రచనా రహస్యం తెలిసిన రచయిత…!

చాలా మంది కవులు రాసిన కవిత్వంలో కవిత్వముండదు. కాని చక్రధర్ గారి వచనంలో గుబాళిస్తాయి కవిత్వ పరిమళాలు. ముక్కామల చక్రధర్ గారు సీనియర్ జర్నలిస్ట్, కథకులు, కాలమిస్ట్. చాలా కాలంగా ప్రపంచ సాహిత్యాన్ని దీక్షగా చదివి ఔపోసన పట్టారు. ఐనా ఒక అక్షరం రాయాలనే ప్రలోభానికి గురికాలేదు. మూడు దశాబ్దాల తర్వాత ‘కేరాఫ్ కూచిమంచి అగ్రహారం’ కథలు రాసారు. రెండేళ్ళ నుంచి విశాలాంధ్ర పత్రికలో ‘చక్రవాకం’ కాలమ్ రాస్తున్నారు. నగ్నమునిగారి గురించి రాసినా, ఘంటసాల గురించి రాసినా సాధికారికంగా రాస్తారు. నిజాలను నిర్భీతిగా రాస్తారు. అన్యాయాలపై కొరడా దెబ్బలు ఝుళిపిస్తారు. అక్షరాలకు అమృతం పోస్తారు. వాక్యాలతో విన్యాసాలు చేయిస్తారు. సమ్మోహనకరమైన శైలి వారి సొంతం. ప్రస్తుతం చక్రధర్ గారు అమలాపురం స్వతంత్ర ఛానల్ లో పనిచేస్తున్నారు. రండి చక్రధర్ గారి జీవన విశేషాలను తెలుసుకోవడానికి వారి ఇంటికి వెళదాం… ఈ నెల పలకరింపు కోసం…

ప్ర: బోలెడన్ని డబ్బులు ఖర్చుపెట్టి పుస్తకాలు అచ్చువేసుకుంటే, ఎవరూ కొనరు అని చాలా మంది రచయితలు వాపోతున్నారు కదా! కానీ మీ కేరాఫ్ కూచిమంచి అగ్రహారం కథలు ముద్రించిన 5 రోజుల్లోనే కాపీలన్నీ అమ్ముడుపోవడానికి కారణమేమిటి?

జ: పుస్తకాలు కొనుక్కునేవాళ్ళు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. అందుకే మూడున్నర దశాబ్దాలుగా హైదరాబాద్ లోనూ, విజయవాడలోనూ పుస్తక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పాఠకులను ఆకట్టుకొనే ఆనందింపచేసే, ఆలోచింపచేసే పుస్తకాలకు మంచి పాఠకులుంటారు. సాహిత్యమంతా ఎడిషన్లు మీద ఎడిషన్లు రావడానికి కారణమదే. పాఠకుడిని ఆకర్షించని సాహిత్యం ఎప్పుడూ చెల్లుబాటు కాదు. పాఠకుణ్ణి మరో లోకానికి తీసుకువెళ్లే సాహిత్యానికి ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. ఇక నా కూచిమంచి అగ్రహారం కథలు మా అగ్రహారీకులనే కాదు, అందరికీ నచ్చాయి. దీనికి కారణం, ఆ కథల్లో నేను చూపించిన వాతావరణం, పాత్రలు, ప్రతి ఊరులోనూ ఉండేవి. బహుశా ఆ నాష్టాలజీయే పాఠకుణ్ణి ఆకట్టుకుని వుండవచ్చు.

ప్ర: 30 ఏళ్ళపాటు ప్రపంచ సాహిత్యాన్ని తదేక దీక్షతో, భక్తితో చదువుకున్నారు కదా! మీకు కవిత్వం అంటే ఇష్టమా? కథా; నవలా ప్రక్రియలు ఇష్టమా!

జ: మీ ప్రశ్న… అమ్మంటే ఇష్టమా, నాన్నంటే ఇష్టమా అన్నట్లుగా వుంది. సాహిత్యంలో ప్రక్రియ ఏదైనా మనిషిని మనిషిగా గుర్తించే, ప్రేమించే, మనిషికోసం పరితపించే ఏ సృజన అయినా ఇష్టమే.

