‘వపా’తో నా చిరస్మరణీయ స్మృతులు-కొరసాల

ప్రఖ్యాత చిత్రకారులు, రంగుల రారాజు వపా వేసిన వేలాది చిత్రాలే నేటికి, ఈనాటికి చిత్రకారులకు ఆదర్శం. ఎంతోమంది చిత్రకారులకు ఆయన మార్గదర్శకులు. కళే దైవంగా, కళ కోసం పుట్టిన మహోన్నత వ్యక్తి వడ్డాది పాపయ్యగారు.

ఆయనను చూడడమే ఒక అదృష్టం, ఆయనతో మాట్లాడడం ఇంకా అదృష్టం. ఆయన ఒరిజినల్ చిత్రాలు చూడడం నేను చేసుకొన్న మరో గొప్ప అదృష్టం. నేను చెప్పిన మూడింటిని నా జీవితంలో కనడం, మాట్లాడడం, చూడడం ఈ జన్మలో ఈ అదృష్టనికి నోచుకుంటానా? అనే ప్రశ్నతో వడ్డాది పాపయ్య గారిని కలవాలని ఆయన నివాసం ఉండే కశింకోటకు వెళ్లాను. నే వెళ్లేసరికి ఆయన కశింకోటలో లేరు అన్న విషయం తెలిసి కొంత నిరాశ చెందాను. అయినప్పటికి వారి సతీమణి సాదరంగా ఆహ్వానించి నా గురించి మంచి చెడులు అడిగి గృహిణిగా ఆమె మర్యాదలు పొందాను.
వపాగారి గురించి, వారి చిత్రాల గురించి గొప్పగా విన్నాను, వారిని చూడాలని వచ్చా గతంలో ఒకసారి వారిని చూడాలని చెన్నై (మద్రాసు) “చందమామ” ఆఫీసుకు వెళ్లి వపాగారి దర్శనం కలగలేదు. ఆనాడు నిరాశ చెందాను. చందమామ మాసపత్రిక ప్రింటు అయ్యే BNK ప్రెస్ అప్పట్లో ఇండియాలో గొప్ప కలర్ ప్రింటింగ్ ప్రెస్. ఈ ప్రెస్లో ప్రముఖ చిత్రకారుడు అనగా J.P సిగాల్, రవివర్మ, S.M పండిట్, S.S షేక్ మొదలగు ప్రఖ్యాత చిత్రకారుల క్యాలండర్స్, గొప్ప గొప్ప వర్ను ఇక్కడ ప్రింటు అయ్యేవి. ఒక మిత్రుని సహాయంతో ఆ చిత్రకారుల “ఒరిజినల్స్” పెయింటింగ్స్, BNK ప్రెస్ ను చూడడం జరిగింది. ఆసమయంలో చందమామ చిత్రకారులు, శంకర్, చిత్ర వీరిరువులను దర్శించుకొని వారి ఆశీస్సులు పొందాను. కాని వపాగారిని కలవలేకపోయాను అని ఆమె (వపాగారి భార్య) గారితో చెప్పగా వారు అర్థం చేసుకొని వపా గారి ఒరిజినల్ చిత్రాలను చూపించారు. వారి విషయాలు ఎన్నో తెలియజేశారు.

ఆ అపురూప చిత్రాలను ఒక్కొక్కటి చూస్తూ ఎంతో ఆనందం పొందాను. ఆ చిత్రాలను చూస్తూ నన్ను నేనే మరిచిపోయాను. మరో ప్రపంచంలోకి వెళ్లిపోయాను. ఒకటా! రెండా! ఎన్నోవందల చిత్రాలు పురాణ, జానపద వర్ణ చిత్రాలు, రేఖా చిత్రాలు, పండుగలు, స్త్రీ అనే రూపానికి ఇంత అందంగా గీయవచ్చా! కట్ కలర్తో, ఆధునిక శైలిలో వర్ణించడానికి పదాలులేవు అన్నీ అద్భుతాలే ఆ చిత్రాలు చూస్తూ ఎప్పటికైనా ఇంత గొప్పవాణ్ణి కాగలనా? అనే ప్రశ్నతో వెర్రి ఆలోచనలు కోరికలతో మనసంతా నిండిపోయింది.
నా అభిమానాన్ని నా ఆనందాన్ని చూసి వపాగారి భార్య, సార్ శ్రీకాకుళంలో ఉన్నారు తప్పక కలవండి అని వివరాలు చెపుతూ ఆయన చాలా కోపిష్టి ఆయన మిమ్మల్ని ఏమన్నా జాగ్రత్తగా సమాధానం చెప్పండి. అని కొన్ని మెళకువలు, వివరాలు తెలియజేశారు. నేను వారికి కృతజ్ఞతలు తెలియజేసి నేను తెచ్చిన స్వీట్స్ ఇచ్చి నమస్కరించి, అక్కడ నుండి శ్రీకాకుళం బయలుదేరాను.

రాత్రి 9గంటలు అయింది. శ్రీకాకుళం వడ్డాది పాపయ్యగారి ఇంటికి చేరుకున్నాను. పాపయ్యగారి దర్శనంతో నన్ను నేనే మరిచిపోయాను. ఎంతో ఆనందంతో గొప్ప చిత్రకారుడిని చూశానన్న ఆనందంలో ఉన్న సమయంలో ఒక్కసారిగా… ఇంత రాత్రివేళ నన్ను చూడటానికి అమలాపాపురం నుండి రావాలా! ఏం చూస్తారు అని ఆయన నన్ను మందలిస్తూ ఆయన సహజధోరణిలో మాట్లాడారు.

ఇంతలో ఓ వింత! నిజంతా వింతే! ఆ వింత సంఘటనే నా జీవితాంతం మరువలేని మహత్తర ఘట్టం. అది ఏమిటంటే!
నేను వెళుతూ మంచి బంగిన మామిడిపండ్లు తీసుకొని వెళ్లి ఆయనకు ఇవ్వబోయాను, ఇలాంటివి నాకు ఇష్టం ఉండవు అంటూ నిరాకరించే సమయంలో ఆయన హాలులో పూజమందిరంలో ఆంజనేయ స్వామి ఫోటో చూశాను. ఆఫోటో చూస్తూ నా మదిలో ఎన్నో ఆలోచనలు, ఆనందాలు ఇది నిజంగా కలా నిజమా అని ఆలోచిస్తూ… సార్ మీరు పూజించే ఆంజనేయస్వామి నేను వేసిన చిత్రం సార్, ఆంజనేయ అష్టోత్తర నామాలుతో వ్రాశాను అని నేను చెప్పగానే ఆయన నావైపు చూసి ఆశ్చర్యంగా నిజమా! అని దృష్టి నావైపుకు మళ్ళింది. నన్ను చూస్తూ కూర్చోమని కుర్చీ చూపించారు. ఇక ఆయన మదిలో నాగురించి నారాక గురించి తెలుసుకొని మా ఇద్దరి మద్య చాలా సంభాషణ జరిగింది.

Vaddadi Papaiah art on Yuva Magazine

నేను తీసుకొని వెళ్ళిన నా చిత్రాలను ఒక్కొక్కటి చూపిస్తూ పూజ కొరకు అష్టోత్తర సాహస్రనామాలతో ప్రత్యేకంగా తయారుచేశాను, ఈ చిత్రాలను మొదట బ్లాక్ & వైట్ తరువాత రంగులలో అన్ని దేవుడు చిత్రాలను మొత్తం 50 రకాల చిత్రాలను చిత్రించాను. ఇవి దక్షిణాది 4 రాష్ట్రాలలో 15 లక్షల ఇండ్లలలో పూజా మందిరాలలో పూజింపబడుచున్నాయి. ఆయన నా బొమ్మలు ఒక్కొక్కటి చూస్తూ మీరు గీచిన ఈ చిత్రాలు చాలా బాగున్నాయి. నా లైనింగ్, స్ట్రోక్స్ చాలా బాగున్నాయి, డిజైనింగ్, స్తోత్రాలు (నామాలు) చక్కగా బొమ్మలో చూసించారు అంటూ నా బొమ్మలు గురించి ఆయన చెప్పిన మాటలు నా జీవితానికి ఒక అవార్డు, బహుశా మా యింటికి వచ్చిన మీ ఏజంటు దగ్గరే ఈ బొమ్మ కొన్నాను. మీరు చిత్రించిన ఈ చిత్రాలు ద్వారా మీరు “భక్తి – ముక్తి” సంపద పొందారు అని అన్న ఆయన మాటలకు నేను ఎంతో ఆనందం పొందాను. మనం అందరం ఆస్వాదించే అంత గొప్ప చిత్రకారుడు నాకిచ్చిన గొప్ప కితాబ్, చాలు నాజీవితం ధన్యం అనుకొంటూ ఆయనకు పాదాభివందనం చేశాను.

