నిన్న రవీంద్రభారతిలో మంకెనపల్లి అజయ్ దర్శకత్వంలో ప్రదర్శించిన “కో అహం” నాటకం చూశాను. ప్రముఖ యువ కవయిత్రి శ్రీమతి మెర్సీ మార్గరేట్ రచన అది. ఒక కావ్యంలా, ఒక కవితలా సాగింది. రాత్రి అంతా నిద్ర పోనివ్వకుండా నాటకం ప్రశ్నలు సంధించింది.
సబ్జెక్టు కొత్తగా లేదు, కానీ దర్శకుడు నాటకాన్ని మలచి ప్రదర్శించిన తీరు జాతీయ స్థాయి నాటక ప్రదర్శనకు ఏమాత్రం తీసిపోలేని స్థాయిలో ఉంది. రంగోద్దీపనం చక్కగా ఉపయోగించారు. సంగీతం అద్భుతంగా సమాకూరింది. పాటలు కూడా చక్కగా కుదిరాయి. ఎవరి పాత్రలో వాళ్ళు ఒదిగిపోయారు.
మెర్సీ చెప్పినట్లుగా…మనల్ని మనం ఎక్కడ పారేసుకున్నామో తెలియని సందర్భాలను గుర్తు చేసింది ఈ నాటకం. మనకే తెలియకుండా బానిసలమైయ్యే సంఘటనల మధ్య ఒక చిన్న వెలుతురు కోసం మనిషి చేసిన ప్రయాణమే ఈ “కో అహం” నాటకం.
ఇంత పెద్ద విశ్వంలో నువ్వెవరు?? నీ నుంచి మా వరకూ.. మా నుంచి మనం వరకు అనేక ప్రయాణాలు చేసిన మనిషి తెలియని బంధాలు బాంధవ్యాల మధ్య బందీ అయి తనని తాను కోల్పోయి, తనని తాను తెలుసుకుని తను చిక్కుకున్న చట్రంలో నుంచి బయటపడడానికి తనని ముందుకు వెళ్లనివ్వని భయాన్నీ.. వెలుగును చూడనివ్వని భయాన్నీ.. మనిషి జయించి తనని తాను తెలుసుకునే ప్రయత్నం చేసింది ఈ నాటకం “కో అహం“.
నాటకం ఆద్యంతం తిలకించిన తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కూర్మాచలం, నేను డాక్టర్ మహ్మద్ రఫీ, నట దర్శకులు ఎస్.ఎం. బాష, మోహన్ సేనాపతి, బీచరాజు శ్రీధర్, శ్రీమతి సజయ కాకర్ల, మైమ్ మధు, శ్రీమతి సుమిత్ర అంకురం కళాకారులను దర్శక రచయితలను అభినందించాం.