సత్తెనపల్లిలో కవి కోకిల, పద్మభూషణ్ గుర్రం జాషువా 50వ వర్థంతి
కవి కోకిల శ్రీ గుర్రం జాషువా సాహితీ సేవా సంస్థ, సత్తెనపల్లి వారి ఆధ్వర్యంలో పట్టణం లోని ఆనంద్ ఎడ్యుకేషనల్ అకాడమి వారి కార్యాలయంలో కవి కోకిల, పద్మభూషణ్ గుర్రం జాషువా గారి 50వ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఇద్దరు ప్రముఖులు – విశ్రాంత ఉపాధ్యాయులు, రంగస్థల నటులు, కవి, ప్రగతి కళా పరిషత్ అధ్యక్షులు నూతలపాటి సాంబయ్యగారు మరియు ప్రముఖ చిత్రకారులు, జాతీయ అవార్డు గ్రహీత జింకా రామారావుగార్లను ఘనంగా సత్కరించారు. ముందుగా జాషువా చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సాంబయ్యగారు మాట్లాడుతూ… ఆనాటి సామాజిక పరిస్థితులను బట్టి గుర్రం జాషువా ఎన్నో అవమానాలను చవి చూశారు. తన యొక్క కవితా పఠిమతో సమాజాన్నే శాసించారు. గబ్బిలం, పిరదౌసి, క్రీస్తు చరిత్ర వంటి ఎన్నో గొప్ప గ్రంథాలను రచించారు. హరిశ్చంద్ర నాటకంలో కాటిసీను ఎంతో ప్రముఖమైనది. కాటిసీను లో గుర్రం జాషువాగారి పద్యాలు మానవ మనుగడ ఉన్నంతకాలం సజీవంగా మారుమ్రోగుతునే ఉంటాయి. అనేక అవార్డులు రివార్డులు పొందారు. ఏ సేవా సంస్థ అయినా వ్యాపార ధోరణితో కాకుండా కేవలం సేవా దృక్పథం తో ఉన్నప్పుడు మాత్రమే ఆ సంస్థ కలకాలం మనుగడ సాధిస్తుంది. ఈ విషయంలో కవి కోకిల శ్రీ గుర్రం జాషువా సంస్థ వారు అభినందనీయులు. సంస్థ వారికి తమ యొక్క సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని సాంబయ్య మాష్టర్ గారు తెలిపారు.
చిత్రకారులు జింకా రామారావుగారు మాట్లాడుతూ… గత 40 సంవత్సరంల నుండి సత్తెనపల్లి పట్టణంలో సాహితీ సేవా సంస్థలు లేకపోవడం, సాహితీవేత్తలను ప్రోత్సహించుకోలేక పోవడం, సాహితీ ప్రక్రియను కొనసాగించలేక పోవడం చాలా విచారకరం. నేడు కవికోకిల గుర్రం జాషువా సాహితీ సేవా సంస్థను నెలకొల్పడం సత్తెనపల్లికి ఓ శుభ పరిణామం. ఈ సంస్థవారు ఈ అంశాలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ లో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ సంస్థకు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలనీ, వారికి మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా జింకా రామారావుగారు 40 సంవత్సరంల క్రితం ఎప్పుడో సాంబయ్య మాష్టర్ గారి మీద రాసుకున్న కవితను ఎంతో హృద్యంగా చదివి వినిపించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు యిర్మీయా మాట్లాడుతూ… దాతల సహాయ సహకారములతో పట్టణంలో గుర్రం జాషువా విగ్రహాన్ని నెలకొల్పామనీ, దానిని త్వరలో ఆవిష్కరింప చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఏఎన్నార్ జక్కం, సంయుక్త కార్యదర్శి, న్యాయవాది గుజ్జర్లపూడి సురేష్ బాబు, సభ్యులు జాన్ బాబు, న్యాయవాదులు జయ కుమార్, సంగీత రావు, ఉపాధ్యాయులు సింగపోగు పాల్ డయాన్ తదితరులు పాల్గొన్నారు.