ఇంటి పెరట్లో లక్ష్మీచెట్టు

“డబ్బు సంపాదించడం ఎలా?” అన్న విషయం మీద ప్రపంచంలో ఉన్న ప్రతి భాషలోనూ బోలెడన్ని పుస్తకాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. వస్తూనే ఉంటాయి కూడా. డబ్బు జాతకం అలాంటిది. సుమారు 22 సంవత్సరాల క్రితం పబ్లిష్ అయిన రాబర్ట్ కియోసాకి “Rich Dad Poor Dad” దగ్గర నుండి రెండేళ్ళ క్రితం విడుదలైన “The Psychology of Money” వరకూ ఎన్నో పుస్తకాలు లక్షల కాపీలు అమ్ముడవుతూ, డబ్బు సంపాదనకు ఎలాంటి మనస్తత్వం అలవరచుకోవాలో చెప్పుకొచ్చాయి. ఆ వరుసలో వచ్చినటువంటి, వాటికంటే కాసింత భిన్నమైనటువంటి పుస్తకమే, ఈ.. “ఇంటి పెరట్లో లక్ష్మీచెట్టు”.

యండమూరి గారి ఇంటి పెరట్లో ఉన్న ఈ లక్ష్మీచెట్టు కేవలం ధనాన్ని మాత్రమే ఇచ్చి ఊరుకోదు. ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, తృప్తిని, కీర్తిని కూడా ఇస్తుంది. ఇప్పుడు ఆ లక్ష్మీచెట్టు తాలూకూ విత్తనాలను, ఆ చెట్టు మొలకెత్తేలా చేసే పద్ధతులను ఈ పుస్తకంలో పెట్టి మనకందిస్తున్నారు యండమూరి. ఆ చెట్టు కాస్తున్న ఫలాలను దశాబ్దాలుగా అనుభవిస్తున్న మనిషి కాబట్టి ఆయన మాటలను మనం నమ్మక తప్పదు. ఇక అటువంటి లక్ష్మీచెట్టే తన పెరట్లో కూడా ఉన్న “గోల్కొండా హోటల్స్” అధినేత నడికట్టు రామిరెడ్డి గారి జీవితకథ కూడా ఈ పుస్తకంలో ఉంది.
ఈ పుస్తకంలో తాను చెప్పదలచుకున్న విషయాలకు చాలావరకూ తన జీవితానుభవాలనే జోడించుకుంటూ వెళ్ళారు రచయిత. మిగిలిన ఉదాహరణలు కూడా ఈమధ్యకాలంలో మన చుట్టూ జరిగిన సంఘటనలనుండే తీసుకున్నారు. జీవితం ఉత్సాహభరితంగా ఉండటానికి మనకు 21 సూచనలిస్తారు యండమూరి. అలానే డబ్బు సంపాదించడానికి ఏ దారీ తోచట్లేదనేవారి కోసం 18 మార్గాలను కూడా సూచిస్తారు. వీటితో పాటూ ఏ ఏ రకాల బిజినెస్‌లలో ఎలాంటి రిస్క్స్ ఉండే అవకాశం ఉందో, వాటి విషయంలో ఎలాంటి ఆలోచనా దృక్పథం ఏర్పరచుకోవాలో కూడా ఆసక్తికరమైన రీతిలో చెప్పుకుంటూ సాగిపోతారు.

“లోదుస్తులు అమ్మే వ్యాపారం చేస్తే నలుగురూ ఏమనుకుంటార”ని తల్లిదండ్రుల నుంచే వ్యతిరేకత ఎదురైనా, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి సక్సెస్ అయిన Zivame.com వ్యవస్థాపకురాలు “రీచా కర్”, టీ అమ్మి పిల్లల్ని పోషించే స్థాయి నుండి చెన్నైలో సందీప రెష్టారెంట్ల అధినేత్రిగా ఎదిగిన “పాత్రిసియా”, సుమారు 800 మంది విజేతల బయోగ్రఫీలు చదివి, ఆ ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి.. వాటి సారంగా “ది ట్రావెలర్స్ గిఫ్ట్” అనే పుస్తకం రచించిన “ఆండీ ఆండ్రూస్”, పేదరికం నుండి పట్టుదలతో పైకెదిగి కోట్ల రూపాయిలతోపాటూ, కోట్లాదిమంది అభిమానాన్ని కూడా సంపాదించుకున్న సిల్వెస్టర్ స్టాలోన్, ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగర్.. ఇలా మనకు ఉత్తేజాన్ని కలిగించగలిగే వ్యక్తులెందరో మనకీ పుస్తకంలో తారసపడతారు.

అంతేకాకుండా.. “ప్రపంచంలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా గెలవవచ్చు” అనే “అమెరికన్ డ్రీమ్” నినాదం వెనుకనున్న కథ గురించి, ప్రాక్టికల్ క్యూరియాసిటీతో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ “పెన్సిలిన్” ఎలా కనుగొన్నాడన్న విషయం గురించి, 7.2% వడ్డీకి ఇచ్చిన డబ్బు పది సంవత్సరాలలో రెట్టింపయ్యే ఐన్‌స్టీన్ “రూల్ ఆఫ్ 72” గురించి, వడ్డీరేటు ప్రభావం వల్ల డబ్బు విలువలో వచ్చే మార్పును చెప్పే “ఫిషర్ థియరీ” గురించి తేలికైన మాటల్లో వివరిస్తారు.

ఇక..
“మనసు సులభమార్గాలు వెతుకుతుంది. బుద్ధి శాశ్వత పరిష్కారాలు చెబుతుంది”
“డబ్బు ఆరోగ్యాన్ని ఇవ్వకపోవచ్చు. కానీ నిశ్చయంగా డాక్టరు బిల్లు పే చేస్తుంది”
“ధర మనం ఇచ్చేది – విలువ మనం పొందేది”

వంటి కొటేషన్స్ చక్కెరపొంగలిలో జీడిపప్పు పలుకుల్లా మధ్యమధ్యలో తగులుతుంటాయి.
ఒకసారో Youtube జర్నలిస్ట్‌ని యండమూరి గారు.. “భారతదేశంలో అత్యంత ధనికుడైన క్రికెటర్ ఎవరో చెప్పగలరా?” అని ప్రశ్నించారట. అందుకతగాడు కోహ్లీ, సచిన్ ఇలా సందేహంగా సమాధానాలు చెప్పాడట. ఇక అతను చెప్పలేడని తెలిశాక యండమూరి గారు చెప్పిన ఆ ప్రశ్నకు సమాధానం చదివితే.. అరే మనం ఇలా ఆలోచించలేకపోయామే అని మనలో చాలామందికి అనిపించవచ్చు.

యద్దనపూడి సులోచనారాణి గారు, అరెకపూడి కౌసల్యాదేవి గారు, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు ఇలా తన కాలపు ప్రసిద్ధ నవలాకారులనెందరినో తలంచుకుంటూ, మనల్ని పుస్తకం పేజీల వెంబడి నడిపించుకుంటూ తీసుకువెళతారు యండమూరి. ఆ దారిలో బమ్మెర పోతన, అల్లసాని పెద్దనలు కూడా మనకు ఎదురవుతారు.
ఇక ఈ పుస్తకంలో రెండో భాగంగా ఉన్నది.. “నడికట్టు రామిరెడ్డి” గారి జీవితచరిత్ర. పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ పల్లెటూరి కుర్రాడు హైదరాబాదుకు వచ్చి, సాధారణ స్థాయినుండి ఫైవ్ స్టార్ హోటల్ స్థాపించే స్థాయికి ఎదిగిన తీరు ఎవరికైనా ఉత్సాహాన్నిచ్చే తీరుతుంది. అలానే 60 సంవత్సరాల క్రితంనాటి హైదరాబాదు నగరం రూపురేఖలు, అప్పట్లో ఇక్కడ ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు, నవాబు కుటుంబీకుల అలవాట్లు, సామాన్య నగరవాసుల పాట్లూ ఇలా ఎన్నో విషయాలు తెలుస్తాయి. LIC ఉద్యోగిగా, అలకాపురి టౌన్‌షిప్స్ వంటి ప్రసిద్ధ వెంచర్స్ నిర్మించిన వ్యాపారవేత్తగా, హైదరాబాదు నగరంలో ప్రఖ్యాతి చెందిన గోల్కొండ హోటల్ నిర్మాతగా ఇలా సాగిపోయింది రామిరెడ్డిగారి ప్రస్థానం. ఆ దారిలో ఆయనకు ఎదురైన కష్టనష్టాలు, వాటిని ఆయన ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్న తీరు మనకు ఉత్తేజాన్ని కలిగిస్తాయి. జీవితంలో ఎదిగిన వ్యక్తులు చాలామందే ఉంటారు. కానీ ఎదిగిన తరువాత ప్రతిఫలాపేక్ష లేకుండా సమాజానికి సేవ చేస్తున్నవారు మాత్రం అరుదుగా ఉంటారు. అటువంటి అరుదైన వ్యక్తులలో రామిరెడ్డిగారు కూడా ఒకరు. ఇవీ ఈ పుస్తకంలోని విశేషాలు.

ఇంకా..
పంజాగుట్ట చట్నీస్ రెస్టారెంట్‌కి యండమూరి గారికీ ఉన్న సంబంధం ఏమిటి?
Pain threshold కి, Pain Tolerance కి ఉన్న తేడా ఏమిటి?
మిస్ హైదరాబాద్ పోటీలో పాల్గొన్న ఒక అమ్మాయిని న్యాయనిర్ణేత స్థానంలో ఉన్న యండమూరి అడిగిన చమత్కారమైన ప్రశ్న ఏమిటి?
సింగపూర్‌ వెళ్ళిన ఒక విఖ్యాత రచయిత జనసమ్మర్ధంలో తప్పిపోయి, చేతిలో పర్సుగానీ, పాస్‌పోర్ట్ గానీ లేకపోయినా, ఏమాత్రం బెదిరిపోకుండా, కాసింత కామన్ సెన్స్ ఉపయోగించి తిరిగి తనవారిని ఎలా కలుసుకున్నాడు?
ఇలా ఒకటేమిటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ పుస్తకం నిండా బోలెడన్ని ఉన్నాయి.
ఇక చివరిగా యండమూరి గారి “ఇంటి పెరట్లో లక్ష్మీచెట్టు”కి నమస్కరిస్తూ.. మా పెరట్లోనూ, మీ పెరట్లోనూ ఈ లక్ష్మీచెట్లు త్వరలోనే మొలకెత్తాలని కోరుకుంటూ…

మీ
రాజన్ పి.టి.ఎస్.కె.

వెల రూ. 300/-
ప్రతులకు అన్ని పుస్తక విక్రయ కేంద్రాలలోను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap