మరో పాత్రికేయుణ్ణి కోల్పోయాం…

నది పత్రిక సంపాదకులు జలదంకి ప్రభాకర్ (ప్రజ) 23 వ తేదీ సోమవారం రాత్రి 12 .30 గంటలకు కరోనా చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కన్నుమూసారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు వున్నారు. ఒకమ్మాయి బెంగుళూరు, ఒకమ్మాయి బ్రెజిల్, ఒకమ్మాయి నెల్లూరులో వుంటున్నారు. నది మూతపడ్డాక ప్రభాకర్ ‘స్వతంత్ర ప్రభ’ పత్రికను ప్రారంభించారు. మరో రెండు పత్రికలూ రిజిస్ట్రేషన్ అయివున్నాయి. ఈ పత్రికల RNI రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా నువ్వే చెయ్యాలి తమ్ముడు అంటూ నా చేత చేయించారు. ప్రభాకర్ అన్నకు పత్రిక రంగమంటే ఎంతో మమకారం.

నది ప్రభాకర్ అంటే ఎక్కువ మందికి అయన తెలుసు. నది మాసపత్రికను ఆయన అత్యున్నత ప్రమాణాలతో నడిపారు. నదితో పాటే ఆయన పాత్రికేయ జీవితం ఆగిపోయినా పడిలేచిన అల లాగా తిరిగి స్వంతంగా స్వతంత్రప్రభ దినపత్రికను ప్రారంభించారు. ఇంకా ఏడాదైనా గడవకమునుపే అయన అర్థంతరంగా వెళ్లిపోయారు.

2013లో మల్లెతీగ నిర్వహించిన కార్టూన్ల పోటీకి శ్రీ పొట్టేపాలెం రామచంద్రయ్య ఫౌండేషన్ నెల్లూరువారి చేత, నది పత్రిక వారిచేత వేలరూపాయలు స్పాన్సర్ చేయించిన సహృదయ శీలి ప్రభాకర్గారు. ప్రభాకర్ అన్నయ లేకపోతే ఆ కార్యక్రమమే లేదు. అదే సంవత్సరం మల్లెతీగ పురస్కార సభలోను అయన హాజరు సభకు మరింత నిండుదనాన్ని తెచ్చింది. ఆంధ్రపత్రిక నుండి మిత్రుడు నూతన్ ద్వారా మరింత చేరువైన మిత్రుడన్నయ్య ప్రభాకర్ గారు. నది పత్రికతో సాహిత్య ప్రపంచంలో ఎందరో సాహితీ దిగ్గజాలను తన చెలిమి ఖాతాలో జమచేసుకున్న స్నేహశీలి ఆయన. తానొక ఎడిటర్ ని అన్న భావన ఏ సాహితీవేత్త దగ్గర ప్రదర్శించే వారు కాదు. ఎప్పడు ఎవరికీ ఏ ఆపద వచ్చిన వెంటనే ఆదుకునే గొప్ప వ్యక్తిత్వం అన్నయ్యది. ఎందరికో గుప్త దానాలు చేసిన కారుణ్యమూర్తి ఆయన. నెల్లూరులో ఓ ఫంక్షన్కి గెస్టుగా ఆహ్వానించడం కోసం నేను ఈనెల 23వ తేదీ సోమవారం ఉదయం ఫోన్ చేశాను. రెండు ఫోన్లు స్విచ్డ్ ఆఫ్ వచ్చాయి. ఫేస్బుక్ లో కూడా ఎన్నో కదిలించే పోస్టులు పెట్టేవారు. అవి కూడా ఈమధ్య కనిపించడం లేదు. కారణం ఏమిటా అని ఆలోచించేలోపే మంగళవారం ఉదయానికి మిత్రుడు నూతన్ నుండి ఈ వార్త అందింది. తొందర పడ్డావ్ అన్నయ్యా..విజయవాడలో తోడుగా వున్నావనుకునేవాణ్ణి. ఆ తర్వాత కావలి వెళ్ళావు..ఫోన్ నాట్ రీచబుల్ వచ్చేది..అదీ పర్వాలేదనుకున్నా..ఇప్పుడిదేంటి అన్నయ్యా.. పరిమినెంట్ నాట్ రీచబుల్…ఇక రాయలేక పోతున్నాను..మిస్ అవుతున్నాను.. అన్నయ్య…
ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.

-కలిమిశ్రీ

1 thought on “మరో పాత్రికేయుణ్ణి కోల్పోయాం…

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link