ప్ర: మీ గురించి వివరాలు చెప్తారా?
జ:
మాది దిగువ, మధ్యతరగతి కుటుంబం. తొమ్మిది మంది సంతానాన్ని తన భుజాన మోసుకొని మా నాన్న మమ్మల్ని పెంచారు. అందరినీ ఉన్నత చదువులు చదివించారు. లౌకిక భాషలో చెప్పాలంటే నేనొక్కణ్ణి భ్రష్టుపట్టాను. ఈ సాహిత్యం ప్రజలతో మమేకమౌతున్న జర్నలిస్టు ఉద్యోగం నాకు తృప్తినిచ్చేయి. కానీ మిగతా అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళలా నేను స్థిరపడలేదు. ఇక మా అమ్మ గురించి… కోడి తన పిల్లల్ని సంసారాన్ని గంపలో దాచి పెట్టుకున్నట్టు మమ్మల్ని పెంచింది. మా నాన్నగారు భాస్కర కామేశ్వరరావుగారు గురించి రాసిన కథ ‘శ్రీ శారదా ట్యుటోరియల్స్’లో మా పేదరికాన్ని చెప్పాను. ఇక నా భార్య ఈశ్వరి నా జీవితంలోకి ప్రవేశించిన తర్వాత నా జీవితం దేదీప్యమానమయింది. ఆమె అకాల మరణం తర్వాత కొండెక్కుతున్న నా జీవిత దీపాన్ని మా అఖరి అక్క కూచిమంచి శ్యామలాదేవి రెండు చేతులను అడ్డుపెట్టి నన్ను, నా కూతురు సాంకృతను బ్రతికేలా చేసింది. ఆమె మినహా ఇక కుటుంబంలోని వారెవ్వరూ నన్ను ఆదరించలేదు. నా జీవితం మొత్తంలో నలుగురు తల్లులు. జన్మనిచ్చిన మా అమ్మ అన్నపూర్ణ, నా జీవితానికి ఆలంబనగా మిగిలిన నా భార్య ఈశ్వరి, నాకు పునర్జన్మనిచ్చిన మా అక్క శ్యామలాదేవి, నన్ను కనిపెట్టుకుంటున్న నా కూతురు సాంకృత. ఈ నలుగురు లేకపోతే ముక్కామల చక్రధర్ అనే మనిషి లేడు. అతని సృజన లేదు. వీళ్ళ ఋణం తీర్చుకోవడమంటే మరో జన్మలో వీరికి బిడ్డగా పుట్టడమే.

ప్ర: మీ బాల్యమిత్రుల గురించి…?
జ: నిజానికి నా జీవితమంతా మిత్రులే. బాల్యంలోనే కాదు, కౌమార యవ్వనంలో కూడా నా శ్వాస నా మిఋలే. ఇప్పుడు నాకు 56 ఏళ్ళు. ఇప్పటికీ నేను పరిచయమైన వాళ్ళెవరూ నన్ను వదులు కోవడానికి ఇష్టపడరు. ఇది నా అదృష్టం. నా బాల్యమంతా క్రికెట్ గ్రౌండులోనే గడిచిపోయింది. ఆనాటి నా స్నేహితులు ఇప్పటికీ నా వెన్నంటే ఉన్నారు. ఒకరిద్దరు కాలం చేసి వెళ్ళిపోయినా నా చేతులెప్పుడూ వాళ్ళ భుజాల మీద ఉన్నట్లుగానే నాకనిపిస్తుంది. నా బాల్యమిత్రులు నా ఆస్తి. వాళ్ళ రుణాన్ని తీర్చుకోవటం కోసం ఇప్పటికీ వాళ్ళతో నడుస్తూనే ఉన్నాను.

ప్ర: ‘కూచిమంచి అగ్రహారం’ కథల్లో సుగుణ కథ చదివిన వెంటనే మనసు చెమ్మగిల్లుతుంది కన్నీటితో. ఆ కథా నేపథ్యం గురించి…?
జ:
‘సుగుణ’ కథ ఓ యదార్థ సంఘటన. నా బాల్య- క్రౌమార్య దశలమధ్య జరిగిన సంఘటన. ఆ సంఘటన నన్ను కుదిపేయడమే కాదు. వెంటాడుతుంది. సుగుణని ఓ పాత్రలా చూపించడమే కాకుండా తొలిప్రేమికురాలిగా చూపించడం వలనే ఆ కథ హిట్టయిందని నా నమ్మకం. అందుకే ఆ కథలో నేను పాత్రనయ్యాను తప్ప మరొకరిని పాత్రగా చేయలేదు. ఆమెను హత్య చేయడం అనేది ఒక సంఘటన. దాని చుట్టూ అల్లుకున్నదంతా ఆమెపట్ల నా ప్రేమ. ఆమె బ్రతికే వుంటే నాపై చూపించే వాత్సల్యమే. వృత్తిలో ఉన్నవారిని ఈ ప్రపంచం గుర్తించలేదు. ఆ రెండూ చెప్పాలనే కథ రాసాను. కథ రాసిన తర్వాత సమస్త పాఠకలోకం ఆమెను గుర్తించింది. బహుశా నన్ను కూడా.

ప్ర: మీరు అనేక పత్రికల్లో జర్నలిస్టుగా ఉద్యోగం చేసారు. ఉద్యోగ జీవితంలో జరిగిన మరపురాని సంఘటనలు ఏమైనా వున్నాయా?

: చాలానే ఉన్నాయి. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడైన అతల్ బిహారే వాజెపేయీ హైదరాబాదు వచ్చినప్పుడు, మరో ముగ్గురు జర్నలిస్టులతో కలిసి నేను ఇంటర్వ్యూ చేసాను. ఆ సమయంలో నన్ను పరిచయం చేసుకుంటూ “నేను వామపక్షవాదిని. నా ప్రశ్నలు ఇబ్బంది పెడితే నన్ను క్షమించండి” అన్నాను. దానికి వాజ్పాయి “ఏ సిద్ధాంతమూ నమ్మకుండా మనిషి బ్రతకడం దుర్మార్గం. నాకు వామపక్ష వాదుల్లోనూ మంచి మిత్రులున్నారు. సంఘర్షణ లేకుండా ప్రజల గురించి ఎవరైనా ఎలా మాట్లాడగలం! నిజానికి అదేగదా ప్రజాస్వామ్యం” అన్నారు. అంతేకాదు, వాజ్పేయి ప్రధాని అవడానికి ముందు ఢిల్లీలో జరిగిన ప్రధాన పత్రికల విలేఖరులతో ముచ్చటించే ముందు ఆయన చిరకాల మిత్రుడు బి.జె.పి. రాష్ట్ర అధ్యక్షుడు వి. రామారావు గారికి ఫోనుచేసి నన్ను ఢిల్లీ తీసుకురమ్మన్నారు. నేను వెళ్లలేక పోయాను. అది జర్నలిజంలో నేను మర్చిపోతేని సంఘటన.

ప్ర: ఒక మంచి అవకాశాన్ని అందుకోలేకపోయారన్న మాట..
జ: అవును. ఇక రెండవది… ఆనాటి పీపుల్స్ వార్ అగ్రనాయకుడు శీలం నరేష్ ని వరంగల్ అడవులలో కొంతమంది జర్నలిష్టు మిత్రులతో కలిసి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను. ఆ ఇంటర్వ్యూ ఐన వారానికే నా పెళ్ళి జరిగింది. డిసెంబరు 2వ తారీఖున నా పెళ్ళి జరిగితే ఆ రోజే ఆయన ఎన్ కౌంటర్లో మరణించారు. 3వ తారీఖున మా స్వగ్రామంలో జరిగిన సత్యనారాయణ వ్రతం రోజున ఆ వార్త నాకు తెలిసింది. పెళ్ళి బట్టల్లో వున్న నేను ఆ రోజంతా దిగులులుగా, ఏడుస్తూనే వున్నాను. కొత్త పెళ్ళికూతురు నా భార్య, ఆమె బంధువులు విషయం తెలియక వారు ఆ పెళ్ళి నాకు ఇష్టం లేదోమోనని కలవర పడ్డారు. “ఒక మనిషి మరణించడమంటే మానవత్వం ఊపిరి బిగబట్టడమే” అనే కవిత్వ పంక్తికి అర్థం ఆ రోజునే తెలిసింది.

ప్ర: మీ రిపోర్టింగ్ ఉద్యోగంలో ఎదురైన అనుభవాల గురించి…?
జ: నేను కష్టపడి రిపోర్టింగ్ న్యూస్ లో అద్భుతమైన కథనం తీసుకువస్తే దాన్ని ఆనాటి ఆంధ్రభూమి ఎడిటర్ తన పేరుతో పబ్లిష్ చేసారు. సంపాదకుల్లో ఇంత నీచమైన మనుషులుంటారని ఆనాడే తెలిసింది. ఒక రైల్వే కాట్రాక్టరు విషయంలో నేను రాసిన వార్తతో టెండర్ నిలిచిపోయింది. ఆ కాంట్రాక్టరు అప్పటి తెలుగుదేశం పార్టీ కాంట్రాక్టరు నా మీద కత్తులతో దాడి చేయించారు. ఆ గుర్తులు నా గుండెమీద ఇంకా వున్నాయి. నేను రాసిన కథనాలతో హైదరాబాదులోని మెహందీ ప్రాంతానికి చెందిన వ్యభిచార వృత్తిలో వున్న మహిళలు పోలీసుల దాడి నుంచి విముక్తి పొందారు. హైకోర్టు కల్పించుకొని ఆ వృత్తిలో వున్న వారికి బ్రతుకు ప్రత్యామ్నాయం చూపించకుండా నిర్భంధించడం అన్యాయం అని తీర్పునిచ్చింది. ఇంకొక చిన్న సంఘటన. తల్లిదండ్రులు వదిలేసిన ఓ పాపపై నేనొక ఫోటో వార్త రాస్తే ఆనాటి గవర్నర్ కృష్ణకాంత్ దంపతులు ఆ పాపను దత్తత తీసుకున్నారు. ఇంకా ఇలాటివి చాలా వున్నాయి. అదే.. నా జీవితంలో జర్నలిస్టుగా నన్ను నిలబెట్టిన రోజులు.

ప్ర: ‘చక్రవాకం’ కాలమ్ రాస్తున్నప్పుడు ఏమైనా విశేషాలు జరిగాయాండీ..?
జ: ‘చక్రవాకం’ కాలానికి సంబంధించి ఒక అనుభవం ఉంది. నేను ఈ కాలమ్ రాస్తున్నప్పుడు జర్నలిస్టు ముసుగులో తిరుగుతున్న వారి గురించి రాసాను. మా స్వగ్రామం అమలాపురంలో అలాంటి ముసుగులో తిరుగుతున్న ఒకడు, వాడి గురించే రాసాననుకొని నన్ను కొట్టేందుకు నా చుట్టూ తిరిగాడు. అది చూసి వాడు ఎంత అజ్ఞానో ఈ లోకంలో ఎందుకూ పనికిరాడు అని నాకు నవొచ్చింది. అలాంటి సంఘటనలు అనేకానేకం జరిగాయి.

ప్ర: ప్రపంచ సాహిత్యంలో మీ అభిమాన కవులెవరు?
జ: చింగీజ్ ఐత్ మాతోవ్, లియో టాల్ స్టాయ్, మాక్సోం గోర్కీ, ఛార్లెస్ డికెన్స్, కాఫ్కా.

ప్ర: అరసం, విరసం లాంటివి వున్నాయి కదా! కవి ఏదైనా సంఘంలో చేరాలా?
జ: అవసరం లేదు. ఐతే సృజన అనేది రచయిత, రచయిత్రి, కవి, కవయిత్రి ఎవరైనా సృజనాత్మకత వారి సొంతం. దానికి సంఘాలతో పని లేదు.

ప్ర: సాహిత్యం గురించి, కవిత్వం గురించి మనకు ఎన్నో నిర్వచనాలున్నాయి. ‘ఉత్తమ’ కవిత్వం లక్షణం గురించి వివరిస్తారా?
జ: ‘ఉత్తమం’ అనేదే వ్యక్తుల ప్రైవేటు వ్యవహారం. ఒకళ్లకు నచ్చినది, ఇంకొకరికి నచ్చకపోవచ్చు. అంతమాత్రాన అది ఉత్తమ సాహిత్యం కాకుండా పోతుందా?

ప్ర: మీ సాహిత్య, రాజకీయ ప్రయాణం ఎలా ప్రారంభమైంది?
జ: నా సాహిత్య గురువు వసీరా. నేను అతణ్ణి చూసి, అతణ్ణి చదివి, అతణ్ణి అనుసరించి పెరిగాను. వసీరా గొప్ప కిక్రెట్ ప్లేయర్. అతని ఆటను చూసి నేను ఆటను నేర్చుకున్నాను. అతని సాహిత్యం చూసి సాహిత్యం చదువుకున్నాను. ఆయన రాసిన పద్యాలకు తొలి పాఠకుణ్ణి నేనే. ఆ తరువాత నాకు పరిచయమైన రాజకీయ గురువు అద్దేపల్లి ప్రభు. ప్రభు సాంగత్యంలో నేను అనేకానేక విషయాలు తెలిసుకున్నాను. వారిద్దరి నుంచి నేను అటు సాహిత్యము, ఇటు రాజకీయము అంచెలంచెలుగా తెలుసుకున్నాను. బహుశా వాళ్ళిద్దరూ లేకపోతే నేను దొంగతనాలు చూసుకుంటూనో, జేబులు కత్తిరించుకుంటూనో బ్రతికేవాణ్ణి.

ప్ర: మీరు ఇప్పటివరకూ ‘కూచిమంచి అగ్రహారం కథలు’, ‘చక్రవాకం’ కాలమ్ రాసారు. తర్వాత రాబోయే రచన ఏమిటండి?
జ: ఫలానా ప్రక్రియ రాయాలని ప్రస్తుతానికైతే అనుకోలేదు. ఐతే ఒకటి రెండు కథలు సుడి తిరుగుతున్నాయి. అలాగే మా కూచిమంచి అగ్రహారానికి సంబంధించిన ఓ వాస్తవ పాత్రను నవలగా రాయాలని తలంపు ఉంది. బహుశా త్వరలోనే ప్రారంభిస్తాను.

ప్ర: భవిష్యత్తులో మీ జీవిత లక్ష్యం ఏమిటి?
జ: భవిష్యత్తులో నా లక్ష్యం ఏమీలేదు గానీ, చదవాల్సిన సాహిత్యం చాలా వుంది. రాయడం కంటే ముందు నేను చదవాలనుకున్న సాహిత్యాన్ని చదవాల్సిందే. అదే నా ముందున్న లక్ష్యం. ఇక రాడమంటారా… అది తనంత తానుగా బయటకు రావాల్సిందే తప్ప కాలకృత్యాలు తీర్చుకున్నట్లుగా సాహిత్య సృజన చేయకూడదని నా నమ్మకం.

మందరపు హైమవతి

5 thoughts on “రచనా రహస్యం తెలిసిన రచయిత…!

  1. ఇతడు… భయం లేని మనిషి.కపటం లేని రచయిత.రాజీ పడని విలేఖరి.పొరపొచ్చాలు లేని అనుబంధం.నిజం చాక్లెట్ ని సెటైర్ అనే రేపర్ లో చుట్టి చుట్టూ ఉన్న వారందరికీ పంచుతూ ఉండే సాహితీ ప్రేమికుడు.

  2. చాలామంచి ఇంటర్వ్యూ,,,అతు రచయితలకు,ఇటు జర్నలిస్టులకు పథనీయం

  3. జర్నలిజం లో జరుగుతున్న అవకతవకల పై కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు రచయిత. ఈ పుస్తకం మంచి పాపులారిటీ సంపాదించింది. రచయితకు అభినందనలు

  4. హైమావతి గారే రచయిత చక్రధర్ గారి గురించి అద్భుత విషయాలతో ప్రసంగపరిచయం చేశారు. రచయిత చక్రధర్ కులమతాలకు అతీతంగా ,మానవ సత్సబంధాలు స్నేహం, వాత్సల్యం నిండిన హృదయంతో అక్షరం వరమై అక్షర శక్తితో దివ్యమైన అనుభూతిని కలిగించే రీతిలో, ప్రతి వాక్యము వెనుక వ్యక్తిలో ఆలో ఆలోచింపచేసే అద్భుతమైన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే కలిగే రచన చేశారు.
    ఈ రచయిత చక్రధర్ గారి గురించి చెప్పాలంటే
    శ్రీ వ్యాసభగవానుడు మహావృక్షం అయితే ఇప్పుడు కవులు, రచయితలు ,రచయిత్రులు ఆ మహా వృక్షానికి శాకోప శాఖలుగా ఆకులుగా ప్రకాశిస్తూ ఉన్నారు. వీరందరిలో చక్రధర్ చిగురించే లేత ఆకులోంచి వచ్చిన పువ్వులా, ఆ పువ్వు నుండి వచ్చే సుగంధ పరిమళంలా విస్తరించే క్రమంలో ముందు ముందు ఎన్నెన్నో రచనలు చేయాలని చేయగలరని ఆశిస్తున్నాను.
    ఇక వారం వారం విశాలాంధ్రలో వచ్చేచక్రవాకం అయితే రచయితలోని ఆర్తి అన్వేషణ అలుపెరుగని పయనం లో చూపిస్తూ చక్రవాకం పుస్తకం కవర్ పేజీ తీర్చిదిద్దారు.

  5. Good interview bold answers nice to know about Chakradhar’s personality wishing him to pen many more books

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap