ఎంతైనా అభినందనీయమైనది. దామెర్ల, వడ్డాది పాపయ్య,పైడిరాజు తదితరుల చిత్రాలను ఇప్పటికే ఆశ్రద్దతో విస్మరించిన ప్రభుత్వం మన సంస్కృతికి ప్రతిభింబాలై  నేటికి అందుబాటులో వున్న వీరి చిత్రాలనైనా సేకరించి భద్రపరిచినట్లయితే భావి తరాలకు మన విలువైన ఆచార సాంప్రదాయాలను తెలియజేసినవాల్లమవుతాము

-వెంటపల్లి సత్యనారాయణ ( 9491378313)

                                                                                                         

10 thoughts on “తెలుగు వేడుకల లోగిలి — ఇప్పిలి చిత్రావళి

  1. Excellent…… 72సంవత్సరాల యువ కళాకారులు అని ప్రసావించడం బహుబాగుంది,అంటే కళల పట్ల ఆసక్తి కలగటానికి వయస్సుతో సంబందం లేదు. నిరూపించారు మన ఈ చిత్ర కారులు.ఇలాంటి వారిని, వారి కళలని వెలికి తీసూన వెంటపలి గారికి అబినందనీయం.

  2. తెలుగు సాంప్రదాయ ఆచారాలపై ఇప్పిలి జోగి సన్యాసి రావు గారి చిత్రాలు ఎంత బాగున్నాయో వాటిని వెంటపల్లి గారు వర్ణించిన తీరు ఇంకా బాగుంది చిత్రకారుడికి రచయితకి నా అభినందనలు

  3. శ్రీ ఇప్పిలి జోగి సన్యాసిరావుగారికి అభినందనలు..వ్యాసరచయిత శ్రీ వెంటపల్లివారికి..మరియు 64కళలు.కాం శ్రీ కళాసాగర్ గారికి ధన్యవాదాలు..
    లాల్..కార్టూనిస్ట్..వైజాగ్..2-1-19

    1. లాల్ గారు ధన్యవాదములు నా ఆర్టికల్ చది వి మంచి అభిప్రాయం వ్యక్తం చెప్పినందుకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap