మానవతా విలువలకు అద్దం పట్టిన ‘జీవితం పేరు’

ఎస్. కాసింబి గారి కలం నుండి జాలువారిన “జీవితం పేరు…” కవితా సంపుటి మానవీయ విలువలకు అద్ధం పట్టింది. ఇందులోని కవితలన్నీ కూడా మాతృత్వపు ప్రేమ, అమ్మాయిల ప్రేమైక జీవన సందేశం, పర్యావరణం, కరోనా వేత్తలు, నేటి యువతరం, సైనికుల సేవ, వలస కార్మికుల వెతలు, ఇంకా తెలుగు భాష పై ఉన్న మమకారాన్నంతా రంగరించి మరీ ఈ కవితా సంపుటిని అందంగా మలచారు. ఈ కవితా సంపుటిలో ప్రతి కవిత మెదడుకు పదును పెడుతూ మళ్లీ మళ్లీ చదవాలనిపిస్తాయి. “జీవితం పేరు…” కవితా సంపుటి రచయిత్రి మంచి విద్యావేత్త. అటు వృత్తిని, ఇటు ప్రవృత్తిని సమపాళ్ళలో మేళవించి రెండింటికి సమన్యాయం చేకూర్చారు. విద్యార్థులకు పాఠాలు చెప్తే మనసుకు ఎలా హత్తుకుంటాయో అలానే ఈ కవితా సంపుటిలోని కవితలన్నింటిని అమ్మ ప్రేమలోని మమకారానంత రంగరించి మనసుకు హత్తుకునేలా కవితా మాలలల్లారు. ఆమెలోని స్నేహశీలత, సహృదయత, సున్నితత్వం, మమకారం, మాధుర్యం అన్నింటిని కలిపి అక్షర తూటాలుగా మలిచి సాహితీ ప్రియులకు అందించారు.

మొదటగా “ఔషధం” కవితలో బిడ్డల బంగారు భవితకోసం అమ్మ పడే ఈతి బాధల్ని ఎంతో ఆవేదనంగా చెప్పారు. ఆకలి కేకలు వినిపిస్తున్నా, అపనిందల పాలవుతున్నా, గండాలు ఎదురైనా కూడా ముందుకు సాగుతుంది అమ్మ అంటారు కవయిత్రి. వయసు మీద పడ్డా గుండె దిటవు చేసుకుని కష్టాల్ని భరిస్తూ ఆపదల్ని అధిగమించడం వల్లే ఇందరు అమ్మలు, బిడ్డల్ని కాపాడుకుంటూ చూపే ప్రేమే అమ్మ ఆయుష్షుని పెంచే దివ్య ‘ఔషధం’ అంటారు కాశీంబి గారు. “సరిహద్దు సైనికుడు” కవితలో కర్తవ్యాన్ని మార్గంగా ఎంచుకొని, ధైర్యాన్ని ఆయుధంగా ధరించి శత్రువుల్ని తరిమికొడుతూ విజయకేతనం ఎగరవేసిన సైనికుల్ని జాతి రత్నాలుగా పోల్చి చెప్పారు “వలసలు” కవితలో వలస కార్మికుల ఈతి బాధల్ని ఆవేదనగా చెప్పారు. పొట్ట కూటి కోసం ఒకప్పుడు కార్మికులు, పేదలు పట్టణానికి వలస వచ్చేవారంటారు. కానీ ఇప్పుడు అగ్రవర్ణాల, పెత్తందారుల ఆగడాలు, ఊరి పెద్దల చెప్పు చేతుల్లో ఉండలేక, దొరల దౌర్జన్యాలు తట్టుకోలేక, కుల మతాలకతీతంగా స్నేహబంధం కోసం వారి నైపుణ్యాల గుర్తింపు కోసం బడుగు జీవులు ప్రతిరోజు వలస వెళ్లాలని వరుస కడుతున్నారని ఎంతో హృద్యంగా చెప్పారు.

“అమ్మవో!… నాన్నవో!” కవిత కూడా ఎంతో ఆద్రతగా ఉంది. పిల్లల ఎదుగుదల కోసం అన్నింటిని సర్దుకుపోయే మనస్తత్వం గల అమ్మ మనసుని చాలా చక్కగా ఆవిష్కరించారు కవయిత్రి. చుట్టూ ఎన్ని సుఖాలు, విలాసాలు ఉన్నా వాటిని కాదని చిన్ని సొంత కుటీరంలోనే ఉంటూ పొంగిపొర్లే దుఃఖాన్ని కనురెప్పల మాటల దాస్తు కారుణ్యపు చెమ్మ కోసం, ఓదార్పు కోసం ప్రతి మనసుని ఆప్యాయంగా తడుముతున్నారాంటే ఇదంతా కన్నబిడ్డల కోసమేనని బంధీగా వున్న ఒంటరి “అమ్మవో!… నాన్నవొ!” అంటూ ఎంతో ఆవేదనా భరితంగా చెప్పారు. “జీవితం పేరు…” కవితలో అమ్మతనం గురించి చాలా అద్భుతంగా చెప్పారు. అమ్మ ఒక అణువు. ఇందులోనే అమ్మ తత్వాలన్నీ జన్మించాయంటారు. అమ్మ ఒక పదం కాదు, కాదు అమ్మ ఓ పాట, ఓ కవిత అంటూ చెప్పారు. అలాగే కొండలు, నదులతో పాటు పనిముట్లన్నీ అమ్మనే జెపిస్తాయి కాబట్టి జీవితం పేరు అమ్మ అంటారు. అంటే సమస్తం అమ్మతోనే ముడిపడి ఉందని కవయిత్రి చెప్పకనే చెప్పారు. “ఎలా” అనే కవితలో మనుషుల పైపై మెరుగుల్ని చాలా చక్కగా తెలియజేశారు. ముఖ కవళికళకు, పెదవులకు మేకప్ లు, కళ్ళకు అద్దాల అడ్డుతెర, జిలుగు వెలుగుల వేషధారణ… ఇలా శరీరమంతా మేకప్ ల ముసుగుతో ఉన్న మనిషిని కలుసుకునేదెలా? అంటూ ప్రశ్నించడంతో ఇలా ఆర్భాటాల మేకప్ తో మనిషి అనారోగ్యం పాలవుతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.

“సంపద” కవితలో భవ బంధాలన్ని కరుడు గట్టిపోతుంటే చూస్తూ ఊరుకుంటావేం నేస్తం అంటూ ప్రశ్నించారు. కన్నవారిపై కారుణ్యం, గురువాత్సల్యం, సోదర బంధం, నెచ్చలి బంధం… ఇలా అన్ని చిద్రమైపోతుంటే నేస్తాన్ని ముందుకు నెట్టి కార్యాచరణకు ఉద్యమింప చేశారు రచయిత్రి. ముందుకు కదిలి మమతల దీపాన్ని వెలిగించి పర సేవా పరాయణుడవై అందరినీ ఆదరించమని హితవు చెప్పారు. ఇంకా మోడువారిన ఇళ్ళలోని తల్లిదండ్రులకు పెద్దపీట వేసి పచ్చదనాన్ని నింపి సహనం అనే పెట్టుబడితో స్నేహ ఫలాల్ని అందుకుంటుంటే అదే గొప్ప ‘సంపద’ అంటూ చాలా చక్కగా కవిత్వీకరించి చెప్పారు. “కరాళ యుద్ధం’ కవితలలో ఎవరికి వారు సైన్యమై స్వీయ నిర్బంధంలో ఉంటూ మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం పాటిస్తూ స్నేహితుల్ని, సన్నిహితుల్ని ఎలర్టు చేస్తూ ఆరోగ్య, పారిశుద్ధ్య, రక్షక భటుల్ని కీర్తించాలని చెప్పారు. ఇలా కరోనాతో కడదాకా పోరు సాగించి కరాళ యుద్ధం చేసి దేశాన్ని ఆరోగ్యవంతం చెయ్యమని చక్కని మెసేజ్ ని ఇచ్చారు ఈ కవితలో.

‘తెలుగు భాష” కవితలో కన్నతల్లి భాష అయిన తెలుగు తరతరాలు చరిత్రకు సాక్ష్యమిస్తూ జాతి సంస్కృతికి నిలువుటదమైన తెలుగు వెలుగుల్ని నలుమూలల వెదజల్లారు. “స్పర్శ” కవితలో ప్రేమ, నమ్మకంతో ధైర్యం నింపి వెన్ను తట్టేది స్పర్శ అంటారు. అలాగే విషం కక్కుతూ వంకరగా చూసే స్పర్శ తేడాని తెలుసుకొనేట్లు ఆడ బిడ్డలకు అవగాహన కలిగించాలని చక్కని మెసేజ్ ఇచ్చారు తల్లులకు రచయిత్రి. చివరిగా “చెలిమి చిరునామాలు” కవిత స్నేహానికి చక్కని భాష్యం చెబుతూ అద్భుతంగా ఉంది. ఆస్తులన్నీ కరిగిపోతూ, అనారోగ్యం వెన్నంటే ఉండి, దిగులుతో గుండె బరువెక్కినా, నమ్మకాలు ఒమ్మయినా, బంధుత్వాలు చిద్రమైనా, నీలాపనిందలు మనసుని గాయపరుస్తున్నా కూడా మన వెన్నంటే ఉండి ప్రేమను పంచుతూ కడదాకా స్నేహం హస్తాన్ని అందించే వారే స్నేహ ప్రతిరూపాలు!, చెలిమి చిరునామాలు! అంటూ స్నేహబంధంలోని మాధుర్యాన్ని ఎలుగెత్తి చాటారు కాశీంబి గారు.

ఇలా ఆద్యంతం ఎంతో ఉత్కంఠ భరితంగా, ఆహ్లాదంగా, సందేశాత్మకంగా సాగిపోతూ “జీవితం పేరు…” కవితా సంపుటి అమ్మ ప్రేమలోని మాధుర్యాన్ని పంచింది. ఇంకా ఈ కవితా సంపుటిలో మమతలనది, “ప్రేమ, వృద్ధులు, ప్లాస్టిక్, జేజేలు, మురికి, ఈత, ఘన కీర్తి, రుజువు, తెలుగమ్మాయి, దుఃఖ గాధ…” లాంటి కవితలు పాటకుల్ని అలరింపజేస్తాయి. ఇంత చక్కటి కవితా సంపుటిని సాహితీప్రియులకు అందించిన షేక్. కాసింబి గారికి అభినందనలు.

ప్రతులకు షేక్ కాశింబి, జెకెసి. కాలేజీ రోడ్డు, విజయపురి కాలనీ, గుంటూరు. పుస్తకం వెల. 100/- రూపాయలు, పేజీలు 104. ఫోన్ నెంబర్. 9052216044.

-పింగళి భాగ్యలక్ష్మి, గుంటూరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap