విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.
ధృవతారలు – 37
భారతదేశం గర్వించదగిన తెలుగు నటనా యశస్వి ఎస్.వి.రంగారావు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. నటనకే నూతన భాష్యం చెప్పిన ఈయన నూజివీడులో జన్మించాడు. 12 ఏళ్ళకే రంగస్థలంపై నటన ప్రారంభించిన ఎస్.వి.రంగారావు అంచచెలంచెలుగా నటసోపా నాలెక్కి కీర్తి సౌధాలను అధిరోహించాడు. బి.ఎస్.సి.. చదివిన తదనంతరం ఎస్.వి.ఆర్. బందరులో ఫైర్ ఆఫీసర్ గా పనిచేస్తూ వరూధిని అనే సినిమాలో హీరో వేషం వేసేందుకు చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి సినీరంగ ప్రవేశం చేశాడు. విజయ పిక్చర్స్ వారు తీసిన పాతాళభైరవి సినిమాలో నేపాళ మాంత్రికుని పాత్ర పోషించి తన విజయ పరంపరను కొనసాగించాడు. విజయ వారి మాయాబజార్ సినిమాలో ఎస్.వి.ఆర్. పోషించిన ఘటోత్కచ పాత్ర ఈయన నట చరిత్రను సువర్ణా క్షరాలలో లిఖించింది. నర్తనశాలలోని కీచకపాత్ర ఈయనకు జకార్తాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ యాక్టర్ అవార్డు తెచ్చి భారతదేశంలో అంతర్జాతీయ అవార్డు అందుకొన్న తొలినటునిగా నిలిపింది. ఎస్.వి.ఆర్. చదరంగం, బాంధవ్యాలు అనే రెండు సాంఘిక చిత్రాలు నిర్మించి, నంది అవార్డులు అందుకున్నాడు. నిండైన విగ్రహంతో, అరుదైన వాచకంతో విలన్‌గా, తండ్రిగా, పౌరాణిక, సాంఘిక పాత్రలలో నటించి, ఆ పాత్రలకే వన్నె తెచ్చిన విశిష్ట నటుడు రాష్ట్రపతి అవార్డు, విశిష్ట నటచక్రవర్తి వంటి బిరుదులందుకున్న నటసింహం, నటసార్వభౌమ ఎస్.వి.రంగారావు నేటికీ మన ధృవతార.
(ఎస్.వి.రంగారావు జన్మదినం 03 జూలై 1919)