కథనం జలపాత వేగం
కవనం అభ్యుదయ యాగం
ఆశయాల పందిరిలో
అదృష్ట దీపకరాగం
‘ఆశయాల పందిరిలో’ రగిలే ‘అగ్ని’ ఆవేశం ‘ప్రాణం’ పోసుకున్న
శతఘ్ని అభ్యుదయ చేతక్-అదృష్ట దీపక్
“యువర్ ఎటెన్షన్ ప్లీజ్-అన్యాయానికి శస్త్రచికిత్సచేసి న్యాయాన్ని బ్రతికించడం కోసం సమర్థవంతమైన ఆయుధాన్ని సాధనంగా ఎన్నుకోండి” అనే తీవ్ర నినాదంతో కళాశాల ఎన్నికలలో పోటీచేసి విద్యార్థులలో ఎర్ర ఆలోచలనాన్ని రేపిన అతి మిలిటెంట్ విద్యార్థి- “ఎర్రజెండాయే నా ఎజెండా” అంటూ ఆర్థిక అసమానతలపై అక్షర యుద్ధం ప్రకటించిన రాజీలేని ‘కలకలం’ వీరుడూ-విద్యార్థి సమాఖ్య, యువజన సమాఖ్య, అరసం, ప్రజానాట్య మండలి ప్రజా సంస్థలలో సమర్థవంతంగా ఎన్నో బాధ్యతలు నిర్వహించిన క్రియాశీల కార్యకర్తా-నిబద్ధకవి, కథకుడు, బుర్రకథారచయిత, వ్యాసకర్త, విమర్శకుడు, ఉపన్యాస కుడు, నటుడు, గాయకుడు, సినీగేయరచయిత అదృష్టదీపక్, పూర్తి పేరు సత్తి అదృష్టదీపక్.
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో 1978 లో ఎం.ఏ. చరిత్రలో పట్టభద్రుడయ్యాక 1979లో అదే జిల్లాలోని ద్రాక్షారామం పి.వి.ఆర్. జూనియర్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరి 2008లో రిటైరయ్యేంత వరకు అక్కడే పనిచేశాడు. రిటైరైన తరువాత తన సమస్త కార్యాచరణకు కేంద్రమైన
రామచంద్రపురంలో సొంత ఇంట స్థిరపడ్డాడు.
‘మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థాన గీతాలు నాలోని కవిని భుజం తట్టిలేపాయి'” శ్రీశ్రీసాంస్కృతిక సేనాని ఐతే, మేమంతా సైనికులం” అంటూ సగర్వంగా చెప్పుకునే అదృష్టదీపక్ శ్రీ శ్రీ కి వీరాభిమాని. మహాకవి శ్రీశ్రీ “కొంత మంది కుర్రవాళ్లు” గేయాన్ని పాడుతూ విద్యార్థి దశలోనే గాయకుడిగా జెండా ఎగరేశాడు.
తన సినీపాటలసంపుటి “ఆశయాల పందిరిలో (2010) మహాకవి శ్రీశ్రీకి అంకితమిచ్చాడు. ‘నేటి భారతం (1983) చిత్రంలో నంది అవార్డు గెలుచుకున్న – “అర్థరాత్రి స్వతంత్రం అంధకార బంధురం” శ్రీ శ్రీ చివరిసినీగీతం. అనారోగ్యంతో మంచంమీద ఉన్న శ్రీశ్రీతో ఆ గీతాన్ని దగ్గరుండి రాయించింది ఇతనే. మహాకవి శ్రీశ్రీ సాహిత్యంపై దాడిచేసే విచ్ఛిన్నకరశక్తులపై తన కలాన్ని కత్తిలా ఝళిపిస్తూ ఎన్నో పదునైన వ్యాసాలు రాశాడు.
కమ్యూనిస్టు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అదృష్టదీపక్, 1962లో సాహిత్య వ్యాసంగం ప్రారంభించి చైతన్యవంతమైన సాహితీ సృజన చేశాడు. ‘కోకిలమ్మ పదాలు ‘(1972), ‘అగ్ని'(1974), ‘ప్రాణం’ (1978), అడవి’ (2008) కవితా సంపుటాలు, సమరశంఖం’ (1981) బుర్రకథ, “దీపకరాగం’ (2008) వ్యాస సంపుటి, ఆశయాల పందిరిలో(2010) సినిమా పాటలు, శ్రీశ్రీ ఒక తీరని దాహం (2010) శ్రీశ్రీ సంస్మరణ, అదృష్టదీపక్ కథలు (కథానికలు), (2016). తెరచిన పుస్తకం (వ్యాసాలు), (2020), దీపం (సప్తతి అభినందన సంచిక), (2020), అచ్చులో అదృష్టదీపక్ రచనలు. 1974లో తూ.గో. జిల్లా అరసం ప్రచురించిన ‘చేతన’ కవితాసంకలనానికి సంపాదకత్వం వహించాడు. విద్యార్థి దశ(1969) లోనే ‘జోకర్’ మాసపత్రికలో ‘కాలింగ్ బెల్’ శీర్షికను నిర్వహించాడు. 2006 నుంచి మూడేళ్లపాటు ‘చినుకు మాసపత్రికలో ‘దీపకరాగం’ శీర్షికతో చేసిన దీపక్ సాహిత్య శరామర్శ’ పలు ప్రశంసలు అందుకుంది. సాక్షి దినపత్రికలో ప్రారంభం నుండి పదశోధన పేరుతో క్విజ్ నిర్వహిస్తున్నారు.
1980లో ‘యువతరం కదిలింది‘ చిత్రంతో సినీరంగప్రవేశంచేసి నలభైవరకు సినిమా పాటలు రాశాడు. చాలావరకు అభ్యుదయగీతాలే. ‘ఎర్రమల్లెలు’ చిత్రానికి రాసిన మేడే గీతం, తెలుగు చలనచిత్ర మేడేగీతాలలో అత్యుత్తమ గీతం. అనేక ప్రముఖ నాటక కళాపరిషత్తులకు న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు.
ఏడేళ్ల వయసులో గాయకుడిగానూ, తొమ్మిదేళ్ల వయసులో నటుడిగానూ, పన్నెండేళ్ల వయసులో రచయితగానూ కళాజీవితాన్ని ప్రారంభించిన దీపక్, సాహిత్య సాంస్కృతి కరంగాలలో ప్రదర్శించిన ప్రజ్ఞాపాటవాలకు పొందిన కొన్ని అవార్డులూరివార్డులూ: 1984లో ‘నేటిభారతం’ చిత్రంలో ‘మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం‘ గీతానికి ఉత్తమ సినీ గేయరచయితగా మద్రాసు ‘కళాసాగర్’ అవార్డు, 2003లో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు, విశాలాంధ్ర ప్రచురణాలయం స్వర్ణోత్సవాలలో కవిసత్కారం, 2004లో రామచంద్రపురం మోడరన్ ఫౌండేషన్ ‘కళానిధి’ అవార్డు,రావుల పాలెం సి.ఆర్.సి.నాటక పరిషత్ పౌరసన్మానం మరియు ఉగాది పురస్కారం, ఎస్.బి. ఎస్.ఆర్ కళాపీఠం సాహితీ పురస్కారం, 2006లో తూ.గో. జిల్లా అధికార భాషాసమీక్షాసంఘ సభ్యునిగా నియామకం. 2008లో నంది నాటకోత్సవాలలో అభినందన సత్కారం. 2009లో మహాకవిశ్రీశ్రీ శతజయంతి ఉ త్సవాలలో అరసం (విశాఖ-శాఖ) వారిచే పురిపండా సాహిత్య పురస్కారం. 2010లో కాకినాడ, అల్లూరి సీతారామరాజు కళావేదిక రజతోత్సవాలలో ‘అల్లూరి’ విశిష్ట పురస్కారం, విజయవాడ ఎక్స్-రే’ జరిపిన మహాకవి శ్రీశ్రీ శతజయంతి ఉత్సవాలలో ‘శ్రీశ్రీ సాహితీ పురస్కారం’. అరసం గుంటూరుజిల్లా శాఖద్వారా ‘కొండేపూడి శ్రీనివాసరావు’ సాహితీ పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంవారిచే ‘సృజనాత్మక సాహిత్యం’లో కీర్తి పురస్కారం.
“సామాజిక సమస్యలకు ప్రతి స్పందించే హృదయ సౌకుమార్యం వుంది అదృష్టదీపకు. తన అనుభూతులకు కవితారూపంయిచ్చే నేర్పు కూడా ఉంది యితనికి” అంటూ ప్రముఖ మార్క్సిస్టు విమర్శకులు రాచమల్లు రామచంద్రారెడ్డి ప్రశంసలు పొందిన అదృష్టదీపక్ 1950 జనవరి, 18న తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారమయిన రావులపాలెంలో జన్మించాడు. 2021 మే 16న కరోనా సోకి కాకినాడ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు.
–అశోక్ కుమార్ సింగంపల్లి
_______________________________________________________________________
నేను ఆయన పాటకు అభిమానిని…
“స్వరాజ్యం” సినిమాలో ఆయన రాసిన గీతం “అమరజీవులెందరో… ఆశించిన స్వరాజ్యం.. ఇదేనా..” పాట ఆయనెవరో తెలియకుండానే నా చిన్నతనం నుంచీ నన్ను ఆయన అభిమానిని చేసింది. అనకాపల్లి లో నా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన అతిథి. చాలా సేపు ఇద్దరం మాధవీ సనారా నివాసంలో అనేక విషయాలపై ముచ్చటించుకున్నాం. ఆసందర్భంలోనే ఆ పాట రాసింది ఆయనని తెలిసి ఆశ్చర్యపోయా. సాకి మొదలుకొని చూడకుండా నేను పాడిన ఆపాటవిని అదృష్టదీపక్ సంభ్రమాశ్చర్యపోతూ ‘ప్రజల నాల్కల పై నా పాట నాట్యమాడుతుందంటే నేనింక కవిగా బ్రతుకున్నట్టే”నని ఆనందం వ్యక్తం చేసారు. మా విజయవాడ కవిమిత్రులు శ్రీ శ్రీ అశోక్ కుమార్ తో ఆయనకున్న బంధుత్వంతో మేము తరచుగా మాట్లాడుకునేంత దగ్గరయ్యాం. ఇలా ఒకొక్క ఆత్మీయ మిత్రులు దూరమవుతుంటే చెప్పడానికి మాటలు రావడం లేదు. అదృష్ట”దీప”క్ మిత్రమా.. నా తరుపునా, మా ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం తరపున మీకు ఇవే మా విప్లవ జోహార్లు.
–చలపాక ప్రకాష్
ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం