అనుపమ సినిమాల గంగాధర తిలక్

“కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది గోదావరి వరద లాగ కోరిక చెలరేగింది”, “నీయాశ అడియాస చేజారే మణిపూస బ్రతుకంతా అమవాస లంబాడోళ్ళ రాందాసా” వంటి హాయిగొలిపే పాటలు వింటుంటే గుర్తుకువచ్చేది అనుపమ సంస్థ సినిమాలే. ఆ సంస్థకు అధిపతి కె.బి. తిలక్ అనే కొల్లిపర బాల గంగాధర తిలక్. ఆయన నిర్మించిన సినిమాలు తక్కువే. దర్శకత్వం వహించిన సినిమాల సంఖ్య కూడా పరిమితమే. కానీ సినిమా నిర్మాణంలో ఒక ‘ట్రెండ్’ను సృష్టించిన దర్శకనిర్మాతగా తిలక్ గణుతికెక్కారు. సినిమా అనే శక్తివంతమైన మాధ్యమం ద్వారా మానవాభ్యుదయానికి, సంఘ సంస్కరణకు, సమాజ ప్రగతికి పాల్పడవచ్చుననే ఆశయాన్ని నమ్మి ఆ దిశగా అడుగులేసిన అతికొద్ది నిర్మాతలలో తిలక్ ప్రధమ పంక్తిలో వుంటారు. ఎం.ఎల్.ఎ చిత్రంలో వచ్చే “నమో నమో బాపు మాకు న్యాయమార్గమే చూపు” అనే ప్రబోధగీతమే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. “ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా” వంటి పాట ద్వారా మనలను మనమే ఉద్ధరించుకోవాలి గానీ, ఎవరో వచ్చి వెలగబెడతారని ఆశించడం తప్పు అనే నినాదాన్ని సమర్ధించిన ఆదర్శ నిర్మాత తిలక్. ప్రముఖ దర్శక నిర్మాత ఎల్.వి. ప్రసాద్ కు తిలక్ స్వయానా మేనల్లుడు. స్వాతంత్ర్య సమరయోధుడుగా, సమాజసేవకుడుగా, సినిమా నిర్మాతగా ఎంతోమందికి తెలిసిన వ్యక్తి తిలక్. జనవరి 14 న జన్మించిన తిలక్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని గురించి కొన్ని విశేషాలు.

మార్క్సిస్టు భావాలతో … బాలగంగాధర తిలక్ జన్మించింది 1926 సంక్రాంతి పర్వదినాన. వారిది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని దెందులూరు గ్రామం. తిలక్ తండ్రి వెంకటాద్రి మోతుబరి రైతు. స్వాతంత్రోద్యమంలో తనవంతు పాత్ర పోషించిన వ్యక్తి. తిలక్ తల్లి ఎల్.వి. ప్రసాద్ కు స్వయానా అక్క. వారిది పెదవేగి గ్రామం. “స్వాతత్ర్యం నా జన్మ హక్కు” అని నినదించిన బాలగంగాధర తిలక్ పేరునే తనకు తండ్రి నామకరణం చేశారు. ఏలూరు మునిసిపల్ పాఠశాలలో తిలక్ చదువు కున్నారు. పాఠశాల విద్యార్థి దశలోనే ‘క్విట్ ఇండియా’ (1942) ఉద్యమంలో పాల్గొని అరెస్టై ఏలూరు సబ్-జైలులో వున్నారు. ఆరోజుల్లో ఆ జైలును సందర్శించిన ఏలూరు కలెక్టరు తిలక్ ను చూసి, అక్కడ శిక్ష అనుభవిస్తున్న ఇతర ఉద్యమకారులతో “పిల్లవాణ్ణి ఎందుకు చెడగొడుతున్నా”రని ప్రశ్నిస్తే, “ఎవరూ నన్ను చెడగొట్టటం లేదు. మహాత్మా గాంధి పిలుపుతో నేను స్వచ్చందంగా ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాను” అంటూ ధైర్యంగా బదులిచ్చిన ధీమంతుడు తిలక్. ఏలూరు కోర్టులో విచారణ తరవాత రాజమండ్రి కేంద్ర కారాగారానికి తిలక్ ను తరలించారు. అక్కడే తిలక్ జైలు శిక్షను అనుభవించారు. జైలు నుంచి విడుదలయ్యాక ప్రజానాట్యమండలిలో చేరి చురుకైన పాత్ర పోషించారు. అతివాద పంధాను అనుసరిస్తూ, నాటకాలు వేస్తూ, విప్లవ గీతాలను ఆలపిస్తూ గ్రామ గ్రామాలు తిరుగుతూ స్వాతంత్రోద్యమ స్పూర్తిని వ్యాప్తిచేశారు. చదువుకు స్వస్తి చెప్పి, తండ్రితో తనకు ఆస్తిపాస్తులేమీ వద్దని ఉత్తరం రాసి బొంబాయికి ప్రయాణం కట్టారు. బొంబాయి వెళ్ళే రైలుకు సమయం ఉండడంతో బెజవాడలో చండ్ర రాజేశ్వరరావు వద్దకు వెళ్లి పరిచయ ఉత్తరం తీసుకొని బొంబాయిలో అమృత డాంగే ను కలిశారు. అక్కడ పీపుల్ థియేటర్ లోపనిచేస్తున్న రమేష్ థాపర్, బల్రాజ్ సాహ్ని లతో సాంగత్యం పెంచుకున్నారు. ఎల్.వి. ప్రసాద్ ఇంట్లోనే ఉంటూ కొంతకాలం ఒక ప్రింటింగు ప్రెస్ లో పనిచేశారు, ‘పీపుల్స్ వార్’ అనే పత్రికకు పేపర్ బాయ్ గా కూడా పనిచేశారు. కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ స్క్వాడ్ లో సేవలందించారు. ‘గృహప్రవేశం’ చిత్రానికి దర్శకత్వం వహించేందుకు ఎల్.వి. ప్రసాద్ మద్రాసు చేరుకోగా, మరికొన్ని రోజులకు తిలక్ కూడా మద్రాసులో అడుగెట్టారు.

సినిమారంగంలో…
మద్రాసు చేరిన కొత్తల్లో తిలక్ ప్రీమియర్ ఫిలిమ్స్ వారి పంపిణీ సంస్థలో చేరి సినిమా రిప్రజెంటేటివ్ గా పనిచేశారు. గృహప్రవేశం చిత్రానికి ఎడిటర్ గా పనిచేసిన ఎం.వి. రాజన్ తో సఖ్యత ఏర్పడింది. సువర్ణలతా పిక్చర్స్ వారు 1948లో కాళ్ళకూరి సదాశివరావు దర్శకత్వంలో ‘సువర్ణమాల’ చిత్రాన్ని నిర్మించినప్పుడు రాజన్ తో కలిసి తిలక్ ఎడిటింగ్ శాఖలో పని చేశారు. అదే సంవత్సరం ‘రాధిక’ సినిమాకు కూడా ఇద్దరూ పనిచేశారు. తరవాత హెచ్.వి. బాబు నిర్మించిన ‘ధర్మాంగద’ (1949) చిత్రానికి, జ్ఞానాంబికా పిక్చర్స్ వారు 1951లో ‘మంత్రదండం’ అనే సినిమా నిర్మిస్తే, ఆ చిత్రానికి కూడా తిలక్ రాజన్ తో కలిసి పనిచేయడం జరిగింది. అలా రాజన్ కు సహాయకుడిగా ఎడిటింగ్ శాఖలో కొంతకాలం పనిచేశాక 1954లో సారథి సంస్థ వారు సహకారోద్యమం నేపథ్యంలో ‘అంతా మనవాళ్ళే’ నిర్మించిన సినిమాలో స్వతంత్రంగా ఎడిటర్ గా పనిచేసే అవకాశం దక్కింది. ఆ సినిమాకు తాపీ చాణక్య దర్శకత్వం వహించారు. మరుసటి సంవత్సరం అదే సంస్థ తెలంగాణా ఉద్యమ స్పూర్తితో నిర్మించిన ‘రోజులు మారాయి’ సినిమాకు కూడా తిలక్ ఎడిటర్ గా పనిచేశారు. అప్పటికే తెలంగాణా విమోచన ఉద్యమం ఊపందుకుంటున్నది. ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం విధించింది. దాంతో ప్రజానాట్యమండలి కళాకారులంతా ఒక్కొక్కరే మద్రాసు చేరుకోవడం జరిగింది. వారిలో తాతినేని ప్రకాశరావు, సుంకర సత్యనారాయణ, వీరమాచనేని మధుసూదనరావు, మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి, తుమ్మల, వాసిరెడ్డి భాస్కరరావు, తాపీ ధర్మారావు, సూరపనేని పెరుమాళ్ళు, గరికిపాటి వరలక్ష్మి వంటి కళాకారులు యెందరో వున్నారు. వీరంతా సినిమా పరిశ్రమలో పాలుపంచుకోవడం జరిగింది. అప్పుడే నవయుగ పిక్చర్స్ వారు ‘జ్యోతి’ చిత్రాన్ని తెలుగు, తమిళంలో ఏకకాలంలో నిర్మిస్తూ సి.వి.శ్రీధర్ ను దర్శకుడిగా నియమించారు. జి.వరలక్ష్మి తోబాటు పలువురు ప్రజానాట్యమండలి కళాకారులు ఇందులో నటించడం జరిగింది. అయితే దర్శకుడు శ్రీధర్ తో నిర్మాతలకు భేదాభిప్రాయాలు రావడంతో శ్రీధర్ తప్పుకున్నాడు. అప్పుడు దర్శకత్వ బాధ్యతను తిలక్ తీసుకొని సినిమాను పూర్తిచేశారు. తిలక్ దర్శకత్వ శాఖకు మారడంతో రాజన్ కు అక్కినేని సంజీవి ఎడిటింగ్ శాఖలో సహాయకుడిగా పనిచేశారు. కమ్యూనిస్టు సిద్ధాంతాల ప్రకారం ప్రమాణపత్రాలు మార్చుకోవడంతో తిలక్ కు శకుంతలతో 1954 లో వివాహం జరిగింది.

ముద్దుబిడ్డ తో నిర్మాతగా…
1956లో ఆరుద్ర సేకరించిన శరత్ బాబు బెంగాలి నవల ‘బిందూర్ చలే’ ఆధారంగా తిలక్ సొంతంగా సినిమా తీసే ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్న ఫలితమే ‘అనుపమ’ సంస్థ ఆవిర్భావానికి దారి తీసింది. తనే నిర్మాత, దర్శకుడిగా తొలిప్రయత్నంగా ‘ముద్దుబిడ్డ’ చిత్రాన్ని నిర్మించారు. అందులో జగ్గయ్య, జమున, నాగయ్య, లక్ష్మీరాజ్యం ముఖ్య పాత్రలు ధరించారు. కె.ఎస్. ప్రకాశరావు సలహామీద జి. వరలక్ష్మిని హీరోయిన్ పాత్రకు తీసుకున్నారు. ఎనిమిది రీళ్ల షూటింగు జరిగాక, జి. వరలక్ష్మి ఒకానొక డైలాగును మార్చమని కోరింది. “ఆరుద్ర, నేను యెంతో ఆలోచించి ఆ డైలాగును రాశాము. దానిని మార్చడం కుదరదు” అని తిలక్ చెప్పడంతో ఆమె “అయితే నేను ఈ సినిమా చెయ్యను” అని భీష్మించుకుంది. తిలక్ కు అప్పుడు పట్టుమని 30 యేళ్ళు లేవు. పైగా సినిమా సంగం పూర్తయింది. అయినా ధైర్యం చేసి ఆమెను తొలగించి లక్ష్మీరాజ్యంతో ఆ ఎనిమిది రీళ్ళు రీ-షూట్ చేసి సినిమా పూర్తి చేశారు. చిత్రసీమలోని ఇతర నిర్మాతలు తిలక్ ధైర్యానికి ఆశ్చర్యపడ్డారు, మెచ్చుకున్నారు కూడా. దర్శకుడు కె.వి.రెడ్డి కూడా తిలక్ సాహస నిర్ణయానికి మద్దతు పలికారు. ఈ సినిమా ద్వారా నటుడు సాయికుమార్ తల్లి ‘జ్యోతి’ ని, బాంబే మీనాక్షిని నర్తకిగా పరిచయంచేసిన ఘనత కూడా తిలక్ దే. తదనంతర కాలంలో నిర్మించిన సినిమాల్లో ఇద్దరు ముగ్గురు కొత్తనటుల్ని కానీ, సాంకేతిక నిపుణులను కానీ పరిచయం చేయడం తిలక్ అలవాటుగా మార్చుకున్నారు. తరవాతి రోజుల్లో ఎడిటర్ గా మంచి పేరుతెచ్చుకున్న కోటగిరి వెంకటేశ్వరరావు రాజన్ కు సహాయకుడుగా వ్యవహరించారు. ఈ చిత్రానికి మాటలు పాటలు రాసిన ఆరుద్ర, సంగీతం సమకూర్చిన పెండ్యాల తో తిలక్ అనుబంధం చివరిదాకా సాగింది. సినిమా విజయవంతమైంది. ముఖ్యంగా “జయమంగళ గౌరీ దేవి, దయజూడుము చల్లని తల్లి” పాట ప్రతి ఇంటిలోనూ దేవుని గదిలో వినపడుతూనే వుంటుంది. అలాగే “చూడాలని ఉంది అమ్మా చూడాలని ఉంది”, “ఎవరు కన్నారెవరు పెంచారు”, “ఇటులేల చేశావయా ఓ దేవదేవా”, “చిట్టీ పొట్టీ వరాల మూట, గుమ్మడిపండు గోగుపువ్వు” పాటలు కూడా బాగా హిట్టయ్యాయి. ఈ సినిమా విజయంతో మరుసటి సంవత్సరమే ‘ఎం.ఎల్.ఎ’ చిత్రానికి శ్రీకారం చుట్టారు. భూసంస్కరణల నేపథ్యంలో సాగే ఈ సినిమా విడుదలైన సంవత్సరం తరవాత ప్రభుత్వం ‘ల్యాండ్ సీలింగ్’ చట్టాన్ని ప్రతిపాదించి 1961 లో దానినే చట్టం చేయడం కేవలం యాదృచ్చికం అని చెప్పవచ్చు. ఈ సినిమాలో జె.వి. రమణమూర్తి ని, గాయని ఎస్. జానకిని, చోటే ఖుర్షీద్ అనే నర్తకిని తిలక్ పరిచయం చేశారు. ఇందులో ఎం.ఎల్.ఎ. గా పోటీచేసి జగ్గయ్య పార్టీ చిహ్నం ‘ఆవు-దూడ’. తదనంతర కాలంలో ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు ఆమె ఎంపికచేసిన పార్టీ చిహ్నం కూడా ‘ఆవు-దూడ’ కావడం యాదృచ్చికమే. “సినిమాను ఒక శక్తివంతమైన సాధనంగా చూశానే కాని, వ్యాపారాత్మకంగా చూడలేదు. అందుచేతే ఎక్కువ సినిమాలు నేను తీయలేదు” అని ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ తిలక్ చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోవాల్సినవే! నృత్యగీతాల్లో కూడా సందేశం వినిపించిన ఘనత తిలక్ ది. ఈ సినిమాలోని ఒక నృత్యగీతంలో “అందరాని పదవికోసం, అందమైన పడతి కోసం, కొంగజపం చేసేది కొందరు, దొంగ వేషం వేసేది యెందరు… చేసే ఖర్చు ఒకటి, రాసే పద్దు వేరొకటి” అంటూ నగ్న సత్యాన్ని డ్యాన్స్ పాటలో జొప్పించిన ప్రత్యేకత ఆయనదే. అంతేకాదు ఈ సినిమాలో “ఇదేనండి ఇదేనండి భాగ్యనగరము, మూడు కోట్ల ఆంధ్రులకు ముఖ్య పట్టణం” అనే