‘ శ్రేయోభిలాషి ‘ పుస్తక ఆవిష్కరణ సభలో వక్తలు.
తెలుగు చిత్ర పరిశ్రమలో కె.బి. తిలక్ వంటి నిర్మాత, దర్శకులు ఇకముందు ఉండరేమో అని పూర్వ తమిళనాడు గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య ఆవేదన వెళ్లబుచ్చారు. మంగళవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో ప్రఖ్యాత సాంస్కృతిక సంస్థ ఆకృతి సంస్థ నిర్వహించిన ‘ శ్రేయోభిలాషి ‘పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది. ఆకృతి అధినేత శ్రీ సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీనియర్ దర్శకులు డాక్టర్ నిట్టల గోపాలకృష్ణ ( లక్ష్మణరేఖ ) రచన – సంకలనం ‘ శ్రేయోభిలాషి ‘ నిర్మాత, దర్శకులు, స్వాతంత్ర్య సమరయోధులు స్వర్గీయ కె.బి. తిలక్ జీవితాన్ని పూర్తిగా అద్దంపట్టింది.
తానూ సినిమాలు పెద్దగా చూడకపోయినా కె.బి. తిలక్ తను తరచుగా కలుస్తుండేవారమని రోశయ్య గతాన్ని గుర్తుచేసుకున్నారు. స్వర్గీయ తిలక్ రఘుపతి వెంకయ్య నాయుడు పేరిట అకాడెమీ స్థాపించి ఆయన విగ్రహాన్ని ఫిలింనగర్ లో ప్రతిష్టించి తన చేత ఆవిష్కరించిన విషయాన్ని శ్రీ రోశయ్య ఈసందర్భముగా గుర్తు చేసుకున్నారు. తిలక్ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొనడమే కాక ప్రజా సంక్షేమం దేశ అభివృద్ధి కోరుతూ మద్యపాన వ్యతిరేక ఉద్యమం చేపట్టారన్నారు.
జమున, జయప్రద వంటి తారలనెందరినో చిత్ర పరిశ్రమకు పరిచయం చేసి ఎన్నోఉన్నతమైన చిత్రాలు అందించడమే కాక సినీ కార్మికుల శ్రేయస్సు కోరి ఫిలిం ఫెడరేషన్ స్థాపించి సినీ టెక్నీషియన్స్ అసోసియేషన్ మరియు ఫిలిం నగర్ కో-ఆపరేటివ్ సొసైటీ స్థాపనలోప్రముఖ స్థానం వహించారని ‘ శ్రేయోభిలాషి ‘పుస్తక రచయిత లక్ష్మణరేఖ గోపాలకృష్ణ అన్నారు. సినీపరిశ్రమలో అందరి మనస్సులో నిలిచిన ఘనత కె.బి. తిలక్ గారిదని ఆయన విలక్షణ వ్యక్తిత్వమే తాను ఈ పుస్తకం రాయడానికి కారణమని శ్రీ గోపాల చెప్పారు.
ప్రజలని చైతన్యవంతులనిచేసే భూమికోసం, కొల్లేటి కాపురం, ధర్మవడ్డీ వంటి చిత్రాలను తీసిన నిర్మాత, దర్శకుడు నిజంగా తెలుగు సినీ కళామతల్లి నుదుట అభ్యుదయ తిలకం స్వర్గీయ తిలక్ అని సీనియర్ జర్నలిస్ట్, సినీనటులు శ్రీ శ్రీధర్ అక్కినేని అభివర్ణించారు.
సాహితీ ప్రియులు, సినీ అభిమానులు పాల్గొన్న ఈ ‘ శ్రేయోభిలాషి ‘పుస్తక ఆవిష్కరణ సభలో చిత్రపురి కాలనీ పెద్దలు శ్రీ పి.యస్. కృష్ణమోహన్, రచయిత శ్రీ తిరుమల వెంకటస్వామి, తిరుపతికి చెందిన ప్రఖ్యాత ఆయుర్వేద డాక్టర్ రఘు, లలిత్ మోడీ గట్ల, శివ తదితరులు పాల్గొన్నారు.