నాకు కొంత ధైర్యం వచ్చింది. నేను వచ్చిన పని చెప్పాలని నిర్ణయించుకొన్నాను. నేను గ్రీటింగ్ కార్డు పెట్టాలని, దేశంలో ఉన్న ప్రముఖ చిత్రకారుల చిత్రాలను తీసుకొని మన సాంప్రదాయాలను మన నెటీవిటీని ప్రతిబింబించేలా క్రొత్త పద్ధతిలో తయారు చేయాలని, నా అభిప్రాయాన్ని వెలుబుచ్చుతూ ఈ చిత్రాలు గ్రీటింగ్ కార్డ్స్ ద్వారా అభిమానులకు చూపించాలని వారు తప్పక నాకోరిక తీర్చాలని నామనసులో మాట చెప్పాను.

ఆయన కొంత సేపు ఆలోచించి ఆర్డుపై మీకున్న అభిమానం తెలుస్తుంది. నా చిత్రాలు గ్రీటింగ్ కార్డుకు పనికి రావేమో అంటూ నా చిత్రాలను గ్రీటింగ్ కార్డ్స్ కు అనుకూలంగా చేసుకోటానికి నాకు అభ్యంతరం లేదు. మీకు కావలసిన నా చిత్రాలను వాడుకోవచ్చు, నేను ఈ విషయం పై నావీలును బట్టి కొన్నిటిని చిత్రిస్తాను నా బొమ్మలు మీకు కావలసినవి తీసుకెళ్ళండి అంటూ నన్ను ప్రోత్సహించారు. నేను మరలా వస్తా డబ్బు ఇచ్చి తీసుకొని వెళతా అని చెప్పగా అక్కర్లేదు తీసుకువెళ్లండి. చాల పెట్టుబడి కావాలి గ్రీటింగ్ కార్డ్స్ తయారుకు, ఎంతో కష్టపడి ఆరాధన చిత్రాలు 50 రకాలు తయారు చేశారు ఆ అనుభవంతో మీరు ముందుకొస్త్నుట్లు నా కనిపిస్తుంది బాగా ఆలోచించి ముందడుగు వెయ్యండి. ఈ సందర్భంగా ఆయన వేసిన గ్రీటింగ్ కార్డు నాకు ఇచ్చారు.

ఇద్దరం కలిసి అల్పాహారం చేసి, రాత్రి 12 గంటల వరకు నాతో ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా చిత్రకళ గురించి ఆయన జీవితంలో అనుభవాలు చెపుతూ నా గురించి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నారు. నేను ప్రతి సంవత్సరం కోనసీమ చిత్రకళా పరిషత్ ఆహ్వానాలు పంపిస్తూ ఉండేవాడిని, ఈ విషయంపై ఆయన నన్ను అభినందిస్తూ చిత్రకళను చిత్రకారులను ప్రోత్సహిస్తున్న మీ కృషి అభినందనీయం అంటూ అభినందించారు. ఎందుకో కలసిన మొదటిసారైనా అభిమాన ఆత్మీయతను చూపించారు.

VaPa wrote to Post card to Korasala on 19 June 1991

ఎందుకో నా పై అంత ప్రేమ, ఆప్యాయత ఇప్పటికి చెప్పుకోలేని ప్రశ్నకు జవాబు దొరకలేదు. బహుశా నేను అనుకోవడం నా పేరు సీతారామస్వామి. నేను వేసిన బొమ్మలు దైవారాధనకు పనికి వచ్చే అన్ని దేవుళ్లు చిత్రాలు, సీతారాములన్న, ఆంజనేయస్వామి అన్న చాలా ఇష్టం అందుకేనేమో ఆయన నాతో అంత సమయం ఆప్యాయతతో మాట్లాడి ఉండవచ్చు.


తెల్లవారింది భక్తి పాటలు ముఖ్యమైన ఆంజనేయ గీతాలు ఆయన ఇంట్లో వినుపిస్తున్నాయి. పెద్ద స్పీకర్ గొట్టం, పెద్ద సౌండో ఆయన ఇంట్లో నిత్యం ఉదయం ఈ పాటలతో ఆయన దినచర్య ప్రారంభం. ఇద్దరం కలసి దగ్గరలో ఉన్న హోటల్‌కు తీసుకొని వెళ్లి టిఫిన్ ఇప్పించారు నేను డబ్బు ఇవ్వబోతే ఆయనే బిల్ ఇచ్చి ఇంటికి వచ్చాం. కొంతసేపు ఇద్దరి మద్య చిత్రకళ మీద ఆయన అనుభవాలు చెపుతూ ఆయన బొమ్మలు వేసే మేడపై చిన్నగది చూపించారు. అందులో పోస్టర్ కలర్స్ బ్రషన్లు చాలా సింపిల్ గా ఉండే ఆయన చిత్రగది చూస్తే ఆయన వేసే చిత్రాలు ఇక్కడే ఇంత సింపుల్ గా వేస్తున్నారా అనిపిస్తుంది సేగాని ఏరకమైన అదునాతన పరికరాలు లేకుండా బ్రష్ తో ఇంత నైపుణ్యమా అనే ఆలోచన కలుగుతుంది. పేపర్స్ కూడా అతి సామాన్యమైనవి వాటిపై అద్భుత చిత్రాలు కొన్ని వేశారు. అక్కడ ఉన్న కొన్ని చిత్రాలు చూపించారు. నేను వద్దన్నా నా కొన్ని చిత్రాలు ఇచ్చారు. ఇవి నాకు మరపురాని చిత్ర మాణిక్యాలు.
నా చిత్రాలు మీరు వాడుకోవచ్చు మీకు కావలసిన చిత్రాలు తీసుకో అని వత్తిడి చేసినా నేను డబ్బు ఇచ్చి తీసుకోవాలనే ఉద్దేశ్యంతో తీసుకోలేదు, ఆరోజు తీసుకొని ఉంటే నా అంత అదృష్టవంతుడు లేడు అని అనుకొంటున్నా.

నేను కళ్లు ఆపరేషన్ అనపర్తిలో చేయించుకోటానికి వస్తా మీరు కూడా అనపర్తి రండి అని ఆయన చెప్పగా తప్పక వస్తా దగ్గరుండి ఆపరేషన్ చేయిస్తా అని చెప్పి ఆయన ఆశీస్సులు తీసుకొని అమలాపురం తిరుగు ప్రయాణంతో ఆనందంగా వచ్చా.
ఆయన దగ్గరనుండి ఉత్తరాలు వస్తూ ఉండేయి కొన్నేళ్లు గడిచిన ఈలోగా ఆయన చిత్రాలు ఎవరో కొన్నట్లు ఆ తరువాత కొద్ది కాలానికి ఆయన మరణించినట్లు తెలిసింది.
ఆయన జ్ఞాపకాలు మననం చేసుకోవడం నాకు మిగిలిన ఆనాటి అద్భుత క్షణాలు – ఆక్షణాలు కొన్నింటిని మీ ముందుంచా.
ఆ జ్ఞాపకాలే నా జీవన ధ్యేయానికి సోపానాలయ్యాయి. రంగులరారాజు లేకపోయిన ఆయన చిత్రరాజాలు నిత్యం ఈ ఆధునిక సాంకేతకతో మనకు దర్శనమిస్తున్నాయి. ధన్యజీవి వపా కళాలోకంలో రంగుల స్టార్! ఆయనే రంగుల రారాజు.

-కొరసాల సీతారామస్వామి,
అమలాపురం

3 thoughts on “‘వపా’తో నా చిరస్మరణీయ స్మృతులు-కొరసాల

  1. రామస్వామి గారూ
    మీదగ్గర వపా గారి ఒరిజనల్స్ ఇంకా ఉన్నాయా.
    నేనుండేది కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. (భద్రాచలం వేళ్ళే దారిలో ఉంటుంది మా ఊరు)మీదగ్గర అలాంటి చిత్రాలున్నాయంటే మీ అనుమతితో చూడటానికి మీ స్టూడియో కు వస్తాను.

  2. ఒక తీయని కలను నిజం చేసుకోగలిగారు. వపా గారిని, వారి చిత్రాలను చూడడం చిత్ర కారులందరికీ ఒక తీయని కలే. అంత బాగా మిమ్మలని receive చేసుకున్నారంటే ఆ గొప్పదనం మీ చిత్రాలదే. రంగుల రారాజు చేత మెప్పు పొందిన మీ చిత్రం ఎంత గొప్పదో. సంతోషం sir. మీ రచన చదువుతుంటే మీరు పోనిన అనుభూతి నేనూ పొందినట్లయింది. Congratulations sir.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap