( నవంబర్ 13 న పద్మభూషణ్ ఎ.ఆర్. కృష్ణ గారి జయంతి సందర్భంగా)
తెలుగు నాటక రంగ గుండెకాయ లాంటి వారు మా గురువు గారు పద్మభూషణ్ ఏ.ఆర్. కృష్ణ గారు. నాలుగు దశాబ్దాలు పాటు తెలుగు నాటక రంగం అన్నీ తానే అయి మమేకం అయినవాడు. ఏ.ఆర్. కృష్ణ నటుడు, దర్శకుడు, రచయిత , నిర్వాహకుడు. కృష్ణ ఒక ద్రష్ట-ప్రష్ట . నాటక రంగ విజ్ఞాన సర్వస్వము. ఆయన ఒక వ్యక్తి కాదు, వ్యవస్థ. ఆయన నాటక రంగంలో ధైర్యంగా ఎన్నో సంస్కరణలు తెచ్చిన మహా మనీషి. ఆయన కార్యదక్షత, తెగింపు, చొరవ, పట్టుదల, క్రమ శిక్షణ ప్రతి నటుడిలోనూ, ప్రతి నాటక సమాజంలోను వుంటే, మన నాటక రంగం పువ్వులు, ఆరుకాయలుగా వర్ధిల్లుతుంది. ఇంత గొప్ప నాటక రంగ ప్రముఖుడికి శిష్యుడిగా ఉండడం మాకు గర్వకారణం .
ఏ.ఆర్.కృష్ణ గారు నాటకం కోసం చేసిన గొప్ప పనుల్లో ఆంధ్రప్రదేశ్ నాట్య సంఘం తరఫున “నాట్య విద్యాలయం (School of Theatre Arts)” స్థాపించి నాటకంలో వివిధ విభాగాల్లో శిక్షణ ఇచ్చేందుకు అనుభవం వున్న అధ్యాపకులను నియమించడం. ఈ నాట్య విద్యాలయం లో నాతో పటు మరికొందరు నాటక మిత్రులు చేరారు, ఇక్కడ నాటకానికి సంబంధించిన అనేక విషయాలు అర్ధమయ్యాయి. కృష్ణ గారు మా చేత ఎన్నో నాటకాలు వేయించారు. ప్రఖ్యాతులైన నాటక రంగ ప్రముఖుల చేత మాకు థియరీ లోను, ప్రాక్టికల్స లో పరీక్షలు పెట్టేవారు. ఔత్సాహిక నటులకి ఇటువంటి శిక్షణ సంస్థలు అవసరం.
అయన దగ్గర ఇంకో గొప్ప విషయం ఏమిటంటే, ఎవరి దగ్గర ప్రతిభ ఉందో, వాళ్ళని ప్రోత్సహించేవాళ్ళు. అటువంటి గురువుకి , నేను శిష్యుడిని కావడం నాకు ఎంతో గర్వంగా ఉంది. ఆయన దగ్గర నాటకాలకి సంబంధించిన ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నాను. ఆయన జయంతి నాడే కాకుండా, అనుక్షణం ఆయనతో గడిపిన క్షణాలు నేను మర్చిపోలేకుండా ఉన్నాను. ఆయనకి నేనంటే ప్రేమ, నాకు ఆయనంటే గౌరవం. నాకు కొన్ని నాటకాల్లో మంచి మంచి పాత్రలిచ్చి ప్రోత్సహించారు. ఆయన వల్ల నాటక రంగం లో నాకు మంచి గుర్తింపు లభించింది. చాలా మంది రంగస్థల ప్రముఖులు తో పరిచయం ఏర్పడింది. కృష్ణ గారు మంచి నిర్వాహకుడే కాకుండా గొప్ప నటుడు, దర్శకుడు, రచయత కూడా. ఆయన అనేక నాటకాల్లో వైవిధ్య భరితమైన పత్రాలు పోషించారు. “వీలునామా”, “కన్యాశుల్కం”, “మృచ్ఛకటికం”, “ప్రతాపరుద్రీయం”,” మాలపల్లి” మొదలైన నాటకాల్లో వారి నటన అద్వితీయం.”మాలపల్లి”, “కీలుబొమ్మలు”, “సతీదాన సూరం” మొదలైన ప్రయోగాత్మక నాటకాలు ఆయన మెదడు లోంచి పుట్టినవే. ఆయన దర్శకత్వం వహించిన ప్రతి నాటకం లోనూ ఏదో కొత్తదనం, ప్రయోగం మనకు కనిపిస్తాయి. జీవితం లోంచి నాటకం పుడితే, నాటకం లో జీవితం చూపించాలని తపనపడ్డారు. ఆధునిక తెలుగు నాటకరంగానికి పితామహులు ఏ.ఆర్.కృష్ణ. అందుకే ఆయన నాటక రంగ పద్మభూషణుడు.
పి.పాండురంగ (9440172396)