మట్టి పాటల మేటి-పెండ్యాల

పెండ్యాల నాగేశ్వరరావుగారు తెలుగు చిత్రాలకు దొరికిన అద్భుత సంగీత దర్శకులలో ఒక్కరు. తెలుగు సినిమా సంగీతాన్ని గగనదిశకు తీసుకువెళ్లి తారాపథంలో నిలబెట్టి, ఆచంద్రతారార్కం ఆ మధురసంగీతాన్ని వింటూ, పరవశిస్తూ పాడుకునేలా చేసిన చలనచిత్ర సంగీతసమ్రాట్‌ పెండ్యాల నాగేశ్వరరావు. తెలుగు సినిమాల్లో నిలిచి ఉండి విలసిల్లే వెలకందని ఎన్నో పాటలను‌ రూపొందించిన‌ పె‌ండ్యాల‌ నాగేశ్వరరావు పుట్టినరోజు (మార్చి 6) నేడు. వారిని స్మరించుకుందాం రండి.

సినిమా సంగీత దర్శకుల్లో గొప్ప సంగీత దర్శకుల్లో ఒక కోవకు చెందిన వారు చక్కదనానికీ, చిక్కదనానికీ, కమనీయతకూ, రమణీయతకూ పెద్దపీట వేసి వాటిపై పాటల్ని నిలిపి అభిరుచికలవాళ్లకు అందిస్తారు. పెండ్యాల సరిగ్గా అలాంటి వారు‌. ఎన్నో పొలుపైన పాటల్నీ, విలువైన పాటల్నీ చేశారు వారు‌.

బావామరదళ్లు‌ సినిమాలో పెండ్యాల చేసిన “నీలి మేఘాలలో గాలి కెరటాలలో” ఒక‌ విశేషమైన‌ పాట. ఈ పాట స్ఫూర్తితో హిందీ సంగీతదర్శకులు మదన్ మోహన్ మేరా‌‌సాయా సినిమాలో “నేనో మే బద్ రా…” అన్న పాటను చేశారు. హిందీ పాటల్ని దక్షిణాది సంగీతదర్శకులు తీసుకుంటున్న పూర్వరంగంలో ఇలా ఒక తెలుగు పాట మదన్ మోహన్ వంటి‌ గొప్ప సంగీతదర్శకులకు స్ఫూర్తినివ్వడం విశేషం. అంతే కాదు ఈ పెండ్యాల పాట మదన్ మోహన్ నేనో మే బద్ రా… పాటకు స్ఫూర్తి అయ్యక ఆ హిందీ పాట ఒక పాకిస్తానీ సినిమా‌ పాటకు ఆధారమయింది! 1972లో విడుదలైన పర్‌దేశీ అనే ఓ పాకిస్తానీ సినిమాలో మెహ్దీహసన్ పాడిన “పాయల్ ఝనన్ ఝనన్ కా నగ్మా బన్ కే” పాటకు మూలం పెండ్యాల నీలి మేఘాలలో పాటే!

పెండ్యాల ప్రతిభని పసిగట్టిన గాలిపెంచల నరసింహారావు మాయలోకం (1945) చిత్రానికి హార్మోనిస్టుగా పిలిస్తే, దుక్కిపాటి మధుసూదనరావుగారి సలహాతో పెండ్యాల తిరిగి సినిమారంగానికి వచ్చారు. గృహప్రవేశం (1946) చిత్రనిర్మాణానికి సారథ్యం వహించిన కె.ఎస్‌.ప్రకాశరావు పెండ్యాలకి సహాయ సంగీతదర్శకుడి స్థానం ఇచ్చారు. ఆ చిత్రానికి సంగీతర్శకుడు బాలాంత్రపు రజనీకాంతరావు. ఆయన ఆలిండియో రేడియోలో తీరిక లేకుండా వుంటారు గనక, సమర్థుడైన సహాయకుడు కావాలని నాగేశ్వరరావును తీసుకున్నారు. అంతే! పెండ్యాల ప్రజ్ఞ ప్రకాశరావుగారికి పూర్తిగా అర్థమైంది. తరువాత తాను నిర్మించిన, ద్రోహి (1948)కి పెండ్యాలకు సంగీత దర్శకుడుగా అవకాశం ఇచ్చారు ప్రకాశరావుగారు. ఆ చిత్రానికీ, ఆ చిత్రంలోని కాఫీ ఖవాలీ, మనోవాంఛలు, పూవు చేరి, చిక్కిలిగింతలు మొదలైన పాటలకీ మంచి పేరొచ్చింది. పెండ్యాల సంగీతదర్శకుడుగా స్థిరపడ్డారు. సినిమాలోని సన్నివేశాన్ని అర్థం చేసుకుని, దానికి తగ్గట్టుగా ట్యూన్‌ వచ్చేవరకూ, ఒళ్లు వంచి పనిచెయ్యడం, తను అనుకున్నట్టే గాయనీ గాయకుల చేత పాడించడం – పెండ్యాల గుణం. గాయనీ గాయకుల దగ్గర ఎంత ప్రతిభ వుందో, అంత ప్రతిభనీ పూర్తిగా వినియోగించుకునే సంగీత దర్శకుడాయన. ఘంటసాలకీ, పెండ్యాలకీ ఒకరి మీద ఒకరికి అమితమైన అభిమానం. పెండ్యాల గారి దృష్టిలో ఘంటసాలని మించిన గాయకుడు లేడు!. పెండ్యాల గారి వేల పాటల్లో – అది క్లబ్బుపాటైనా అందులో కూడా మాధుర్యం తొంగిచూసినట్టే, హిందీ పాటని అనుసరించినా, పాశ్చాత్య ధోరణిని అనుకరించినా అందులో తెలుగుదనం వుట్టిపడుతుంది. సంగీతరస హృదయులకీ, గాయనీ గాయకులకీ అందరికీ నచ్చే సంగీతం ఆయనది.

ద్రోహి చిత్రం తో మొదలు పెట్టి చాలా సినిమాల్లో చాలా చాలా గొప్ప పాటలు చేశారు పెండ్యాల. ” చిగురాకులలో చిలకమ్మా”, “ఓ నెలరాజా వెన్నెల రాజా”, “మోహనరాగమహా”, “హాయి హాయిగా జాబిల్లి”, “తెలిసిందిలే తెలిసిందిలే” వంటి గొప్ప పాటలు చేశారు. జయభేరి సినిమా పాటలు మహోన్నతమైనవి. జగదేకవీరుడు సినిమాలో “శివ‌‌శంకరి…” పాట పెండ్యాల ధీ శక్తికి ఒక‌ ఉదాహరణ. దాన వీర శూర కర్ణ సినిమాలోని “చిత్రం భళారే విచిత్రం పాట” చాలా ప్రత్యేకమైన పాట‌. ఎన్.టి. రామారావు అక్బర్ సలీం అనార్కలి సినిమా సి.రామచంద్ర సంగీతం చేసినది. అందులో గుమ్మడికి ఎస్.పి. బాలసుబ్రగ్మణ్యం పాడిన ఓ పాట పెండ్యాల చేశారు‌.

ముఖ్యంగా ప్రస్తావించవలసిన విషయం ఏమిటంటే పెండ్యాల తెలుగు పరిమళంతోనే గొప్ప పాటలు చేశారు. వారిపై ఇంగ్లిష్ ఆపై ఇతర సంగీతాల ప్రభావం పెద్దగా లేదు. మట్టి పాటల మేటి పెండ్యాల.

చిక్కటి సంగీతంతో చక్కటి పాటలు చేసిన మన తెలుగు సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వర రావు పుట్టింది మార్చి 6, 1917 ఒణుకూరు, కృష్ణాజిల్లా. ఈ లోకాన్ని విడిచిపెట్టింది ఆగస్ట్ 31, 1984.

రోచిష్మాన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap