వైవిధ్య కథల సమాహారం ఈ ‘పాలపిట్ట ‘

వర్తమాన తెలుగు కథన రీతుల్ని ప్రతిఫలించే వినూత్న కథల సంకలనమిది. కొత్త కథలతో ఒక సంకలనం తీసుకురావాలన్న సంకల్పంతో పాలపిట్ట పత్రిక వారు సుమారు 80 మంది రచయితల వెలుబుచ్చిన విభిన్న పాయలు, వివిధ జీవన పార్శ్వాలకు సంబంధించిన బహుముఖ కోణాల్ని చిత్రించిన కథల సమాహారం ఈ పుస్తకం. ఆ మధ్యన ‘పాలపిట్ట వినూత్న కవిత’ సంకలనం వెలువరించారు. ఇపుడు ‘పాలపిట్ట వినూత్న కథ’ల సంకలనాన్ని తీసుకొచ్చారు. వస్తువులో, శైలీ శిల్పాల్లో, కథా సంవిధానంలో ఎవరి ప్రత్యేకత వారిదే.
ఒకే ఒక్క సంఘటన కథకు కేంద్రబిందువు. కానీ ఆ సంఘటన చుట్టూ అల్లుకొని వున్న పొరలు అనేకం. అందుకని కేవలం సంఘటన చిత్రణగా ఉండదు ఇవాల్టి కథ. వాస్తవాల చిత్రణతోనే కథకులు సరిపుచ్చుకోడం లేదు. మనిషి లోపలి ప్రపంచాల్లోని కల్లోలాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. వాస్తవిక శిల్పం మాత్రమే కాదు, అధివాస్తవికత, ప్రతీకాత్మకత మొదలయిన అంశాలతో కథని సౌందర్యభరితం చేస్తున్నారు. వారి ప్రయత్నాల సాఫల్య వైఫల్యాలని పాఠకులే నిర్ణయించుకుంటారన్నది మా ఆకాంక్ష. ఒక కథ ఎంతకాలం నిలబడుతుందో, ఏ రీతిన ప్రభావితం చేస్తుందో వస్తువుని బట్టి చెప్పడం కుదరదు. ఎంచుకున్న వస్తువును కళాత్మకంగా వ్యక్తీకరించడానికి రచయిత చేసిన సాధన మీద ఆధారపడి వుంటుంది. విభ్రమకు లోను చేసే కథన సౌందర్యాన్ని ఎవరూ చెప్పకనే పాఠకులు గుర్తించగలరు.
ఇవాల్టి రచయితలు ఏయే అంశాల గురించి ఆలోచిస్తున్నారో, వారిని స్పందింపజేసే సంఘటనలు ఏమిటో ఈ కథలు చదివితే బోధపడుతుంది. ఒకటి రెండు మినహాయించి అన్నీ కొత్త కథలే. మొదటిసారిగా పాఠకుల ముందుకు వచ్చిన కథలివి. మంచి కథల కోసం దప్పికగొన్న పాఠకుల దాహాన్ని తీర్చేందుకు చేసిన ఒక మంచి ప్రయత్నమిది. ఇలాంటి కథా సంకలనాలు తెలుగులో రావాల్సిన అవసరం చాలా వుంది, పబ్లిషర్స్ కు అభినందనలు.
-రమణ ఆర్వీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap