బాహుబలి లాంటి కథ 60 యేళ్ళ క్రితమే !

బాహుబలి లాంటి సినిమా 60 సంవత్సరాల క్రితమే వచ్చి ఉండేదా?

వైవిధ్య భరితమైన సన్నివేశాలు, పదునైన సంభాషణలు, రాజుల, యువరాజుల పరాక్రమాలు, వీరుల శౌర్య సాహసాలు, రాజోద్యోగుల విధేయతలు, ప్రజల రాజభక్తి, రాజ పరివారాల అట్టహాసాలు, సౌందర్యవతులైన రాణుల రాజసాలు, యువరాణుల అందచందాలు, వీరులతో, రాకుమారులతో వారి ప్రేమ గాథలు అలాగే రాజ ద్రోహాలు, వెన్నుపోట్లు, గూఢచర్యాలూ అంతఃపుర కుట్రల ఇతివృత్తంగా రాచరికాల చుట్టూ అల్లిన చక్కటి చిక్కటి కథ.

దీనిలో ముగ్గురు హీరోలు, ఒక దుష్టపాత్రతో సహా కథానాయికకు సరితూగే నాలుగు ప్రధాన స్త్రీ పాత్రలు, ఇంకా డజనుకు పైగా ముఖ్య పాత్రలుండే ఈ నవలకు 1958లో శ్రీ యం.జి.రామచంద్రన్ హక్కులను స్వంతం చేసుకుని ఒక భారీ సినిమా తలపెట్టారు. తనతో పాటు, జెమిని గణేశన్, వైజయంతిమాల, పద్మిని, బి.సరోజాదేవి, యం. యన్.రాజన్, టి.యస్. బాలయ్య, యం.యన్. నంబియార్, ఏ.కె. దేవర్, వి.నాగయ్య వంటి భారీ తారాగణాన్ని సైతం నిర్ణయించారు. చిత్ర నిర్మాణం ఇక కొద్ది రోజుల్లో ప్రారంభం అవుతుందనగా దురదృష్టవశాత్తు రామచంద్రన్ పెద్ద ప్రమాదానికి గురయ్యారు. కోలుకోవడానికి ఆరు నెలలు పైగానే పట్టడంతో ఆ సినిమా గురించి ఆలోచనను విరమించుకున్నారు. ఇది జరిగిన 48 సంవత్సరాల తరువాత తిరిగి 2004లో సుప్రసిద్ధ దర్శకుడు మణిరత్నం, నటుడు కమల్ హాసన్ తో కలిసి మళ్ళీ ఈ కథ మీద దృష్టి సారించినా ఏ కారణం వల్లనో ఆ ప్రయత్నమూ ముందుకు సాగలేదు. 2010లో మళ్ళీ మణిరత్నమే తన ప్రయత్నాన్ని పునరుద్ధరించి ఈసారి సినిమాలోని ముఖ్య పాత్రలకు విజయ్, మహేష్ బాబు మిగతా పాత్రలకు విక్రమ్, సూర్య, విశాల్, కథానాయికల పాత్రలకు అనుష్క, ప్రియాంక చోప్రాలను ఎన్నిక చేశారు. కథకు ఉన్న నేపథ్యం రీత్యా మైసూరు ప్యాలస్, లలిత మహల్ ప్యాలసులను షూటింగు కోసం అభ్యర్ధించగా అనుమతి లభించలేదు. ఆ సెట్టింగులను బయట వేయడానికి తడిసి మోపెడై పెట్టుబడి అంచనాలను మించింది. అంత బడ్జెటుతో తీసిన సినిమా వసూళ్ల మీద నిర్మాతలకు నమ్మకం కుదరలేదు. అంతే! ప్రయత్నమైతే అప్పటికి అటకెక్కింది కానీ, ఆలోచనమాత్రం విడిపోలేదు.

