సీ. ఇగురు మామిడి చిన్ని చిగురు కొమ్మలలోన గొంతెత్తి పాడిన కోయిలమ్మ
పూల పుప్పొడి లోన పొంగిపొరలెడు తేనె పసిపాపలకు పంచు పంకజాక్షి
ఆ నుండి క్షా వరకు అక్షరక్షరమందు మంత్రముగ్ధుల చేయు మహిత చరిత
హాయిగా ప్రజలెల్ల ఆనందమందగా పాడి పరవశించు పద్య విద్య
గీ. అఖిల విద్వత్ సభాo బోధి సుఖ సుధాక
థా తరంగ రంగ త్ప్రబంధ కమనీయ
మాలికా లోల యయి నాల్కనోలలాడు
తెలుగు భాషకు సరిసాటి కలదె ఇలను.
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం నిర్వహించాలని 1999 నవంబరు 17న యునెస్కో ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్ జనరల్ ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతోంది.
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం(International Mother Language Day):
యునెస్కో 1999 ఫిబ్రవరి 21 న అంతర్జాతీయ మాతృభాష దినంగా ప్రకటించింది. 2000 ఫిబ్రవరి 21 నుండి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. బంగ్లాదేశీయులు (అప్పటి తూర్పు పాకిస్తానీయులు ) చేసిన భాషా ఉద్యమానికి నివాళిగా ప్రతి ఏట ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. 1947 లో భారత దేశం, పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ రెండు భౌగోళికంగా వేర్వేరు భాగాలు ఏర్పడింది. ఒకటి తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్ అని పిలుస్తారు) రెండవది పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుతం పాకిస్తాన్ అని పిలుస్తారు). సంస్కృతి, భాష మొదలైన వాటిలో రెండు ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉండేవి. ఈ రెండు భాగాలను భారతదేశం వేరు చేసింది.తూర్పు పాకిస్తాన్ (ఇప్పుడు బంగ్లాదేశ్), పశ్చిమ పాకిస్తాన్ (ఇప్పుడు పాకిస్తాన్ ) కలిపి మెజారిటీ ప్రజలు బెంగాలీ లేదా బంగ్లా భాష ఎక్కువగా మాట్లాడేవారు.1948 లో అప్పటి పాకిస్తాన్ ప్రభుత్వం ఉర్దూను పాకిస్తాన్ జాతీయ భాషగా ప్రకటించింది. దీనికి తూర్పు పాకిస్తాన్ ప్రజలు అభ్యంతరం తెలిపారు.తూర్పు పాకిస్తాన్ జనాభాలో ఎక్కువ భాగం బెంగాలీ మాట్లాడతారు. ఉర్దూతో పాటు బెంగాలీ కూడా జాతీయ భాషలలో ఒకటిగా ఉండాలని వారు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ను తూర్పు పాకిస్థాన్‌కు చెందిన ధీరేంద్రనాథ్ దత్తా 1948 ఫిబ్రవరి 23 న పాకిస్తాన్ రాజ్యాంగ సభలో లేవనెత్తారు. తూర్పు పాకిస్తాన్ ప్రజలు (ప్రస్తుతం బంగ్లాదేశ్) నిరసనలు చేపట్టారు.భాష సమాన హోదా కోసం ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి పాకిస్థాన్ ప్రభుత్వం 144 సెక్షన్, ర్యాలీలు, మొదలైనవి ఢాకా నగరంలో నిషేధించింది.ఢాకా విశ్వవిద్యాలయం విద్యార్థులు, సాధారణ ప్రజల సహకారంతో భారీ ర్యాలీలు, సమావేశాలు ఏర్పాటు చేశారు.1952 ఫిబ్రవరి 21 న ర్యాలీలో పాల్గొన్న వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సలాం, బర్కాట్, రఫీక్, జబ్బర్, షఫియూర్ మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. చరిత్రలో ఇది చాలా అరుదైన సంఘటన, ప్రజలు తమ మాతృభాష కోసం ప్రాణాలను అర్పించారు.పోలీసుల దాడికి నిరసనగా ముస్లిం లీగ్అదే రోజు పార్లమెంటరీ పార్టీకి రాజీనామా చేశారు. ఉద్యమం పెరుగుతున్న నేపథ్యంలో, పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వం చివరకు దిగి వచ్చింది. 1954 మే 8 న పాకిస్తాన్ రాజ్యాంగ సభలో బెంగాలీని రాష్ట్ర భాషలలో ఒకటిగా స్వీకరించారు. 1956 లో పాకిస్తాన్ మొదటి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు, ఆర్టికల్ 214 లో బెంగాలీ ఉర్దూలను పాకిస్తాన్ రాష్ట్ర భాషలుగా పేర్కొంది. 1971 లో బంగ్లాదేశ్ స్వతంత్రమైనప్పుడు, బెంగాలీ ఏకైక రాష్ట్ర భాషగా ప్రవేశపెట్టబడింది. యునెస్కో బంగ్లా భాషా ఉద్యమం, మానవ భాష సాంస్కృతిక హక్కులను పురస్కరించుకుని 1999 ఫిబ్రవరి 21, న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ప్రకటించింది.
మాతృభాషలో పట్టు సాధించాలి!
‘‘ఒక వ్యక్తితో ఒక భాషలో మాట్లాడితే అది అతని మస్తిష్కాన్ని మాత్రమే చేరుతుంది. అదే అతని ‘మాతృభాష’లో మాట్లాడితే అది అతని హృదయాన్ని తడుతుంది’. మాతృభాష గొప్పదనం గురించి నల్లజాతి సూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా పేర్కొన్న మాటలివి. ప్రపంచంలో 7105 భాషలు ఉన్నాయని, వాటిలో చాలా భాషలు అంతరించాయని, మరికొన్ని అంతరించే ప్రమాదంలో ఉన్నాయని వాటిలో మన తెలుగు భాష కూడా ఉందని యునెస్కో హెచ్చరించినది.
మాతృభాషా మాధ్యమం:
మనిషి జ్ఞానవంతుడు కావడానికి విద్య అవసరం. విద్యార్థి విద్యాభ్యాసానికి సహకారిగా ఏదైనా ఒక భాష ఉంటుంది. సహజంగా విద్యార్థియొక్క మాతృభాషే బోధనలో స(ఉ)పకారిగా వుంటుంది. ఈ విధంగా మాతృభాష ఆలంబనగా విద్యాభ్యాసం జరగడం మాతృభాషా మాధ్యమంగా పేర్కొంటున్నారు. విద్యార్థి తన విద్యాభ్యసనంలో భాగంగా తన మాతృభాష సాహిత్యాలతోపాటు గణిత, విజ్ఞాన, సమాజ శాస్త్రాలు, ఇంగ్లీషు, హిందీ వంటి పరభాషల విషయాలను (సబ్జెక్టులను) అభ్యసించవలసి ఉంటుంది. సాధారణంగా విషయం (సబ్జెక్టు) ఎప్పుడూ తెలిసిన విషయంనుంచి తెలియని విషయం నేర్చుకొనేటట్లు విద్యాభ్యాసం ఉంటుంది. ఇలా అభ్యసించడానికి మాతృభాష మాధ్యమం ఉత్తమం అని అనేక మంది విద్యావేత్తలు, మేధావులు, విజ్ఞానులు పేర్కొంటున్నారు.
ఎందుకంటే…
మాతృభాషా మాధ్యమంలో విద్యార్థి విషయాన్ని (సబ్జెక్ట్) ఎలాంటి అభ్యసన క్లిష్టత లేకుండా ఇష్టంగా నేర్చుకుంటాడు. ఫలితంగా మాతృభాష మాధ్యమంలో ‘చదువు’ విద్యార్థి యొక్క శారీరక మానసిక ఎదుగుదలకు, సర్వతోముఖాభివృద్ధికి దారితీసేలా ఉంటుంది. అదే విషయాన్ని విద్యార్థి పరభాషామాధ్యమంలో నేర్చుకోవాలంటే ఆ విషయాన్ని అర్థంచేసుకోవడానికి అవగాహనలోకి తెచ్చుకోవడానికి అతని మెదడు చాలా కష్టపడవలసి వస్తుంది. అభ్యసన ప్రక్రియలో కష్టం ఉన్నప్పుడు విషయం (సబ్జెక్ట్) సరిగా అర్థంకాని పరిస్థితి వస్తుంది. మాతృభాష మాధ్యమంలో చదువుకుంటే ఆ ఇబ్బంది ఉండదు.
మాతృభాషపై ప్రముఖుల అభిప్రాయాలు:
ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల విద్యాభ్యాసం మాతృభాషా మాధ్యమంలోనే సాగాలని ఎందరో ప్రముఖులు, మేధావులు సూచించారు. 1918వ సంవత్సరంలో గాంధీ మహాత్ముడు బీహార్‌లో విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొని ‘మాతృభాషను నిర్లక్ష్యం చేయడం తల్లిని అవమానించడంతో సమానం’అని పేర్కొన్నాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ కొమర్రాజు లక్ష్మణరావు వంటివారు ‘సొంత భాషలో చదువుకోవడం తల్లిపాలు తాగి పెరగడంతో సమానమని పరభాషలో చదువుకోవడం పోత పాలు తాగి బ్రతకడం లాంటిద’ని పేర్కొన్నారు. ప్రఖ్యాత నాటకకర్త జార్జ్‌బెర్నార్డ్‌షా ‘మాతృభాష సరిగా నేర్వని వారికి ఇతర భాషలు లొంగవు’అని ముందుగా ‘మాతృభాషలో పట్టుసాధించమ’ని సూచించారు. మాతృభాషలో ఎంత గట్టి పట్టుఉంటే పర భాషలు అంత తేలికగా అలవడతాయి అని మేధావులంతా పేర్కొంటున్నారు.
ఆంగ్ల ప్రాభవం- తెలుగు సంకటం:
భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన కారణంగా దేశ (మాతృ)్భషలు నిరాదరించబడి ఆంగ్లభాష ప్రోత్సహించబడింది. ముఖ్యంగా పాలకులైన ఇంగ్లీషువారికి, పాలితులైన భారతీయులకు పరిపాలన, ఉద్యోగ, ఆర్థిక వ్యవహారాలలో ఉపయోగపడడానికి ఒక అనుసంధాన భాష కావలసి వచ్చింది. దీనికి ఇంగ్లీషువారు భారతీయ భాషలనుకాదని తమ మాతృభాష ఇంగ్లీషుకు ప్రాధాన్యతనిచ్చి దానినే పాలనాభాషగా అధికార భాషగా ప్రోత్సహించారు. అధికార భాష కావడంతోనూ, ప్రభుత్వ అండదండలు ఉండడంతోనూ ఈ ఆంగ్ల భాషలో చదువుకున్నవారికే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయి. ఫలితంగా ఆంగ్ల భాష భుక్తి కలిగించే భాషగా పేరు గడించింది. ఈ రకంగా మన దేశంలో దేశ భాషలు ఉపాధి ఇవ్వని భాషలుగా వెనుకబడగా ఆంగ్ల భాష ఉపాధి భాషగా దేశంలో వేళ్లూనుకుంది. స్వాతంత్య్రానంతరం ‘అనుసంధానం’ అన్న కారణంగా ఇంగ్లీషు ప్రాధాన్యత పెరిగిందే కాని తరగలేదు.
ఆంగ్ల భాష విషయంలో రెండు అంశాలు ఉన్నాయి. 1. భాషగా అధ్యయనం చేయడం, 2. మాధ్యమంగా అధ్యయనం చేయడం. భాషగా అధ్యయనం చేయడంవలన అభ్యంతరమేమీ లేదు. విజ్ఞాన సముపార్జనకు వ్యవహార జ్ఞానానికి అది అవసరం కూడా.
తెలుగు రాష్ట్రాలలో కిందటి తరంవరకు విద్యార్థులు విద్యాభ్యాసాన్ని తెలుగు భాషామాధ్యమంలోనే చదువుకున్నారు. ఈ మాధ్యమం ద్వారానే గణిత విజ్ఞాన, సమాజ శాస్త్రాలను, ఆంగ్ల భాషా జ్ఞానాలను పొందారు. ఇలా జ్ఞానం పొందిన ఎందరో విదేశాలలో లబ్దప్రతిష్టులైన నిపుణులుగా, దేశంలో అత్యున్నత అధికారులుగా పేరుపొందారు. తొలి తరపు స్వాతంత్య్ర సమరయోధుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు, రాజకీయ నాయకులు భోగరాజు పట్ట్భా సీతారామయ్య, ప్రకాశం పంతులు, శాస్తవ్రేత్త ఎల్లాప్రగడ సుబ్బారావు వంటివారు ఇలా ఒకరా ఇద్దరా… ఎందరో మహానుభావులు… తెలుగు మాధ్యమంలోనే చదువుకొని విజయ కేతనాలు ఎగరవేశారు. ఎదగడానికి మాధ్యమాలు అడ్డుకావని నిరూపించారు.
ఇప్పుడు చిక్కంతా రెండో దానివల్లే. భారతదేశంలో 1990వ దశకంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాక సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ అంశాలు తెరమీదకు వచ్చాయి. ఫలితంగా ప్రజల ఆలోచనా ధోరణుల్లో విపరీతమైన మార్పువచ్చింది. అంతర్జాల ఆంగ్ల మయ పోటీ ప్రపంచంలో తమ పిల్లలు మిగతా ప్రపంచంతో పోటీపడాలన్నా, నెగ్గుకు రావాలన్నా ఆంగ్లమాధ్యమమే మేలనే భావనలు ఎల్లెడలా వ్యాపించాయి. ఫలితంగా భారతదేశంలో అందునా తెలుగు రాష్ట్రాలలో ఆంగ్ల మాధ్యమాలు వేలంవెఱ్ఱిగా పుట్టుకువచ్చాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా రాష్టమ్రంతా పాఠశాలల్లో 1నుంచి 6వ తరగతి వరకూ తెలుగు మాధ్యమాన్ని రద్దుచేసి ఆంగ్ల మాధ్యమం ద్వారా మాత్రమే విద్యనేర్చుకోవాలనే ఉత్తర్వులు ఇచ్చింది అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. గురజాడ అప్పారావుగారి ముత్యాలు సరాలు గేయంలో ఒక పాత్ర చెప్పినట్లు…
పొట్టకూటికి నేర్చువిద్యలు
పుట్టకీట్లు కదిల్చినా’’ అన్నట్లు. తెలుగుదేశంలో తెలుగు పరిస్థితి తయారవబోతోంది. ఆమధ్య యునెస్కో – ‘‘యునెస్కో అట్లాస్ ఆఫ్ ది వరల్డ్స్ లాంగ్వేజస్ ఇన్ డేంజర్’’అన్న నివేదికలో భాషల గురించి విలువైన సమాచారాన్ని అందించింది. ప్రపంచంలో చాలా భాషలు అంతరించాయని భారతదేశంలో కూడా చాలా భాషలు అంతరించాయని మరికొన్ని భాషలు అంతరించే ప్రమాదంలో ఉన్నాయని వాటిలో ‘తెలుగు భాష’ ఒకటని హెచ్చరించింది. ఒక భాషను మాట్లాడే ప్రజానీకంలో ఆ భాష రాయడం 30%(శాతం) మందికి రాకపోతే ఆ భాష కాలక్రమంలో అంతరిస్తుందని సూత్రీకరణ చేసి తెలుగు భాషకు ఈ దుస్థితి దాపురించే అవకాశం ఉందని హెచ్చరించింది.
మాతృభాష గొప్పతనం:
మనిషి తన ఉనికిని తల్లిదండ్రుల ద్వారా పొందుతాడు. తదుపరి రూపం, కులం, మతం, ధనం, సంస్కృతి, సాంప్రదాయం, భాష వంటి విషయాలు అతనికి జతకూడుతాయి. ఈ విషయాలన్నీ తరతరాలుగా వారసత్వంగా కొనసాగుతున్నాయి. అయితే మనిషి వీటిలో కొన్నిటికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు. ముఖ్యంగా ధనం వంటి వాటికి. సాధారణంగా పెద్దలు తమ సంపదలను పిల్లలకు పంచుతారు. పిల్లలు ఆ సంపదల్ని భద్రంగా నిలుపుకుంటూ, పెంచుకుంటూ వెళ్తే అది అభివృద్ధి కారకం. కాకుంటే, అధోగతికి సూచకం. మనిషి దృష్టిలో ధనం విలువైనదే కావచ్చు. కానీ, అంతకంటే ఘనమైన, విలువైన వెలకట్టలేని సంపద భాష- మన మాతృభాష (తెలుగు). ఇటువంటి (తెలుగు) మాతృభాషను పెద్దలు మనకు వారసత్వ సంపదగా అందించారు. ఈ సంపదను మనం నిలుపుకోవాలి. పెంచుకోవాలి, సుసంపన్నం చేసుకోవాలి. పది మందితో పంచుకోవాలి, భవిష్యత్ తరాలకు వారసత్వంగా అందించాలి. అప్పుడే మనం ప్రపంచంలో నిలవగలం. అందరి మన్ననలు పొందగలం.
మన మాతృభాష (తెలుగు) గొప్పదనం:
బయటి ప్రపంచంలో మనకు గుర్తింపు, గౌరవం భాషవల్ల వస్తుంది. ఇంకా చెప్పాలంటే భాష యొక్క ప్రాధాన్యత మనకు ఎక్కడ స్పష్టంగా తెలుస్తుంది అంటే- మనం ఏ తెలుగేతర ప్రాంతాలలోనో పర్యటించామనుకోండి అప్పుడు అక్కడ మన గురించి మనం ‘తెలుగువాళ్ళం’ అని చెప్పుకోవాలంటే భాష ఆధారంగానే చెప్పుకోగలుగుతాము. ఈ విధంగా మనం చెప్పుకోవడానికి మన భాష ఒక ఉపకరణం అవుతుంది. మన మాతృభాష తెలుగు మనం తెలుగులోనే మాట్లాడదాం
–డాక్టర్ పి.వి.ఎన్. కృష్ణ