మైక్రో ఆర్ట్ మాష్టర్ – డాక్టర్ రవికుమార్ 

బొమ్మను గీసి ప్రాణం పోయడం ఆయనకు వంశ పారంపర్యంగా వచ్చిన విద్య. కళాసృజనే వారికి వృత్తి, ప్రవృత్తి కూడా. కళ సమాజ చైతన్యం కోసమే కానీ, ధనార్జనకు కాదని త్రికరణ శుద్ధిగా నమ్మారాయాన. చిత్రలేఖనంలో ఆయన సృజించని ప్రక్రియ లేదంటే అతిశయోక్తి కాదు. తండ్రి, ప్రఖ్యాత చిత్రకారుడు నడిపల్లి సంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకుని తనకంటూ ఓ ప్రత్యేకత గుర్తింపు పొందారు. ఒకటి కాదు.. రెండు కాదు… తొమ్మిది ప్రపంచ రికార్డులను ఏకకాలంలో సాధించారు. లయన్స్ కృష్ణా జిల్లా చైర్మన్ గా సేవా రంగంలోనూ ఇంటర్నేషనల్ ఎక్స్టెన్స్ పురస్కారం, చిత్రకారుడిగా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకొని, కళామతల్లి సేవలో మూడున్నర దశాబ్దాలుగా తరిస్తూ విజయవాడ మాంటిస్సోరి విద్యా సంస్థల ఫైస్ఆర్ట్స్ విభాగాధిపతి గా, సమాజ సేవకుడిగా రెండింటా తనదైన ముద్రవేస్తున్న డాక్టర్ నడిపల్లి రవికుమార్ గారి పరిచయం 64కళలు.కాం పాఠకుల కోసం …

కళా ప్రస్థానం: రవికుమార్ 1967 సంవత్సరం జూన్ 1 న నడిపల్లి సంజీవరావు – శ్రీమతి దంపతులకు విజయవాడ లో జన్మించారు. నగర పాలక సంస్థలో పనిచేస్తున్న తన తండ్రి సంజీవి ఇంటి వద్ద చిన్నారులకు చిత్రలేఖనంలో శిక్షణ ఇస్తుండేవారని, ఆయన మిగిల్చిన రంగులతోనే చిత్రాలు గీసి కళపై మమకారం పెంచుకున్నానని చెబుతున్నారు రవికుమార్, అనేక మంది ప్రముఖులు విజయవాడ, పటమటలోని తమ నివాసానికి వచ్చి తండ్రి చేత చిత్రాలు గీయించుకువెళ్లడం చూసి చిత్రకారుడు కావాలనే కాంక్ష తనకు కలిగిందని, చిన్ననాటి స్మృతులు గుర్తు చేసుకున్నారు. ఏడవ తరగతిలోనే చిత్రలేఖన రంగంలో అరంగేట్రం చేసి, ఇంటర్మీడియేట్ చదివే నాటికి వ్యక్తిగతంగా మూడు ప్రదర్శనలను ఇచ్చే స్థాయిలో తన కళానైపుణ్యాన్ని పెంపొందించుకున్నారు. తండ్రికి తనను వైద్యుడిగా చూడాలని ఆకాంక్ష వున్నప్పటికీ, చిత్రకళపై తాను పెంచుకున్న ప్రేమను గమనించి అడుగడుగునా ప్రోత్సహిస్తూ వెన్నంటి నిలిచారని ఉద్వేగంగా చెప్పారు. అలా రవికుమార్ 1989 లో విజయవాడ మాంటిస్సోరి విద్యాసంస్థలలో చిత్రకళోపాధ్యాడిగా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. రవికుమార్ సతీమణి రజని సైతం పెనమలూరు ప్రభుత్వ జిల్లా పరిషత్  పాఠశాలలో చిత్రలేఖనోపాధ్యాయురాలే కావడం విశేషం.

ఆర్ట్ టీచర్స్ అవసరం:
చేతితోనే విలక్షణ చిత్రాలు చిత్రిస్తూ, చిత్రకళతో సామాజిక స్పృహను పెంచడానికి కృషి చేస్తున్న రవికుమార్ తన కుటుంబ సభ్యులను సైతం కళాసరస్వతి సేవకు అంకితం చేశారు. ఆధునిక కంప్యూటర్ యుగంలో గ్రాఫిక్స్ మాయాజాలాలకు సైతం అంతుచిక్కని చిత్ర రాజాలను చేతితో వేస్తూ వర్థమాన చిత్రకారులకు సరికొత్త ప్రమాణాలు నెలకొల్పుతున్నారు. కెరీర్ కలల సాకారమే పరమార్థమని భావిస్తున్న ప్రస్తుత తరుణంలో భావితరాలకు చిత్రలేఖనం దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుస్తకాలే ప్రపంచంగా ఉండే పిల్లలు ఉపాధి సాధనకు కీలకమైన సాఫ్ట్ స్కిల్ కు దూరమవుతున్నారని తల్లిదండ్రులు గుర్తించాలని కోరారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఇతర స్థానిక సంస్థల పాఠశాలల్లో చిత్రలేఖనోపాధ్యాయుల నియామకాలను రాష్ట్ర ప్రభుత్వం 1987లోనే నిలిపివేయడం బాధాకరమని అంటారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చిత్రలేఖన ఉపాధ్యాయులను నియమించుకుంటున్నా వారిని పాఠ్యేతర కార్యక్రమాలకు వినియోగిస్తున్నారని ఆవేదన చెందుతారు.

ఆర్ట్ గ్యాలరీ స్థాపనే లక్ష్యం : ఔత్సాహిక చిత్రకారులను ప్రోత్సహించడానికి 2007లో బెజవాడ వైస్ఆర్ట్స్ అకాడమీ స్థాపించారు రవికుమార్. జిల్లా, రాష్ట్ర స్థాయి చిత్రలేఖన ప్రదర్శనలు ఏర్పాటు చేసారు. ఆర్ట్ గ్యాలరీ స్థాపించి చిత్రకారులు తాము గీసిన చిత్రాలను ప్రదర్శించుకోవడానికి నగరంలో ఓ ప్రాంగణం ఏర్పాటు చేయాలన్న రవికుమార్ గారి లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం. పిల్లలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తూ, వారిని ప్రోత్సహిస్తున్నారు.

విద్యా దానం: ఆర్థిక ఇబ్బందులతో చదువుకోలేని పదిమంది అనాథ బాలలను పాఠశాలలో చేర్పించి ప్రధాన విద్యా స్రవంతిలోకి తీసుకువచ్చారు రవికుమార్. ఆరుగురు ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. పేద విద్యర్థులకు కెరీర్ గైడెన్స్ తరగతలు నిర్వహించారు. వాడి పారేసిన కళ్లజోళ్లను సేకరించి, వాటికి మళ్లీ మరమ్మతు చేయించి అవసరమైన వారికి అందజేశారు. నిరుపేద మహిళల స్వయం ఉపాధి కోసం కళా క్రియేషన్స్ పేరిట స్వచ్ఛంద సంస్థను స్థాపించి, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, మగ్గం వర్క్లపై ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.

కాదేదీ కళకనర్హం అన్నట్లు – సుద్దముక్కలు, సబ్బులు, గింజలు, చాక్ పీస్ లపై అపురూప ఆకృతులు, అక్షరాలు, ప్రముఖుల బొమ్మలు చెక్కడంలో రవికుమార్ బహునేర్పరి. తెలుగుతల్లి, మాతృమూర్తి, ఏసుక్రీస్తు, సరస్వతీదేవి, వినాయకుడూ, అబ్దుల్ కలాం తదితరుల చిత్రాలను చాక్ పీస్ లపై  చెక్కి ఆ కళలో తనకు తానే సాటిఅని ప్రఖ్యాతిపొందారు. ప్రకృతి అందాలు, జీవితపు వెలుగునీడలు, భక్తి భావతరంగాలు ఆయిల్ పెయింటింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, లైన్ డ్రాయింగ్, నిబ్ పెయింటింగ్, నైఫ్ డ్రాయింగ్ తదితర ప్రక్రియలతో ప్రతి ఫలింపచేస్తూ సమకాలీన ప్రముఖ చిత్రకారుల మన్ననలందుకున్నారు. చిన్న చాక్ పీస్ పైనే తెలుగుతల్లి రూపం, కిరీటం, ఆభరణాలు, పూలదండ, పట్టుచీర చెక్కి ప్రపంచ తెలుగు మహాసభలకు తనదైన శైలిలో ఆహ్వానం పలికిన భాషాభిమాని. పల్స్ పోలియో, ఎయిడ్స్ అక్షరజ్యోతి, తల్లిప్రేమ వంటి ప్రజోపయోగకర అంశాలపై అవగాహన పెంచేందుకు చాక్ పీస్ లతో కళాకృతులు తీర్చిదిద్ది తనలోని సామాజిక స్పృహ చాటుకొన్నారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో నుద్దముక్కపై గోదావరి మాత చిత్రాన్ని, సబ్బుపై మోనాలిసా, విష్ణుమూర్తి, బుద్ధుడు తదితర కళారూపాలను అలవోకగా సృష్టించారు.

రవికుమార్ అందుకున్న పురస్కారాల్లో కొన్ని:
~ద యునైటెడ్ థియలాజికల్ రిచెర్చ్ విశ్వవిద్యాలయం, కాలిపోర్నియా నుండి గౌరవ డాక్టరేట్ …
~మహానటి సావిత్రి కళాపీఠం, విజయవాడ నుండి జీవిత సాఫల్య పురస్కారం..
~2001లో జిల్లా ఉత్తమ చిత్రలేఖన ఉపాధ్యాయుడిగా..
~1998లో నీరు-మీరు పథకానికి, విజయవాడ కళాదర్శిని ఆధ్వర్యంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి నుంచి..
~హైదరాబాద్ కు చెందిన చెలిమి స్వచ్చంద సంస్థ నుంచి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడి పురస్కారాన్ని..
~2002లో కృష్ణా మహోత్సవాలలో జిల్లా ఉత్తమ చిత్రకారుడిగా..
~లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ గా లయన్స్ ఇంటర్నేషనల్ (ఎక్స్టెన్స్) పురస్కారాన్ని..
~2007లో పోలీసుశాఖ నుంచి నగర ఉత్తమ పౌరుడిగా..
~కృషిరత్న, కళారత్న, సేవారత్న వంటి బిరుదులు, సిద్ధార్థ అకాడమీ ఉగాది పురస్కారాలు సహా రవికుమార్ ఇప్పటివరకూ 300కు పైగానే అవార్డులు అందుకున్నారు.
______________________________________________________________________

తొమ్మిది ప్రపంచ రికార్డుల్లో చోటు : చిత్రకళలో వినూత్న ప్రక్రియలను ప్రయత్నించడమే ధ్యేయంగా పనిచేసే రవికుమార్ విజయవాడ బుక్ ఫెస్టివల్ కమిటీ నిర్వహించిన 25వ పుస్తక మహోత్సవం సందర్భంగా పుస్తక మహోత్సవరం లోగోను చాక్ పీస్ పై కేవలం 20 నిమిషాల్లో చెక్కి, ప్రపంచ రికార్డులు సృష్టించారు. పుస్తక మహోత్సవ లోగోతో పాటు, గాంధీ స్థూపం, 31 అక్షరాలు, పుస్తకాలను చెక్కి రికార్డు సంస్థలకు పంపారు. అలాంటి సృజన చేసిన తొలి కళాకారుడిగా రవికుమార్ ఎవరెస్ట్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యూనిక్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ అమేజింగ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్, హైరేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వంటి తొమ్మిది రికార్డు పుస్తకాల్లో చోటు సాధించారు. గిన్నిస్ బుక్ రికార్డ్స్ సంస్థ వారూ ఆయనకు ప్రశంసాపత్రం పంపడం విశేషం.
______________________________________________________________________

-కళాసాగర్ యల్లపు

_________________________________________________________________________
ఫ్రెండ్స్ పత్రికలోని ఆర్టికల్స్ పై క్రింది కామెంట్ బాక్స్ లో స్పందించండి. మీ విలువైన సూచనలు, సలహాలు తెలియజేయండి.

3 thoughts on “మైక్రో ఆర్ట్ మాష్టర్ – డాక్టర్ రవికుమార్ 

  1. వినూత్న కళను తనదిగా చేసుకున్న సృజనకారుడు. సంఘ సేవ, కళాసేవలను రెండు కళ్ళుగా భావించు మానవతావాది శ్రీ రవికుమార్ గారికి అభినందనలు.

  2. విచిత్ర అక్షర శిల్పి LNSS THIRUNAGARI,MFA. ARTIST, DUAL LINE WRITING CREATOR (1968),WW.UNESCO,LIMCA etc. KARIMNAGAR. says:

    కళాారులు,సమాజ సేవకులు డా.రవికుమార్ గారి వినూత్నమైన చిత్రకళ కు కళాభివందనాలు.

  3. Micro art lo ప్రతిభ చూపిన రవి కుమార్ గారికి అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap