అందరిదీ గిడుగుబాట కావాలి

ఆగస్టు 29 గిడుగు రామమూర్తి పంతులు జన్మదినం. తెలుగు భాషకు ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా గిడుగు మాతృభాషా దినోత్సవంగా ప్రకటించారు.

భాష ఒక ప్రాంత ప్రజల సమిష్ఠి సంపద. భాష ఆధారంగానే ఆచారాలు, అలవాట్లు రూపుదిద్దుకుంటాయి. ఒక భాష ఒక జాతిని తయారు చేస్తుంది. ఆ జాతికి ఒక గుర్తింపు తీసుకువస్తుంది. ఆ భాష మాట్లాడే వారిలో ఐక్యత, భాషాభిమానం ద్వారా సాధ్యమవుతుంది. ఒక్కొక్క సందర్భంలో భాషలమీద ఒక లాంటి దాడి జరుగుతుంది. ఈ విషయం గుర్తించిన ప్రపంచదేశాలు మాతృభాషలను కాపాడాలనే సదుద్దేశంతో మాతృభాషా దినోత్సవం ప్రారంభించారు. ఇది బెంగాలీ భాష కోసం బంగ్లాదేశీయులు పాకిస్థాన్ లో చేసిన పోరాటాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరిలో జరుపుకునే దినోత్సవం. ఉర్దూను అధికారభాషగా తూర్పు పాకిస్తాన్ ప్రజలమీద రుద్దే యత్నం చేసినపుడు బెంగాలీ భాషాభిమానంతో, తమ మాతృభాషను రక్షించుకునే యత్నంలో ఒక కొత్త దేశాన్నే తయారుచేసుకున్నారు తూర్పు పాకిస్థానీయులు. నేటి బంగ్లాదేశ్ భాషాభిమానం నుండి పుట్టిన దేశం. ఒక జాతి గర్వపడేలా చేయగలిగిన భాష అని చెప్పటానికి తాజా సాక్ష్యంగా నిలుస్తుంది బంగ్లాదేశ్.

ప్రపంచమంతా మాతృభాషా దినోత్సవం జరుపుకుంటున్నా, భాషలను రక్షించాలన్న ప్రకటనలు, అధికారిక కార్యక్రమాలు జరుగుతున్నా, ప్రస్తుతం భాషలమీద దాడులు పరోక్షంగా జరుగుతూనే వున్నాయి.
మాతృభాషాదినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరపాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం తర్వాతే ప్రాంతీయ భాషలకు ముప్పు పెరగటం గమనార్హం. ప్రపంచీకరణ నేపథ్యంలో ఇంగ్లీషు భాష పెత్తనం పెరిగి, మిగిలిన భాషలు నేర్చుకోవటం వృథా అనే భావం బలంగా యువమనసుల్లో నాటుకునేలా చేయగలిగారు.
మాతృభాషకు చిన్నవయసులోనే దూరమవుతున్న విషయం గమనించిన భాషాభిమానులు తమ తమ భాషలకు ప్రత్యేకంగా భాషాదినోత్సవాలను జరపాలనే నిర్ణయానికి వచ్చాయి. ఆ వరుసలోనే తెలుగుభాషాభిమానులు తెలుగు మాతృభాషా దినోత్సవం జరిపేందుకు ముందుకు వచ్చి అందుకు తగిన రోజుగా ఆగస్టు 29ని ఎంపికచేయడం జరిగింది.
ఆగసస్టు 29 గిడుగు వెంకట రామమూర్తిపంతులు జన్మదినం. తెలుగభాషకు ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా గిడుగు రామమూర్తి పుట్టినరోజును తెలుగు మాతృభాషా దినోత్సవంగా ప్రకటించారు.
తెలుగు భాష మీద ఒకప్పుడు సంస్కృత భాష పెత్తనం ఉండేది. సంస్కృత భాష పెత్తనం ఉండేది. సంస్కృతం పెత్తనం ఇప్పటికీ కొనసాగుతున్నదనే వారు లేకపోలేదు. సమాజంలో సమాజంలో వర్గాలు సహజం.

ఐతే నాడు భాషాపరంగా కూడా రెండు వర్గాలుగా విడిపోయింది సమాజం. పండిత భాష వేరు, పామర భాష వేరు అంటూ భాషను విడగొట్టారు. అక్షరాలు అవే అయినా మాట్లాడే తీరు,
రాసే తీరులో ఉన్న తేడాలే ఆ విభజనకు కారణం. పండితులు మాట్లాడేది గ్రాంథికం. అక్షరాస్యత తక్కువగా ఉన్న రోజుల్లో చదువకున్నవారు చేపట్టిన గ్రాంథికభాషదే పైచేయి.
పామరభాషను రాసేందుకు వీలులేనిదిగా అవమానించారు. పామర భాష నుండి ఎదిగి చదువుకున్నవారు కూడా గ్రాంథికంలోకి వెళితే గాని గుర్తింపు ఉండేది కాదు. నేడు ఇంగ్లీషును నెత్తిన పెట్టుకున్న రీతిలోనే నాడు గ్రాంథికాన్ని కళ్ళకద్దుకున్నారు. ఇది తెలుగుకే కాదు, అన్ని భాషల్లోనూ కనిపించిన స్థితి.

ఇలా భాష ఏ కొందరి చేతులలోనో బందీ అయితే దానికి విస్తృత స్థాయి లభించదని భావించిన తెలుగుభాషాభిమానులు వ్యవహారికభాషోద్యమాన్ని చేపట్టారు. ఆ వ్యవహారిక భాషోద్యమంలో పిడుగులా పడి గ్రాంథికవర్గాన్ని నలిపేసి ప్రజలభాషకు పెద్ద పీట వేయించిన ప్రముఖుడే గిడుగు. అందుకే ఆయన జన్మదినోత్సవం కన్నా మరొకటి తెలుగు మాతృభాషా దినోత్సవానికి తగినది కాదు.
గిడుగు రామమూర్తి పంతులు శ్రీకాకళం జిల్లాలో 1863లో జన్మించారు. మెట్రిక్యులేషన్ పాసై కుటుంబ పరిస్థితి దృష్ట్యా స్కూల్ టీచర్ గా ఉద్యోగం చేపట్టారు. ఆయన కార్యస్థానం పర్లాకిమిడి.
ఆ తర్వాత చదవంతా ప్రైవేటు చదువే. ఎఫ్.ఎ.,బి.ఎ. చదివింది ప్రైవేట్ గా, రాజాగాని స్కూల్ కాలేజ్ స్థాయికి పెరిగినపుడు ఆయనస్థాయి లెక్చరర్ స్థాయి అయింది. ప్రముఖ కవి, రచయిత, నాటకకర్త గురజాడ అప్పారావు. గిడుగుకు సహాధ్యాయి. ఒక బ్రిటీష్ స్కూళ్ళ ఇన్ స్పెక్టర్ వేసిన ఒక ప్రశ్న గిడుగును పూర్తిస్థాయి భాషోద్యమ కార్యకర్తగా మార్చింది. ‘
రాసే భాషకు, మాట్లాడే భాషకు ఎందుకు ఇంత తేడా, ఇదే తేడా తమిళంలో కూడా చూశాను’ అని అడిగాడు మేట్ అనే ఆ అధికారి.
ఆ ప్రశ్న వేసింది ప్రిన్సిపాల్ శ్రీనివాస అయ్యగారిని అయినా, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది గిడుగు, గురజాడేనని ప్రిన్సిపాల్ అన్నారు. ఆ ప్రశ్నకు సమాధానంగా ఆ నలుగురూ అప్పటికప్పుడే ఒక నిర్ణయానికి వచ్చి భాషోద్యమం ప్రారంభించారు. బ్రిటీష్ పాలనలో చదవుల్లో ముందున్న కృష్ణా, గుంటూరు జిల్లాలలో కాక తెలుగు వ్యావహారిక భాషోద్యమం ఉత్తరాంధ్రలో పుట్టడం గమనించాలి.
1911 నుండి తన ఉద్యోగం వదిలి గిడుగు పూర్తిస్థాయి భాషోద్యమ కార్యకర్త అయ్యారు. వ్యవహార భాషనే అసలు భాష అని వాదించి, సామాన్య ప్రజలు మాట్లాడేదే ‘జీవద్భాష’గా ప్రచారం చేశాడు. ఇది మరో భాషమీద ద్వేషాన్ని తెచ్చిన ఉ ద్యమం కాదు. స్వభాషాభిమానంతో నిర్వహించిన ఉద్యమం.

ఒకవైపు పాలనంతా ఇంగ్లీషులోనే. ప్రభుత్వం విడుదల చేసే ఉత్తుర్వులన్నీ ప్రజలకు సంబంధం లేని ఇంగ్లీషులోనే. పరిపాలన తెలుగులో సాగాలని ఉద్యమిస్తూ దానికి స్పందించాల్సిన ప్రభుత్వాలు ప్రజలనే ఇంగ్లీష్ వారిగా మారుద్దామనే విధానాన్ని అమలుచేస్తున్నారు.
తెలుగుమాధ్యమాన్ని పక్కన పెట్టి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీషు మాధ్యమ ప్రవేశాన్ని ఒక ఘనమైన విధానంగా ప్రభుత్వాలు ప్రకటించి అమలుచేస్తున్నాయి.
నేటికీ తెలుగు భాష బతికి వుంది గ్రామసీమలలోనే. నగరాలు పూర్తిగా ఇంగ్లీషు మాయమయ్యాయి. పట్టణాలు నగరాల వెంట పరుగెడుతున్నాయి. గిడుగు వంటివారు గ్రాంథికం మీద పోరాటం చేసి, బ్రిటీష్ పాలకులను ఒప్పించి పాఠశాల స్థాయిలో వ్యావహారికభాషలో రాసుకునేందుకు అనుమతి సంపాదించగలిగారు.
కాని నేటి పాలకులకు భాషోద్యను కార్యకర్తల కోరికలు చెవులకెక్కడం లేదు. అందుకే అధికారికంగా వారికి అర్ధమయ్యేలా కొత్త ఉద్యమానికి తెలుగువారు శ్రీకారం చుట్టాల్సిన సమయం వచ్చింది.
తెలుగు భాషను సంరక్షించుకోవడమంటే ఒక ప్రాంత సంస్కృతిని రక్షించుకోవడం. భాష మీద అభిమానం కోల్పోయిన జాతి బానిసజాతిగా మారుతుంది.
ప్రతి తెలుగు వాడూ ఒక గిడుగుగా వ్యవహరించాలి. అదే తెలుగు భాషామతల్లికి మనం అందించే నీరాజనం.

2 thoughts on “అందరిదీ గిడుగుబాట కావాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap