వూటుకూరి వెంకటరావు గారు సంస్కృత భగవద్గీత – సరళ తెలుగు వచనంలో… రాసిన ‘గీతార్థం’ గ్రంథం ఆవిష్కరణ శ్రీ వాసవీ హైస్కూల్ ప్రాంగణం చీరాలలో మార్చి 31న గురువారం జరిగినది. ఈ ఆవిష్కరణ ప్రారంభంలో శ్రీ కృష్ణ వేషదారణలో వచ్చిన చిన్నారులను వేదిక పైన అందరిని ముగ్గులను చేశారు. సభాధ్యక్షులుగా వడలి రాధాకృష్ణ గారు వ్యవరిస్తూ ‘కాలం కాలం కాలం నిన్నటి తీపికి రేపటి ఆశకు సోపానం ఇది మానవుడే నవ భావకుడై సేవించే ఇంద్రజాలం’ అన్న సందేశంతో రచయితగారు సరళ భాషలో రచించి జిడ్డు కృష్ణమూర్తిగారికి ఆదర్శంగా నిలిచారని తెలిపి వేదిక మీదకు ముఖ్య అతిధులను అతిధులను ఆహ్వానించారు. ముందుగా వలివేటి విశ్వనాథబాబువారి శ్రీమతి గీతా గార్లు, జయప్రభగారు, మల్లికార్జునగారు మరియు అనిల్ గారు జ్యోతి ప్రజ్వలన చేశారు. గ్రంథ ఆవిష్కరణ ధర్మవరపు వెంకటరమణగారు చేశారు. వెంకటరమణగారు మాట్లాడుతూ భగవద్గీతను సరళ తెలుగులో అందించడం వలన మనిషి జీవనంలో ఎదురయ్యే వడిదిడుకులకు చ్కటి మార్గం చూపుతుందని అన్నారు. గ్రంథ సమీక్ష డా. యమ్. వెంకటరావుగారు చేశారు సమీక్షలో వివరిస్తూ గ్రంథంలో ఎన్నో విషయాలను సాదారణ మానవుడు తనకుతాను చదువుకుని అర్థంచేసుకొనేలా ఆచరించేలా ఉందని అందులో మనిషి ఆహారనిలలో వివరిస్తూ భూమినించి మొలకెత్తినవి మాత్రమే ఆహారంగా స్వీకరించాలి అని అలాగే ఇంద్రియ నిగ్రహం లేని వాడు విషయ భోగాలలో మునిగిన వాడు ప్రాపంచిక సుఖాలపై మోహం చెందేవాడు ఏనాటికీ సుఖపడడు అని వివేక వైరాగ్యలనే జ్ఞాన ఖడ్గాలతో ‘ఆశ’ అనే విషవృక్షాన్ని సమూలంగా నరికి వేస్తే ముముక్షువుడు కాగలడని ఇలా క్లుప్తంగా రచయితగారు అందిచారని అన్నారు.
ఇక చిటిప్రోలు వేంకటరత్నంగారు మాట్లాడుతూ తెలుగులో సరళంగా వ్రాయడం చాలా కష్టమని కష్టాన్ని ఇష్టంగా మలిచినదే ఈ గీతార్థం అన్నారు. డా. ఉమామహేశ్వరరావుగారు మాట్లాడుతూ ప్రస్తుతం తెలియని స్థలాన్ని చేరుకొనెందుకు జి.పి.యస్. ఎలా ఉపయోగ పడుతుందో మోక్షమార్గానికి భగవద్గీత అలాంటిదని అన్నారు. ప్రముఖ న్యాయవాది హేమంత్ కుమార్ గారు మాట్లాడుతూ శేషజీవితంలో చదివితే ఏమి రాదని చిన్నప్పటి నుండే చదివితే జీవితం సార్థకతమౌతుందని అన్నారు. వలివేటి మురళీకృష్ణగారు స్థితప్రజ్ఞుడి లక్షణాలగురించి చక్కగా వివరించారన్నారు. చివరగా రచయిత వూటుకూరి వెంకటరావుగారు మాట్లాడుతూ సంస్కృతంలో ఉన్న పదాలకు సరళ తెలుగులో వ్రాస్తే సులువుగా అర్థ చేసుకుని ఆచరిస్తే ప్రతీ మనిషి మోక్షం పొందగలడని ఈ ప్రయత్నం చేశానన్నారు. ముఖ్య అతిధులను అతిధులను రచయితనూ శ్రీ వాసవీ హైస్కూల్ డైరెక్టర్సు ఘనంగా సన్మానించారు. అనంతరం సభాధ్యక్షులు సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పి సభను ముగించారు.
-మల్లిఖార్జున ఆచారి