సంగీత స్వర పల్లవులకు అందంగా పద విన్యాసాలు చేయగల యువ నర్తకి ఆమె. అంతరార్థాన్ని హస్తముద్రల్లో… భావ సందర్భాలను అంగ భంగిమల్లో ఆవిష్కరిస్తూ… రస భావ తాళ లయలను రసాత్మకంగా అభినయించి తన నర్తనంతో బహు పాత్రాభినయం చేయగల నాట్యమయూరి. కూచిపూడి నాట్యంతో పాటు తెలుగు సంప్రదాయ వైభవాన్ని చాటే జానపదాన్ని, ఫోక్ ఫ్యూజనను, భరతనాట్యాన్ని నేర్చుకుని ప్రపంచ వేదికలపై పదం కదిపారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చినా.. కాదనుకుని తన జీవితాన్ని నాట్యానికే అంకితం చేసిన అభినయమూర్తి సీహెచ్ హవీషా చౌదరి కళా ప్రస్థానంపై 64కళలు పత్రికలో చిరు పరిచయం …
కృష్ణానదీ తీరాన పురుడుపోసుకున్న కూచిపూడి నాట్యాన్ని అభ్యసించి ప్రపంచ వేదికలపై తెలుగు కీర్తి పతాకాన్ని ఎగురవేసిన కళాకారులు ఎందరో. అహర్నిశలు శ్రమించి, అణువణువూ నాట్య పదమై.. వేసే ప్రతి అడుగు శ్రుతిమయమై.. కృతులే నాట్య గతు… విలసిల్లిన సిరిమువ్వలు నాటి నుంచి నేటి వరకు ఇక్కడ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఆ పద విన్యాసాల అడుగులను స్పూర్తిగా తీసుకుని చిగురించిన యువ నర్తకీమణుల్లో హవీషా చౌదరి ఒకరు.
కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన ఈమె తల్లిదండ్రులు వాణి, సీతారామ్. తండ్రి ఉద్యోగం వల్ల ఆరో తరగతి వరకు కరీంనగర్ జిల్లా జగిత్యాలలో సాగింది. 5వ తరగతి నుంచి జగిత్యాలలోని నాట్యాచార్యుడు భుజంగరావు వద్ద కూచిపూడిలో శిక్షణ ఇప్పించారు. రెండేళ్ల పాటు కూచిపూడిలో శిక్షణ తీసుకున్న హవీషా కుటుంబం ఆ తరువాత విజయవాడ వచ్చింది. ప్రముఖ నాట్య కళాకారుడు ఘంటసాల పవనకుమార్ వద్ద కూచిపూడి, భరతనాట్యం, జానపదంలో శిక్షణ తీసుకుంది. చదువుతో పాటు నాట్యాన్ని సమన్వయ పరుచుకుంటూ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించింది.
పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ పదవ తరగతి సమయంలో (2013) భరతనాట్యంలో సర్టిఫికెట్ పూర్తి చేశారు. 2014లో యక్షగానం, 2015లో కూచిపూడి, 2016లో భరతనాట్యం డిప్లొమా చేశారు. 2017 స్వాతికాభినయం పూర్తిచేశారు. బీటెక్ చేసి, నాట్య శిక్షణ ఏర్పాటుచేసి పేద విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు.
ప్రతిభకు పురస్కారాలు జయదేవుని అష్టపదిలో కృష్ణుడిగా, అన్నమయ్య రూపకంలో వేంకటేశ్వరుడిగా, పద్మావతిగా, వివేకానంద, రామాయణం వంటి నృత్య రూపకాల్లోనూ నర్తించి ప్రశంసలందుకున్నారు. దాదాపు 1,100కు పైగా నాట్య ప్రదర్శనలు ఇచ్చి ప్రతిభ చాటుకున్నారు. హైస్కూల్ విద్య సమయంలోనే నాట్య మయూరి బిరుదును అందుకున్నారు. 2014లో సోమనాథ్ కల్చరల్ ఆర్ట్స్ సంస్థ నుంచి ఎస్వీఆర్ పురస్కారం, నవరత్న పురస్కారం అందుకున్నారు. 2017లో కేఎల్ వర్సిటీలో ఐక్యూ ఏసీ సంస్థ నిర్వహించిన క్వాలిటీ ఉత్సవాల్లో రాష్ట్రస్థాయిలో కూచిపూడి, జానపద నృత్యాల్లో ప్రథమ స్థాయిలో నిలిచారు. కేఎల్ యూనివర్సిటీ సాంస్కృతిక ప్రతినిధిగా పనిచేశారు. 2018లో ఆంధ్రప్రదేశ్ టూరిజం నిర్వహించిన రాజధాని నగరాల కళాశాల పోటీల్లో నాట్య ప్రతిభా పురస్కారం అందుకున్నారు. అదే ఏడాది డాక్టర్ పట్టాభి అవార్డు తీసుకున్నారు. నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఎన్ఎస్ఎస్ యూత్ ఫెస్టివల్ లో ప్రథమ బహుమతి కైవసం చేసుకున్నారు. 2019లో జిజ్ఞాస నుంచి యువకళా సమ్మాన్ అవార్డును నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ విజయభాస్కర్ నుంచి అందుకున్నారు. 2016లో ఐఐటీ భువనేశ్వర్‌లో కూచిపూడి నాట్యం ప్రదర్శించారు. 2017లో హర్యానాలో నిర్వహించిన నిషా హార్మోనియం ఫెస్టివల్స్ లో అవార్డు అందుకున్నారు. చెన్నైలో 2017లో నిర్వహించిన విక్ట్ యూనివర్సిటీ ఉత్సవాల్లో కూచిపూడి నాట్యం ప్రదర్శించి ద్వితీయ స్థానం పొందారు. 2016లో రాష్ట్రస్థాయి యువజన సాంస్కృతిక పోటీల్లో భరతనాట్యంలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. గుల్బర్గా, పాట్నా, పుదుచ్చేరి, బెంగళూరు, శ్రీలంక, అండమాన్, బ్యాంకాక్, థాయిలాండ్ వంటి దేశాల్లో తెలుగు అసోసియేషన్ వేదికలపై ఆమె ప్రదర్శనలు చేశారు.
నాట్యంపై పరిశోధన చేయాలనుంది :
“శాస్త్రీయ నాట్య రంగంలో పరిశోధన చేయాలనేది నా లక్ష్యం. లలిత కళలపై ఆసక్తి చూపేవారు చాలా తక్కువ. అదృష్టవశాత్తూ నాకు శాస్త్రీయ నాట్యంపై ఇష్టం పెరిగింది. పంచమవేదంగా చెప్పుకొనే నాట్య శాస్త్రంలో పీహెచ్ డీ చేస్తాను. నాట్యం నేర్చుకున్నాక అందులోని వ్యాయామం, ఆరోగ్యం, మెమరీ పవర్ పెంచుకున్నాను. అందుకే నాకు తెలిసిన నాట్యాన్ని మరికొంతమందికి నేర్పుతాను. నా దగ్గర 40 మంది విద్యార్థులు నేర్చుకుంటున్నారు” అని అన్నారు.
-శ్రీనివాస రెడ్డి
Nice article, She have a beautiful career.