Ponniyin Selvan Novel Part-3

ఆలా నిద్రాణంలోకి జారుకున్న ఆ ఆలోచన కొద్ది సంవత్సరాల తరువాత, చారిత్రాత్మక విజయం సాధించిన బాహుబలితో ఒక్కసారిగా జాగృతమైంది. 2019 జనవరిలో లైకా అనే చిత్ర నిర్మాణ సంస్థ పెట్టుబడితో ముందుకు రావడంతో, ఈ సారి మరింత ఉత్సాహంగా ప్రయత్నాలు ప్రారంభించారు మణిరత్నం. విక్రమ్, ఐశ్వర్యారాయ్, జయం రవి, కార్తీ, త్రిష, జయరాం, విక్రమ్ ప్రభు, ఐశ్వర్య లక్ష్మీ, శోభిత ధూళిపాళ మొదలైనవారు ముఖ్య తారాగణంగా చిత్ర నిర్మాణం ప్రారంభించారు. అమితాబ్ బచ్చన్, .మోహన్ బాబు మరో రెండు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అలాగే ఐశ్వర్యారాయ్ రెండు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. మిగిలిన స్త్రీ పాత్రల్లో కీర్తి సురేష్, నయనతార, అమలా పాల్ మొదలైనవారు నటిస్తున్నట్లు తెలుస్తున్నది. సంగీతం ఏ. ఆర్. రహమాన్ సమకూరుస్తున్నారు. కోవిడ్ 19 కారణంగా కొంతకాలం పూర్తిగా నిలిచి పోయి, తరువాత మందకొడిగా సాగిన నిర్మాణం ఇప్పటికి 70 శాతం పూర్తయినట్టు ఇటీవల ఒక సందర్భంలో ఆ చిత్ర నాయక పాత్రధారి కార్తీ తెలిపారు. 560 కోట్ల భారీ బడ్జెటుతో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని 2022 ప్రారంభంలో విడుదల చేసే కృషిలో నిర్మాణ సంస్థలు లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ నిమగ్నమై ఉన్నాయి.

ఇంతకీ ఆ సినిమా పేరు చెప్పలేదు కదూ. దానిపేరు పొన్నియిన్ సెల్వన్. ‘సెల్వన్’ అంటే ‘ముద్దు బిడ్డడు’, లేదా ‘ప్రియపుత్రుడు’ అని అర్ధం. ‘పొన్నియిన్ సెల్వన్’ అంటే ‘పొన్ని ముద్దులబిడ్డడు’ లేదా ‘పొన్ని ప్రియపుత్రుడు’ అని చెప్పుకోవచ్చు. ఇది తమిళంలో ఒక. ‘కల్కి’ అనే కలం పేరుతో రామస్వామి కృష్ణమూర్తి ఈ నవలను వ్రాశారు. 1950-54ల మధ్య ‘కల్కి’ అనే తమిళ పత్రికలో ధారావాహినిగా ప్రచురించ బడిన ఈ బృహత్తర చరిత్రాత్మక నవల ఒక సాహిత్య కళా ఖండం 1955లో, రెండు వేల రెండు వందల పేజీలతో ఐదు భాగాల పుస్తక రూపంలో వెలువడి, సుమారు డెబ్బై సంవత్సరాలు కావస్తున్నా నేటికీ విశేష పాఠకాదరణ పొందుతున్నది.

మెరుపు వేగంతో మారిపోయే సన్నివేశాలు, ఊహించ శక్యంగాని మలుపులు, ఊపిరి బిగబట్టేంత ఉత్కంఠలో వదిలే అధ్యాయాలూ పఠనాసాంతమూ పాఠకులను వెన్నంటి ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంటాయి. అసలు ‘పొన్నియిన్ సెల్వన్’ ఎవరు అనేదే ప్రధాన ఉత్కంఠ అని చెప్పవచ్చు. మధ్య మధ్య ప్రస్తావనా మాత్రంగా చెప్పినా, ఆ పేరు వెనుక ఇతివృత్తమూ, నేపథ్యమూ దోబూచులాడుతూనే ఉంటాయి. అలా కొనసాగుతూ వచ్చిన ఉత్కంఠ, కథా గమనంలో ఎప్పుడో గానీ వీడదు. అటువంటి ఈ నవలను, శ్రీ నాగరాజన్ కృష్ణమూర్తి నాలుగేళ్లు కష్టించి మూల రచనలోని సమస్త హంగులతో యథాతథంగా తెలుగులోకి అనువ’దించారు’.

సుమారు 1800 పేజీలతో 2014 లో వెలువడిన ఐదు భాగాల ఈ అద్భుత నవల అనువాదకుని అభిలాష్ మేరకు ఇప్పటికే ‘ఈ పుస్తకం ‘(e Book) రూపంలో దాసుభాషితం యాప్ లో ఉంది.
క్రింది లింక్ లో ఉచితంగా చదువుకోవచ్చు.
https://www.dasubhashitam.com/ab-title/ab-ponniyen-selvan-part-1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap