విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.
ధృవతారలు – 38
ఆంధ్రావనిలో వెలసిన ఓ మంచినీటి కోనేరు భారతావనికి అపర భగీరథుడయిన తెలుగు ఇంజనీరు శ్రీ కానూరు లక్ష్మణరావు (కె.ఎల్.రావు). సివిల్ ఇంజనీరింగ్ లో మద్రాసు యూనివర్శిటీ పట్టా పుచ్చుకున్నారు. తప్పని పరి స్థితుల్లో గిండీ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ గా చేరి పరిశోధనల వైపు దృష్టిని మళ్ళించి తాను రాసిన ఓ సిద్ధాంత వ్యాసాన్ని ఇంగ్లండుకు పంపి అక్కడి మేధావులతో దానిని చదివించి మరీ రిసెర్చి డిగ్రీ పొంది విదేశాలకు వెళ్ళి కాంక్రీటు విద్యలో ప్రావీణ్యం సంపాదిస్తూ అక్కడే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అండ్ రీ ఇన్ఫోడ్ కాంక్రీట్ పై ఓ గ్రంథం రాసి పేరు, డబ్బూ గడించారు. భారతదేశంలో జలవిద్యుత్ ఉత్పాదన చేసే నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టుల నిర్మాణం, ఇతర భారీ ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలను చేపట్టి సమర్థవంతంగా నిర్వహించారు. రాష్ట్రపతి అవార్డు, అంతర్జాతీయ సదస్సుకు ఉపాధ్యక్ష పదవి, విద్యుచ్ఛక్తి, నీటిపారుదల కేంద్రమండలికి అధ్యక్ష పదవి, డాక్టర్ ఆఫ్ సైన్స్, డాక్టరేట్, పద్మభూషణ్ వంటి బిరుదులు, సత్కారాలు ఎన్నో అందుకున్నారు. రాజకీయాల్లోనూ మచ్చలేని మనిషిగా ఎన్నికలలో గెలిచి పార్లమెంటులో నీటిపారుదల, విద్యుత్ శాఖలకు మంత్రిగా నియమించబడిన శ్రీ కె.ఎల్. రావుగారు భారతదేశ బ్యారేజ్ లకు మహారాజు. అపర భగీరథుడు. భారతీయ జలయాజమాన్య పితామహుడు అయిన డా. కె.ఎల్. రావు నేటికీ మన ధృవతార !
(కానూరు లక్ష్మణరావు (కె.ఎల్.రావు) జన్మదినం 15 జూలై 1902)