పాటను, “జామి చెట్టు మీద నున్న జాతి రామ చిలుక, యెంతో ముచ్చట పడినా నాపై యెందుకు నీకీ అలుకా” పాటను అందంగా ఇమిడ్చారు. ఎస్. జానకి చేత తొలిసారి “నీయశా అడియాస చేజారే మణిపూస, బ్రతుకంతా అమవాస, లంబాడోళ్ళ రాందాసా” పాటను ఘంటసాలతో కలిసి పాడించారు. వ్యాపార దృష్టితో సినిమాలు తీయకుండా 23 ఏళ్ళ వ్యవధిలో తనదైన శైలిలో అత్తా ఒకింటి కోడలే (1958), చిట్టితమ్ముడు, ఈడూ జోడూ, ఉయ్యాల-జంపాల, పంతాలు పట్టింపులు(1968), భూమికోసం (1974), కొల్లేటి కాపురం (1976) వంటి చిత్రాలకు ప్రాణం పోశారు. తిలక్ నిర్మించిన చివరి చిత్రం త్రిపురనేని గోపీచంద్ కథ ఆధారంగా నిర్మించిన ‘ధర్మవడ్డి’ (1982). ‘ముద్దుబిడ్డ’ సినిమాని హిందీలో ‘చోటి బహు’ (1971) పేరుతో, ‘ఈడూ జోడూ’ సినిమాని ‘కంగన్’ (1972) పేరుతో తనే పునర్నిర్మించారు. అలాగే ‘అత్తా ఒకింటి కోడలే’ సినిమాను తమిళంలో ‘మామియారుమ్ ఒరు వీట్టు మరుమగళే’ (1961) పేరుతో పునర్నిర్మించారు. ‘భూమికోసం’ (1974) సినిమా ద్వారా నటి జయప్రదను పరిచయం చేసింది కూడా తిలక్ కావడం విశేషం. ధర్మవడ్డి సినిమా తరవాత 16 యం.యం ప్రొజక్టర్ సాయంతో పల్లె పల్లెలు పర్యటిస్తూ ప్రభోదాత్మకమైన సినిమాలను గ్రామీణ ప్రజలకు చేరువ చేస్తూ వచ్చారు. చలనచిత్ర పరిశ్రమకి తిలక్ చేసిన సేవలను గుర్తిస్తూ ఆయనకు భారత ప్రభుత్వం ‘బి.ఎన్. రెడ్డి జాతీయ అవార్డు’ ను ప్రదానం చేసింది. తిలక్ అనారోగ్యంతో బాధపడుతూ తన డెబ్భై మూడవ ఏట సెప్టెంబరు 23, 2010 న తుది శ్వాస విడిచారు.

మరిన్ని విశేషాలు
ఎం.ఎల్.ఏ చిత్రంకోసం ఆనాటి మహబూబాబాద్ నియోజకవర్గం నుండి పోటీచేసి మంత్రి అయిన నూకల రామచంద్రా రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని షూట్ చేశారు. అందులో బారులు తీరి నిల్చున్న ఓటర్లను, బహిరంగ సభను చిత్రీకరించారు. ఇందులో గుమ్మడి పోషించిన పాత్రను ఎస్.వి. రంగారావు అయితే బాగుంటుందని గుమ్మడే సూచించినా, గుమ్మడి చేతనే ఆ పాత్రను పోషింపజేశారు తిలక్. హైదరాబాదు నగరాన్ని చూపే “ఇదేనండి ఇదేనండి భాగ్యనగరము” పాటను నూతన నటుడు జె.వి. రమణమూర్తి, గిరిజ ల మీద చిత్రీకరించారు. శాసనసభ ఆవరణలో షూటింగు జరిపేందుకు నాటి శాసన సభాపతి అయ్యదేవర కాళేశ్వరరావు అనుమతి మంజూరు చేయగా చాలావరకు షూటింగు అక్కడే జరిపారు. కానీ తిలక్ అంటే కిట్టని వాళ్ళు శాసన సభ కార్యదర్శి కి చెప్పి షూటింగు ఆపుచేయించారు. ఘర్షణ పడడం ఇష్టం లేని తిలక్ మిగతా సన్నివేశాలు సెట్టింగ్ వేసి చిత్రీకరించారు.

‘అత్తా ఒకింటి కోడలే’ సినిమాకు ‘బరంపురం కొల్లాది’ అనే ఒరియా నాటకం ఆధారం. ఈ చిత్రానికి తిలక్ కొత్తరకంగా పబ్లిసిటీ ఇచ్చారు. చిత్రకారుడు బాపు చేత కార్టూన్ల రూపంలో బొమ్మలు వేయించి, వాటికి ఆరుద్ర చేత పద్యరూపంలో మాటలు రాయించి వారం వారం ఆంధ్రపత్రికలో ప్రచురిస్తూ పబ్లిసిటీ ఇచ్చారు. అటువంటి ప్రయత్నం చేసిన మొదటివ్యక్తి తిలక్. అప్పట్లో ఏలూరు పురపాలక సభ్యురాలిగా పనిచేసిన పువ్వుల లక్ష్మీకాంతం ను అత్తగారి పాత్రలో నటింపజేశారు. ఈ సినిమా సింహభాగం సంగం జాగర్లమూడి ప్రాంతంలో చిత్రీకరించారు. మద్రాసు సిస్టర్స్ గా పేరొందిన శశి-కళ లను ఇందులో డ్యాన్సర్స్ గా పరిచయం చేశారు.

తిలక్ కు తీరని కోరికలుగా ఉండిపోయిన అంశాలు లేకపోలేదు. హైదరాబాదుకు సమీపంలోని ఉప్పల్ ప్రాంతంలో స్టూడియో నిర్మించాలని యోచన చేశారు. స్థలం ఎంపిక కూడా జరిగింది. కానీ వారి ప్రతిపాదన ఆచరణలోకి రాలేక పోయింది. ముద్దుబిడ్డ సినిమా తరవాత ‘భీమసేన’ అనే సినిమా తీయాలని ప్రకటించారు. కొండేపూడి చేత కథారచన కూడా చేయించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అయితే అదే థీమ్ ని తరవాత రోజుల్లో కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో ‘పాండవ వనవాసం’ పేరుతో సినిమాగా తీయడం జరిగింది. ఎన్.టి. రామారావు కృష్ణుడుగా, జగ్గయ్య అర్జునుడుగా, దేవిక సుభద్రగా ‘శ్రీకృష్ణార్జున’ సినిమాను మొదలుపెట్టి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. తరవాత అది కూడా ఆగిపోయింది. అదే కథను తరవాతి కాలంలో కె.వి. రెడ్డి ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ పేరుతో సినిమా నిర్మించి విజయం సాధించారు. అలాగే ‘ఉత్తర గోగ్రహణం’ సినిమా తీయాలని అంతా సిద్ధం చేసుకున్నారు అదికూడా ఆగిపోయింది. అదే కథను కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో శ్రీధరరావు, లక్ష్మి రాజ్యం ‘నర్తనశాల’ గా నిర్మించి డబ్బు చేసుకున్నారు. తిలక్ తీయలేకపోయిన మరొక సినిమా ‘ఊరికే పెద పాలేరు’.

‘చోటి బహు’ సినిమాలో తొలుత హీరోయిన్ గా సైరాబాను ను బుక్ చేసి ఆమె మీద ఒక పాటకూడా చిత్రీకరించారు. అనారోగ్యకారణాలవలన ఆమె చికిత్సకోసం లండన్ కు వెళ్ళిపోతే ఆ స్థానంలో షర్మీలా టాగూర్ ను తీసుకున్నారు. సైరాబాను కు ముందు మౌసమీ చటర్జీని తీసుకుందామనుకున్నారు. కానీ సైరాబాను వైపే మొగ్గారు.

ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap