‘అమర దీపం’ కృష్ణంరాజు

ఇటీవల సినిమా నిర్మాతలు బడ్జెట్ ఆవరిమితంగా పెరిగిపోతున్న కారణంగా స్వీయ నిర్ణయంతో నెల రోజుల పాటు షూటింగ్ లు ఆపేశారు. అందులో ఓ ప్రధాన కారణం హీరో హీరోయిన్లతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుల వ్యక్తిగత సిబ్బంది ఖర్చులను సైతం నిర్మాతలే భరించాల్సి రావడం. దాదాపు ఐదు దశాబ్దాల క్రితమే ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు కృష్ణంరాజు. ఓ కథానాయకుడిగా తన వ్యక్తిగత సిబ్బందికే కాదు తన కారుకు పెట్రోల్ పోయించడానికి సిద్ధపడిన నిర్మాతలను వారించారు. ‘నాకు రెమ్యూనరేషన్ చెల్లిస్తున్న మీరు నా సిబ్బందికి డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు. వారి అవసరాలు తీర్చడం నా బాధ్యత’ అంటూ నిక్కచ్చిగా చెప్పేశారు. అందుకే ఆయన చిత్రసీమలో రారాజుగా పేరు తెచ్చుకున్నారు. కృష్ణంరాజు బాటలోనే తోటి నటీనటులు, నిర్మాతలు నడిచి ఉంటే… ఇవాళ సినిమా రంగానికి ఇలాంటి పరిస్థితి దాపురించేది కాదు. రాజకీయ రంగం విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున 1992లో నర్సాపురం నుండి పోటీచేసి ఓడిపోయిన ఆయన ఆరేళ్ల తర్వాత భారతీయ జనతాపార్టీ నుండి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో నిలబడి జయకేతనం ఎగరేశారు. ఆ తర్వాత యేడాదే వచ్చిన మధ్యంతర ఎన్నికలలో నర్సాపురం నుండి పార్లమెంట్‌కు పోటీ చేయాల్సి వచ్చింది. కాకినాడ ప్రజలు సజల నేత్రాలతో వీడ్కోలు ఇవ్వగా, నర్సాపురం జనాలు హర్షాతిరేకంతో స్వాగతం పలికారు. ఈసారి ఆయన నర్సాపురం నుండి విజయం అందుకుని కేంద్రమంత్రిగానూ సేవలు అందించి ప్రజాబంధుగా పేరు పొందారు.

మొగల్తూరులో ఉన్నత కుటుంబంలో జన్మించిన కృష్ణంరాజు జీవితం తిరిగిన మలుపులను తలుచుకుంటే ఓ పెద్ద సినిమా కథే తలపుకొస్తుంది. కుటుంబానికి సమాజంలో ఉన్న గౌరవం కారణంగా తెలియని వయసులో తలకెక్కిన పొగరును దించు కుని, ఆ స్థానంలో స్వాభిమానాన్ని, స్వయంకృషిని నింపుకుని, ధీరోదాత్తుడిగా ఎదిగిన వ్యక్తి కృష్ణంరాజు.

ప్రాథమిక విద్యాభ్యాస సమయంలో అడుగులు తడబడినా, ఆ పైన హైదరాబాద్ బద్రుకా కాలేజీ నుండి డిగ్రీ పట్టాను అందుకుని రకరకాల వ్యాపారాలు చేశారు. కొంతకాలం ఆంధ్రరత్న పత్రికలో పాత్రికేయాన్ని చేపట్టారు. ఫోటో స్టూడియో నెలకొల్పారు. వాటితో సంతృప్తి పడలేక సినిమా నిర్మాణం కోసం చెన్నయ్ చేరి, అక్కడ నాటకాలు వేసి సినీ ప్రముఖుల మెప్పుపొంది చివరకు 1966లో ప్రత్యగాత్మ తెరకెక్కించిన ‘చిలకా గోరింక’తో హీరో అయ్యారు కృష్ణంరాజు. తొలి చిత్ర పరాజయంతో కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మారిపోయింది. నిర్మాత డూండీ ప్రోత్సాహంతో ‘నేనంటే నేనే’లో స్టైలిష్ విలన్‌గా నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అక్కడ నుండి పలు చిత్రాలలో వైవిధ్యమైన ప్రతినాయకుడి పాత్రలు పోషించి మెప్పించారు. ‘ఇంటి దొంగలు’ చిత్రంతో హీరోగా మరోసారి ప్రయత్నించి ఈసారి విజయాన్ని అందుకున్నారు. అక్కడ నుండి కృష్ణంరాజు తిరుగులేని నటుడిగా చిత్రసీమలో నిలిచిపోయారు.

Krishnam Raju family

తెలుగు సినిమా రంగంలోని అగ్ర కథానాయ కులంతా సొంత బ్యానర్లో చిత్రాలు నిర్మిస్తున్న సమయమది. కృష్ణంరాజు సైతం అందుకు సై అనేశారు. తన కోసం కాకుండా ఉత్తమ కథా చిత్రాలను నిర్మించాలని భావిస్తున్న తన స్నేహితులకు చేదోడు వాదోడుగా ఉండాలనే ఆయన మొదట నిర్మాతగా మారారు. అలా చేగొండి హరిరామ జోగయ్య, చలసాని గోపితో కలిసి ‘కృష్ణవేణి’ సినిమా నిర్మించారు. అది మ్యూజికల్ హిట్ గా నిలిచింది. హైదరాబాద్ శాంతి థియేటర్ లో జరిగిన శత దినోత్సవ సభకు చెన్నయ్ నుండి ఎన్టీ రామారావు దంపతులు ఈ వేడుకకు హాజరు కావడం విశేషం. ఆ తర్వాత నిర్మించిన ‘అమరదీపం’ సినిమా నటుడిగా కృష్ణంరాజును మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. అదే సంవత్సరం ప్రారంభించిన నంది అవార్డులలోని ఉత్తమ నటుడు కేటగిరికి కృష్ణంరాజు ఎంపికయ్యారు. ఆ రకంగా ఉత్తమ నటుడిగా తొలి నందిని అందుకున్న వ్యక్తిగా కృష్ణంరాజు పేరు రికార్డులలో చేరి పోయింది. సొంత బ్యానర్ లో వైవిధ్యమైన చిత్రాలనే కాదు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించారు. ఆయన నిర్మించిన ‘బొబ్బలి బ్రహ్మన్న’ ఆ యేడాది బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిపోయింది. ఇదే సినిమాను హిందీ లోనూ పునర్ నిర్మించారు కృష్ణంరాజు.

‘రంగూన్ రౌడీ, కటకటాల రుద్రయ్య, శివమెత్తిన సత్యం’ వంటి చిత్రాలలో ఫెరోషియస్ హీరోగా నటించి ‘రెబల్ స్టార్’ అనిపించుకున్న ఆయన, ‘మనవూరి పాండవులు, సీతారాములు, త్రిశూలం, గువ్వల జంట’ వంటి చిత్రాలలో సాత్వికాభినయం కనబరిచారు. అదే సమయంలో ‘భక్త కన్నప్ప’లో కరుణరసాన్ని అత్యద్భుతంగా పండించారు. ఐదున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలలో నటుడిగా తనదైన ముద్రను వేశారు. వివిధ కారణాలతో కొంతకాలం నటనకు దూరంగా ఉన్నా ఆ మధ్య ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లోనూ, ఈ యేడాది విడుదలైన ‘రాధే శ్యామ్’లోనూ అతిథి పాత్రల్లో మెరిశారు. వయోభారాన్ని లెక్కచేయకుండా నిర్మాతగా భిన్నమైన చిత్రాలను నిర్మించాలనే కోరిక మాత్రం నెరవేరలేదు. నట జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ, రాజకీయ రంగంలోనూ ఎదురైన ఆటుపోటులను గుండె నిబ్బరంతో ఎదుర్కొన్న ధీశాలి కృష్ణంరాజు. నిజానికి ఆయన పట్టుకున్నదల్లా బంగారం కాలేదు. వ్యాపార రంగంలోనూ లాభనష్టాలను చవిచూశారు.

గోపీకృష్ణ గ్రానైట్ను సమర్థవంతంగా నిర్వహించలేకపోయారు. కానీ ఎప్పుడూ, ఎక్కడా రాజీ పడకుండా ముందుకు సాగడం అలవర్చుకున్న కృష్ణంరాజు ఓ రారాజుగానే చిత్రసీమ నుండి, నిజజీవితం నుండి 83 సంవత్సరాల వయసులో 2022 సెప్టెంబర్ 11న నిష్క్రమించారు.

-అరుణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap