తెలుగుజాతి వైతాళికుడు కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావుగారి శత వర్థంతి
జీవితంలో అనుక్షణం పరిశోధనే ప్రాణంగా, భాషాచరిత్ర, సాహిత్యాలను మధించి, సజాతీయ విజాతీయ భాషా సాహిత్యాల లోతులను చూసి, సాదృశ్య వైదృశ్యాలను సమ్యక్ దృష్టితో తెలుగుజాతికి అందించిన, తెలుగువారిని ఆధునికయుగం వైపు నడిపించిన మహనీయుడు, తెలుగువారు విస్మరించిన వైతాళికుడు కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు గారు (1875-1923).
చరిత్ర, శాసన పరిశోధనను మల్లపల్లి సోమశేఖరశర్మ, చిలుకూరి వీరభద్రరావు వంటి తొలితరం చరిత్రకారులకు నేర్పడం, ‘శివతత్వసారం’ వంటి తొలి తెలుగు శతకాన్ని పరిష్కరించి, ప్రచురించి ప్రాచీన గ్రంథపరిష్కరణలో కొత్తబాటలు వేయడం, తెలుగులో విజ్ఞానసర్వస్వ నిర్మాణానికి పూనుకొని స్వీయ మార్గంలో కొత్తబాటలు వేయడం, ‘విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి’ని స్థాపించి చరిత్ర, వైజ్ఞానిక శాస్త్రాలను అందించి తెలుగువారిని జాగృతపరిచారు. ఆయన జీవిత చరమాంకంలో 1922లో అనారోగ్యంగా వుండికూడా ‘తెలుగుభాషాతత్వం’ (తెలుగు ఫిలాసఫీ) ప్రామాణిక గ్రంథాన్ని తెలుగుజాతికి ఇచ్చారు. తెలుగుభాషా చరిత్రలోనే ఇదొక విశిష్టాంశం. తన నలభైఆరు సంవత్సరాల జీవితాన్ని సార్ధకం చేసుకొని తెలుగు సమాజం పై చెరిగిపోని ముద్రవేసిన మహనీయుడు, జాతి వైతాళికుడు మరణించి 13జులై 2023 నాటికి వంద సంవత్సరాలు.
కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు గారిని స్మరించుకొంటూ వారు దివాన్ గా పనిచేసిన మునగాల రాజా నాయుని వేంకట రంగారావుగారి కోటలో లక్ష్మణరావుగారి 100వ వర్ధంతి సంస్కరణ సభను నిర్వహించుకొందాం. ఈ సందర్భంగా ఒక సంస్కరణ సంచికను ఆరోజున విడుదలచేయదలచాం. ఇందులో ప్రచురించుటకు తగిన వ్యాసాలను పంపవలసినదిగా అందరినీ కోరుతున్నాము.
13 జులై 2023న జరుగబోయే శతవర్ధంతి కార్యక్రమానికి ఆసక్తిగల వారందరూ ఆహ్వానితులే. ఆరోజున సంస్కరణ సంచికతోపాటు ఇప్పుడు లభించని రెండు మూడు విలువైన లక్ష్మణరావుగారి రచనలను కూడా పునర్ముద్రించి విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాము.
మునగాలలో జులై 13న జరుగబోయే కార్యక్రమ వివరాలను త్వరలో విడుదల చేయగలము. అన్ని వివరాలకు శ్రీ కె.జితేంద్రబాబు, అధ్యక్షులు, కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు సాహితీ సాంస్కృతిక సమాఖ్య, మునగాల – 508233, ఫోన్: 9848882600ను సంప్రతించవచ్చును.
కె. జితేంద్రబాబు, అధ్యక్షులు
కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు సాహితీ సాంస్కృతిక సమాఖ్య
మునగాల – 9848882600.