సమాజంలో నాటకం శక్తిమంతమైన మాధ్యమం. శ్రవణం ద్వారా కాక దృశ్యం వల్ల ప్రేక్షకుడిని రంజింప చేయడం సులువైన మార్గం. గతంలో కందుకూరి, కాళ్లకూరి వంటి వారు సమాజంలో చైతన్యం కోసం నాటకాలు రాశారు. అప్పట్లో నటులు కూడ ఒక ధ్యేయంతో వేషం వేసేవారు. ఆ రోజుల్లో జమీందారులు పోషకులుగా ఉండేవారు. రాజుల అనంతరం జమీందారులు పోషించకపోతే ఆనాడు నాటకాలు మరుగునపడేవి. ముఖ్యంగా మైలవరం, మీర్జాపురం, నూజివీడు జమీందారు నాటక సంస్థలను ఆడుకున్నారు. ఆ తరువాత ప్రభుత్వాలు శీతకన్ను వేయడంతో సంస్థలు. వెనకడుగు వేశాయి. ఇప్పటికీ తమిళనాడు ప్రభుత్వం కేటాయించినట్లు మన ప్రభుత్వాలు నిధులు కేటాయించడం లేదు. ప్రజల్లో చైతన్యం కోసం నాటకం బాగా ఉపయోగపడుతుందని ప్రజానాట్యమండలి స్థాపించి అనేక మంది నటులను తయారుచేసిన గరికిపాటి రాజారావు చిరస్మరణీయుడు. ఆ రోజుల్లో ప్రజా నాట్యమండలిలో వేషం వేయడం ఒక గొప్ప ప్రశంసా పత్రంగా భావించేవారు. జమున, మిక్కిలినేని, రామకోటి లాంటి అనేక మంది ప్రజా నాట్యమండలి ద్వారా సినీ రంగంలో ప్రవేశించారు.
దృశ్యం కావ్యం కనుక నాటకం రమ్యం అన్నారు పెద్దలు. నాటకాలు వాటిల్లో ప్రాచుర్యం పొందాయి ప్రజల్లో, ఆ విషయం గుర్తించిన రచయితలు రకరకాల నాటకాలు రాశారు. గతంలో ప్రతి నాటకం పురాణాలు, ఇతిహాసాల నుండే పుట్టాయి. ముఖ్యంగా భారత, రామాయణాలే ఇతివృత్తంగా నాటకాలు రచించారు.
మారుతున్న కాలంతో పాటు పెరుగుతున్న శాస్త్ర విజ్ఞానంతో పాటు ప్రజల అభిరుచులు మారాయి. దాంతో సమాజ పోకడలకు సంబంధించిన నాటకాల రచనలు మొదలయ్యాయి. అంటే 1880 నుండి 2020 వరకు వచ్చిన అందుబాటులో ఉన్న 100 నాటకాలను ఆరు సంకలనాలుగా ప్రచురించడం సామాన్య విషయం కాదు. ఈ ప్రయోగం ఎవరి కోసం, ఎందు కోసం, ఎవరికి ఉపయోగం అనే ప్రశ్నల్ని పక్కపెడితే ఎంతో శ్రమించి ఎందరివో సలహాలు పాటించి వంద నాటకాలు సేకరించి ప్రచురించిన ప్రముఖ నటుడు, నాటకమే ఊపిరిగా జీవనయానం సాగిస్తున్న గంగోత్రిని ప్రతి తెలుగువాడు ముఖ్యంగా ప్రతి – కళాకారుడు అభినందించక తప్పదు. ఆరు సంకలనాల ప్రచురణకు సాయికి చేయూత నిచ్చిన వారందరికి ముఖ్యంగా వల్లూరి శివప్రసాదుగారు మిక్కిలి అభినందనీయులు. నటులు, రచయితలు తమ కోసం కాకుండా సమాజ మార్పు కోసం చేస్తున్న కృషిలోనే భాగంగానే ఈ సంకలనాలుగా భావించవచ్చు. మనసులో ఎంత వ్యథ ఉన్నా, ముఖాన రంగుపడగానే సర్వంమరచి పాత్రలో లీనమై వేలాది ప్రేక్షకులను తాము అద్భుతనటనతో సమ్మోహితులను చేస్తూ ఒక్క క్షణం నవ్వించి మరుక్షణంలో గొంతు బిగపట్టేలా విషాద వలయంలో ముంచి మరు నిముషంలో రౌద్రాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల మనసు దోచుకోగల్గిన నటుడి చూపు రూపాయ వంక కాక నాటకరంగం వైపే ఉంటుంది.
గతంలో కొంతమంది రచయితలు ముఖ్యంగా ఆత్రేయ, భమిడిపాటి, పినిశెట్టి, జి.వి.కృష్ణారావు, నార్ల, సుంకర, కొప్పవరపు, బుచ్చిబాబు, పాటిబండ్ల, గొల్లపూడి, సినారె, రెంటాల లాంటి కొందరు రచయితలు కొన్ని సంపుటాలు వెలువరించగా వాటిని విశాలాంధ్ర ప్రచురణాలయం. వెలుగులోకి తీసుకువచ్చింది. 1880లో నందక రాజ్యం మొదలుకొని 2020 వరకు వచ్చిన ప్రముఖ నాటక, నాటికలు సాయికృషి వల్ల ప్రజల్లోకి వచ్చాయి. 1930లో రాజమన్నారు రాసిన తప్పెవరిది. 1938లో వచ్చిన గాలివాన ఆనాడు ప్రతి పల్లెలో యువకులు నేర్చుకుని ప్రదర్శించారు. అలాగే పద్మరాజు రక్తకన్నీరు సినీనటుడు నాగభూషణం ప్రతి పట్టణంలో ప్రదర్శించారు. భమిడిపాటి కీర్తిశేషులు, దాసరి గోపాలకృష్ణ చిల్లరకొట్టు చిట్టెమ్మ కూడ ఆనాటి ప్రేక్షకుల మన్ననలు పొందాయి. మోదుకూరి నటనాలయం, కె.యస్.టి. సాయి సంఘం చెక్కిన శిల్పం బహు ప్రాచుర్యం పొందాయి. 1962లో మరో మొహంజోదారో ద్వారా యన్.ఆర్. నంది నాటకంలో టెక్నిక్ అనే దానికి నాంది పలికారు. 1940లో వచ్చిన తెలుగుతల్లి ఆనాడు గుడివాడలో అక్కినేని నాగేశ్వరరావు గుంటూరు కోమల, కోడూరి అచ్చయ్య దర్శకత్వంలో ప్రదర్శించగా ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచన పినతండ్రి నారాయణరావు దర్శకత్వంలో ప్రముఖ బుర్రకథ కళాకారుడు పడవల శ్రీకృష్ణ, నందం సుబ్బారావులు గుడివాడ టీంకు పోటీగా ప్రదర్శించారు. తప్పెవరిది, ‘గాలివాన, ఎదురీత, ఛైర్మను, యన్.జి.వో. పెత్తందారు, రైతుబిడ్డ, పాలేరు, ముందడుగు, అడుగుజాడలు, ఈ మంటలార్చండి, అసురసంధ్య లాంటి ఎన్నో నాటకాలు ప్రజా నాట్యమండలి ద్వారా ప్రజల్లో చొచ్చుకుపోయాయి. నాటకాల ద్వారా ప్రజల్లో చైతన్యం తేవచ్చునన్న గరికిపాటి రాజారావు యిందుకు మూల కారకుడు. ముఖ్యంగా సమాధానం కావాలని అడిగిన సంజీవి, చలిచీమలు ద్వారా పి.వి.రమణ మాలపల్లి ద్వారా నగ్నముని గ్రామాలు మేల్కొంటున్నాయన్న అన్నచెరబండరాజు ప్రజల హృదయాలను తట్టారు. ముఖ్యంగా యస్.ఆర్.నంది, యం.వి.యస్. హరనాథ రావు. సాంకేతికతతో నాటకాలు రాశారు. పూసల మండువా లోగిలి గణేశ్ పాత్రో కొడుకు పుట్టాల అనే నాటకాలు కూడ విశేష ప్రాముఖ్యం పొందాయి. ఇవిగాక పాటిబండ్ల నిషిద్ధాక్షరి, మిరియాల పంచమవేదం, శివప్రసాద్ వానప్రస్థం, శంకరమంచి దొంగల బండి, ఆకెళ్ల శివప్రసాద్ నరవాహనం, కందిమళ్ల సాంబశివరావు సైసై జోడెడ్ల బండి, భాస్కర చంద్ర యిక్కడ కాసేపు ఆగుదాం లాంటి ఎన్నో నాటకాలు నాటికలు ప్రముఖ కళాకారులు నాయుడు గోపి, గంగోత్రి సాయి, మిశ్రో, కె.యస్.టి.శాయి లాంటి అనేక మంది నటులు, రచయితలతో సమాజంలో ఉన్న సమస్యలపై నాటకాలు నాటికలు రాయించుకొని పరిషత్తులలో యిప్పటికీ ప్రదర్శిస్తున్నారు. అయితే గతంలో సబ్జెక్టుకు ప్రాధాన్యత ఉండేది కాని యిటీవల కాలంలో డ్రామా మెలోడ్రామాతో పాటు టెక్నికల్ ఎఫెక్టుతో ప్రదర్శించడంతో విషయం మరుగున పడుతోంది.
సుంకర వాసిరెడ్డి రాసిన మా భూమి నాటకం ప్రజల్ని చైతన్యం చేస్తుందనే ఆనాటి ప్రభుత్వం నిషేధించింది. అలాగే రుద్రజ్వాల రాసిన పులిపంజా కూడా ప్రభుత్వం నిషేధించింది. ఆ తరువాత దాన్ని రేపటి పౌరులు సినిమాగా ప్రజల్లోకి తేవడం జరిగింది. అలాగే గిరిజన సంస్కృతిని ప్రతిబింబిస్తూ పాణిగ్రాహి రాశారు. వేలూరి శివరామశాస్త్రి తెలంగాణ స్లాంగ్లో రాసిన సుల్తాని నాటకం గుడివాడ నుండి పామర్తి సుబ్బారావు పరిషత్తులలో ప్రదర్శించారు. ప్రముఖ రచయిత పాపినేని అన్నట్లు వ్యక్తిగత రచనలు కొన్ని సంకలనాలకు జీవితకాలం ఎక్కువ అన్నట్లు ఈ సంకలనాల వల్ల ప్రతి తెలుగువాడి హృదయం సంతోషపడుతుంది. అసమాన్యమైన పనికి పూనుకొని ఎంతో శ్రమించి వంద నాటకాలను పుస్తక రూపంలోకి తెచ్చిన గంగోత్రి సాయి, శివప్రసాదులను ప్రతి తెలుగువాడు అభినందించవలసిందే.
-బండారు రాధాకృష్ణ, సెల్: 9885569394
(‘విశాలాంధ్ర’- సౌజన్యంతో)