ఖండ కావ్య పద్యరచనలకు ఆహ్వానం…
ఆంధ్రత్వం మూర్తీభవించిన అనన్యసామాన్యపద్యరచనతో తెలుగుజాతిని రాయప్రోలు, విశ్వనాథ, జాషువ, తుమ్మల, కరుణశ్రీ, మధునాపంతుల వంటి మహాకవులు ఉత్తేజపరచటానికి ఖండకావ్య ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నిద్రాణమైన జాతిని మేల్కొల్పారు. ఆనాటి ఆంద్రోద్యమానికి కవులే మార్గదర్శకులైనారు. వారు రచించిన అజరామరమైన పద్యాలు ఈనాటికీ మనకు స్పూర్తినిస్తున్నాయి.
ఇప్పుడు పరభాషా సంస్కృతుల వ్యామోహం పెచ్చు పెరిగిపోయింది. తెలుగు భాష సంస్కృతుల అస్తిత్వం ఆంధ్రత్వం కనుమరుగైపోతున్నాయి. జాత్యభిమానం, భాషాభిమానం మాయమైపోతున్న నేటి పరిస్థితుల్లో మరల జాతిని మేల్కొల్పే ప్రబోధాత్మక రచనలు రావలసిన అవసరం ఏర్పడింది. తదనుగుణమైన నూతన ఖండకావ్య పద్య రచనలను ‘మండలి ఫౌండేషన్’ ఆహ్వానిస్తోంది. ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతంగా జరిపి విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒకే వేదికపైకి తెచ్చిన స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు గారి ఆశయాలకు అనుగుణంగా తెలుగు భాష, సంస్కృతుల పరివ్యాప్తికి చేతనైన కృషి చేయటానికి ‘మండలి ఫౌండేషన్’ సంకల్పించింది.
తెలుగు వారి హృదయాలలో చెరగని ముద్ర వేసే విధంగా చిన్న చిన్న ఖండికలతో కూడిన ఖండ కావ్య పద్య రచనలకు బహుమతులతో ఆహ్వానం పలుకుతోంది. ఖండ కావ్య ప్రక్రియను పునఃప్రకాశితం చేయటంతోపాటు ‘ఆంధ్రసంతతికే మహితాభిమాన దివ్యదీక్షాసుఖస్ఫూర్తి తీవరించె’ నామహావేశ మర్ధించే రచనలు రావాలని మనసారా కోరుకుంటున్నాం.